Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 5

   "అదేమిట్రా...ఇవ్వాళ స్కూల్ బస్సు మిస్సయిందా?"
    "అది టాప్ సీక్రెట్...ఎవరికీ చెప్పకు..."
    "స్శశానంలో   దెయ్యం'  నవల చదువుతూ బాత్రూంలో వుండిపోయా...ఈలోగా  ఆలస్యమైంది.   బస్సెళ్ళిపోయింది.
    నుదురు  మీద కొట్టుకొని అంది,  "నువ్వెలా బాగుపడతావురా?   అయినా నాన్న కూడా నిన్ను బాగా గారాబం చేస్తున్నారు"  అంది తమ్ముడి వంక చురచుర చూస్తూ.
    "అబ్బ...అరవకు...నాన్నొచ్చి  మళ్ళీ తిడతాడు"  అన్నాడు.
    "సర్లే..పద.."  అంది.
    ఇద్దరూ కైనెటిక్    హొండా  మీద బయల్దేరారు.  దారిలోనే డుంబు స్కూల్ వుంది.  స్కూల్ దగ్గర  డుంబుని  దించింది.
    అక్కడ్నుంచి  సందు తిరగ్గానే తన హ్యండ్ బ్యాగ్ డుంబు స్కూల్ బ్యాగులోనే వుండిపోయిందని గుర్తొచ్చి బండిని వెనక్కి తిప్పింది.
    సరిగ్గా అప్పడే డుంబు రోడ్డు క్రాస్ చేసి స్కూల్ వైపు వెళ్ళబోతున్నాడు.
    సరిగ్గా అప్పడే ఓ కారు వేగంగా డుంబు పక్క నుంచి వెళ్ళిపోయింది.
    అది చూసి భయంతో కెవ్వున కేక వేసింది అవని.
    కొద్దిలో ప్రమాదం తప్పింది.  డుంబు పెద్దగా కేక వేశాడు.  జనమంతా పోగయ్యారు.
    "అదృష్టం"  ఎవరో అన్నారు.
    "కొద్దిలో తప్పింది"  మరొకరి కామెంట్.
    "చూసుకుంటూ నడవాలి"  ఇంకెవరో అన్నారు.
    "ఆ కారువాడే బలిసి స్పీడుగా పోనిచ్చాడు"  ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు.
    అవని కైనెటిక్ హొండాని రోడ్డు పక్కన పార్క్ చేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళింది.
    అక్కను చూడగానే  బావురుమన్నాడు డుంబు.
    "ఎడవకురా...దెబ్బలేం తగల్లేదుగా"  అంది తమ్ముడ్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ.
    డుంబుకి  ఇంకా భయం పోలేదు.  అవనికి తమ్ముడ్ని చూస్తే జాలేసింది.
    "పోనీ ఇవాళ్టికి స్కూల్ కు  వద్దులే...ఇంటికి వెళ్ళు...పోనీ నేను  డ్రాప్ చేయనా?"   అడిగింది తమ్ముడ్ని అవని.
    హమ్మొ...వద్దు....నాన్న కోప్పడతాడు."
    "పోనీ స్కూల్ కు వెళ్తావా?" అంది.
    స్కూల్  కు   వెళ్లడం  ఇష్టంలేదని,  తమ్ముడి మొహం చూస్తేనే తెలుస్తోంది.
    ఇవ్వాళ బాస్ కూడా ఆఫీసుకు రాడు.  ఢిల్లీ వెళ్తానన్నాడు.
    పోనీ  తనతోపాటు ఆఫీసుకు తిసుకెళ్తే?
    "డుంబు.....నాతోపాటు మా ఆఫీసుకు వస్తావా?"    
    హుషారుగా  తలూపాడు వస్తానన్నట్టు.
    "వెరీగుడ్.. పద"  అంది  కైనెటిక్ హొండా స్టార్ట్  చేసి.
                   *            *           *
    తమ్ముడి స్టాఫ్ కు   పరిచయం చేసింది.  డుంబు ఏ మాత్రం మొహమాటం లేకుండా అందరితో కలిసిపోయాడు.  తర్వాత ఓ మూల టేబులు చూసుకొని కూచొని,  బ్యాగులో అడుగున దాచిన డిటెక్టివ్ నవల తీసుకొని చదవడం మొదలెట్టాడు.
    "ఏయ్ అవనీ...మీ  తమ్ముడికి  డిటెక్టివ్ నవలల పిచ్చి బాగా వున్నట్టుందే"  అంది వసుధ.
    "ఎలా వచ్చిందో ఆ అలవాటు!"   అంది నిట్టూరుస్తూ అవని.
    ఆమె ఆలోచలన్నీ టెలిఫోన్ లో  బెదిరించిన వ్యక్తి చుట్టే
    ఆ విషయం వసుధకు ఎలా చెప్పాలా?  అని  ఆలోచిస్తోంది.
    మధ్యాహ్నం పన్నెండు దాటుతుండగా ఫోన్ వచ్చింది.
    వసుధ ఫోన్ లిప్ట్ చేసి,  "అవనీ..  ఫోన్ నీకే"  అంది రిసీవర్ పక్కన పెడుతూ.
    గుండెల్లో రైళ్ళు పరుగెత్తిన ఫీలింగ్ కలిగింది అవనికి.
    'మళ్ళీ ఆ బ్లాక్ మెయిలర్ గాడేనా?'  అన్న అనుమానం.
    "ఎ..ఎవరట"  అంది మెల్లిగా.
    తన గొంతు తనకే వినిపించడం లేదేమోనన్న అనుమానం కలిగింది.
    "ఏమో...అవనిగారు కావాలనన్నారు"  అంది  వసుధ.
    మెల్లిగా ధైర్యం కూడాదీసుకుని ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది.
    "హ..లో..వ్..  మీ తమ్ముడు  సేఫ్ గా    వున్నాడా?  జాగ్రత్త...  ఈసారి సరిగ్గా  మీ తమ్ముడ్నే...వద్దులే...నిన్నే టార్గెట్ పెట్టుకుంటా..."
    "యూ.." కోపంగా ఇంకా ఏదో అనబోయింది.
    "ష్..... ఆఫీసులో  అందరూ వింటారు.  ఏమిటని  అడుగుతారు.  ఏమని చెబుతావు?  నువ్వేంచేప్పినా,   చెప్పకపోయినా నువ్వు చావడం గ్యారంటీ.  నిన్ను హత్య చేయడం ఖాయం"  ముచ్చెమట్లు పోసాయి అవనికి.
    అవతలి వైపు ఫోన్  పెట్టేసిన శబ్దం వినిపించింది.  రిసీవరు క్రెడిల్ చేసింది.
    "ఎవరే?"  అడిగింది వసుధ.
    ఏం చెప్పాలో అర్ధంకాలేదు.  శేషశాయి గుంట నక్కలా తనవైపే చూస్తున్నాడని అవనికి అర్ధమైంది.
    "మా రిలేటివ్ లే "  అని  చెప్పి తన సీట్లో  కూలబడింది.
    సరిగ్గా అప్పుడు పక్క గదిలో నుంచి డుంబు వచ్చాడు.  వని మాట్లాడిన ఫోన్ కు,   మరో ఎక్స్ టెన్షన్  వుంది.   ఆ ఎక్స్ టెన్షన్  ఫోన్  రిసీవర్ క్రెడిల్ చేసి అక్కయ్య దగ్గరికొచ్చి "అక్కా నిన్ను హత్య చేస్తానని  బెదిరించింది ఎవరు?   అని అడిగాడు.
    తమ్ముడి  వంక కంగారుగా చూసింది.
    తమ మాటలు ఎవరు వినడం లేదుకదా..  అని చుట్టూ చూసి తమ్ముడి నోరు తన చేత్తో మూసింది.  గట్టిగా  మాట్లాడవద్ధన్నట్టు  సైగా చేసింది.
    డుంబు కామ్ గా వుండిపోయాడు.
    లంచ్  టైమ్  లో   క్యాంటీన్ కు   దూరంగా వున్న ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది.  లైట్ గా  క్యాంటీన్ లో సమోసా తిని టీ తాగొచ్చారు.
    "నన్ను ఫోన్ లో బెదిరించిన విషయం నీకెలా తెలిసిందిరా?"  ఆశ్చర్యంగా అడిగింది అవని తమ్ముడ్ని.
    "రెండ్రోజుల నుంచి నువ్వు కంగారుగా వుంటున్నావు.  ఫోన్ వస్తే చాలు వణికిపోతున్నావు.  నేను చదివిన బోల్డు డిటెక్టివ్ నవలల్లో ఇలాంటి సీన్లు వున్నాయి.  హీరోయిన్ని విలన్ ఫోన్ లో బెదిరించడం,  బ్లాక్ మెయిల్ చేయడం... అందుకే ఇందాక నువ్వు ఫోన్ లో   మాట్లాడుతుంటే  పక్కగదిలో వున్న ఫోన్ ఎత్తాను.  అందులో ఒకతను నిన్ను బెదిరించడం వినిపించింది."  క్లియర్ గా   చెప్పాడు డుంబు.
    తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూసింది.
    నవలల ప్రభావం తమ్ముడి మీద ఎంతగా పడిందో అర్ధమైంది.
    "నిజమేరా  డుంబు... నన్నొకడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.  ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు"  చెప్పింది విచారంగా అవని.
    అక్కని అలా చూసేసరికి డుంబుకు బాధేసింది.  అవని కూడాడుంబు తనకన్నా చాలా చిన్నవాడని,  ప్రపంచ జ్ఞానం లేనివాడని  ఆలోచించలేదు.  కష్టాల్లో పూచిక పుల్ల కూడా బలమైన  ఆధారంగా కనిపిస్తుందనే విషయం ఆమె విషయంలో నిజమైంది.
    "నువ్వేం భయపడకక్కా...నేనున్నాగా"  అన్నాడు.
    ఆ మాటలకే కొండంత ధైర్యం వచ్చింది అవనికి.
    "ఏం చేయన్రా"  బాధగా అడిగింది అవని.
    "ఈ సారి  వాడు ఫోన్  చేసినప్పుడు పోలీసులతో చెబుతానని బెదిరించు.డిటెక్టివ్ జేమ్స్ బాండ్ కు  కూడా చెబుతానను."
    "డిటెక్టివ్ జేమ్స్ బాండ్ ఎవర్రా?"
    "చస్తావు జాగ్రాత్త'  నవల్లో హిరోయిన్ కష్టాల్లో వున్నప్పుడు డిటెక్టివ్ జేమ్స్ బాండ్ వచ్చి కాపాడుతాడు."
    ఎందుకో కొద్దిగా ధైర్యం వచ్చినట్టు అనిపించింది అవనికి.
    "ఒరే...ఈ విషయం నాన్నకు చెప్పకురా"  అంది అవని.
    "ఇలాంటి విషయాలు  ఎవరికీ చెప్పొద్ధక్కా...నీ కెందుకు నేను వున్నానుగా"  ధైర్యం చెప్పాడు  డుంబు.
    "వసుధకు చెబుదామనుకుంటున్నాను"  అంది.
    "వద్ధక్కా...ఈ విషయంలో  ఎవర్నీ నమ్మొద్దు."
    "పోనీ అనిరుద్ర"  అని అడిగింది అవని.
    డుంబుకు అనిరుద్ర తెలుసు.  అప్పడప్పడు అనిరుధ్రను కలవడానికి వెళ్ళినప్పుడు డుంబును వెంట పెట్టుకుని వెళ్ళేది.
    "ఇప్పుడే వద్ధక్కా"  పెద్ద ఆరిందలా చెప్పాడు.  అన్నింటికీ  బుద్ధిగా తలూపింది అవని.
                    *            *           *
    ఆఫీసులో  పనిచేస్తున్నా అవనికి మనసు మనసులో లేదు.
    ఆమె ఆందోళనలో  పడిపోయింది.
    తమ్ముడెంత ధైర్యం చెప్పినా,  ఫోన్ లో తనని బెదిరించిన వ్యక్తి గురించి భయపడిపోతుంది.
    అసలు తననెందుకు బెదిరిస్తున్నాడో కూడా అర్ధం కావడంలేదు.
    డుంబు బుద్ధిగా మూల కూచొని డిటెక్టివ్ నవల చదువుతున్నాడు.  అప్పడప్పడు అవని ఫోన్ లిప్ట్ చేసినప్పడల్లా  అక్క వంక పరిశీలనగా చూస్తున్నాడు.
   అతనికి సరదాగా వుంది.  డిటెక్టివ్ చేయాలన్న కోరికా వుంది.
    శేషశాయి అవని వై పు దొంగ చూపులు చూస్తూన్నాడు.  అవని ఆ చూపులు గమనించింది.  చాలా రోజులుగా శేషశాయి తనక్ని తినేసేలా చూస్తున్నాడు.ఏదో వంకతో తనతో మాట్లాడే  ప్రయత్నం చేస్తున్నాడు.  గుంటనక్క...  కసిగా అనుకుంది అవని.  నాలుగ్గంటలకు ఫోన్ వచ్చింది.
    వసుధ లిప్ట్ చేసి,  అవతలి వైపు ఏదో మాట్లాడేసరికి అవనిని కేకేసి "అవని ఫోన్ నీకే"  అంది.
    వెంటనే డుంబు పరుగెత్తుకొచ్చాడు.
    "డుంబు..నువ్వు చిన్న పిల్లాడివి..ఫోన్ నీక్కాదు,  మీ  అక్కయ్యకు"  అంది వసుధ నవ్వుతూ.
    గుర్రగా వసుధ వంక చూశాడు డుంబు.
    తనని చిన్నపిల్లాడు అనడం డుంబుకు నచ్చలేదు.
    ఈలోగా అవని వచ్చి రిసీవర్ అందుకుంది.  డుంబు పక్క గదిలోకి వెళ్ళ బోయాడు.
    అవని వద్దని వారించింది.
    "హలో.."  అంది  మెల్లిగా.
    "అవనీ..నేను అనిరుధ్రను మాట్లాడుతున్నా.
    ఇవ్వాళ ట్యాంక్ బండ్   దగ్గర కలుసుకుందాం?"
    అటువై పు నుంచి అనిరుద్ర మాట్లాడుతున్నాడు.
    ఒక్క క్షణం తేలిగ్గా నిట్టూర్చింది.
    "వద్దు.. ఇవ్వాళ కుదర్దు"  చెప్పింది డుంబు వంక చూస్తూ.
    "అదేం?"

 Previous Page Next Page