Previous Page Next Page 
జీవనయానం పేజి 5


    నాదిర్ షా మొగలు దర్బారులో ప్రవేశించాడు. సింహాసనం మీద ఆసీనుడు అయినాడు. అంతఃపురంలోని  స్త్రీలందరినీ తన ముందుకు రావలసిందని ఆదేశించాడు.

 

    అంతఃపురంలో గుసగుసలు మొదలయినాయి. పరపురుషుని ఛాయసహితం చూడని తాము నాదిర్ షా ముందుకు పోవడమా? నాదిర్ షా క్రౌర్యాన్ని గురించి విని ఉన్నారు. విధిలేదు అనుకున్నారు. అలంకరించుకుని కదిలారు.

 

    నాదిర్ షా దర్బారు అతివల అందాలతో వెలిగిపోయింది. సౌందర్యరాసులు కూడాను. అంతఃపురపు అందాల ఉద్యానాలు అక్కడ వెలిశాయి.

 

    నాదిర్ షా ఒకసారి ఆ అందాలను తిలకించాడు. తన మొలలో ఉన్న జంబియా తీశాడు. తన ముందున్న పీఠం మీద పెట్టాడు. నిద్రకు ఉపక్రమించాడు. గుర్రుకొట్టాడు!

 

    అలా కొంతసేపు గడిచింది.

 

    అంగనలు విసుక్కున్నారు. గుసగుసలాడుకున్నారు. కాని, నిలిచిన చోటునుంచి కదల్లేదు.

 

    నాదిర్ షా మేలుకున్నాడు. అందరినీ వెళ్లిపోవలసిందని ఆజ్ఞాపించాడు!

 

    'ఎందుకు పిలిచినట్లు?' అనుకున్నారు అందరు. ఒక యువతి అడిగింది.

 

    "జాతి నిర్వీర్యమయిందని తెలుసుకున్నాను. మీరు వెళ్లవచ్చు" అన్నాడు.

 

    "అంటే?" మళ్లీ ఆ యువతి అడిగింది.

 

    "వివరిస్తాను. విను. నేను పిలిచినపుడు మీరు నా ముందుకు వస్తారనుకోలేదు. ప్రాణాలు ఇస్తారనుకున్నాను. మీరు వచ్చారు. జంబియా ముందుంచి నిద్రపోయాను. జంబియా అందుకుని ఏ ఒక్కరయినా ప్రతీకారం కోసం ముందుకు వస్తారనుకున్నాను. ఇలాంటి పిరికివారికి వీరులు పుడ్తారని ఎలా ఆశించను? భారతదేశం మీద జైత్రయాత్ర సాగించిన మొగలు వంశం ఈనాడు ఇంత నిర్వీర్యం అయింది. ఇక దీనికి మనుగడలేదు" అని లేచి వెళ్ళిపోయాడు.

 

    అదిగో అలాంటి సమయంలో ఇంగ్లీషువాళ్లు మనదేశంలో చొరబడ్డారు. ఇంగ్లీషు వారి దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే! అది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోనే వారు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం నుంచి వచ్చి మనసు కొల్లగొట్టారు.

 

    ఇతరులవలె కాక ఆంగ్లేయులు మన జీవన విధానాన్ని - సంస్కృతిని - సభ్యతను రూపుమాపారు. ఒక నూరు సంవత్సరాలు మన రైతును బ్రతకనీయలేదు. మన కుటీర పరిశ్రమలను మననీయలేదు. వాళ్ళ దేశపు సరుకులు తెచ్చి అమ్మి, మన వర్తక వాణిజ్యాన్ని రూపుమాపారు.

 

    ఆంగ్లేయ కంపెనీ అంతటితో ఆగలేదు. మన సంస్కృతి - సభ్యత - మతం మీద కత్తితో కాదు - కలంతో దాడి చేశారు. మనకు ఆనాటికి ఉండినది సాంతం కుళ్లు అని బోధించారు. వెలుగు సాంతం పశ్చిమ దేశాల్లో ఉందని నమ్మించారు. మన మేధావులు నమ్మారు. కాదు - నమ్ముతున్నాం. మనం ఆంగ్లేయుల రాజకీయ బానిసత్వం మాత్రమే వదిలించుకున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనే పాశ్చాత్య సాంస్కృతిక బానిసత్వంలో మరింత కూరుకుపోతున్నాం.

 

    ఆంగ్లేయులు నూరు సంవత్సరాలు ప్రజలను పీడించి - దోచుకుంటే పెదవి కదిపినవాడు లేడు. కంపెనీవారి దృష్టి దేశీయ సంస్థానాల మీద పడింది. రాజులు రాణుల వ్యక్తిగత జీవితాల్లో కూడా కల్పించుకున్నారు. గద్దె ఎక్కడం, దింపడం కంపెనీవారే నిర్ణయించారు. ఝాన్సీ లక్ష్మి పెంపుడు తీసుకోవచ్చా? అనే విషయం కూడా కంపెనీయే నిర్ణయిస్తానన్నది.

 

    బిడ్డను రక్షించుకోవడానికి పిల్లి సైతం పులి అవుతుంది!

 

    అందుకుతోడు సైనికులకు తోలు తూటాలు ఇచ్చారు.

 

    ప్రజల్లోనూ - దేశీయ ప్రభువుల్లోనూ - కొంత భాగం సైన్యంలోనూ ఇంగ్లీషు వారిమీద ద్వేషం ప్రబలింది.

 

    వీటన్నిటి పర్యవసానంగా 1857 నాటి మనం అనుకునే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది. దీనిని సంగ్రామం అన్నదానికంటే విచక్షణారహితమైన దొమ్మి అనడం మేలు. ఎంచేతంటే-

 

    1. దీనికి ఒక నిర్ణీతమైన లక్ష్యం లేదు.

 

    2. కేంద్రబిందువు కేంద్రనాయకత్వం లేదు.

 

    3. చేతకాని - లేవలేని బహదూర్ షాను చక్రవర్తినిచేయ సంకల్పించారు.

 

    4. క్రమశిక్షణ బొత్తిగా లేదు. మూకలు విరుచుకుపడ్డాయి.

 

    5. ఆయుధబలం ఏమాత్రం లేదు.

 

    6. ఎదుటిబలాన్ని అంచనా వేయలేదు.

 

    సుశిక్షితమైన కంపెనీ ప్రభుత్వం తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. మనకు ఝాన్సీలక్ష్మీ - తాంతియాతోపే వంటి అమరవీరులు, వారి కీర్తిగానాలు దక్కాయి.

 

    హైదరాబాదులో కూడా స్వాతంత్ర్య సంగ్రామపు నీడ పడింది. దీనికి కొంతవరకు నిజాం అండకూడా ఉన్నట్లు చెప్పుకుంటారు.

 

    17.జులై 1857 నాటి సాయంకాలం తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలో అయిదారువందలమంది రెసిడెన్సీమీద దాడి చేశారు.

 

    అనుకోకుండా జరిగిన దాడి విషయం రెసిడెంటుకు పదిహేను నిముషాలముందు తెలిసింది. ఏడు నిమిషాల్లో సైన్యం ఆయత్తం అయింది. అర్థరాత్రి వరకు అల్లర్లను అణచివేశారు. 18 జూలై తెల్లవారేవరకు సర్వం సాధారణంగా ఉంది.

 

    తుర్రెబాజ్ ఖాన్ - అల్లావుద్దీన్ పారిపోయారు. వారిద్దరినీ పట్టుకున్నారు. తుర్రెబాజ్ ఖానుకు జీవిత ఖైదు విధించారు. అతడు జైలునుంచి పారిపోయాడు. వారంలో అతన్ని కనిపెట్టారు. తప్పించుకు పారిపోతూ దెబ్బతగిలి మరణించాడు.

 

    అల్లా వుద్దీన్ను అండమాను పంపారు. ఇరవై అయిదేళ్ళ యాతన తరువాత అతను మరణించాడు.

 

    పోలీసు చర్య తరువాత తిరుగుబాటు జరిగిన చోట రెసిడెన్సీ రోడ్డుకు "తుర్రెబాజ్ ఖాన్ రోడ్డు" అని పేరు పెట్టారు. మనం స్వాతంత్ర్యాన్ని వలెనే ఆ పేరునూ మరిచిపోయాం.

 

    పోరాటాలు అణచబడుతాయి. ఓడిపోతాయి. నిలిచిపోతాయి. అంతే.

 

    పోరాటాలు వృధాకావు. వ్యర్థంకావు. అర్థం కాకపోవు.

 

    కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచిన ఉప్పెనను - లావాను - తుపానును ఇంగ్లీషువారు నిర్దాక్షిణ్యంగా - క్రూరంగా - పాశవికంగా అణచివేశారు.

 

    మనుషులను చెట్లకు కట్టి ఉరితీశారు.

 

    మనుషులను ఫిరంగులకు కట్టి పేల్చి వేశారు.

 

    మనుషులను ముక్కలు ముక్కలుగా నరికారు.

 

    పితూరి - తిరుగుబాటు - స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేశామని మురిసిపోయారు.

 

    పోరాటాలు అణగవు. పోరాటాలు సమసిపోవు. పోరాటాలు ఆరవు. ఈ విషయం బ్రిటిషు ప్రభుత్వం గమనించింది. అర్థం చేసుకుంది.

 

    బ్రిటిషు ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి కారణం ఏమిటి?

 

    బ్రిటిషు ప్రభుత్వం నవాబులది కాదు. బ్రిటిషు ప్రభుత్వం నియంతృత్వం కాదు. బ్రిటిషు ప్రభుత్వం రాచరికం కాదు.

 

    బ్రిటిషు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం! ప్రజల ప్రభుత్వం! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం.

 

    బ్రిటిషు ప్రభుత్వానికి తిరుగుబాటులు తెలుసు. వాటి విలువలు తెలుసు. ఆ దేశంలోనే తిరుగుబాటులు వచ్చాయి.

 

    బ్రిటిషు ప్రభుత్వానికి ఫ్రెంచి విప్లవం తెలుసు. అది కూలదోసిన రాచరికం తెలుసు.

 

    బ్రిటిషు ప్రభుత్వానికి అమెరికా స్వాతంత్ర్య సంగ్రామం తెలుసు. అందులో దాని ఓటమి చేదు నిజం తెలుసు.

 

    బ్రిటిషు ప్రభుత్వానికి స్వాతంత్ర్య పిపాస తెలుసు. ఆ పిపాస వెనుక ఉన్న అగ్నిగోళాలు తెలుసు. అగ్నిపర్వతాలు తెలుసు. దావాగ్నులు తెలుసు.

 

    బ్రిటిషు ప్రభుత్వం అమెరికానువలె - భారతదేశాన్ని వదలదలచలేదు. కలకాలం భారతదేశాన్ని పీల్చుకు తినాలనుకుంది. సామ - భేదమును ప్రయోగించింది.

 

    బ్రిటిషు ప్రభుత్వం భారతప్రజల కోపాగ్నిని పసి కట్టింది. కొంతవరకు అంచనా వేయగలిగింది. మండే అగ్నిమీద నీళ్లు చల్లింది!

 

    బ్రిటిషు పరభుత్వం కంపెనీవారు దౌర్జన్యం జరిపారు అన్నది. అందుకోసం కంపెనీ ప్రభుత్వాన్ని తొలగించింది.

 

    విక్టోరియా మహారాణి భారత ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇది బ్రిటిషు ప్రభుత్వపు తొలి చర్య! భారతదేశంలో కొంత ఉపశమనం కలిగించింది.

 

    తుంట దింపి మొద్దు ఎత్తుకోవడం అనే సామెత లాంటిది. బరువు అంతటిదే! కాని వస్తువు మారింది!!!

 

    బ్రిటిషు ప్రభుత్వం గుర్తించిన విషయం ఏమంటే - వచ్చిన విప్లవానికి ప్రజాశక్తి కారణం కాదు. దేశీయ ప్రభువులు - రాజులు, నవాబులు కారణం.

 

    కారణం అయినవారిని తాకరాదనీ - వారి విషయంలో జోక్యం చేసుకోరాదనీ నిర్ణయించింది. బ్రిటిషువారి అదీనంలోని భారత దేశంలోని రెండు వంతులు దక్కాలంటే ఒక వంతు వదులుకోవాలనుకున్నారు.

 Previous Page Next Page