Previous Page Next Page 
నా కథవింటావా పేజి 6


    ఆమె మాటల్లో ఎంత అర్ధం ఉందో, ఎంత ఆలోచన వుందో చూసి ముగ్ధులయ్యేవారు క్రాంతీ, కావ్య.
    "నేను నీ మాటే వింటానమ్మా!" అనేది పసిపిల్లలా తల్లిని చుట్టేస్తూ కావ్య.
    "అవసరమనుకున్నప్పుడు  ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడంలో తప్పులేదు. కానీ, కేవలం సంపాదించాలనే తృష్ణతోనే ఉద్యోగాలకోసం ఎగబాకడం, నాకిష్టంలేదు" అనేది.
    ఆమె ఆలోచనలు ఎంత సబబైనవో  తెలుసుకుని, అటువంటి తల్లికి బిడ్డలైనందుకు  గర్విస్తూ మురిసిపోయేవారు, క్రాంతీ _ కావ్యా!
                                                                                 4
    "అప్పుడేమయిందో  తెలుసా?" పొట్ట చేత్తో పట్టుకుని  పగలబడి నవ్వింది కావ్య.
    "ఎలా తెలుస్తుంది? నవ్వయినా చెప్పు_చెప్పయినా నవ్వు!" కావ్య అలా నవ్వుతూంటే  తనూ చిన్నగా నవ్వాడు క్రాంతి.
    "బస్సాపేసి  గబగబా దిగి చెంపమీద ఒక్కటిచ్చేసరికి  వేడి వేడి చపాతీలా, ఉడాయించాడనుకో_వెనక్కి తిరిగి చూడకుండా! బస్సులో వున్న వాళ్ళందరూ  నన్ను మెచ్చుకున్నారు_ నా ధైర్యానికి!"
    "వెరీగుడ్! ఆడపిల్ల అంటే అలా వుండాలి. నోరు విప్పితే వేడి వేడి చపాతీలు పెట్టేటట్టు!"
    మళ్ళీ ఇద్దరూ నవ్వుకున్నారు.
    "కావ్యా! నువ్వు కరాటే నేర్చుకోకూడదు."
    "నేనా? అమ్మ చస్తే ఒప్పుకోదు."
    "నేనొప్పిస్తానుగా! ఈ రోజుల్లో ఆడపిల్ల లందరికీ కరాటే రావడం ఎంతో అవసరం. ఆడపిల్లని నాజూగ్గా పెంచవలసిన  రోజులు   కావివి! ఆత్మరక్షణకోసం, తనని తాను ఆపదలనుంచి కాపాడుకోవడంకోసం, ప్రతీ ఆడపిల్లా కరాటే నేర్చుకోవలసి ఉంది. నేనే గనక ముఖ్యమంత్రినయితే, ప్రతి బడిలో డ్రిల్లు నేర్పించినట్టే, కరాటే కూడా కంపల్సరీగా నేర్పించాలని రూల్ ప్యాస్ చేసేవాణ్ని! దానివల్ల పోలీస్ శాఖవారు కూడా సంతోషిస్తారు."
    "పోలీస్ శాఖవారికెందుకు సంతోషం?"
    "ఆడపిల్లలు ఆపదలో చిక్కుకునే అవకాశాలు చాలా తక్కువయిపోతాయి కాబట్టి."
    ఇద్దరూ పెద్దగా నవ్వారు.
    పని చేసుకుంటున్నా, వీళ్ళ సంభాషణ విన్న  సీతాదేవి వీళ్ళ దగ్గరికొచ్చి నుంచుంది.
    ఆమెని చూడగానే ఇద్దరూ ఆ మాటలు మార్చేసి సీరియస్ గా 'ఎకనామిక్స్' గురించి మాట్లాడ్డం మొదలెట్టారు. అది ఆమె గమనించినా, ఏమీ తెలీనట్టుగా వాళ్ళకేసి చూసింది.
    ఇద్దరూ తలొంచుకున్నారు.
    "క్రాంతీ! ఇందాకేమన్నావ్?"
    "అబ్బే....ఏమీ....అనేలేదే!....అసలు....నీతో.... నేను మాట్లాడలేదు."
    "నాతో కాదు బాబూ! నీ చెల్లాయితోనే! ఏం చెపుతున్నావూ అని!"
    "నేనేం చెపుతున్నాను....ఆఁ....ఎకనామిక్స్ చెబుతున్నాను."
    "నీ ఇంజనీయరింగ్ లో ఎకనామిక్స్ కూడా చెప్తారా బాబూ!"
    ఆమె వ్యంగ్యంగా మాట్లాడుతోందని  తెలిసినా ,తెలీనట్టుగా_
    "ఆఁ....ఏదో కాస్త! అక్కడక్కడా  చదివినది చెబుతున్నాను."
    "అక్కడక్కడా చదివినదీ, అక్కడక్కడా చూసినదీ, మనకి పనికిరావు సరికదా, అలా తెలిసీ తెలీకుండా రాస్తే, ఉన్న మార్కులు  పోతాయి. అంటే వొచ్చే మార్కులు రావన్నమాట" నవ్వుతూ చెప్పింది.
    క్రాంతి తలవంచుకున్నాడు.
    అతని గడ్డం పట్టుకుని  తల పైకెత్తింది సీతాదేవి.
    "బాబూ! తల వంచుకునే పన్లు మనం ఎప్పుడూ చెయ్యకూడదు. కరాటే నేర్చుకున్నా, కత్తిసాము నేర్చుకున్నా ఆడపిల్ల ఆడపిల్లలే! మానసికంగా ధైర్యవంతురాలే కావొచ్చు! కానీ, శారీరకంగా పురుషుడి ముందు బలహీనురాలే బాబూ! ఒకరు ఒక విషయంలో గొప్పవారైతే, మరొకరు ఇంకొక విషయంలో గొప్పవారు. ఇద్దరూ అన్నింటిలోనూ సమఉజ్జీ అయితే, ఒకరిని ఒకరు లక్ష్యపెట్టుకోరూ, గౌరవించుకోరు. స్త్రీ మానసిక శక్తిని పురుషుడు హర్షిస్తాడు. పట్టుదలకు పోతే ఆమె ముందు అపజయాన్ని పొందుతానేమోననీ భయపడతాడు. అలాగే, మగవాడి కండల ముందు ఆడది ఓటమిని అంగీకరించక తప్పదు. ఒక్కోసారి అతనిలోని ఆ శక్తికి ముగ్ధురాలైపోతుంది కూడా! ఇలా ఒకరిలో లేనిది, మరొకరిలో ఉంటే, ఒడుదుడుకులొచ్చినా, గొడవలు జరిగినా సర్దుకుపోవచ్చు! లేకపోతే సంసారాలు నిలువవూ _ మనుగడ సాధ్యంకాదు. ఉదాహరణకి, భార్యాభర్తలిరువురూ  దుబారాగా ఖర్చుపెట్టే రకమే అయితే, ఆ సంసారం గుల్లయి పోయి పిల్లలు బజారుపాలవుతారు. అలాకాక ఒకరిలో అయినా పొదుపనేది వుంటే, కొంచెంలో కొంచెం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇద్దరూ తెలివి తక్కువవారే అయినా, ఇద్దరూ దుష్టులే అయినా లేక ఇద్దరూ అమాయకులే అయినా, లేదా ఇద్దరూ కొంపలు ముంచే తెలివిగలవారైనా, ఆ ఇల్లు సరిగ్గా వుండదు. కొన్నింట్లలో కొందరికి అసమానతలు  ప్రకృతే  కల్పించింది. కొందరిలో కొన్ని లోపాలుండడంవల్లే  కొన్ని బలహీనత లుండడంవల్లే ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు! గౌరవించుకోవడానికి ప్రయత్నిస్తారు! అందరూ  సమానులే అయితే, ఎవరూ ఎవరినీ ఖాతరు చెయ్యరు!" అంది సీతాదేవి.
    ఆమె చెప్పిన సుదీర్ఘమైన ఉపాన్యాసాన్ని విని, ఈ కొత్త సిద్ధాంతం గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు క్రాంతీ, కావ్య.
    "క్రాంతీ!కరాటేలూ, కుస్తీలూ నేర్చుకున్నంత మాత్రాన, కొన్ని ట్రిక్కులూ, ఆత్మరక్షణకు పనికొచ్చే కొన్ని యుక్తులు తెలియొచ్చేమో గానీ, సహజంగా ఆడపిల్లకుండే  శారీరక బలహీనత ఎక్కడికి  పోతుంది బాబూ" అలాంటి ఆలోచనలు రానివ్వకండి మనసులోకి" అంది.           
    ఆమె చేచ్చే విధానాన్ని  చూసి, ఆమెకి ఇంక ఏం చెప్పినా లాభం లేదనీ, ఆమె అభిప్రాయాలు మార్చుకోదనీ తెలిసిన వాళ్ళిద్దరూ  మౌనంగా వుండిపోయారు.
    కాస్సేపాగి, మళ్ళీ ఆవిడే అందుకుంది _ "చూడమ్మా కావ్యా! ఎంతటి దౌర్భాగ్యుడైనా, అర్భకుడైనా, మొగాడు ఆడదాని చేతిలో దెబ్బతినడం భరించలేడు. అలా దెబ్బ తిన్నవారు జరిగిన విషయాలు ఛస్తే మర్చిపోడు. వాడి హృదయంలో ఆ అవమానం అగ్నిలా రగులుకుంటూనే వుంటుంది. ద్రౌపది నవ్విందని తనని చూసి, దుర్యోధనుడు చేసిన ప్రతిజ్ఞ లేమిటి? వాళ్ళ పంతం చెల్లించుకోవడానికీ, ప్రతీకారం తీర్చుకోవడానికీ, ఏమైనా చేస్తారు." ఆమెలో ఆందోళనా భయం చోటు చేసుకున్నాయి. అది గ్రహించిన కావ్య, మాట మార్చడానికి ప్రయత్నిస్తూ "ఆకలేస్తోందమ్మా....వంటయిందా లేదా?" అంది చేత్తో కడుపు పట్టుకొని తల్లి వంక చూస్తూ.
    "అయిపోయింది. చారులో  తిరగమోత  పెడదామనుకుంటూ, ఎందుకో ఇటొచ్చేసరికి మీ మాటలు వినపడ్డాయి! ఆగిపోయాను! అలా చాటుగా వినగూడదు  ఇతరులమాటల్ని! కానీ, ఈ విషయం నాకు తెలుసు మీరు నాతో చెప్పరని! అందుకే విన్నాను కావ్యా! ఎందుకమ్మా ఆ రౌడీ వెధవల గొడవ మనకి, ఎందరో ఆడపిల్లలు వాళ్ళకి జరుగుతూన్న అవమానాలను సహిస్తూ, తలొంచుకుని వెళ్ళిపోతున్నారు. బురదలో రాయేస్తే మన మొహాన చిందుతుంది. మన సమాజంలో మార్పు రావాలి! మన ఆలోచనల్లో మార్పు రావాలి!
    చదువు సంధ్యలకి నోచుకోలేనివాళ్ళూ   చదువుకోవడానికి  బద్ధగించేవాళ్ళూ ఈరోజున సినిమాలు చూసి అందులోని ప్రతి విషయాన్నీ అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనం చూస్తున్న సినిమాల్లో ఈరోజున, అర్ధం లేని ప్రేమ కధలూ, ప్రతీకారాలూ, హత్యలూ, దొంగతనాలూ, దోపిడీలూ  ఇవేకదూ. ఇవి చూసి వాళ్ళూ ఆ పాత్రల్లాగా ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.   
    అటువంటి సినిమాలు తీస్తూన్నంతకాలం, ఈ జనం విరగబడి, అదే పరమావధిగా చూస్తున్నంతకాలం, మనకీ  ఆందోళనా, ఆస్తవ్యస్తాలూ తప్పవు. గొంగట్లో  భోంచేస్తూ వెంట్రుకలేరడానికి ప్రయత్నం చేస్తే ఏం లాభం చెప్పు?"
    మామూలుగా అయితే ఆమె అంత సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడానికి మొదలెట్టగానే, 'సుత్తీ! సుత్తీ!' అని అరిచి ఆమెని మాట్లాడనీయకుండా అల్లరి చేసేవారే, క్రాంతీ కావ్యా! కానీ ఈరోజున, ఆమె మాట్లాడతూన్న ప్రతిమాట వెనకా, ఎంతో నిజం ఉండడమే కాకుండా, వ్యక్తమైన బాధా, భయమూ ఆమె గొంతులో ధ్వనించడంతో మాట్లాడకుండా విన్నారు ఇద్దరూ. సీతాదేవి గబగబా లోపలి కెళ్ళిపోయింది. చారులో  తిరగమోత పెట్టింది. ఇంగువ వాసన గుప్పున  నాసికా పుటాలకి తగిలి, వెంటనే నోరూరింది కావ్యకి.
    "మంచి వాసనొస్తోంది కదూ!" అన్నాడు క్రాంతి.
    "ఆకలీ! అమ్మా!....అన్నం!" పసిపిల్లలా   అరిచింది  కావ్య కూర్చున్న చోటినుంచి లేవకుండా.
    "ఆఁ....ఆఁ....అయిపోయింది. అయిదు నిమిషాలు" వంటింట్లోంచే సమాధానం చెప్పింది ఆమె.
    క్రాంతి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కంచాలూ, గ్లాసులూ అమర్చాడు.
    "ఎప్పుడు అంతే! కాస్త తీరిగ్గా  వుంటే వెళ్ళి తల్లి వెనకాలే  తిరుగుతూ కబుర్లు చెబుతూ, ఏవో చిన్నచిన్న పన్లు చేస్తూ వుంటాడు. "నువ్వు ఆడపిల్లవై, అది మగాడవవలసింది" అనేది సీతాదేవి.
    "ఇదంతా ఎందుకో తెల్సా అమ్మా? రేపు పెళ్లామొచ్చి, ఆవిడగారు మంచం దిగకుండా కూర్చున్న చోటికే, బెడ్ టీ, అందించమంటే అయ్యగారు 'యస్. మేడమ్!' అని అందించడానికి" అంది కావ్య.
    ఈ పెళ్ళి మాటలు వినగానే తల్లి  జ్ఞాపక మొచ్చింది సీతాదేవికి.
    "ఈ గడుగ్గాయి పెళ్ళి చూడందే చచ్చిపోనే" అనేది తల్లి.
    "ఏం? అన్నయ్య పెళ్ళి చూడాలని లేదా అమ్మమ్మా?" కొంటెగా అడిగేది కావ్య.

 Previous Page Next Page