Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 6


    పక్కన పడుకుని-

 

    "ఆ కోరిక ఏమిటో చెప్పనా?" అని చెవి దగ్గర పెదవులకు ఆన్చి మెల్లగా చెప్పాడు.

 

    ఆమె మాట్లాడలేదు.

 

    "అంత సిగ్గెందుకు? ఏ మగాడైనా అమితంగా ఇష్టపడేది ఇదే" అని మరోమారు చెప్పాడు.

 

    ఆమె ఇటు తల అయినా తిప్పలేదు.

 

    "బెడ్ రూమ్ లోకి రాగానే సిగ్గును తలుపుకి ఆవలే వదిలెయ్యాలి" అంటూ భార్య ముఖాన్ని సుతారంగా తనవైపు తిప్పుకున్నాడు.

 

    ఆమె ముఖం చూడగానే అతను పెట్టిన గావుకేకతో కొండరాళ్ళ మీద కాంక్రీట్ తో బలంగా కట్టిన ఆ భవంతి వూగినట్టనిపించింది.

 

    నీలంగా మారిపోయిన ఒళ్ళు - ముందుకు వుబ్బి వికారంగా కనిపిస్తున్న కళ్లు - బయటికి వచ్చి కదులుతున్న నాలుక- దాని చివరనుంచి చుక్కలు చుక్కలుగా బెడ్ మీద పడుతున్న లాలాజలం- ముడతలు పడ్డ చర్మంతో భయంకరంగా కన్పిస్తున్న ఆమెను చూసి వణికిపోతున్నాడు అతను.

 

    ఇంట్లో నుంచి కేక వినిపించడంతో రామ్ సింగ్ హడావుడిగా లోపలికి పరుగెత్తాడు.

 

    బజారు నుంచి వచ్చి కారు దిగుతున్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె చేతివేళ్ళను స్పృశించిన కుక్క అంతవరకు బయటికి పోలేక పొదల మాటున వుండిపోయింది.

 

    ఎప్పుడయితే వాచ్ మేన్ లోపలికి వెళ్ళాడో నింపాదిగా పైకి లేచిన ఆ కుక్క నిశ్శబ్దంగా బయటికి అడుగులు వేసింది.

 

    గుండెజబ్బున్న మనిషిలా నెమ్మదిగా స్టేషన్లో ఆగింది ప్యాసెంజర్ రైలు వగర్చుకుంటూ, తను దిగాల్సిన స్టేషన్ అదేనని నిర్ధారించుకున్న తరువాత చలపతిరావు నింపాదిగా కంపార్ట్ మెంట్ లోంచి కిందకి అడుగుపెట్టాడు.

 

    ఆయనకి యాభై అయిదేళ్ళుంటాయి. అయితే మనిషి మాత్రం కుర్రాడిలా, కాటన్ ప్యాంటుమీద గళ్ళాచొక్కాతో ఫ్యాషన్ బుల్లోడిలా ఉన్నాడు. కానీ బట్టతల, పెరిగిన గడ్డం ఎక్కడో ఆయన వయసుని పట్టించేస్తాయి. ఒకప్పుడు బాగా బతికి, ప్రస్తుతం చెడిపోయినవాడిలా కనిపిస్తున్నాడు.

 

    నున్నగా వున్న బట్టతలను ఓసారి రుద్దుకుని నడవడం మొదలుపెట్టాడు. ఆ బండిలోంచి అతనితోపాటు ఒక్కరు కూడా దిగలేదు. పగలే కొంత జనసంచారం ఉంటుందిగానీ అప్పుడు రాత్రి పదకొండు కావడంతో ప్లాట్ ఫామ్ పై నరమానవుడు లేడు.

 

    అసలా స్టేషనే పురాతనకాలంలోంచి పట్టుజారి కిందపడ్డట్టుంది. స్టేషన్ కార్యాలయం వున్న భవనం భూమిని గట్టిగా పట్టుకుని అతికష్టం మీద నిలబడ్డట్టు కనిపిస్తోంది. చుట్టూ వున్న ఇనుపచువ్వల ఫెన్సింగ్ తుప్పుపట్టిపోయి వికారంగా వుంది. అక్కడక్కడా వున్న ఎలక్ట్రిక్ దీపాలు శాపవశాత్తు కిరోసిన్ లాంతర్లయి పోయినట్టు మసగ్గా వెలుగుతున్నాయి.

 

    చలపతిరావు స్టేషన్ దాటబోతుండగా, "టికెట్" అని వినపడడంతో ఠక్కున ఆగాడు.

 

    పచ్చలైటు పట్టుకున్న ఓ వ్యక్తి గబాగబా అక్కడికి వచ్చాడు. చలపతిరావు అతన్ని చూస్తూనే ఓ క్షణంపాటు ఉలిక్కిపడ్డాడు. దెయ్యాలు సగం పీక్కుతిని మిగిలిన సగం వదిలేసినట్టు కుష్టువ్యాధి అతని ముఖంలో చాలాభాగాన్ని మింగేసింది. ముక్కుస్థానంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. పెదవులు ఉబ్బి వికారంగా కనిపిస్తున్నాయి. జబ్బు కళ్ళను సైతం వదలనట్టు అవి గాజుగోళీల్లా వున్నాయి.

 

    చలపతిరావు ఠక్కున జేబులోంచి టిక్కెట్టు తేసి అతనికిచ్చి ఒక్క గెంతులో బయటికొచ్చి నిలబడ్డాడు. ఎద్దులబండి ఏమన్నా వుందేమోనని చుట్టూ పరికించి చూశాడు కానీ ఏ ఒక్క బండీ వున్నట్టు లేదు. పెద్ద రావిచెట్టు ఒంటరిగా, దిగులుగా నిలబడి వుంది.

 

    అతను వెళ్ళాల్సిన ఊరు వాల్ ఘెరా.

 

    అది ఆంధ్రా బోర్డర్ దాటి వంద కిలోమీటర్లు మహారాష్ట్రలో ప్రయాణిస్తే వస్తుంది.

 

    ఆ ఊరు మంత్రగాళ్ళకు ప్రసిద్ధి. ఆ వూరిలో సగం జనాభా మంత్రగాళ్ళయితే, మిగిలిన సగం కుష్ఠురోగులు. మంత్రాలకూ, కుష్ఠు రోగులకి వున్న సంబంధం ఏమిటో తెలియదుగానీ ఆ మాట మాత్రం నిజం.  

 

    ఫతేపూర్ స్టేషన్ నుంచి పదికిలోమీటర్లు నడిస్తే వాల్ ఘెరా వస్తుంది. చలపతిరావు ఇప్పుడు దిగింది ఆ స్టేషన్ లోనే. ఇటీవల ఆయన ఓసారి ఆ వూరు వచ్చాడుగానీ దారీ డొంకా సరిగా గుర్తులేవు. అదీగాక అంత రాత్రిపూట గుట్టలంట, పుట్టలంట ఒంటరిగా వెళ్ళాలంటే ధైర్యం చిక్కడం లేదు.

 

    ఆయన పట్టువదలని విక్రమార్కుడు కాబట్టి ఆ మాత్రం సాహసించి అయినా అక్కడ నిలబడ్డాడు గానీ మరొకరైతే వచ్చిన బండికే తిరిగి టపా కట్టేసేవారు.

 

    ఆయన ఏదయినా అనుకుంటే సాధించేవరకు నిద్రపోడు. తన లక్ష్యం చేరుకోవడానికి అది ఎంత కష్టమైనదయినాసరే జంకడు. అంతే కాకుండా ఆయనెంత కార్యసాధకుదో, అంత క్రూరుడు కూడా.

 

    ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఓ ఉదాహరణ చాలు.

 

    చలపతిరావుది ఓ చిన్న పల్లెటూరు. ఆయన తండ్రి రఘుపతి వున్న వూర్లోనే ఓ రైస్ మిల్లు నడిపేవాడు. చలపతి ఆయనకి ఒక్కగానొక్క కొడుకు. అందుకే కొడుకంటే ముద్దూ మురిపెంతోపాటు కొడుకు బాగా చదువుకోవాలన్న కోరిక కూడా వుండేది.

 

    అయితే చలపతికి చదువబ్బలేదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు తప్ప స్కూలుకి వెళ్ళేవాడు కాడు. ఎప్పుడూ సినిమాలు, షికార్లని తిరిగేవాడు.

 

    "నువ్వు చివరికి ఏమౌతావో నీ భవిష్యత్తు గురించి నే చెప్పనీ. చదువూ సంధ్యా లేకపోవడంతో కనీసం నాలాగా ఈ రైస్ మిల్లు కూడా నడపలేవు.

 

    స్నేహితుల్తో కలిసి టౌన్ లో సినిమాహాళ్ళ దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటూ ఉంటావ్. నువ్వు ఈ జన్మలో ప్రయోజకుడు కాలేవ్" అని రఘుపతి రోజుకోమారయినా కొడుకుని తిట్టేవాడు.

 

    అయినా చలపతిరావులో ఎలాంటి మార్పూ రాలేదు. మరింత జులాయిగా తిరిగేవాడు తప్ప బాధ్యత తెలుసుకోలేకపోయాడు.

 

    దీంతో ఆ కన్నతండ్రి మనసు విరిగిపోయింది. కొడుకంటే వున్న ప్రేమను బలవంతంగా చంపేసుకున్నాడు. చీటికీ మాటికీ తిట్టేవాడు. మరీ కోపం పట్టలేనప్పుడు కసితీరా కొట్టేవాడు. అయినా ప్రయోజనం శూన్యం. పదవ తరగతి తప్పి, చదువుకి పర్మినెంట్ గా మంగళం పాడేశాడు చలపతి.

 

    "చదువంటే ఎలానూ కొండెక్కి కూచుంది. కనీసం రైస్ మిల్లుకైనా వచ్చి పద్దులూ అవీ నేర్చుకో. కాసిన్ని డబ్బులు వస్తే ముద్దయినా నోట్లోకి వెళుతుంది" అని తండ్రి బతిమిలాడేవాడు.

 

    చలపతికి చీమ కుట్టినట్టయినా ఉండేదికాదు. రైస్ మిల్లుకు వెళ్లినట్టు వెళ్ళి క్యాష్ బాక్స్ లోని డబ్బు సంగ్రహించి టౌన్ కి చెక్కేసేవాడు. ఆ డబ్బుతో నాలుగైదు సినిమాలు చూసి తిరిగి వచ్చేవాడు.

 

    అలా వచ్చినప్పుడంతా పెద్ద రాద్దాంతం అయ్యేది. రఘుపతి చివాట్లు పెట్టడం, బెత్తం తీసుకుని రెండు బాదడం చేసేవాడు.

 

    చలపతి తన తప్పు తెలుసుకోలేకపోగా తండ్రంటే ద్వేషం పెంచుకున్నాడు. కసి పెట్టుకున్నాడు.

 

    తను మరికాస్త పెద్దయ్యాక తండ్రికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తండ్రంటే అసహ్యం, పగా పెరిగాయి గానీ అతనిలో ఏ మార్పూ రాలేదు.

 

    వూరంతా అప్పులు చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బుల్తో షికార్లు కొట్టొచ్చేవాడు. తన తండ్రికి ఎంత తలవంపులు తెప్పిస్తే అంత సంతోషించేవాడు. ఆయన బాధ చలపతికి సంతోషాన్ని ఇచ్చేది.

 Previous Page Next Page