Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 6



    శృతికి అర్థం కావడానికి కొద్ది సెకండ్లు పట్టింది అర్థమయి చటుక్కున మంచంమీద నుంచి లేచింది. పీడకాల వచ్చినట్లు తెలుసుకుని సిగ్గుపడింది ఎదురుగావున్న మురారి దేముడిని చూసి రాత్రి జరిగినదంతా గుర్తుకొచ్చింది. గుండె దడలాడింది.

    "నేనొచ్చి నీ నోరు మూయకపోతే, నీ అరుపులకి ఊరు ఊరు పరుగెత్తుకు వచ్చేది" అన్నాడు.

    "ముందు జాగ్రత్త పడ్డావుగా!" అని మూతి తిప్పింది శృతి.

    "ఆపదలో వుంది నేను. నీకేం అరుస్తావు కరుస్తావు. తెల్లారిపోయింది నాలుగున్నర దాటింది. పాలమనిషి, పనిమనిషి వచ్చేస్తారేమో, కాస్త కాఫీ పోస్తే అటకెక్కేస్తాను."

    "పగలంతా ఆటకమీద ఎలా వుంటావ్? ఆటక మీద కూర్చోవాలంటే సరిగా నీ ఎత్తు సరిపోతుంది. పడుకుని వుండాల్సిందే. దిగే అవసరం వస్తే ఎలా ? భోజనం ఎలా?"

    జైలుకన్నా అటకేనయం. ఓసారి పోలీసులకి తప్పించుకుని ఉండటానికి నీటిగొట్టంలో కటికచీకటిలో అలా రోజున్నర వున్నాడు. సర్దుకుపోవడం అలవాటే. భోజనం అంటావ్? నీ దయ నా ప్రాప్తం అతిధిని  పస్తుపడుకోబెడితే నీకే పాపం. ఎలాగౌ అలా వీలుచూచుకు భోజనం అందించు."

    తలుపులు తట్టిన చప్పుడు, "పాలమ్మా? పాలు" అన్న పిలుపు వినిపించాయి.

    మురారిదేముడు రెండంగల్లో ప్రక్క గదిలోకి వెళ్ళి పోయాడు.

    "వస్తున్నా! వస్తున్నా" అంది కంగారుగా శృతి పాలు పోయించుకుని మరిచిపోకుండా తలుపేసి వచ్చింది/ స్టవ్ మీద కాఫీకి నీళ్ళుపడేసి మురారి దేముడికి బాత్ రూమ్ చూపించింది.

    "కాఫీ అయిందా?" మురారిదేముడు ముఖం కడుక్కొచ్చి ఎంతసేపయిందో వంటింటి గుమ్మానికి ఆటో చెయ్యీ ఇటో చెయ్యీ ఆనించి గుమ్మంపొడుగునా గుమ్మానికి సరిపోను నుంచుని వున్నాడు. బావ మరదల్ని అడిగినట్లో ఓ భర్త భార్యని అడిగినట్లో అడిగాడు కాఫీ సంగతి.

    శృతికి వళ్ళు మండింది. మండినా చేసేదేముంది? పరాయి మగాడు. పెద్ద దర్జాగా వంటింటి గుమ్మంలో నుంచుని "కాఫీ అయిందా?" అని అడుగుతున్నాడు. సెగలు పొగలు కక్కుతున్న వేడికాఫీని ముఖాన పోస్తే సరి. పెద్ద పరిచయమున్నట్టు ఆ నవ్వొకటి?

    శృతి జవాబివ్వకుండా కప్పులో కాఫీపోసి ఇచ్చింది.

    శృతి కోపం గుర్తించిన మురారిదేముడు కాఫీ కప్పు అందుకుని చిరునవ్వుతో "థాంక్స్" అన్నాడు. శృతి మాట్లాడకుండా అటుతిరిగి తడిగుడ్డతో స్టవ్ తుడుస్తూ వుండడంతో రెండు గుక్కల కాఫీతగి "ఓహ్! అద్భుతం దీనిరుచి. కాఫీపొడి బ్రాండ్ ఏమిటో?" అన్నాడు. ఛర్రున ఇటు తిరిగి "బ్రాండ్ ఏమిటో చెపితే కన్నమేస్తావా?" అంది శృతి.

    మురారి దేముడికి కొలమారింది. మాడుమీద చరుచుకుని దగ్గి ఆ పైన పకపకా నవ్వి "వెయ్యక వెయ్యక కాఫీ పొడికోసం కన్న మెయ్యాలా? ఏ బ్యాంకినో కొల్ల గొడితే పుణ్యం, పురుషార్థం." అన్నాడు.

    "పుణ్యానికి పురుషార్థానికి అర్థం ఈ తప్పడు పనులు  కాదు" తీవ్రంగా అంది శృతి.

    మురారిదేముడు ఏదో అనబోయాడు. వీధితలుపు చప్పుడయింది.

    శృతి, మురారిదేముడు ఇరువురు కంగారుపడ్డారు. కాఫీ కప్పి కిందపెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు.

    "ఎవరది?" గట్టిగా అరిచింది శృతి.

    "నేనే తలుపుతియ్యి శృతి అన్న సిద్దార్థ గొంతు అది.

    "వస్తున్నా!" అని మురారి దేముడి దగ్గరకు పరుగెత్తింది. "మా అన్నయ్య వచ్చాడు. తొందరంగా అటకెక్కు" అంది శృతి చాలా నెమ్మదిగా.

    తన తడిగుడ్డలు బూట్ల ఎప్పుడో మూటగట్టి పెట్టుకున్నాడు మురారిదేముడు. ముందు ఆటకమీదికి మూట విసిరేశాడు. కిటికీలో కాలుపెట్టి చేత్తో ఆటక అందుకుని స్ప్రింగ్ లా శరీరాన్ని ఎగరేసి ఆటకమీదికి వెళ్ళిపోయాడు.

    "శృతీ! శృతీ!" బైటనుంచి మరోసారి సిద్ధార్థ పిలిచాడు.

    పైట కొంగుతో ముఖం తుడుచుకుని "అమ్మయ్య" అనుకుని, అప్పుడు వెళ్ళి తలుపు తీసింది శృతి.

    "తలుపు తీయడానికి ఇంత ఆలస్యం చేశావేమిటి? సిద్దార్థ లోపలికోస్తూనే అన్నాడు.

    వంటింటివేపు వేలు చూపిస్తూ "పాలు.....పాలు." అంది శృతి.

    "పాలు పొంగుతుంటే ఆగావా?"

    "ఆ....అదే అదే....."

    "కాఫీ కలుపు."

    "అలాగే ఈరోజు తొందరగావచ్చావేమిటి. డే డ్యూటీ అతను తొందరగా వచ్చాడా?"

    "ఊ." అని నైట్ డ్యూటీ డ్రెస్ విప్పటం మొదలు పెట్టాడు సిద్దార్థ.

    శృతి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటే సిద్దార్థ వంటగదిలోకి వచ్చాడు. గుమ్మం పక్కనేవున్న కాఫీ కప్పుపై అతని కళ్ళు పడ్డాయి. మరో కాఫీ తాగిన ఖాళీ కప్పు స్టవ్ వద్ద ఉండటమూ చూశాడు. "ఈ కప్పులో ఎవ్వరు కాఫీ తాగారు?" అన్నాడు.

    గుమ్మంవద్ద కప్పుచూసి ఉలిక్కిపడింది శృతి. "అది.... అది.....నేనే తాగాను. రాత్రంతా వర్షం, చలి నిద్రపట్టలేదు. కాసిని పాలు కాచుకుని పాలు రాగానే తాగాను. ఇప్పుడు మళ్ళీ వెచ్చేపెట్టి మరోసారి తాగాను. అంతే, కప్పులు కడగలేదు. అంతే? వెధవ వాన, వెధవ చలి. రాత్రంతా నా ప్రాణం ప్రాణంలో లేదు."

    శృతి అటుతిరిగి మాట్లాడబట్టి మాటలో తడబాటు సిద్ధార్థ గుర్తించలేదు. "వానలో నైటు డ్యూటీ నా ప్రాణం పోయింది" అన్నాడు.

    శృతి ఇచ్చిన కాఫీ తీసుకుని మధ్య గదిలోకి వచ్చి మంచమీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు సిద్దార్థ. ఆ  గదిలోనే వుంది ఆటక. పైన దేముడున్నాడనే సంగతి శృతికి మాత్రమే తెల్సు ఏ నిమిషాన మురారిదేముడు ఆటకమీద నుంచి ధన్ మంటూ తమ మధ్యకు దూకుతాడో అన్నట్టు బితుకుతో ఓ చూపు ఆటకవేపు మళ్ళిస్తూ సిద్దార్థ చెప్పేది వింటున్నది శృతి.

    "నే వస్తుంటే రాఘవయ్యగారు  కనిపించి చెప్పారు ఓ పెద్ద గజదొంగ, ఖూనీకోరు మన కాలనీవేపు పారిపోయి వచ్చాడట. రాత్రి పోలీసులు ప్రతి ఇంటివాళ్ళను లేపి మోచ్చరించారట. పోలీసులు మనింటికి వచ్చారా?"

    "పోలీసులు...పోలీసులు కదూ? వచ్చారన్న య్యా? అబ్బో ఎన్ని జాగ్రత్తలో చెప్పి  పోయారు. వాళ్ళ పిచ్చిగాని దొంగ పారిపోక ఇళ్ళల్లో దూరి దాక్కుంటాడా?"

    "ఆ దొంగ వెధవ పారిపోలేదని, ఎక్కడో దాక్కున్నాడని పోలీసుల కథనం మనింట్లోనే దాక్కోటానికి వచ్చాడనుకో....." అంటూ ఖాళీ కప్పు కింద పెట్టాడు సిద్దార్థ.

    "మనింటికా? రాడు ఎందుకొస్తాడు? వస్తే మాత్రం తలుపు తీస్తానా? తీస్తే మాత్రం ఏదో ఉపాయంతో వాడి కళ్ళల్లో కారం కొట్టి పోలీసులకి పట్టించనూ?" ఎవరో తరుముతున్నట్లు అంది శృతి.

    పకపక నవ్వాడు సిద్దార్థ.

    "ధైర్యంగా ఎన్ని కబుర్లయినా చెబుతావ్! నువ్వు రాత్రంతా వంటరిగా వున్నావని ఎంతభయపడ్డానో. నే పుట్టిం తర్వాత ఇంత పెద్ద వాన చూసి ఎరుగను. ఈ దొంగలు, ఖూనీకోరల్లో మానవత్వం ఉండదు. వంటరిగా అందమైన ఆడపిల్ల కనపడితే ఊరుకుంటారా? వాడు చాలా పెద్ద ఘనాపాఠీట. పెద్ద పెద్ద  వాళ్ళ  కళ్ళల్లోనే కారం కొట్టాడు. నువ్వెంత? మన అదృష్టం బాగుంది. రాత్రి ఆ దొంగవెధవ మనింటికే వచ్చి వుంటే నిన్నిలా చూడగలిగి వుండేవాడినా శృతీ! దేముడికి మనమీద దయవుంది. ఆ వెధవ మన ఇంటివేపు రాలేదు. సమయానికి అమ్మకూడా ఊరికి వెళ్ళింది." అంటూ ఆవులించాడు సిద్దార్థ.

    "మురారి దేముణ్ణి పట్టుకుని మాటి మాటకి సిద్దార్థ వెధవ వెధవ అని తిడుతుంటే శృతికి కాళ్ళల్లోంచి వణుకుబైలుదేరింది. "నే వెధవ నటరా" అని ఆటక మీదనుంచి దేముడు దూకితే! అతను దొంగ, ఖూనీకోరు అన్నయ్యకి ఆవేశంఎక్కువ. కొండను ఢీ కొనే పొట్టేలులా వెనకాముందూ మాడకుండా రయ్యిన పోట్లాటకి వెడతాడు. పర్యవసానంగా ఉహూ....

 Previous Page Next Page