Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 5
కథా విభాగం :
వీరభారతి
కల్యాణ భారతము
1
అప్పుడే సూర్యోదయమయ్యెను. బాలభాస్కరుని ప్రభాతకిరణములు పాటలీపుత్ర రాజసౌధములకు బంగారు పూతలు పూయుచుండెను. రాజప్రసాదమున వైతాళికుల ప్రబోధగీతము లింకను వినవచ్చుచుండెను. పట్టణవాసులప్పుడప్పుడే తలుపులు తెరచుకొని తమతమ నిత్యకృత్యముల నిర్వర్తించుకొనుటకై వీథులలోనికి వెడలుచుండిరి.
ఆ సమయమున రాజవీథిలోఁ గొందఱు విదేశ పురుషులొక సింహపుబోనును లాగికొనివచ్చుచుండిరి. ఆ బోను బలిష్ఠములైన యినుపకమ్ములతో నమర్పఁ బడియుండెను. దానియందు భయంకరమగు నొకసింహము బంధింపఁబడి యుండెను. ఆ మృగేంద్రమును దర్శించుటకై పౌరులు గుంపులు గుంపులుగా నరుదెంచుచుండిరి. బాలురకు పట్టపగ్గములు లేకుండెను.
ఆ సింహము ముందొక గుఱ్ఱముపైఁ గూర్చుండియున్న పురుషుఁడిట్లు గొంతెత్తి చాటుచుండెను. "అయ్యలారా! ఈ బోనును దెఱవకుండ లోపలనున్న సింహమును వెలువరింపఁగల బుద్ధిమంతు లెవరైననున్నచొ రాజాస్థానమునకు రండు." ఇట్లు చాటించుచు వా రా సింహమును పాటలీ పుత్రపుఁ గోటవాకిలియొద్దకుఁ గొనివచ్చిరి.
అది సభామంటపము. నందమహారాజు కొలువుదీర్చి యుండెను. మంత్రులు, సామంతులు తమతమ యాసనములపై నుపవిష్టులై యుండిరి. వందిమాగధుల కైవారములు మిన్నుముట్టుచుండెను. ఇంతలో ద్వారపాలకుడు చనుదెంచి "మహాప్రభూ! కొందఱు క్రొత్త పురుషులొక విచిత్రమైన సింహమును గొనివచ్చి దేవరవారి యనుజ్ఞకై సింహద్వారమున వేచియున్నా"రని విన్నవించెను.
నందమహారాజు వారిని గొనిరమ్మని యనుజ్ఞ నొసఁగెను. కొలఁదిసేపటికి నూతన పురుషుల సింహముతో రాజసభలోనికిఁ బ్రవేశించిరి.
మహారాజు :- ఓరీ! మీదే దేశము? మీ రాజెవరు?
పురుషులు :- ప్రభూ! మాది సింహళదేశము. మగధ సామ్రాజ్యమున మంచి మంచి బుద్ధిమంతులు గలరని విని మా ప్రభువుగారీ సింహమును మీ యాస్థానమునకుఁ బంపిరి.
మహారాజు :- ఏమీ! సింహళరాజు మమ్ము పరీక్షింప నెంచెనా? మంచిది. ఇందలి విశేషమేమిటో వివరింపుఁడు.
పురుషులు :- ఈ బోను తలుపులు తెరవకుండ చువ్వలు కదల్పకుండ లోపలి సింహమును వెలువరింపవలయును.
ఆ మాటలు వినుటతోడనే రాజు విస్మితుఁడయ్యెను. సభ్యులంద ఱాశ్చర్యముతో నావింత సింహమువైపు వీక్షణములు సాగించిరి. బోనులోనున్న హర్యక్షము నోరుదెఱచి నాలుకచాచి మిక్కిలి భీతిగొల్పుచుండెను. ఉండియుండి యిటునటు గదలించుచుండెను. ముందువెనుకల కూగుచు కనుగ్రుడ్లు త్రిప్పుచు చెవులు నిక్కించుచుండెను.
ఎవ్వరి కేమియుఁ దోఁపలేదు. ఆ కఠిన సమస్య నెట్లు విప్పవలెనో తెలియలేదు. తలుపులు తెరవకుండ సింహమును తరలించుటెట్లు? అంతయు నగమ్యగోచరముగ నుండెను. ఈ వార్త పట్టణము నలుమూలలఁ బ్రాకెను. పాటలీపుత్ర పౌరు లాబాలగోపాల మా యద్భుతదృశ్య మాలోకించుటకై కొలువు కూటమున గుమిగూడిరి. కాని యేమి చేయవలెనో యెవ్వరికిని స్ఫురింపలేదు. కన్నులు పెట్టుకొని కనుఁగొనువారేగాని కర్తవ్యము గుర్తించిన వారొక్కరును లేకపోయిరి.
ఇంతలో పదేండ్ల బాలకుఁడొకఁడు పరుగుపరుగున నచ్చటికరుదెంచి యా విచిత్రమును విలోకించి "ఓహో? దీనికేనా యింతదూరము వచ్చితిరి? రాజాజ్ఞయైనచో బోను నుండి సింహమును దరలించు టెంతపని?" అని సగర్వముగఁ బలికెను. నందమహారాజాయర్భకుని జూచి "నీవీ పనిచేయఁగలవా?" అని ప్రశ్నించెను. "దేవరవా రాజ్ఞ యిత్తురా?" యని బాలుఁడు పలికెను. "మంచిది! కానిమ్ము" అని మహారాజు ముదల యిడెను. సభ్యులందరు తమతమ స్థానముల లోనికిఁబోయికూర్చుండి యా వినోదమును వీక్షించుచుండిరి. మహారాజు విస్మయవిస్ఫారిత నయనములతో నేమి జరుగునోయని రెప్పవెట్టక చూచుచుండెను.
బాలుఁడు తదేకదృష్టితో హర్యక్షము నవలోకించెను. కొంచె మాలోచించి తల పంకించి మందహాసము చేసెను. 'ఎఱ్ఱగాఁ గాల్చిన యినుపకడ్డీలు రెండు తెప్పింపుఁ'డని పలికెను. రాజభటులు గణగణ కాలుచున్న కడ్డీలను గొనివచ్చిరి. బాలుఁడు వాని నందుకొని చువ్వలసందుగా బోను లోనికిఁబోనిచ్చి తెఱచియున్న సింహము నోటిలోఁజొనిపెను.
వెంటనే సింహము కరిగి నీరైపోయెను. "లక్క సింహము! లక్కసింహ"మను కేకలు సభలో నొక్కమాటుగ పిక్కటిల్లెను. బాలుని బుద్ధికౌశల్యమునకు "మేలుమే"లని సభ్యులందఱు చప్పట్లు చఱచిరి. మహారాజు బాలుని ముఖమాలోకించి "నేఁటికి నీమూలమున మా మగధ రాజ్యగౌరవము దక్కినది. మా మర్యాదఁ గాపాడితివి. నీ వెవఁడవు! నీ తల్లిదండ్రు లెవరు?" అని సబహుమానముగఁ గాపాడితివి. నీ వెవఁడవు! నీ తల్లిదండ్రు లెవరు?" అని సబహుమానముగఁ బ్రశ్నించెను.
"నా పేరు చంద్రగుప్తుఁడు. నా తల్లి పేరు ముర. తండ్రి యెవ్వరో తెలియదు" అని ప్రభువాక్యములకు బాలుఁడు బదులు పలికెను.
ఆ మాట వినుటతోడనే నందుని కనుబొమలు ముడిపడెను. మొగ మెఱ్ఱవారెను. "భటులారా! ఈ బాలుని బంధించి కారాగారమునఁ బడవేయుడు" అని కఠినముగ నాజ్ఞాపించెను. సభ్యులెల్లరు చకితులైరి.
2
అది నందరాజు విలాసోద్యానము. నటీమణులు నాట్యము చేయుచుండిరి. గాయకులూ గానము చేయుచుండిరి. ఒక పుష్ప నికుంజము మధ్యనున్న స్ఫటిక శిలావేదికపై నందుఁడాసీనుఁడై యుండెను. అతఁడు బాగుగాఁ ద్రాగి మైమరచియుండెను. ఒకదానివెంట నొకటి మద్యపాత్రములు చెల్లిపోవు చుండెను. చేతికి నోటికి నెడతెఱపి లేకపోయెను. సంగీత వాద్యముల ధ్వని తరంగములలో నటీమణుల నాట్యభంగిమలలో రాజు హృదయము తేలిపోవుచుండెను. తప్పత్రాగి యొడలు తెలియక ఇష్టము వచ్చినట్లు వదరుచున్న రాజబంధువుల స్తోత్రపాఠములు వనమంతయుఁ బ్రతిధ్వనించుచుండెను.
Previous Page
Next Page