Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 5

    "ముందు చదివి ఈ కాగితం ఆ బాపతే అనుకున్నాను కాని అంతలో మళ్ళీ భయంవేసింది." అంది ఆమె.

    "డోంట్ వర్రీ మమ్మీ!" అంది రోజారమణి.


                       -3-


    దీక్ష తలుపు తట్టింది.

    పద్మనాభం వచ్చి తలుపు తీశాడు.

    "నీ వొస్తావని శలవు పెట్టి యింట్లో వుంటే మరీ యింత ఆలస్యంగానా రావటం, నీ కసలు బుద్ధివుందా!" అంటూ తలుపు తీసిన పద్మనాభం గుమ్మం అవతల వున్న దీక్షని చూసి కంగారు పడ్డాడు. అంతలోనే తేరుకుని "సారీ మేడమ్!" అన్నాడు.

    "నెవర్ మైండ్!" అంది దీక్ష ఓ చూపు లోపలికి సారించి.

    దీక్షకి తను చేపట్టిన పనిలో కొన్ని చేదు అనుభవాలు అయ్యాయి. విషం మింగుతూ చేదుగా వుందని వాపోతే ఎట్లా! అక్కడికి దీక్ష తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేస్తూ పదకొండుగంటల తర్వాత బైలు దేరుతున్నది.

    ఉదయం ఆడవాళ్లు బిజీగా వుంటారు. కత్తి పట్టుకుని రణరంగంలోకి చొచ్చుకు పోయినట్లు గరిట పుచ్చుకుని వంట సామాగ్రి మీద కలియపడుతూ వంటిల్లంతా కదం తొక్కుతు, వున్నవి రెండు చేతులు అయినా నాలుగు చేతుల పని చేస్తారు.

    పిల్లలు స్కూళ్ళకెళ్ళేవేళ భర్తలు ఆఫీసుకి వెళ్ళేవేళ ఎవరైనా వస్తే ఏ ఇల్లాలయినా గరిట తిరగేస్తుందని దీక్షకి తెలుసు.

    రెండు దాటిందంటే చాలు విశ్రాంతికి నడుం వాల్చిన ఇల్లాలు టకీ మని లేస్తుంది. పని మనిషి, పంపు, టిఫెను అయిదు గంటల లోపున ముగించే మూడు కార్యక్రమాలు ఆమె వెన్నుతట్టి లేచేట్లు చేస్తాయి.

    సాయంత్రం అయిదు దాటుతూనే,

    ఆఫీసు నుంచి ఈసురోమంటూ అయ్యగారు ఊడిపడతారు. ఆయనకి అటూ ఇటూగా ఆవురావురు మంటూ పిల్లలు వచ్చి పడతారు. కాఫీ ఒకరికి, బూష్ట్ మరొకరికి అదనపు శక్తికి హార్లిక్స్ వీటిల్లో మునిగి తేలుతుంది ఇల్లాలు. ఆ తర్వాత కుక్కరు మోత వుండనే వుంది.

    ఇల్లే ఆఫీసు గల ఇల్లాలికి ఉదయము, సాయంత్రము రెస్ట్ అనేది వుండదు. మంగళ సూత్రాలు రెండు ఎందుకని ఎవరో అడిగితే, ఓ ప్రబుద్ధుడు భర్తని మర్చిపోకుండా ఒకటి, వంటిల్లు మర్చిపోకుండా రెండోది అన్నాడుట అలా.

    అందుకే దీక్ష తెలివిగా ఉదయము, సాయంత్రము వదిలేసి మిట్ట మధ్యాన్నం మిడసరి లగ్నం ఎన్నుకుంది తన ప్రచారానికి. పైగా ఇంట్లో మగాళ్ళు వుంటే అదో గోల.

     ఈ విషయంలో అటు కొద్దిమంది ఆడాళ్ళతోగాక కొందరు మగాళ్ళతో చేదు అనుభవాలు అప్పటికే రుచి చూసి వుంది దీక్ష. తలుపు తీసి పద్మనాభం అన్న మగప్రాణి వూడి పడేసరికి దీక్ష కొద్దిగ కంగుతింది. అయినా అంతలోనే సర్దుకుని లోపలికి తొంగి చూసింది. ఆడవాళ్ళ తాలూకా అలికిడి కానకు రాలేదు.

    "ఎవరు కావాలండీ!" ముందుగా పద్మనాభం అడిగాడు.

    "మీ యింట్లో ఆడవాళ్ళు...!" దీక్ష అక్కడితో ఆగిపోయింది.

    "ఉన్నారు. ఎవరు కావాలి!"

    "మీ శ్రీమతి...!"

    దీక్ష మాట పూర్తి చేసే లోపల పద్మనాభం చెప్పే లోపల అతగాడి శ్రీమతి అరుంధతి లేచి వచ్చేసింది 'ఎవరూ!' అంటూ.

    "నీ కోసమేట" తడబడుతూ చెప్పాడు పద్మనాభం.

    "నాకోసం అయినప్పుడు నన్ను పిలవక గుమ్మానికి అంటుకు పోయారేమిటి!" దీర్ఘం తీసింది అరుంధతి.

    "అబ్బే! అదేం. లేదు నిన్ను పిలవబోతున్నాను. నీవు వచ్చావు. నేను వెళుతున్నాను. నీవు మాట్లాడు" రవంత కంగారుతో పద్మనాభం లోపలికి వెళ్ళాడు.

    పెదవుల చివర్ల వంకర నవ్వు, నుదురు చిట్లింపు, మాట పెళుసు, హృదయంలోకి చొచ్చుకు పోయేలాంటి గుచ్చి చూసినట్లు చూసే చూపులు చూసి ఆ నిమిషానే అరుంధతిని అంచనా వేసింది. దీక్ష. ఎదుటివాళ్ళని అంచనా వేయటంలో దీక్షకి మంచి ప్రావీణ్యం వుంది.

 Previous Page Next Page