విరక్తిగా నవ్వుకున్నాడు రవి.
రంగరామానుజం వెళ్ళిపోగానే "అమ్మా!" అని సుబ్బమ్మగారిని కేకేశాడు.
"ఏం బాబూ!"
"ఇదిగో డబ్బు!" అని అయిదు రూపాయలూ అతనిచ్చి వెళ్ళినవి యిచ్చేడు. ఉదయంనించీ ఆ డబ్బు చాలా బరువుగా వుంది అతనికి. గాంధీగారికి మేకపాలలాగా తన అయిదురూపాయలూ కడుపులో ఏం వికారం పుట్టిస్తాయో అనుకున్నాడు.
ఆమెకి చాలా సంతోషమయింది. కొడుకు సంపాదన అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
"నాలుగు రోజులు ఫరవాలేదు" అంది నవ్వుతూ.
"నలుగురి జేబులు కొడితే వచ్చింది" అనుకున్నాడు రవి. అయితే ఆ మాటలు పైకి అనలేదు...
ఆమె డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.
తనకి అర్ధంకాని ఆర్ధికశాస్త్రాన్ని చదువుతూ వుండిపోయాడు రవి. అతనికి దినదిన గండం నూరేళ్ళాయుర్దాయంలాగా వున్న తన కుటుంబ జీవనంపై అసహ్యం వేసింది.
4
"అబ్బ! చచ్చిపోయాననుకోండి."
ఇంటిముందు కారు ఆగగానే ఆఘమేఘాలమీద బయటికివచ్చిన రవిని చూడగానే అంది రాజ్యలక్ష్మి.
అతను తెల్లబోయాడు చప్పున ఆమెని పోల్చుకోలేక పోయాడు.
"నన్ను గుర్తుపట్టలేదుకదూ!"
"పట్టకేం?" పెదాల బిగువున నవ్వేడు.
"అయితే నాపేరు చెప్పండి!"
బిక్క మొఖం వేశాడు. నిజానికి అతనికి ఆమె ముఖమే బొత్తిగా కొత్తగా అనిపిస్తోంది. ఎక్కడా పరిచయం లేదు! 'ఎవరీమె?'
"ఎవరీ సుందరీమణి! ఎవరీ రాజకుమారి!" అనుకుంటున్నారు చుట్టుపక్కల గుడిసెల్లోని పిల్లలు. కారు రాగానే దాని చుట్టూ చేరారు. సినీ నటిని చూసినట్టుగా చూస్తున్నారు ఆమెని, ఆ కారుని. ముట్టుకోవాలని వాళ్ళెంత తహతహ లాడుతున్నారో డ్రైవరు వేసే కేకలు తెలియ జెబుతున్నాయ్.
"లోపలికి రమ్మన్రా రవీ" గడపవద్ద నుంచుని అరిచింది సుబ్బమ్మగారు.
"రండి!" అన్నాడు చప్పున.
ఆమె అతన్ననుసరించి వస్తూ గడప దగ్గరికి రాగానే "నాపేరు రాజ్యలక్ష్మీ నమస్కారం" అంది వినయం ఉట్టిపడేట్టుగా.
పోతపోసిన బంగారు విగ్రహంలాగా, అలంకరించిన కనకదుర్గలాగా, నడిచివస్తోన్న కంచికామాక్షీలాగా అనిపించింది ఆమెకి. నిడుపాయి జడ పిరుదులతో సయ్యాటలాడుతోంది.
"రామ్మా!" ఆప్యాయంగా ఆహ్వానించింది.
ఎప్పుడో దశాబ్దాలకి పూర్వం చేయించిన తలుపులు బార్లా తెరిచింది సుబ్బమ్మగారు. అవి కిర్రుమని శబ్దంచేసాయి.
"అమ్మా! ఈమె మా కాలేజీలో చదువుతోంది. బాగా పాడుతుంది. ఎంత అద్భుతంగా పాడుతుందంటే ఆడిటోరియం అంతా నిశ్శబ్దం అయిపోతుంది" గొప్పగా చెప్పాడు రవి.
"మీ అమ్మగారా" అడిగింది రాజ్యలక్ష్మి.
ఆమె ముఖంలో కళకొద్దిగా తప్పింది. "అంత అదృష్టం లేదమ్మా. వీడు మా అక్కకొడుకు! పురిట్లోనే ఆమె చనిపోతే నన్ను పెళ్ళిచేసుకున్నారు వీళ్ళ నాన్నగారు"
రవి చప్పున అన్నాడు, "అమ్మంటే నాకు తెలియదు, ఈమె నా అమ్మ! అమ్మకి యింతకంటే అర్ధం యింకెక్కడ వుండదు."
తలపంకించింది రాజ్యలక్ష్మీ ఆ అమ్మాయి గడపదాటి లోపలికి వచ్చిందే కానీ ఎక్కడ కూచోవాలో తెలియక తికమక పడిపోయి అలాగే నుంచుంది.
"మా యింట్లో కుర్చీలు లేవు! ఒకటి ఉండేది బందులు అన్నీ ఊడిపోయాయి! ఓసారి మాస్టారు వస్తే దాన్లో కూర్చుని క్రింద పడ్డారు వెంటనే పాతసామాన్ల వాడికి పారేశాను! నాలుగు రోజులు గడిచిపోయాయి దాంతో!" నవ్వుతూనే అన్న అందులో బాధ వుంది.
"ఫర్లేదు లెండి!"
"అదిగో ఆ మంచం మీద కూర్చో! లేదా రవీ ఆ చాపవెయ్! కూర్చుంటుంది!" అంది ఆమె. అది సుబ్బమ్మగారు అల్లిన చాప.
"ఖరీదైన ఫారెన్ నైలెక్స్ చీరని మళ్ళీ డ్రైవాష్ కి వేసుకోవలసిందే!" అనుకుంటూ అయిష్టంగానే మోపీ మోయనట్టుగా కూర్చుంది ఇంటిని పరిశీలిస్తుంది. ఏనాడో పూసిన గోడలు! ఎన్నడో వేసిన వెల్ల! బూజు లేకపోయినా గోడలు అన్నీ సున్నం వెలిసిపోయి వృద్ధాప్యంలో వున్న వేశ్యల్లా వున్నాయి.
ఓ గోడకి ఒక ఫోటో వేలాడుతోంది.
"మా నాన్నగారు!" ఆమె మనస్సు చదివినట్టుగా అన్నాడు రవి. తల ఆడించింది. మరో గోడమీద వెంకటేశ్వరస్వామి కేలండరు! అది ఆ సంవత్సరందే!
మిగిలిన రెండు గోడలకీ రెండు కిటికీలు ఉన్నాయి. ఒద్దులు చాలా పాతవి! తలుపులు అసల్లేవు. ఆ హాలు నుంచి లోపల గదికి వెళ్ళే వాకిటికి కూడా తలుపులు లేవు.
"మా యింటికి తలుపులు లేవు! ఈ బయటి వాకిలి, పెరటి వాకిలి అంతే! అల్మెరాలకీ తలుపులు లేవు. దాచుకుందుకీ దోచుకుందికీ ఏముందని?" నిదానంగా అన్నాడు రవి.
పల్చటి మజ్జిగ తెచ్చి యిచ్చింది సుబ్బమ్మగారు. రాజ్యం ప్రశ్నార్ధకంగా చూస్తే "తీసుకోమ్మా!" అంది మృదువుగా.
"ఈ పూట అమ్మకి మజ్జిగ కూడా కరువే!" అనుకున్నాడు రవి.
గట గటా తాగేసింది రాజ్యలక్ష్మి.
"ఇంతకంటే యిచ్చుకోలేని నిరుపేదని!" పేలవంగా నవ్వాడు.
"డోంట్ వర్రీ!" అని చప్పున నాలిక్కరుచుకుంది.
ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం.
"నాకో చిన్న సహాయం కావాలి! నేను రేడియో గేయం రాశాను. మీరు కొంచెం చదివి పెడితే --- తప్పులు సరిజేస్తే --- తర్వాత పంపిస్తాను!" అందంగా పాలమీగడలా మెరిసిపోతున్న కాగితాన్ని అందించింది.