Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7


    కృష్ణ యజుర్వేదం మంత్ర బ్రాహ్మణాత్మకం. ఇందు మంత్రం విధి విధానం వివరంగా చెప్పబడింది.

    కృష్ణయజుర్వేదపు పూర్తిపేరు 'కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత' తిత్తిరి మహర్షిచే దర్శించబడి ప్రచారం పొందినందున దీనికి ఆ పేరు వచ్చింది. మంత్ర బ్రాహ్మణ సహితం అయినందున విశాలమూ, విస్తృతమూ, బృహద్గ్రంథం అయింది.

    తైత్తిరీయ సంహితలో ఏడు కాండములు లేక అష్టకములు. నలుబది నాలుగు ప్రపాఠకములు లేక ప్రశ్నలు. ఆరువందల ఏబది ఒక్క అనువాకములు, రెండువేల ఒక వంద పంచాశత్తులు. పందొమ్మిదివేల రెండువందల పదములు. రెండు లక్షల ఏబది మూడువేల ఎనిమిది వందల అరువది ఎనిమిది అక్షరాలున్నాయి.

    సరియైన గ్రంథాలు లభించనందున, అన్య కారణాల వలన నేను నాలుగు కాండములు మాత్రం అనువదించ గలిగాను. నేను వచనానువాదం చేసిన కృష్ణ యజుర్వేద సంహిత పంచవేదాల్లోనూ ఇది ఒక్కటే సశేషంగా మిగిలిపోయింది. ఈశ్వరేచ్చ అనలేదు. దీనిని నా లోపంగానే అంగీకరిస్తున్నాను. ఈ 'విశ్వ' విశ్వాంతరాళాల్లో - కేవలం పరాత్పరునకు తప్ప - పరిపూర్ణత్వం లేదు. అందుకే బహుశః కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత అనువాదం పూర్తి కాలేదు. అందుకు క్షంతవ్యుణ్ణి.

    శుక్ల యజుర్వేదపు పూర్తి పేరును గురించి ఆ గ్రంథ పీఠికలో వివరించాను. అయినా సౌలభ్యం కొరకు ఉటంకిస్తాను.

    "వాజసనిపుత్రుడు యాజ్ఞవల్క్యుడు. కావున 'వాజసనేయి' అయింది. మధ్యందిన మహర్షికి లభించినందున 'మాధ్యందిన' అయింది. ఆ విధంగా అది వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత అయింది. ఈ సంహితలో నలుబది అధ్యాయాలు, పందొమ్మిది వందల డెబ్బది అయిదు పద్య గద్యాలున్నాయి.

    ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది వేదం తొలుత విష్ణువు నుంచి బ్రహ్మకు అందింది. శుక్ల, కృష్ణ యజుర్వేదాల పేర్లలో వారులేరు. వేదాన్ని విభజించినవాడు వేద వ్యాసుడు. అతని పేరు లేదు. వాజసనేయి, తిత్తిరి మహర్షులకు యజుర్వేదం ఉపదేశించినవాడు వైశంపాయనుడు అతని పేరు లేదు!

    మిగత మూడు వేదాల పేర్లకు ముందు ఋషుల పేర్లు లేవు!

    ఋగ్వేద మంత్రాలకు ఋక్కులని పేరు. అవి ఛందోబద్ధములు. వృత్త బద్ధములు. గాయత్రి, అనుష్టుప్ మున్నగు ఛందస్సు గలవి.

    సామవేదమునందలి మంత్రములు సామములు. అవి గీత సహితములు.

    యజుర్వేద మంత్రములకు యజుస్సులని పేరు. ఇది వృత్త, గీత వర్జితములు. అక్షర మాత్ర సంఖ్య గలవి యజుస్సులు. వర్ణానుపూర్వియై, స్వరజీవము గల యజుస్సులు రసవత్తరములు కర్ణ పేయములు.

    యజుర్వేద మంత్రాలను - ఒక్కొక్కచో తప్ప గద్యం లేక వచనం అనవచ్చు వచనం సహితం స్వరయుక్తమైనపుడు సుందరము, మధురము, కర్ణామృతమూ అవుతుంది.

    వచన సాహిత్యాన్ని భారతదేశానికి మేమే దిగుమతి చేశామంటున్నారు ఆంగ్లేయులు. జ్ఞానమో - అజ్ఞానమో ప్రగతి శీలురం అనిపించుకునే మేధావులు దానిని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు! మన సంపన్న, సమృద్ధ, సనాతన సాహిత్యాన్ని బూజు పట్టింది అని ఆ మైకంలో తిట్టి పోస్తున్నారు. వేదాల్లోనే సుందర వచనం ఉందని వారు గ్రహించాలి. తనను, తన దేశాన్ని, తన సంస్కృతినీ విశ్వసించని, గౌరవించని వారికి భవిష్యత్తు అంధకార బంధురం - బానిస బంధం!

    ముస్లిముల పవిత్ర గ్రంథం అయిన ఖుర్-ఆన్ షరీఫ్ వచనంలో ఉంది. దాన్ని సస్వరంగా చదువుతారు. వినసొంపుగా ఉంటుంది.

    విధి నిషేధాలు

    కృష్ణ యజుర్వేదం విధి నిషేధాలను ఎంతో వివరంగా ప్రవచించింది.

    1. "ధ్రువాం వై రిచ్యమానాం యజ్ఞోరిచ్యతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ధ్రువామాప్యాయమానాం యజ్ఞోన్వాప్యతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా"

    ఇది ఎంతో సుందరం. ఎంతో చెప్పవలసిఉంది. సమయ సందర్భం కాదు. నిగ్రహించుకుంటున్నాను!

    యజ్ఞ సమయంలో ఆజ్య పాత్ర శూన్యంగా ఉండరాదు. అది అసంపూర్ణ యజ్ఞం అవుతుంది. అందువల్ల యజమాని ఫల శూన్యుడు అవుతున్నాడు. యజమాని వలన అతని సంతానం అన్న శూన్యమవుతున్నది.

    యజ్ఞ సమయంలో ఆజ్య పాత్ర నిండుగా ఉండాలి. అప్పుడు యజ్ఞం సంపూర్ణం అవుతుంది. అందువలన యజమానికి యజ్ఞఫలం లభిస్తుంది. యజమాని వలన యజమాని సంతానానికి అన్న సమృద్ధి కలుగుతున్నది.

    2. "సర్వేణవై యజ్ఞేన దేవాస్సువర్గం లోకమాయ న్పాక యజ్ఞేన మనురశ్రామయ త్సేడా మనుము పావర్తత తాం దేవాసురా వ్యహ్యవయన్త ప్రతీచీం దేవాః పరాచీ మసురా స్సా దేవా నుపావర్తత పశవోవై తద్దేవా నవృణత పశవోసురా నహుజ"

    దేవతలు యజ్ఞము వల్లనే స్వర్గమునకు చేరారు. మనువు పాక యజ్ఞం చేశాడు. విశ్రమించాడు. ఇడా దేవత మనువును చేరింది.

    ఇడా దేవతను అసురులు ఆహ్వానించారు. దేవతలు ప్రతీచీ పద్ధతిని "ఇడోపహూతా" అని ఆహ్వానించారు. పశురూప ఇడా దేవత దేవతలను చేరింది.

    అసురులు పరాచీ పద్ధతిని అనుసరించారు. "ఉపహూతేడా" అని ఇడా దేవతను ఆహ్వానించారు. పశురూప ఇడా దేవత అసురులను విడిచి పోయింది.

    వేదం సాంతం సుందరం - సుస్వరం - సుదర్శనమే! ఎంతకని చెప్పడం. వేదం పంచ భూతాలను - పర్యావరణాన్ని ఎలా కాపాడిందో పరికింతాం :-

    "దేవీ రాపో అపాంనపాద్య ఊర్మిర్హ విష్య ఇన్ద్రియావాన్మదిన్తమస్తం వో మావక్రమిష మచ్చిన్నం తన్తుం పృథివ్యా అనుగీషం"

    జలములందలి అగ్నీ! జలములారా! మీరు హవిస్సునకు యోగ్యులు. మా ఇంద్రియములకు శక్తి నిచ్చువారు. దాహము తీర్చి ఆనందము కలిగించేవారు. మీరు నదీరూపమున ఉన్నారు. మిమ్ము పాదంతో తాకను, మట్టిగడ్డలు వేసి, వాటి మీద కాలు పెట్టి దాటుతాను!

    కాలుతాకకుండా మనం నదులను శుభ్రంగా- శుద్ధంగా- ఆరోగ్యకరంగా - పవిత్రంగా - పాపనాశకంగా వేల సంవత్సరాలుగా పరిరక్షించుకున్నాం.

    ఈ రాక్షస యాంత్రిక రక్కసి నాగరికత దశాబ్డాల్లో పవిత్ర గంగానదిని సహితం కలుషితం చేసి గంగా జలాన్ని విషతుల్యం - కాదు విషం చేసింది!

    వేదం - చదవటం :-

    వేదం కథ, నవల, టీ.వీ. సీరియల్, సినిమా కాదు. రామాయణ, భారత, భాగవతాదుల్లో చదివించే కథ, పాత్రలు, సన్నివేశాలూ, సందేశాలూ ఉంటాయి. ఇవి తేనె కలిసిన మందు లాంటివి. తీయగా ఉంటూ గుణం కలిగిఉంటాయి. కాబట్టి వినోదం కోసం కూడా చదవచ్చు.

    కృష్ణ యజుర్వేదంలో అక్కడక్కడా కథలూ, గాథలూ కనిపిస్తాయి. కాని తైత్తిరీయ సంహిత - కథా ప్రధానం మాత్రం కాదు. వజ్రాన్ని వెదకడానికీ, ముత్యాలనూ వెలికి తీయడానికీ శ్రమ అవసరం.

    నిజ జీవితంలో సుఖమూ, కష్టమూ ఉంటాయి. అవాంతరాలూ, అడ్డంకులూ వస్తాయి. వాటిని ఎదిరించి గట్టెక్కిన వాడు సాధిస్తాడు. విజయం ఆనందాన్ని కలిగిస్తుంది. భరించలేక ఆత్మహత్య చేసుకున్న వానికి పాపం దక్కుతుంది.

    హేతువాదం, మార్క్సిజం, నాస్తికం సహితంగా అన్నింటికీ విశ్వాసం వెన్నెముక! వాస్తవంగా హేతువాదానికి హేతువుకన్న విశ్వాసం పట్టుకొమ్మ

    వేదం పవిత్రం - పావనం - పరిశుద్ధం. దీనిని విశ్వాసంతో, నిష్కల్మషంగా, ప్రసన్నచిత్తంతో అధ్యయనం చేయాలి. నీరు కావాలంటే నేలను త్రవ్వాలి. శ్రమించండి. ఫలితం దక్కుతుంది.

    ఇంట్లో దేవతల పటాలు పెట్టుకుంటాం. అర్థమైకాదు. నమస్కరించడానికే! ఫలితం దక్కకపోదు.

    వేదం మానవ జాతికి భగవానుడు ప్రసాదించిన తొలి ప్రసాదం. దాన్ని ఇంట్లో పెట్టుకొండి. నమస్కరిస్తుండండి. ఫలితం దక్కకపోదు!

    ఉద్యమం

    నేను ఉద్యమకారుణ్ణి. నాడి ఉద్యమం. వేదం ఏ కొందరి స్వంత సొత్తు కాదు. వేదం సమస్త మానవాళిది. వేదం అందరికీ అందాలని ఉద్యమించాను. భగవానుడు ప్రసన్నుడైనాడు. కరుణించాడు. స్వామి కరుణాకటాక్షం వల్ల ఒక్కణ్ణీ నాలుగు వేదాల ఆంధ్ర వచనానువాదం చేయగలిగాను.

    నా ఉద్యమానికి ఊపుగా "అందరికీ వేద విజ్ఞానము" నినాదంతో ఎమెస్కో ఆర్ష భారతి ఉద్యమించింది. అందరికీ వేదం అందడమే ధ్యేయంగా ఎమెస్కో వారు వేదాలను తొమ్మిది సంపుటాల్లో ప్రచురిస్తున్నారు. వారికి నేనూ, సకల ఆంధ్ర జాతీ కృతజ్ఞులం.

    ఎమెస్కోవారికి వేదాశీస్సులు.

    "సమహం ప్రజయా సంమయా ప్రజా సమహగం
    రాయస్పోషేణ సం మయా రాయస్పోష"

    నేను సంతానంతో కూడియుందునుగాక. సంతానము నాతో కూడి యుండును గాక. నేను ధన సమృద్ధితో కూడి యుందునుగాక. ధన సమృద్ధి నాతో కూడి యుండును గాత.

                                                    దాశరథి రంగాచార్య

 Previous Page Next Page