అందుచేత - సత్రకాయలు ఇద్దరూ తుర్ప్తిగా నిట్టూర్చారు.
సరిగ్గా ఉదయం పది గంటలకు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పగిలిన కొబ్బరి కాయల సంఖ్యకేవలం రెండొందల ఏభై నాలుగు! అందుచేత పరమానందం పందెం ఓడిపోయేడు. అందుచేత పరమానందం గుమాస్తా భద్రాచలం తాను తెచ్చిన చెక్కుని ఆనందం గుమస్తా సింహాచలానికి ఇచ్చేడు.
ఆనందం 250 పగుల్తాయని పందెం కట్టేడు పగిలినవి 254 అందుచేత ఆనందం కూడా పందెం ఓడి పోయేడు. అందుచేత ఆనందం గుమాస్తా సింహాచలం తాను తెచ్చిన చెక్కుని పరమానందం గుమాస్తా భద్రాచలం చేతిలో పెట్టేడు.
ఆ విధంగా కొబ్బరి కాయల పందెం ముగిసింది.
8
ఊరి చివర చెరువువుంది!
ఆ చెరువులో సర్వ వేళలా నీళ్లు పుష్కలంగా వుంటాయి ఎందుకుంటాయని అడిగితే సమాధానం ఏం చెబ్తాం? అంచేత ఆ చెరువుకి ఆ ఊరి వాళ్లు ముద్దుగా "దేవుడు చెరువు" అని పేరు పెట్టుకున్నారు.
దేవుడు చెరువులో నర్సిగాడు ఫీట్లు చేస్తున్నాడు!
నర్సి గాడికి పదేళ్ల వయస్సుంటుంది. వాడు ఆ ఊరి వాడు కాదు చుట్టం చూపుగా వాదు ఆ ఊర్లోని వాళ్ల మేనమామ గారింటికి వచ్చేడు.
వచ్చిన వాడు బుద్దిగా ఇంటో వుండక దేవుడు చెరువులో ఆడుకుంటున్నాడు.
సరిగ్గా అదే సమయానికి ఆనందం, పరమానందం దేవుడి చెరువు వేపు వచ్చేరు. వాళ్లవెంట గుమాస్తాలున్నారు. వాళ్లచేతుల్లో చెక్కు పుస్తకాలు సిద్దంగా వున్నాయి.
అప్పటికే ఆనందం పరమానందంలు కాకుల మీద కొన్ని పందేలు కాసేరు. ఎగురుతున్న కాకి ఏచెట్టు మీద వాలుతుంది. చెట్టు మీద వున్న కాకిని రాయితో కొడితే ఎటు ఎగురుతుంది?
అట్లాగే-
వారు వీథి కుక్కలమీద కూడా పలు పందేలు కాసేరు. పంపు దగ్గిర పడుకున్న కుక్కని డొక్కలో కొడితే ఏ వీథిలోకి పరుగెడుతుంది లాంటి పందేల్లో వాళ్లు బాగా అలిసిపోయి - దేవుడు చెరువుని చేరుకున్నారు.
ఆనందం పరమానందాల చూపు చెరువులో వున్న నర్సిగాడి మీద పడింది.
నర్సిగాడికి ఈతరాదు కాబోలు! బుడుంగున నీళ్లల్లో మునిగి చేతులు ఆకాశం వేపు ఎత్తుతున్నాడు. ఆ సమయంలో ఏ దేవుడు వాడిని ఆడుకుంటున్నాడో గాని - నీళ్ల లోంచి తేలి కేరింతలు కొడుతున్నాడు.
వాడి విన్యాసాలు శ్రద్దగా చూస్తో అన్నాడు పరమానందం.
"వాడికి ఈత రాదు కాబోలు!"
"చిత్తం! చెరువులో దూకి వాడిని ఒడ్డునేయమంటారా?" అడిగేడు భద్రాచలం.
"నోర్ముయ్! వాడిని ఒడ్డు తర్వాత! వాడు నీళ్లల్లో మునిగిపోతాడా? ఒడ్డు చేరుకుని బతికి బయటపడతాడా? ఆ పాయింటు ఆలోచించాలి!" అన్నాడు ఆనందం.
"చిత్తం! మంచి పాయింటు సెలవిచ్చేరు" అన్నాడు సింహాచలం పళ్లు కోరుక్కుంటో.
"మునిగిపోతాడు ఖచ్చితంగా మునుగుతాడు! అన్నాడు పరమానందం.
"మునగడు నూటికి మారుపాళ్లు మునగడు" అన్నాడు ఆనందం.
"చెక్కు మీద అంకె ఎంత వేయమంటారండయ!" అడిగేడు భద్రాచలం.
"అది ఆనందాన్ని అడుగు!" అన్నాడు పరమానందం.
"ఎవరూ అడగక్కర్లేదు వెయ్యిన్నూట పదార్లు!"
"చిత్తం! చెక్కు మీద ఆ ముక్క రాసేనండి!" అన్నాడు సింహాచలం.
"నువ్వేం చేసేవ్?" అడిగేడు పరమానందం.
"చిత్తం! ఆ లెక్కే రాసేనండి!" అన్నాడు భద్రాచలం.
"పావుగంట - సరిగ్గా పావుగంటలో అటో ఇటో తేలిపోవాలి!" అన్నాడు ఆనందం.
"వాచీ చూస్తుండు" అని భద్రాచలానికి ఆజ్ఞ జారీ చేశాడు పరమానందం.
భద్రాచలం ఆ పని మీద వున్నాడు!
కామందులు తన మీద పందెం వేసుకున్నారని తెలీని అజ్ఞాని నర్సిగాడు అందుచేత వాడు వాళ్ల పందేన్ని పట్టించుకోకుండా బుడుంగున నీటిలో మునుగుతున్నాడు. గబిక్కిన నీళ్లపైకి వస్తున్నాడు.
వాడు మునిగి నప్పుడు "మునుగూ.....మునిగిపో" అని కేకలు వేస్తున్నాడు పరమానందం. 'అవునంతే!' అనివంత పాడుతున్నాడు. భద్రాచలం.
వాడు నీటిలో తేలినప్పుడు "వచ్చేయ్.....ఒడ్డుకి వచ్చేయ్" అని అరుస్తున్నాడు ఆనందం 'అయ్యగారి మాట విను బాగు పడతావ్' అని బతిమి లాడుతున్నాడు సింహాచలం.
ఈ రభస పది నిమిషాలు నడిచింది. నర్సిగాడు ఎవర్నీ పట్టించు కోకుండా తన పనిలో తాను వున్నాడు.
పదకొండో నిమిషానికి గట్టు మీద కొత్త గొంతు వినిపించింది.
"రేయ్! ఎవడ్రా అది? బుడ్డోడికి బుద్ది చెప్పకుండా ఏంటా కేకలు?'
ఆనందం పరమానందంలతో పాటు వాళ్ల గుమాస్తాలు కూడా అరచిన మనిషి వేపు చూసేరు.
ఆ మనిషి పరుగెత్తుకుంటో వచ్చి పెద్దల్ని చేరుకున్నాడు. పెద్దల్ని చూసీ చూడగానే అతనికి విషయం అర్ధమైంది. అర్థమవ్వగానే కడుపుమండిపోయింది. కడుపు మండిపోయింది గనక అతను తిక్కగా అనేసేడు-
"తమరా బాబు? మా బుడ్డోడి మీద పందెం గట్టి - ఒడ్డున నిలబడ్డారా?"
"అరే? భలే కనిపెట్టెసేవ్?" అన్నాడు పరమానందం.
"ఛీ!" మీ బతుకులు తగలడ! పందెం కట్టుకోడానికి -దొరక్క దొరక్క -మీకు మా బుడ్డోడే దొరికాడా?"
"వాడు నీకు ఏమవుతాడు?" అడిగేడు ఆనందం.
"నా మేనల్లుడు చెల్లెలి కొడుకు పోరుగూర్నుంచి వచ్చేడు. మీ సంగత్తెలవక కిందా మీదా కొట్టు కుంటున్నాడు. అయినా నీళ్లల్లో ఆడుకునే బుడ్డోడ్ని కేక లేసి బయటికి లాగి ఇంటికి పంపించాలి గానీ - పందేలు కాస్తారా? పందేలు?"
"అది సరే! వాడు నీళ్లల్లో మునగడంటావ్! అంతే గదా?" అడిగేడు ఆనందం.
"ఆడ్నికాదు. మిమ్మల్ని ముంచాలి! ఎల్లండయ్యా - ఎదవ పందేలు మీరూను! ఎల్లండెల్లండి!" అని అతను నీళ్లల్లోకి దూకెడు -బుడ్దోడ్ని ఒడ్డుకి తీసుకొచ్చేందుకు!
పెద్దలిద్దరూ తెల్ల మొహాలు వేసేరు.
నర్సిగాడు మునగనందుకు పరమానందం చెక్కు ఆనందానికి వెళ్లింది. మేనమామ రాకపోతే - తప్పకుండా మునిగిపోయే వాడు గనక - ఆనందం చెక్కు పరమానందాన్ని చేరుకుంది!
అంతటితో మునుగుడు పందేనికి చుక్క పడింది!
* * *
ఊళ్లో అదొక బేంకు!
ఎంతో సందడిగా బేంకు ముందు బుర్ర మీసాల భద్రయ్య తుపాకీ పట్టుకుని నిలబడ్డాడు. అతను ఆ బేంకుకి రక్షకభటుడు. మనిషిని చూస్తేనే భయమేస్తుంది. ఆ ఆకారానికి తగ్గట్టు చేతిలో తుపాకీ కూడాను!
భద్రయ్య మొహమ్మీద ఒక ఈగ ఆడుకుంటోంది. దాని ఆటతో గొప్ప చికాకు పడిపోతున్నాడు. భద్రయ్య తన మొహానికి దెబ్బ తగలకుండా - అతి జాగ్రత్తగా ఈగని తోలే ప్రయత్నం చేస్తున్నాడు.
బేంకులో బేంకు సిబ్బంది బిజీగా వున్నారు.
ఆ బేంకు నంది వాడ వారి వీథికి అందుబాటులో వుంది. అందుచేత నందివాడ వారి వీథి వాస్తవ్యుల బేంకు వ్యవహరాలకు అది ఎంతో అనువుగా వుంటుంది.
సింహాచలం భద్రాచలం ఆ బేంకు వేపే వస్తున్నారు. వాళ్ల భుజాల మీద మూటలున్నాయి ఆ మూటల్లో చేక్కులుంటాయని బేంకు వాళ్లకి బాగా తెలుసు.
వారం రోజుల్లో పందేల ద్వారా ఆనందం చెక్కులు పరమానందానికి పరమానందానికి పరమానందం చెక్కులు ఆనందానికి చేరి - మూటల ద్వారా బేంకుకి రావడం పరిపాటి! అందువల్ల వారానికి ఓ రోజు మూటల దృశ్యం మామూలై పోయింది!
బుర్ర మీసాల భద్రయ్యకి బేంకుకి వస్తున్న సింహాచలం భద్రాచలం కనిపించేరు. వాళ్లని చూడగానే భద్రయ్య మీసాలు వణికేయి. వాళ్ల భుజాల మీద మూటలు చూడగానే ఏడుపోచ్చింది. తుపాకీలో తల బాదుకుంటో బేంకులోకి వచ్చి ఖంగారుగా ప్రకటన చేసేడు.
"బాబో! మూటలోస్తున్నాయి!"
ఆ మాట వినగానే బేంకు సిబ్బంది యావన్మందీ - చేస్తున్న పని ఆపేసేరు. బొమ్మల్లాగా ఫ్రీజైపోయేరు.
మూటల ఫిలాసఫీ తెలిసిన కష్టమర్లు తమ పని కాదని బేంకు వదిలి పారిపోయేరు. మూటల గురించి తెలీని కస్టమర్లు తెల్లమొహం వేసుకుని నిలబడ్డారు.
వాళ్లని చూచి బుర్ర మీసాల భద్రయ్య జాలి పడ్డాడు-