Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 5

    ఆ ఇల్లు ఓ బ్యూటీ క్లినిక్ లాంటిది. అందంగా ముఖాన్ని తయారుచేయడమే కాదు. విగ్గులు, డ్రస్ లు కూడా అద్దెకిస్తారు.
    నందితాదేవి తన చిన్న బ్రీఫ్ కేసుతో ఆ ఇంట్లో అడుగు పెట్టింది.

    మేడం హసీనా వివరాలు అడిగింది, నోట్ బుక్ దగ్గరకు లాక్కుని.

    "నా పేరు సరళ. నాకు ఎవరూ లేరు! నా పోషణ భారం దూరం చుట్టం ఓ ముసలమ్మ చూస్తుంది. సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను. పలురకాల వేషాలతో ఫోటోలు ఇదివరకే దిగాను. పూర్తి మగవేషంతో తయారయి, ఈ వూరి హోటల్లో దిగిన ప్రముఖ సినీ డైరెక్టర్ సోంబాబుని కల్సుకుని కాసేపు మగపాత్రలో నా నటన చూపించి తర్వాత నా వివిధ వేషాల ఫోటోలు, అసలు రూపం చూపి సినిమా ఛాన్స్ అడగాలి" తను వచ్చిన కారణం అదీ నందితాదేవి వివరంగా చెప్పింది.

    మేడం హసీనా రాసుకుంది.

    వయస్సు, ఎత్తు, లావు, అడ్రసు కూడా అడిగి రాసుకుంది. సూటు బూటు గనక అయితే ఛార్జ్ ఎక్కువ. ముందుగా రెండువందలు కట్టాలి. అదనంగా గంటకి పదిరూపాయలు, రెండు గంటల కాలానికి ఎడ్వాన్సు పే చెయ్యాలి.

    నందితాదేవి రెండు వంద నోట్లు ఒక యాభైరూపాయల నోటు ఇచ్చింది.

    మేకప్ చేస్తున్నంతసేపు నందితాదేవి సరదాగా వాగుతూనే వుంది. తనకి స్టేజీ నాటకాల అనుభవం బాగానే వుందని ఏ సినీ డైరెక్టర్ కంట్లోనూ పడలేదని, ఓ సినిమా ఛాన్స్ తగిలితే ఆఖరికి అప్పలమ్మ పాత్రయిన సరే సినీ రంగాన్ని ఏలేస్తానని.

    "నీవు అందమైన దానివి. నీ రూపానికి మరింత మెరుగులు దిద్దుకుని వెళితే నీ కోరిక ఫలిస్తుందేమో" మేడం హసీనా ఉచిత సలహా ఇచ్చింది కనుబొమలకి కొద్దిగా టచెస్ యిస్తూ.

    "నిజమే! మగ వేషంలో ఫోటో తీయించుకోవాలి. అలానే డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి మగవేషంలో వుండే సినిమచాన్స్ అడుగుతాను. అతను పెదవి విరిచి పొమ్మంటాడు. ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్., కృష్ణ, శోభన్ అందరి యాక్షను చేసి చూపిస్తాను. అనుకరణ తప్ప టాలెంట్ లేని మనుషులను తిట్టి పంపిస్తాడు. తను దేవదాసు ఫోజు కూడా అభినయించి చూపిస్తుంది. అద్దె డ్రెస్ వదిలేసి తన అందానికి మరింత మెరుగులు ఇక్కడే దిద్దించుకుని మరోసారి అప్సరసలా వెళుతుంది. అందమైన ఆడపిల్ల అనగానే వేషం ఇచ్చినా, ఇవ్వకపోయినా ముందు ఖుషీగా మాట్లాడుతాడు. తర్వాత తను చెపుతుంది. తన నటనా అనుభవం అపారమని, చాలా నాటకాల్లో ప్రయిజులొచ్చాయని, ఫోటోజెనిక్ రూపమని తన ఫోటోలు చూపుతుంది. అంతేకాదు, అంత క్రితం మగవాడిగా వచ్చింది తనే అని చెపుతుంది- ఎలా వుంది నా ప్లాన్?" వివరంగా చెప్పి అడిగింది నందితాదేవి.

    "గుడ్ అయిడియా!" మెచ్చుకుంది మేడం హసీనా.

    "ప్లాన్ వేశాను. ప్లాను ఫలించి పని సవ్యంగా అయితే పెద్ద తారనయినా నిన్ను మరిచిపోను" నందితాదేవి ఫోజు కొట్టి అంది.

    మేడమ్ హసీనా నవ్వు దాచుకుంది.

    హీరోలా తయారయ్యావు! ఆడపిల్లగా నీ వెనుక బడితే నేను బాధ్యురాలిని కాను సుమా! మగవేషంలో ముద్దొస్తున్నావు. వేషం తీసేస్తే ముద్దు పెట్టుకుంటాను. అభ్యంతరం లేదుగా?" మేకప్ పూర్తిచేసి సామాను సర్దుతూ అంది మేడమ్ హసీనా.

    తెల్లగా లావుగా వున్న మేడమ్ హసినాని చూసి "అంతవరకూ అభ్యంతరం లేదు." అంటూ నవ్వింది నందితాదేవి.

    "ఇది ఆడదాని నవ్వు. మగవాడిలా యిలా నవ్వాలి. నడక, మాటలు ఇలా వుండాలి" మేడమ్ హసీనా చెపుతూ అన్నీ చేసి చూపించింది.

    ఆ ఇంట్లోంచి బైటికి వస్తూ నందితాదేవి అనుకుంది.

    "సారీ హసీనా మేడమ్! ఈ జన్మకి నీకు ముద్దివ్వలేనేమో! చాలాదూరం వెళ్ళిపోతున్నాను.

    అక్కడే రిక్షా ఎక్కక బ్రీఫ్ కేసు వూపుకుంటూ కొద్ది దూరం నడిచి రిక్షా ఎక్కింది.

    రిక్షా రైల్వేస్టేషను వేపుకి పరుగు తీసింది.  

 Previous Page Next Page