4
"ఏది మళ్లీ అను" కైలాసగణపతి హూంకరించాడు.
"ఒకసారి ఏం ఖర్మ. వందసార్లు అంటాను. నీకు బుద్ధిలేదు" సూర్యారావు అన్నాడు.
ఏది మళ్ళీ అను!"
"మళ్ళీ అదేమాట అన్నాను సరేనా?"
"నీ మర్యాద ఇంతేనన్నమాట!"
"ఇంతే. కావాలంటే ఈ మాట కూడా వందసార్లు అంటాను."
"నేను పరుగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చింది ఇన్ని మాటలు నీచేత పడటానికి రా సూరీడూ!" జాలిగా అడిగాడు కైలాసగణపతి.
"ఎవరికోసం పడతావ్! బుర్రలో గుంజులేకపోయిం తరువాత చచ్చినట్లు పడాల్సిందే." సూర్యారావు నిర్లక్ష్యంగా అన్నాడు.
"సారీరా."
"నీవు సరిగమలు నా చెవి దగ్గర వాయించకు."
"అదికాదురా!"
"వద్దు. చెప్పొద్దు."
అంతవరకూ వాళ్ళిద్దరి ఫార్సూ చూస్తున్న మాణిక్యాంబ ఇహ ఆగలేక కల్పించుకుంది.
"ఏమిటండీ మంచీ మర్యాద లేకుండా?"
"అలా గడ్డిపెట్టు చెల్లెమ్మా. ఇందాకనుంచీ చూస్తున్నాను. మర్యాద లేదు, మంచిలేదు....
"ఆగరా ఆగు. నీవెంతటి ఘనుడువి అయినా, గడ్డి పెట్టమంటే పెట్టదురా గణనాధా! అది నాభార్య. అదింత వరకూ తన చేత్తో వండి అమృతమే తినిపించిందిగానీ గడ్డికాదు. ఈరోజు నీవు చెప్పావని ఇ.....హ.....పె....ట్టా....లి ఘడ్డి." నొక్కి పలికాడు సూర్యారావు.
"ఘడ్డి కాదు గడ్డి" సరిదిద్దాడు కైలాసగణపతి.
"నా ఇష్టం. గడ్డిని ఘడ్డి అనే అంటాను."
వీళ్లిద్దరూ ఇలా వాదులాడుకుంటుంటే మాణిక్యాంబ ఇంట్లోకి వెళ్లి రెండు ప్లేట్లలో కారప్పూస అరిసెలు తెచ్చి వాళ్ళముందు పెట్టింది. "కాస్త ఫలహారం చేయండి అన్నయ్యగారూ!" అంది.
"ఇంకా ఆలస్యం ఎందుకు మింగు" అన్నాడు సూర్యారావు.
"నేను మింగను. తింటాను" అన్నాడు. కైలాసగణపతి ప్లేటు మీద దాడిచేస్తూ.
"నీ ఇష్టం. నీవెలా అఘోరిస్తే నాకెందుకులే" అంటూ సూర్యారావు ప్లేటులోని అరిశను అందుకొని నోటికి పని కల్పించాడు.
రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టిన మాణిక్యాంబ "అమ్మయ్యా" అంది.
"ఎందుకు అమ్మయ్యా అన్నావు?" భార్యని అడిగాడు సూర్యారావు.
"నేను చెప్పను" అంది మాణిక్యాంబ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.
"నీవు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అంట....! అసలు ఆడజాతి అంటేనే ఎవరికి అర్ధం కానిది అని ముక్కు విరుస్తారు. మూతి తిప్పుతారు. ముసిముసి నవ్వులు నవ్వుతారు. అమ్మమ్మమ్మ. వీళ్ళకి ఒక కళా! నవకళలు."
"మీరు మాట్లాడకుండా తినండి" అంది మాణిక్యాంబ.
"అదెలా కుదురుతుంది. అమ్మయ్యా ఎందుకు అన్నావో తెలుసుకోకుండా!"
"నాకు తెలుసు" మధ్యలో కల్పించుకుని చెప్పాడు కైలాసగణపతి.
"నీకు తెలిసింది ఒక్కటే తినటం."
"దానితో పాటు యిదీ తెలుసు.
"అయితే చెప్పు."
"మనిద్దరం మాట్లాడకుండా ఫలహారం చేస్తున్నాము కదా! అమ్మయ్యా నా ఉపాయం ఫలించింది. దెబ్బతో నోరు మూసుకున్నారు. అనుకుంటూ అమ్మయ్యా అంది."
"అంతేనా!"
"అంతే!"
"మరి వుపాయం ఏమిటి?"
"పలహారం తింటూ మనం నానాచెత్తా వాగటం మర్చిపోయాం. మననోళ్లు మూతపడేసరికి ప్రాణం హాయిగా అనిపించి "అమ్మయ్యా అనుకుంది మా చెల్లెమ్మ" వివరించాడు కైలాసగణపతి.
"హత్తెరికి యిలా విషయం" అంటూ మాణిక్యాంబ కోసం చూశాడు సూర్యారావు. దరిదాపుల్లో ఎక్కడా భార్య కనిపించలేదు.
ఇద్దరూ నవ్వుకున్నారు.
అసలు విషయం వాళ్ళిద్దరూ చాలా ఏళ్ళ తర్వాత కల్సుకున్నారు. ఆనందం పట్టలేక వయసు మరిచిపోయి పిల్లలు గిల్లికజ్జాలు ఆడుకున్నట్లు చేస్తున్నారు. ముద్దుగా తిట్టుకుంటున్నారు.
బస్సుదిగి రోడ్డుమీద కాలు పెట్టినప్పటినుంచీ తనకీ జరిగిన అనుభవాలు, పడ్డతిప్పలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు కైలాసగణపతి.
అంతా విని "నీకు బుర్రలేదు బుద్ధిలేదు" అన్నాడు సూర్యారావు.
"ఎందుకు లేదు?" అన్నాడు కైలాసగణపతి.
"బుర్రా బుద్ధి రెండూ వుంటే మందుగా నాకు ఓ కార్డు ముక్కయినా రాయకుండా నీకు ఏకులా ఈ వూళ్ళో దిగబడవు" అన్నాడు సూర్యారావు.
"ఎన్నేళ్ళబట్టో ఈ ఊళ్ళో అఘోరిస్తున్నావు. నీ పేరు ఒక్కడికంటే ఒక్కడికి తెలిసి చావకపోయే."
"అది నా తప్పుకాదు. నీది."
"అదిగో ఆ మాటే ఎత్తవద్దన్నాను. ఉన్న ఊళ్ళో నీపేరు ఎవరికీ తెలియదంటే...."
"నా పేరు తెలియకపోవటం ఏమిటి? ఆ బాలగోపాలానికి తెలుసు. పొరపాటు నీదన్నా కదా!"
"ఎలా?"
"సూర్యారావు అనే నా పేరు అడిగితే చాలు బొడ్డూడని వెధవాయికూడా నా అడ్రస్ చెపుతాడు. సూరీడు అని అడిగితే ఎవరికి తెలిసి చస్తుంది. నన్ను సూరీడు అని పిలిచేది నీ ఒక్కడివేరా కైలాసం" వివరించాడు సూర్యారావు.
"ఇదన్నమాట విషయం!"