Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 5

    ఈ ఎక్స్ ప్రెస్ కూడా ఆగింది.

    "కొత్తవాళ్ళు ఎక్కారు. పడుకున్న ఆమెని చూశారు. ఆమెని లేపితే సీటులో కూర్చోవచ్చుకదా అని ఆశపడ్డారు. అందులో ఒకడు "ఏయ్ అమ్మీ లేలే..." అన్నాడు.

    ఆమె కాస్త కదిలింది. "రామాపురం వస్తే కాస్త లేపండి బాబూ!" అంది.

    "బయలు దేరుతున్నాను సుమా" అన్నట్లు కూతవేసింది.

    "లే, లే, ఇది రామాపురమే. రైలు ఆగటము బైలు దేరటమూ అయింది." ఎక్కినతను అన్నాడు.

    పోయేప్రాణం లేచొచ్చినట్లయింది. "ఇది రామా పురమా అయ్యో!" అంటూ కంగారుగా లేచింది. పిల్లని చంకలోకి తీసుకుంది. సంచీ అందుకుంది. తూలుతూ తలుపు దగ్గరకొచ్చింది.

    రైలు బిగ్గరగా గర్జించి బయలుదేరింది.

    "ఇప్పుడు దిగావంటే రైలుకిందపడి చస్తావ్!" ఎవరో అరిచారు. ఆమె వినిపించుకోలేదు. కదుల్తున్న రైలులోంచి దూకినట్లే దిగింది. ఆ విసురుకి వెళ్ళినుంచున్న పోర్టర్ మీద పడింది.

    "వళ్ళు పొగరెక్కి చస్తున్నావా, రైలు బయలుదేరిందాకా ఏం రాచకార్యం పెట్టెలో వెలగబెట్టావ్. జారి నట్లయితే చక్రాలకిందకి సరాసరి పోయేదానివి..." అంటూ బండ బూతులు లంకించుకున్నాడు పోర్టర్.

    "డోన్ టాక్ రబ్బిష్!" ఆమె గొణుక్కుంది. అంత దూరాన స్టేషన్ మాస్టరు నుంచుని వుంటే వడివడిగా ఆయన దగ్గర కెళ్ళింది.

    "నాకోసం ఎవరయినా వచ్చారా?"

    ఆమె అడిగినమాట ఆయన కర్ధంకాలేదు. రోగిష్టి మారి పిచ్చిదానిలా వున్న ఆమెని గుచ్చి చూస్తూ "ఏమిటి" అనడిగాడు.

    "నాకోసం ఎవరూ రాలేదా?" ఆమె అడిగింది.

    ఆ ప్రశ్న ఆయనకి పట్టరానంత నవ్వొచ్చింది.

    "ఆ...వచ్చాడు మైసూర్ మహారాజాగారు" అని అవతలికి వెళుతూ, పాపం "పిచ్చిది" అనుకున్నాడు.

    ఆమె కుంగిపోయింది...అడుగులు తడబడుతుండగా లోతుకుపోయిన కళ్ళతో చికిలించి చూస్తూ స్టేషనంతా కలయ తిరిగింది.

    ఆమెకి కావాల్సినవారు ఎవరూ రాలేదు.
   
    అణువణువూ నిరాశ పేరుకోగా "భగవాన్, నేనేం చేయాలి. నా ఆశ....నా ప్రాణం...నేను__నేను..." పై కే గొణిగింది. అక్కడే చెట్టుకిందవున్న బెంచీమీద కూర్చుండి పోయింది.
   
    ఆమె కళ్ళముందు నల్లని వలయాలు తిరుగుతున్నాయి. ఎదుటిదృశ్యం బూజురు బూజురుగా కాన వచ్చింది. సంచీ తలకింద పెట్టుకొని పిల్లని మరో చేత్తో గట్టిగా పట్టుకుంది. "భగవాన్! భగవాన్?" కళ గట్టిగా మూసుకుని భగవన్నామ స్మరణలో పడింది.
   
    కొద్దిసేపు తర్వాత ఆమె పెదవులు "దాహం దాహం" అని కదిలాయి.
   
    టపటప రెక్కలు కొట్టుకొని ఓ పక్షి ఏకాకిగా ఎగిరి పోయింది ఆమె చెట్టుమీదనుంచి.
   
                                                              2
    మంచికి గాని చెడుకుగాని జనం గుమికూడటం మామూలు.

    ఆ బెంచీకి కాస్తదూరంగా కొద్దిమంది గుమికూడారు. చావు సహజం అయినా అది మనిషికి మహా వింతైన విషయం. చనిపోయిన ఆమెని చూస్తూ తలో రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు.

    క్రమశిక్షణగల సైనికులులా బయలుదేరిన చీమలు ఒకదాని వెనుక ఒకటి ఆమెముక్కులోంచి వెళ్ళి తెరుచుకునివున్న నోట్లోంచి బయటికి వస్తున్నాయి. ఈగలు ముఖం మీద శరీరం మీద ఎగురుతున్నాయి. ఆమె చెయ్యి వొకటి బెంచీ కిందకు వాలివుంది. మరో చెయ్యి పిల్లని కింద పడకుండా పుచ్చుకుంది.

 Previous Page Next Page