Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6


    "బుద్ధిమాలిన్యాత్కృష్ణావి జాతాని" బుద్ధిమాలిన్యము వలన 'కృష్ణములు' అయినవి అన్నది సరికాదు. దీనికి బుద్ధిమాలిన్యము అంటదు. ఇది వ్యాసుని నుంచి వైశంపాయనునికి వచ్చింది. ఇదే శుద్ధయజుర్వేదం. దీనినే తిత్తిరి మహర్షి చెప్పాడు.

    శుక్ల కృష్ణ యజుర్వేదాలు సమానములు. వీనిలో ఏదీ మిన్న కాదు. శుక్ల యజుర్వేదీయులు కృష్ణ యజుర్వేదాన్ని తక్కువగా చూస్తారు. కొందరు కృష్ణ యజుర్వేదాన్ని బ్రాహ్మణంగా పరిగణిస్తారు. దాన్నివేదంగా అంగీకరించరు. స్థూలంగా శుక్ల యజుర్వేదం ఉత్తరాది వారికీ, కృష్ణ యజుర్వేదం దక్షిణాది వారికీ వర్తిస్తుంది. వస్తుతః ఉత్తరాది వారికి అహంకారం ఎక్కువ! దాక్షిణాత్యులను తమతో సమంగా - నేటికీ - గుర్తించరు! ఉత్తర భారతం వారు తెల్లవారు. వారి యజుర్వేదం శుక్ల యజుర్వేదం. దక్షిణ భారతం వారు నల్లనివారు వారి యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అయింది.

    ఈ శుక్ల, కృష్ణములు చంద్రుని శుక్ల, కృష్ణ పక్షాల వలన వచ్చినవి. చంద్రుని శుక్ల, కృష్ణ పక్షాలను గమనింతాం.

    కాలమానం

    మనం ఈనాడు ప్రమాణంగా భావించే ఇంగ్లీషు - గ్రిగేరియన్ - కేలండరుకు శాస్త్రీయ ఆధారం లేదు! సంవత్సరానికి ఆధారమైన భూభ్రమణం మాత్రమే వారికి తెలుసు. నేలలకు ఆధారం లేదు. ఒకప్పుడు వీరి నెలలు 40,35 రోజులుండేవి. జూలియస్ సీజర్ పేర జూలై నెల, ఆగస్టస్ పేరు మీద ఆగస్టు నెల ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఒక నెలకు 31, ఒకటి 30, ఒకటి 28 ఎందుకవుతుందో తెలియదు. ఇదండీ శాస్త్రీయ కేలండర్! దీన్ని మనం గ్రుడ్డిగా అనుసరిస్తున్నాం!! భారతీయులు తమ సంస్కృతికి గ్రుడ్డివారేకదా!

    వేదంలో భూమి గుండ్రంగా ఉండని వాచ్యంగా చెప్పబడలేదు. భూగోళం మీద ఆధారపడిన శాస్త్రం వారికి తెలుసు. భూమి గుండ్రంగా ఉంది. అది తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు లేక 24 గంటలు పడుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి పగలవుతుంది. చాటుగా ఉన్న భాగానికి రాత్రి అవుతుంది.

    వేదానికి రాత్రింబవళ్లు తెలుసు. పగలు, రాత్రి ఆచరించవలసిన వానిని వేదం నిర్దేశిస్తుంది.

    గ్రిగేరియన్ కేలండర్ నెలకు ఆధారం లేదు. వేదంలో పక్షానికి చంద్రుని కాంతి - వెన్నెల ఆధారం. భూమి నిరాధారంగా వ్రేలాడుతున్నదని వేదం వివరించింది. అలాగే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. అతనికి సూర్యుని వలన కాంతి లభిస్తున్నది అని చెప్పింది.

    భూమి తన చుట్టు తాను తిరుగుతున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుంది. అదే వెన్నెల అవుతుంది. వెన్నెల పక్షం రోజులు పెరుగుతూ పూర్ణిమ అవుతుంది. పక్షం అంటే సరిగ్గా పదిహేను రోజులు కాదు. చాంద్రమాసపు నెలలో సగం. తదుపరి పక్షం రోజులు తరుగుతూ అమావాస్య అవుతుంది.

    సాయంకాలం తరువాత పెరిగే వెన్నెలను శుక్ల పక్షం అంటాం. శుక్ల పాడ్యమి నుండి వెన్నెల రోజుకు రెండు గడియలు పెరుగుతుంటుంది. అలా తొలి 15 రోజులు రెండు గడియల చొప్పున 15 x 2 = 30 గడియలు పూర్ణిమ రాత్రి సాంతం వెన్నెల ఉంటుంది. కృష్ణ పాడ్యమి నుంచి వెన్నెల రోజుకు రెండు గంటలు తగ్గుతుంటుంది. అంటే పాడ్యమి నాడు రెండు గడియలు తప్ప రాత్రంతా వెన్నెల ఉంటుంది. ఆవిధంగా తరుగుతూ పక్షానికి వెన్నెల పూర్తిగా లేని అమావాస్య వస్తుంది.

    లెక్క వేస్తే వెన్నెల గడియలు రెండు పక్షాలలోనూ ఒకంతే ఉంటాయి. కాబట్టి శుక్ల, కృష్ణాలు రెండూ సమానములే. ఆధిక్యత దేనికీ లేదు. అలాగే శుక్ల, కృష్ణ యజుర్వేదాలు సమానములే! రంగును బట్టి ఒకటి హెచ్చు, ఒకటి తగ్గు కాదు.

    వాస్తవానికి బ్రహ్మ నుంచి, వేద వ్యాసుని నుంచి, వైశంపాయనుని నుంచి క్రమానుగతంగా తిత్తిరి ఋషి నుంచి వచ్చిందే నిజమైన యజుర్వేదం.

    యాజ్ఞవల్క్యుడు అలిగి వెళ్లాడు. ఋషికి కోపం త్యాజ్యం! గురువైన వైశంపాయనుని సాధించదలచాడు!! సూర్యుని నుండి యజుర్వేద ఉపదేశం పొందాడు. ఇది బ్రహ్మ నుంచి వచ్చింది కాదు. అట్లనగా కృష్ణ యజుర్వేదం కన్న తక్కువే కదా?

    వేదాలలో ఒకదాన్ని తక్కువ, మరొకదాన్ని ఎక్కువ చేయడం నా అభిమతం కాదు. రంగును బట్టి ఒక యజుర్వేదం తక్కువ అనేవారి కోసం తర్కం మాత్రమే!

    నా అభిప్రాయం ఏమంటే ఉత్తరాది వారు దక్షిణాది వారికి యజుర్వేదం ఇవ్వలేదు. దక్షిణాది వారు తమ యజుర్వేదం ఏర్పరచుకున్నారు. దానిని ఉత్తరాది వారు కృష్ణ యజుర్వేదం అన్నారు!

    కృష్ణం అంటే నలుపు. నలుపు తెలుపు కన్న తక్కువేమీ కాదు. రాముడు నల్లన. కృష్ణుడు నల్లన, సీత శ్యామ, నల్లన, ద్రౌపది కృష్ణ - నల్లన. కాళిదాసు శకుంతల నల్లన. వీరందరూ భారతీయులందరికీ ఆరాధ్యులే.

    వాదన కోసం మాత్రం కృష్ణ యజుర్వేదం రాముని వంటిది! కృష్ణునివంటిది! సీతవంటిది! ద్రౌపది వంటిది! శకుంతల వంటిది! వీరు లేని భారత ఇతిహాసం లేదు. చరిత్ర లేదు. సంప్రదాయం లేదు. అసలు భారతదేశం లేదు.

    కాలమానంలో మాసముల విషయం తెలుసుకున్నాం. చైత్రాది పన్నెండు మాసాల పేర్లు వేదంలో చెప్పబడినాయి. పక్షం కనిష్ఠ కాలమానంగా కనిపిస్తుంది. రెండు పక్షాలు ఒక మాసం అవుతుంది. వేదంలో వారాల జాడ కనిపించలేదు.

    గ్రిగేరియన్ కేలండర్ లో నెలకు వట్టి అంచనా తప్ప శాస్త్రీయ ఆధారం లేదు. వేదపు నెలకు చంద్రుని నడక, నక్షత్రాలు శాస్త్రీయ ఆధారాలు! దయచేసి గమనించండి మన కాలమానానికి శాస్త్రీయ ఆధారం ఉందండీ! ఇప్పటికైనా నమ్మండి! మన కాలమానాన్ని చాటండి!

    వేదం ఋతువులను గురించి అనేక చోట్ల చెప్పింది.

    1. వసంత ఋతువు త్రివృత్ స్తోమము.

    2. గ్రీష్మ ఋతువు పంచదశ స్తోమము.

    3. వర్ష ఋతువు సప్తదశ స్తోమము.

    4. శరద్ ఋతువు ఏకవింశత్త్సోమము.

    5. హేమంత ఋతువు త్రిణవ స్తోమము.

    6. శిశిర ఋతువు త్రయస్త్రింశస్తోమము.

    భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. అందువల్ల రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకసారి సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. అది భగవన్నిర్ణయం. ఈ 6  గంటలను ఏ కాలమానమూ సరిగా పూరించలేకపోతున్నది! మానవుడు అంతటి బలహీనుడు.

    తెలుగు వారిది చాంద్రమానం. నెలలు చంద్రుణ్ణి బట్టి లెక్కిస్తాం. ఏ నెలా సరిగ్గా 30 రోజులు ఉండదు. మొత్తం మీద సంవత్సరానికి గల రోజులను పూరించడానికి అధికమాసం వస్తుంది. అధిక మాసం కూడా సైంటిఫిక్. ఆ నెలలో పూర్ణిమ, అమావాస్య వస్తాయి. అధిక మాసం వచ్చిన సంవత్సరానికి 365 రోజుల 6 గంటలు సరిపోతుంది. మళ్లీ తరగడం మొదలవుతుంది. ఈ అధికమాసం వల్లనే ఋతువులు సరిగ్గా ఆ నెలల్లోనే వస్తాయి. చైత్ర, వైశాఖాలు వసంతం జ్యేష్ఠ, ఆషాఢాలు గ్రీష్మం, శ్రావణ, భాద్రపదాలు వర్షం, ఆశ్వీజ, కార్తీకాలు శరత్తు, మార్గశిర, పుష్యాలు హేమంతం, మాఘ ఫాల్గుణాలు శిశిరం.

    మనకు సంవత్సరాది చెట్లు, ప్రకృతి చిగిర్చే వసంత కాలంలో వస్తుంది.

    గ్రిగేరియన్ - ఇంగ్లీషు - న్యూఇయర్ చెట్లు, ప్రకృతి ముడుచుకుని చలికి వణికే హేమంతంలో వస్తుంది!

    ఏది శాస్త్రీయమో - సైంటిఫిక్ అగునో ఆలోచించండి!

    ముసల్మానులది కూడ చాంద్రమానమే. 'గోవధసేయు తురకలకు దైవంబవు' అన్నాడు అల్లసాని పెద్దన మనుచరిత్రములో ముస్లిం దేశాల పతాకాలన్నింటిలో చంద్రుడు నక్షత్రం ఉంటుంది. అయితే ముసల్మానులకు సూర్యుని వలన కలిగే సంవత్సరం లెక్క తెలియదు. అందువలన వారికి అధిక మాసం లేదు. చాంద్రమానం ప్రకారం 365 రోజుల 6 గంటలకు వచ్చే తరుగు 1400 ఏళ్లుగా కొనసాగుతున్నది. ఫలితం ఋతువులకు నెలల నిర్దిష్టత లేదు. రమ్జాన్ నెల ఎప్పుడూ ఒకే రుతువులో రాదు. గమనించండి.

    తెలుగువారిది చాంద్రమానం. అంటే కాలపు లెక్క చంద్రుని అనుసరించి జరుగుతుంది.

    భారతదేశంలో మరి కొన్ని ప్రదేశాలలో సౌరమానం - సూర్యుని లెక్క, బార్హ స్పత్యమానం - బృహస్పతి లెక్క అమల్లో ఉన్నాయి. దేనికైనా సంవత్సరం సూర్యుని లెక్కయే.

    ఇంత శ్రమించి సశాస్త్రీయమైన కాలమానాన్ని వేదం నిర్ణయించింది. మనం దాన్ని ఎరుగకున్నాం! ఇప్పుడైనా మన కాలమానానికి గర్వించండి!

    ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇక్కడ అవసరం కాదు. సమయ సందర్భాలు కావు.

    వేదం - బ్రాహ్మణం

    బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు వేదానికి అనుబంధాలు. ఆవి వేదానికి చివరివి. అందువలన వేదాంతములు అయినవి. ఒకవాదం ప్రకారం వేదాంతం జ్ఞాన ప్రధానం. వేదం కర్మ ప్రధానం. కాని ఆధునిక వేద వ్యాఖ్యాతలు వేదంలోనే జ్ఞానం ఉందంటున్నారు. కొన్నింటికి కర్మ పరమైన, జ్ఞానపరమైన అర్థాలు చూపుతున్నారు. ఈ వాద, ప్రతివాదాలు ఆగవు. సాగుతూనే ఉంటాయి. ఆధునిక గ్రంథాల విషయంలోనే వాద ప్రతివాదాలు ఆగడం లేదు!

    పాశ్చాత్యులు వేదాలకు బహుదేవతాక, హింస, కర్మ దోషాలు ఆరోపించి దూషిస్తున్నారు. వారి దూషణలను మన్నించి వేదానికి ఆ దోషాలు లేవని నిరూపించడానికి ఆధునిక వ్యాఖ్యాతలు ప్రయత్నిస్తున్నారు. అర్థాలూ, అంతరార్థాలు తీస్తున్నారు!

    నావరకు నాకు పాశ్చాత్యులు చూపినవి దోషాలుగా కనిపించవు. అవి గుణాలు అవుతాయి. పాశ్చాత్యులు వాళ్ల మతాల దృక్కోణంతో చూచినపుడు వారికి అవి దోషాలుగా కనిపిస్తాయి. మనం వారి దృక్కోణానికి బానిసలం అగుట ఏల? తెల్ల దొరల సంతృప్తి కోసం మన సంప్రదాయాన్ని వదులుకోనేల? భారత సంస్కృతికి- నాగరికతకు, ధర్మానికి, తాత్వికతకు మహోన్నత వ్యక్తిత్వం ఉంది. అది కాలపు జరా, జీర్ణాలను జయించి నిత్య నూతనంగా నిలిచి ఉంది. ఆ మహా మనీషి ఒకరి ముందు మోకరిల్లనేల?

    వేద కర్మలు కామ్యకర్మలని నా అభిప్రాయం. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయో వాటన్నింటివి కామ్య కర్మలే! ఆదర్శానికి తప్ప అందరి కర్మలూ కామ్యములే! నిష్కామకర్మ ఆదర్శప్రాయం. ఆచరణ ఉండదని కాదు - అరుదు. అన్వేషించాలి.

    వేదాంతం జ్ఞాన ప్రధానం కావచ్చు. జ్ఞానం సాంతం నిష్కామం కాదు. అయితే వేదాంతాన్ని వైరాగ్యం అనే అర్థం మాత్రం సమంజసం కాదు. జ్ఞానం జీవితం బాగుపరచుకోవదానికే వదులుకోవడానికి కాదు!

    బ్రాహ్మణం వేదంలో భాగం అగును అనీ కాదు అనీ వాదనలున్నాయి. మంత్ర బ్రాహ్మణయోః వేద నామధేయమ్" అని ఆపస్తంబమహర్షి. సంహిత + బ్రాహ్మణమునకు వేదం అని పేరు అంటున్నాడు.

    "మంత్ర బ్రాహ్మణ మిత్యాహుః" అని బోధాయన మహర్షి ఆపస్తంబ మహర్షి బలపరుస్తున్నారు.

    "అనంతావై వేదాః" అని శ్రుతి. అట్లయిన వేదాలకు నాలుగు అని పరిమితి ఏల? "శేషే బ్రాహ్మణసంజ్ఞా" అని కల్పసూత్రం. అట్లయినా పరిమితమే! వేదం అపరిమితంకదా!

    వేదం కర్మ - బ్రహ్మ ప్రతిపాదకం. ద్రవ్య దేవతా ప్రాతిపదికం మంత్ర భాగం - సంహిత. బ్రాహ్మణము విధి అర్థవాదాది రూపకం.

    యజుర్వేదం యాగస్వరూపాన్ని నిరూపిస్తున్నది. కర్మ స్వరూపం తెలిపేది యజుర్వేదం. కావుననే దానికి కర్మకాండ విషయంలో అధిక ప్రాధాన్యత.

    కర్మ కేవలం మంత్రం కాదు. విధి విధానానికి సహితం ప్రాధాన్యత ఉంది. కావున బ్రాహ్మణం లేని యజుర్వేద కర్మ ఉండదు. అందుననుసరించియే యజుర్వేదాలు రెండు అయినవి.

    శుక్ల యజుర్వేదం మంత్ర భాగం మాత్రమే - సంహిత మాత్రమే. ఇందులో బ్రాహ్మణం లేదు.

 Previous Page Next Page