Previous Page Next Page 
నా కథవింటావా పేజి 5

    ఒక్కోసారి ఆ దేముడిమీద తెగ కోపం వొచ్చేది కావ్యకి.
    అంత మంచి అమ్మని దిక్కులేని దానిలా  ఒదిలేసి, నాన్నని తీసికెళ్ళిపోయినందుకు  దేముడ్ని నిందించేది.
    తండ్రి కూడా  ఎంతో  మంచివాడట! అందరూ అతన్ని గురించి  చెప్పుకుంటూ వుంటే, ఎంతో గర్వంగా అనిపించేది. అంతమంచి మనిషిని తను పోగొట్టుకున్నందుకు  ఏడుపొచ్చేది. తండ్రి గురించి ఎవరైనా మంచి మంచి మాటలు చెప్పినపుడు, కడుపు నిండిపోయినట్టు  మనసు నిండిపోయేది! అతడు లేడన్న  దుఃఖాన్ని  తల్లిని చూసి మరిచిపోయేది కావ్య!
    ఆరోజు తెలుగు పరీక్షకి అందరూ  చీరలు కట్టుకోవాలని  అనుకోవడం చేత, తల్లి దగ్గరున్న  చీరల్లోంచి  ఒక మంచి   చీరని  ఎన్నుకుంది  కట్టుకోవడానికి. ఆమె జాకెట్టునే తీసుకుని, తన ఆది ప్రకారం సరిచేసుకుంది.
    చీర కట్టుకుని  చిలకలా తయారయిన కూతుర్ని  చూసి  మురిసి పోయింది సీతమ్మ.
    "కావ్యా!" అంటూ చీర కుచ్చిళ్ళు  పట్టుకుని నడవలేక నడుస్తున్నట్టుగా  ఒచ్చి నుంచుంది కళ్యాణి.        ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు 'నువ్వు బాగున్నావే' అంటే 'నువ్వు  బాగున్నావు' అనుకున్నారు.
    "ఇద్దరూ బాగున్నారు" అంది సీతాదేవి.
    చీరలు చూసి మురిసిపోతూ, తెలుగు పరీక్షలో  ఒక భాగమైన మనుచరిత్ర కావ్యాన్ని  చదువుకుంటూ  కూర్చున్నారు.
    చీర కట్టుకోగానే ఆ పిల్లల  మనస్సులో ఏవో కొత్త భావాలు! వొళ్ళంతా  కొత్త వొంపులు కనిపించాయి! ఆ డ్రెస్సులో ఆ భావం ఆటోమేటిక్ గా వొచ్చేస్తుందేమో! దానికి తోడు చదువుతూన్నది  మనుచరిత్ర. ప్రపంచం అంతా శృంగారమయంగా  కనిపిస్తోంది  కావ్యకి.
    "హాయ్!" అంటూ లోపలికొచ్చారు  గంగా, ఉమా, నిర్మలా, రేఖా, అందరూ చీరలు కట్టుకుని  వొయ్యారాలొలుకుతూ  వున్నారు.
    వాళ్ళందర్నీ  చీరలో  చూడాలని లోపల్నుంచి  పరుగెత్తుకొచ్చింది సీతాదేవి పనొదిలిపెట్టి.
    వంద చిలుకలు  ఒక్కచోట  గుంపుగూడి  కూర్చున్నట్టనిపించింది, తియ్యతియ్యని పలుకులు పలుకుతూ!
    వేయి కోయిలలు ఒక్కసారిగా కూసినట్టనిపించింది  వారి మాటలు!
    "మీరు పరీక్ష కెళ్ళేవారిలాగా లేరు, పెళ్ళికెళుతూన్నట్టుగా వున్నారు. అసలు మీరందరూ  పెళ్ళికూతుళ్ళలా వున్నారు _ అందరూ దిష్టి తీయించుకోండి ఇళ్ళకెళ్ళాక" అంది.
    అందరిలో ఏదో సిగ్గు పెళ్ళి పేరు చెప్పేసరికి! ఏదో పులకింత ఆ మాట వినేసరికి!
    "మమ్మీ! అసలే చదివే మూడ్ లేదు. నువ్వు డిస్టర్బ్  చేస్తున్నావ్ మమ్మల్ని" అంది కావ్య.
    "ఓ! కే....కానివ్వండి. నే పోతున్నా _ పని చూసుకుంటా" అంటూ లోపలికెళ్ళిపోయింది సీతాదేవి.
    ఆడుతూ పాడుతూ  చదివారు మనుచరిత్ర  కావ్యాన్ని, పరీక్ష కెళుతూన్నట్టుగా  కాదు, ఏదో నవల చదువుతూన్నట్టుగా.
    "టైమయింది _ ఇంక పోదామే" అంది గంగ.
    "ఛలో...." అంటూ అందరూ  లేచారు.
    "తలుపెసుకో  మమ్మీ...." అరిచింది కావ్య.
    గబగబా లోపల్నుంచొచ్చి  తలుపేసింది  సీతాదేవి _ "జాగ్రత్తగా వెళ్ళి రమ్మని" చెబుతూ.
    చదివింది మననం చేసుకుంటూ, మధ్య మధ్య చర్చించుకుంటూ బయలుదేరారు  అందరూ బస్ స్టాండుకి! దాదాపు అరగంటసేపు నుంచుంటే గానీ, ఏ బస్సూ రాదు! ఒకవేళ వస్తే ఆగదు! ఆగితే ఎక్కడానికి  స్థలముండదు.
    అతికష్టంమీద  తోసుకుంటూ  లోపలికెళ్ళడానికి  ప్రయత్నించారు  ఈ స్నేహితుల బృందం.
    "అబ్బా! ఎవరో జడ లాగుతున్నారు" అరిచింది నిర్మల.
    ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.
    "ఎవరే?" అరిచింది కళ్యాణి!
    "సమ్....స్టుపిడ్ ఫెలో...." అంది రేఖ.
    "ఏయ్....అలా  అరవకండి  గట్టిగా...." అన్నారు గంగా, ఉమా, భయపడుతూ.
    కావ్య వెనక్కి తిరిగి చూసింది.
    నల్లటి మొహం, ఉంగరాలు  తిరిగిన జుట్టూ, తెల్లటి  పలువరస, గొరిల్లాలా వున్నాడు. వీళ్ళ అరుపులు  విని వాడు  వినోదంగా నవ్వుతూ వుంటే, ఒళ్ళు మండిపోయింది కావ్యకి!
    "కండక్టర్....స్టాప్....ది....బస్!" గట్టిగా అరిచింది కావ్య.
    కండక్టర్ బస్సాపాడు.
    బస్సు దిగి గబగబా నడిచి వాడి దగ్గరి కెళ్ళింది కావ్య! సాచి అతని చెంపమీద లెంపకాయ కొట్టింది. దాంతో బస్సులో వున్న వాళ్ళంతా కిందకి దిగారు, అందరూ కావ్య ధైర్యానికి  మెచ్చుకుంటూ  వాణ్ని తిడుతూ వుండడం గమనించడమే  కాకుండా, ఆడదాని చేతిలో పదిమంది మధ్యా చెంపదెబ్బ తిన్నందుకు  అవమానంతో పరుగెత్తాడు వాడు.
    "చాలా మంచి పని చేశావమ్మాయ్! ఆడపిల్లలు ఏం చేసినా పడుంటారు  అన్న ధైర్యంతోటే వాళ్ళు అలా చేస్తూంటారు. నీలాగా కొందరైనా తిరగబడితే  బుద్దొస్తుంది" అన్నాడొక ముసలాయన, కావ్యాని అభినందిస్తూ.
    కావ్య అపర కాళికాదేవిలా వుంది  కోపంతో.
    బస్సు కదిలింది.
    మదినిండా  శృంగారాన్ని  నింపుకుని  వొయ్యారంగా  వెళుతూన్న  ఆ చిన్నారుల మనసుల్లో  భయం, ఆందోళన  చోటు చేసుకున్నాయి, కొద్దిసేపట్లో!  
    గమ్యం చేరుకొని, ఎలాగో పరీక్ష రాశారు. ఆ రోజు కాలేజీలో అంతా ఇవ్వే మాటలు.
    లెక్చరర్లదాకా పాకిందీ విషయం! అందరూ కావ్యని  పిలిచి సంగతులు తెలుసుకుని  ఆమెని అభినందిస్తూ  వొచ్చారు. ఆ రోజు కావ్య ఆ కాలేజీకే హీరోయిన్  అయింది.
    అంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు  ఇలాగే  బస్సుస్టాండు లోనూ, షాపింగ్ కి వెళుతూన్నప్పుడూ, మొగపిల్లలు ఎగతాళిగా  మాట్లాడితే, మందలించింది  మళ్ళీ మాట్లాడకుండా!
    ఇంకోసారి తనూ, కళ్యాణీ కలిసి బజారికెళ్ళి  ఏదో కొనుక్కొని ఇంటికొస్తూవుంటే, ఇద్దరు రౌడీలు వెధవలు వెంటపడ్డారు.
    "ఒరేయ్! కళ్ళు జిగేల్ మనడం లేదూ?" అన్నాడొకడు.
    "అవును _ మెరుపులా వున్నారు" అన్నాడు ఇంకొకడు.
    "నీ మొహం! ఆపిల్స్ లా వున్నారు" అన్నాడు మొదటివాడు.
    "కొరికి తినెయ్యాలనుంది" రెండోవాడన్నాడు.
    కళ్యాణికి వొణుకుపుట్టింది. అడుగు పడడంలేదు భయంతో.
    వాళ్లు  వీళ్ళకి మరీ దగ్గరగా  వొచ్చి  నడుస్తున్నారు.
    "కళ్యాణీ! కుక్కలు మొరుగుతూ వుంటే ఏం చెయ్యాలి?" అంది నవ్వుతూ కావ్య.
    "చెప్పు తీసుకుని కొట్టాలికదూ! అదికూడా తెలీదా?" కళ్యాణికేసి చూసి నవ్వుతూ అంది.
    "ఏయ్! కావ్యా! ఏమీ అనకే! వాళ్ళతో  ఎందుకొచ్చిన  గొడవ?" అంది కళ్యాణి మెల్లగా చెవిలో రహస్యం చేబుతూన్నట్టుగా.
    "నీ చెప్పులకి  శాండిల్స్  లేవు కదూ! నా చెప్పులకి వున్నాయి. చూపిస్తానుండు. దవడనంటుకున్నాయంటే, ముఫైరెండు పళ్ళూ ఊడి చేతిలోకి రావలసిందే!" అంటూ ఆగి, చెప్పును కాలినుండి తీసింది. అంతే! పక్కపక్కనే నడుస్తున్న ఆ రోమియోలు వెంటనే స్పీడు పెంచి జనంలో కలిసిపోయారు.
    కళ్యాణి తెల్లబోయి చూసింది కావ్యవంక.
    కావ్య పకపకా నవ్వింది! 
    "చూశావా? భయపడుతూ ఉంటే  భయపెడుతుంది వెధవ ప్రపంచం. కాస్త బెదిరించేసరికి  పరుగు లంకించుకున్నారు. కళ్యాణీ! ఆడపిల్లని చూస్తే ఆరేళ్ళ వెధవ దగ్గరినుంచీ, అరవై ఏళ్ళ ముసలాడిదాకా  ఒకటే పిచ్చెత్తిపోతారు. అదేం బుద్దో! ఇంత పిల్లాడి దగ్గరి నుంచీ అలుసే!" అంది.
    కళ్యాణికి కావ్యని చూస్తే  ఝాన్సీలక్ష్మిలా, రాణి రుద్రమలా అనిపించేది.
    ఆ మాటంటే కావ్య పకపకా నవ్వేది. "ఏదీ? నాకు వీరనారి బిరుదాంకితం చెయ్యి" అని విల్లంబులు పట్టుకున్నట్టు ఫోజు పెట్టేది. ఫ్రెండ్సందరూ, తీరిక సమయాల్లో  ఇవన్నీ  చెప్పుకుని నవ్వుకునేవారు.
    కాలేజీలో ఎవరు ఎవరిని ఏడిపించినా  ముందు కావ్య  దగ్గరికొచ్చి  చెప్పుకునేవారు.
    ఆ సంవత్సరం కాలేజీ జనరల్ సెక్రటరీగా  కావ్యే సెలక్టయింది. ఆడపిల్లలు పోట్లాడుకున్నా, ఆ తగవులు తీర్చడానికి  కావ్య దగ్గరికే వొచ్చేవాళ్లు. ఎవ్వర్నీ నొప్పించకుండా  అందరికీ  సర్ది చెప్పి, దెబ్బలాడుకున్న రెండు పార్టీలనీ కలిపి నవ్వించి  పంపించేది కావ్య.
    "నీలో మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయే! నువ్వు కాలేజీ అయ్యాక ఎలక్షన్లలో నుంచుంటే రాజకీయాల్లో ఎంతో పనికొస్తావ్!" అనేవారు కొందరు స్నేహితులు.
    "శక్తీ, యుక్తీ ఒక్క రాజకీయాలకే  అవసరం కాదు. నిజ జీవితంలో ప్రతి విషయంలోనూ పనికొస్తాయి" అనేది కావ్య.
    ఈ విషయాలన్నీ ఇంటికొచ్చి  పూసగుచ్చినట్టు  చెప్పేది తల్లికి కావ్య!
    "తనపక్కన  పసిపిల్లలా  పడుకుని  ముద్దుముద్దు మాటలు పలికే ఈ బిడ్డలో ఇన్ని ఆలోచనలూ, ఇంత శక్తీ ఉందా....!?" ఆశ్చర్యబోయేది సీతాదేవి.
    ఈ మాటలు విన్న క్రాంతి "అమ్మా! కావ్యని 'లా' చెయ్యమనాలి. చక్కగా ఆలోచించి, సమర్ధవంతంగా  తీర్పు చెబుతుంది" అనేవాడు.  
    "ఎందుకురా  ఆ గొడవలు! వెధవది, తెల్లారి లేచింది మొదలు విడాకుల కేసులూ, విధివంచితుల కేసులూ, దొంగలూ, దోపిడీలూ, నేరాలూ, శిక్షలూ వీటితోటే సరిపోతుంది. దొంగైనా వాదించవలసొస్తుంది. హత్యకేసుల్లో  వాదించాల్సొస్తే  లేనిపోని గొడవలు! యెందు కొచ్చిండా జీవితం! ఆడపిల్ల జీవితం మల్లెపువ్వు లాంటిది, భద్రంగా కోసిపెడితే, పరిమళాలు వెదజల్లుతూ వికసిస్తుంది. లేకపోతే వాడిపోతుందీ, నలిగిపోతుంది."
    తల్లి మాటలకి నవ్వేవాడు క్రాంతి! "అమ్మా! అలా అనుకుంటే ప్రపంచంలో ఆడ డాక్టర్లుండరు. ఆడ లాయర్లుండరూ, అసలు ఆడవాళ్ళు తిని కూర్చోవడం తప్ప, ఇంక ఏ పనీ చెయ్యకూడదు. స్త్రీలు అన్నిరంగాల్లో  విజృంభించి ప్రగతి సాధిస్తున్న ఈ సమయంలో, నువ్వు కొన్ని శతాబ్దాలు వెనక్కెళ్ళి ,మళ్ళీ ఆమెని షోకేసులో బొమ్మలాగా, ఆ సిద్ధాంతాన్నే బోధిస్తున్నావు. ప్రగతిశీలురు  నీ మాటలని  ఖండిస్తారమ్మా!" అనేవాడు.
    "అవన్నీ నాకు తెలీదు. నాబిడ్డ  మాత్రం ఏ ఉద్యోగమూ చెయ్యదు" అనేది.
    "మరయితే ఈ చదువెందుకు?" అనేవాడు క్రాంతి.
    "చదువు విజ్ఞానంకోసం. ఇల్లు చూసుకోవడంలోనూ, పిల్లల్ని పెంచుకోవడంలోనూ, తెలివిగా,శాస్త్రోక్తంగా పనులు చేసుకుపోవడానికి  చదువు పనికొస్తుంది. చదువువల్ల సంస్కారం పెరుగుతుంది. అందుకోసం ప్రతీ ఆడపిల్లా కనీసం డిగ్రీవరకైనా  చదువుకోవాలి. ప్రతి తల్లీ తన బిడ్డలని చదువూ సంధ్యాలేని ఆయాలచేతిలో పెట్టేసి, తను  ధనార్జనకోసం పరుగులు తీస్తే, ఇంటికొచ్చేసరికి  ఈసురోమని పెరుగుతూన్న బిడ్డలూ, అశ్రద్ధగా పెరుగుతూన్న బిడ్డలూ కనబడితే వాళ్ళమీద విసుక్కుంటూ, వాళ్ళని చీదరించుకుంటూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎందుకా సంపాదన? ప్రతి తల్లీ తన బిడ్డలకి తనే ప్రధమ గురువు కావాలి! ఆరోగ్య విషయాలూ, ఆహార విషయాలూ  తనే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. అందుకు చదువు కూడా తోడైతే, తల్లే తన బిడ్డలకి ఉత్తమ నర్సుగా, ఉత్తమ టీచరుగా వుంటుంది" అనేది.

 Previous Page Next Page