Previous Page Next Page 
వ్యూహం పేజి 5


    మిత్రులు అది వింటూనే బిత్తరపోయారు.

 

    "ఆ.... రూసీమోడీ ఎవరూ...? ఆ టిస్కో ఏమిటి? ఇస్కోలాగా- నువ్వు మాట్లాడేదేది అర్థమయి చావదు. రూసీమోడీ ఏమిటి కాజు పకోడాలా...?"

 

    జగపతి మాటలు పూర్తికాకుండానే శక్తి అతని నెత్తిమీద ఒక జెల్లకాయ వేసాడు.

 

    "పాపం... అలా మాట్లాడకు... కళ్ళు పేలిపోతాయ్... ఇండియాలో 1907లో పెట్టిన మొట్టమొదటి స్టీల్ కంపెనీ టిస్కోకి చైర్ మెన్ ఆయన.

 

    టాటా గ్రూప్ కి ఫౌండర్ జెమ్ షెడ్జీ నుస్సెర్ వాన్జీ టాటా అయినా, టిస్కోని అద్భుతంగా అభివృద్ధి చేసింది రూసీమోడీనే.

 

    రుస్తోమ్ జీ హోర్ ముస్జీ మోడీ... సర్ హోమీ మోడీ పెద్దకొడుకు బ్రిటన్ లోని హారో పబ్లిక్ స్కూల్ లో చదివిన రూసీమోడీ కంపెనీ పుట్టిన పదకొండు ఏండ్లకు- అంటే 1918లో పుట్టాడు- అయినా ఆ కంపెనీని ఎంత అభివృద్ధి చేసాడో తెలుసా... ఇలాంటివి మీ దృష్టికి రావు.

 

    అన్నీ గాలివార్తలే మీకు కనిపించేది. థీరీ ఆఫ్ రెలెటివిటీని, E=Mc2 అనే ఈక్వేషన్ కనిపెట్టిన మహానుభావుడు- ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్ బర్డ్ ఐన్ స్టీన్ తో, రూసీమోడీ ఆరునెలల సహవాసం చేసాడు తెలుసా?

 

    E=Mc2 అంటే ఏమిటో తెలుసా...."

 

    ఆటంబాంబు తయారీకి మూలం అదే-

 

    న్యూక్లియర్ ఫిజిక్స్ కి పితామహుడు ఐన్ స్టీన్.

 

    light could be thought of as a stream of tiny particles అని కనిపెట్టింది ఆయనే.

 

    దీనిద్వారానే ఎలక్ట్రిక్ ఐకి రూపకల్పన జరిగింది. తద్వారానే ఫౌండ్ మోషన్ పిక్చర్స్- టెలీవిజన్ కనుక్కోవటం సులభమయింది తెలుసా?

 

    వాళ్ళిద్దరూ ఒక హోటల్ లో పక్క పక్క రూమ్స్ లో ఉండేటప్పుడు రోజూ బాత్ రూమ్ దగ్గర కలిసేవారట.

 

    రూసీమోడీ పియానో వాయిస్తే- అలబర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ వాయించేవారట.

 

    అంత గొప్ప రూసీ మోడీని చైర్ మెన్ పోస్ట్ లోంచి డిస్ మిస్ చేస్తే మీ దృష్టికి రాలేదా?" కసురుకున్నాడు శక్తి.

 

    వాళ్ళు దెయ్యం పట్టినట్లయిపోయారు.

 

    "ఒక్క ముక్క... ఒక్క ముక్కంటే ఒక్క ముక్క అర్థమైతే నీ బాటా చెప్పుచ్చుకు కొట్టు...

 

    E=Mc2 ఏంటో?

 

    థీయరీ ఆఫ్ రెలెటివిటీ ఏంటో- అసలు బుర్ర పాడయిపోయింది. వేలాద్రి వెళ్ళి కృష్ణానదిలో మునిగొస్తేగాని నా ధిమాక్ బాగుపడదు-" ఏడుపు మొఖం పెట్టి అన్నాడు జగపతి.

 

    "వీడసలు ఇండియాలో... అందునా ఆంధ్రప్రదేశ్ లో... అందునా కృష్ణాజిల్లా, నందిగామలో పుట్టవలసినవాడు అంతకంటే కాదు... ఛీ- ఛీ- ఈ రోజు నా మూడంతా పాడయిపోయింది. అయ్యరు హోటల్ కాఫీ సిగరెట్ దమ్ము- వీడి దెబ్బతో ఠా- దొంగలముఠా అయిపోయింది-" సుబ్రహ్మణ్యం తల పట్టుకొని అన్నాడు.

 

    "అయ్యా బాబు- మనం ఇప్పుడు నందిగామ పాత బస్ స్టాండులో పొంగళ్ళు అడితి ఎదురుగా వున్న అయ్యరు హోటల్ ముందున్న పిట్టగోడ మీద తగలడ్డాం- అమెరికాలోనో ఐర్లాండ్ లోనో- ఓక్ లాండ్ లోనో ఒసాకాలోనో లేం- అసలయినా నాకో అనుమానం. వీడికి దెయ్యం పట్టిందని- ఆ దెయ్యం ఖచ్చితంగా ఫారెన్ దెయ్యమే అయుంటుంది" అన్నాడు ఏడుపు మొఖంపెట్టి రమణ్రావ్.

 

    శక్తి వాళ్ళ స్థితికి నవ్వాడు పెద్దగా.

 

    "సర్లే మీ లెవల్ విషయాలే మాట్లాడుకుందాంలే" అన్నాడు శక్తి వారిమీద జాలిపడుతూ.

 

    "అలా అన్నావ్ బాగుంది."

 

    "అసలు న్యూస్ విను... మన ఎమ్మెల్యే ఈశ్వరచంద్ర కొడుకు బాలరాజుగాడు లేడూ? వాడు జగ్గయ్యపేటలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడంట..." సుబ్రహ్మణ్యం చెప్పాడు మహదానందంగా.

 

    "పాపం... ఆ అమ్మాయి ఎవరో.... ఆ అమ్మాయిని వాడి బారి నుంచి రక్షించాల్రా...." రమణ్రావు అన్నాడు.

 

    రమణ్రావు సన్నగా రివటలా ఉంటాడు.

 

    "పెద్ద వస్తాదు బయలుదేరాడండీ... వస్తాదు" శక్తి మాటలకు అందరూ నవ్వారు.

 

    "బాలచంద్ర ఆ అమ్మాయి వార్త ఎవరు చెప్పార్రా?"

 

    "మన ఆర్టీసీ బస్సు... జాకీఛాన్ గాడు లేడూ వాడు" చెప్పాడు సుబ్రహ్మణ్యం.

 

    "డిటైల్ గా వివరాలు కనుక్కోమని చెప్పు- అది నిజమైతే ఆడితోలు వలిచేద్దాం" శక్తి హుషారుగా అన్నాడు.

 

    "ఒరేయ్ శక్తీ నీకు తెలుసా... మొత్తం మీద హైద్రాబాద్ లోని బుద్ధ విగ్రహాన్ని నిలబెట్టేసారట...." జగపతి అన్నాడు.

 

    "బుద్ధ విగ్రహం నిలబడిందా- జీబ్రాల్టర్ రాక్ మీద పెట్టేసారా- సెవెన్ క్రోర్స్... ఏడుకోట్లు అనవసరంగా వేస్ట్ చేసార్రా..." పెదవి విరుస్తూ అన్నాడు రమణ్రావ్.

 

    "పిచ్చోడిలా వున్నావ్... వేస్ట్ ఎందుకురా. ఎన్.టి.రామారావు ఎంతో కళాభిరుచి వున్న వ్యక్తిరా. దానికోసం ఎంతో కష్టపడ్డారాయన. ఇప్పుడు హైద్రాబాద్ పెద్ద టూరిస్ట్ సెంటర్ అయిపోతుందిరా... ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదంట్రా" జగపతి అన్నాడు.

 

    "విగ్రహాలు ఉండాలి కాదనటం లేదు. ఉన్నవాటిని డెవలప్ చేయకుండా... ఏడుకోట్లతో క్రొత్తగా విగ్రహం ఎందుకురా. ఏడుకోట్లు... ఒక ఫాక్టరీ పెట్టమను... ఎన్ని వేలమందికి ఉద్యోగాలు వస్తాయి- ఎంతమంది నిరుద్యోగులున్నారు. వాళ్ళలో కొంతమందైనా హాయిగా ఉండేవారు కదరా. మేన్ పవర్ ని సమీకరించటం ద్వారా ఎంత ఉత్పత్తి జరిగేది. ఆ ఫ్యాక్టరీ ఒక వెనుకబడిన ప్రాంతంలో పెట్టారనుకో ఆ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందుతుంది. మనదేశం పారిశ్రామికంగా ఎదగలేక పోవటానికి కారణం మన ప్రభుత్వాలే. బుద్ధుడి మీద గౌరవం వుంటే ఆయన బోధించిన అహింసే ఆయుధంగా బ్రతికేవారు. దేశంలో ఇంత రాజకీయ రక్తపాతం ఎందుకు వుండేది? జపాన్ కీ మనకీ ఎంత తేడా వుంది. మన ప్రభుత్వానికీ, మన పాలకులకూ దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు నడిపేందుకు సరియైన అవగాహన లేదు. కనీసం జిల్లాకు ఐదు పెద్ద పరిశ్రమలుంటే చాలు. మన దేశం ఎలా వుండేది?" శక్తి సాలోచనగా అన్నాడు.

 Previous Page Next Page