Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5


    భారతీయులకు కాలం అనాది. అనంతం. అందరికీ అంతే! కాని అన్యులు మూర్ఖులు!! నమ్మనొల్లరు. కాలం అనంతం అయినా మన శాస్త్రజ్ఞులు శాస్త్రీయంగా గుణించి లెక్కలు కట్టారు. పంచాంగం మీద చూడండి సృష్టి ఆది నుంచి లెక్క కనిపిస్తుంది. ప్రమాధి నామ సంవత్సరానికి 99-2000లకు సృష్టి మొదలై 194 కోట్ల 58 లక్షల, 85,100 సంవత్సరాలయింది.

    సృష్టి మొదలయిం తరువాత 432 కోట్ల సంవత్సరాలకు ప్రళయం వస్తుంది. అప్పుడు సమస్తం జలమయం అవుతుంది. ఆ జలమయ జగత్తు 432 కోట్ల మానవ సంవత్సరాలుంటుంది. అప్పుడు విష్ణువు - శ్రీమన్నారాయణుడు. మర్రి ఆకు మీద శయనించేంత వాడవుతాడు. వటపత్రశాయి అవుతాడు. అప్పుడు ఆ స్వామి ఒక్కడే మర్రి ఆకు మీద తేలియాడుతుంటాడు.

    మళ్లీ సృష్టి ప్రారంభం కావాలి. అప్పుడు స్వామి శేషశయనుడు అవుతాడు. అతని బొడ్లో నుండి తామరపూవు వెలుస్తుంది. దానిమీద చతుర్ముఖ బ్రహ్మ ప్రభవిస్తాడు. విష్ణుదేవుడు బ్రహ్మకు "అనేకావై వేదాః" అనేకములైన వేదాలను ఉపదేశిస్తాడు.

    432 కోట్ల సంవత్సరాలు వేదాలు నశించలేదు. సృష్టితో పాటు అంతర్హి తాలయినాయి. అప్పుడు ఋషులు బ్రహ్మ వలన అనుమతించబడ్డారు. ఆ మహర్షులు ఆ విధంగా వేదాన్ని దర్శించారు. కావున ఋషి వేదానికి ద్రష్ట దర్శించినవాడు- స్మర్తి గుర్తించుకున్నవాడు మాత్రమే! కర్త మాత్రం కాడు.

    "నతావద్వ్యాసో వేద కర్తా, తస్య విభాగమాత్ర కారిత్వాత్, నాపి చతుర్ముఖః, ఈశ్వరేణ చతుర్ముఖాయ వేద ప్రదానాత్, నాపి జగదీశ్వరః, తస్య వేదాభివ్యంజకత్వాత్" మత్స్య పురాణం.

    వేద వ్యాసుడు వేదకర్త కాడు. అతడు వేద విభజన మాత్రం చేశాడు. చతుర్ముఖుడు వేదకర్త కాడు. అతనికి ఈశ్వరుడు ప్రసాదించాడు. జగదీశ్వరుడు వేదకర్త కాడు. అతడు కేవలం వ్యక్తపరిచాడు.

    వేదానికి కర్త లేడు. వేదం అపౌరుషేయం.

    వేదం - నామములు

    వేదానికి 1. శ్రుతి, 2. ఆమ్నాయము, 3. ఛందస్సు, 4. స్వాధ్యాయము అని పేర్లు

    1. శ్రుతి : వేదాన్ని మహర్షులు విన్నారు. విన్నందున శ్రుతి. పాశ్చాత్యులు శ్రుతికి అపార్థం కలిగించారు. వ్రాత, లిపి అక్షరం వేదకాలంలో లేదని వారి దుర్మతం. అందువల్ల విని నేర్చుకున్నారని వారి కువ్యాఖ్యానం. వేదం ఛందోబద్ధం - సస్వరం - సమస్త సృష్టినీ ఇముడ్చుకున్నది. అప్పటికి అక్షరం లేదన్నది మూర్ఖత్వం!

    "ఫూల్ కిప్తతీసే కట్ కక్తాహై హీరేకా జిగర్
    మర్దెనాదాఁప్రర్ కలామెనర్మొనాజుక్ బేఅసర్" ఇక్బాల్
    పూవు రేకుతో వజ్రపు గుండెను కోయవచ్చు
    మూర్ఖుని ముందు సుతిమెత్తని మాట వ్యర్థం.

    2. ఆమ్నాయం : వేదం ఉపదేశం వలన లభించింది. సస్వర వేదం ఉపదేశం వల్ల మాత్రమే సాధ్యం. సంప్రదాయ ప్రకారం లభించింది. ఇన్ని వేల సంవత్సరాల నుండి తరం నుంచి మరో తరానికి సంక్రమించింది. Veda remains received by an unbroken chain of generations. travelling like a great wave, through the living substance of mind" jhon seemee

    నిరంతరం అధ్యయనం చేయబడేది ఆమ్నాయం. అవిచ్చిన్నంగా సాగుతున్నది ఆమ్నాయం.

    ఖుర్ - ఆన్ - ఖురాన్ కు అర్థం కూడా ఎక్కువగా చదవబడేది - నిరంతరం చదువబడేది అని.

    3. ఛందస్సు : ఛందో బద్ధం అయిందని మాత్రం కాదు. ఆదేశించేది - నియమించేది అని అర్థం. మానవ జాతికి నియమబద్ధం అయిన జీవితం నేర్పినందున ఛందస్సు.

    4. స్వాధ్యాయన : వేదం సంప్రదాయంగా వచ్చింది, ఉపదేశించవలసింది. ఈ రెండు గురుముఖతః జరిగేవి. అంతటితో అధ్యయనం ఆగిపోదు. వేద విద్యార్థి తాను స్వయంగా వేదాన్ని అధ్యయనం, పరిశోధన చేయాలి. అంతకు ముందు తెలియని అర్థాలు, వాస్తవాలు వెలికితీయాలి. ఇది స్వాధ్యాయం అవుతుంది.

    "తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్" ఇది నారదుని గురించి శ్రీమద్రామాయణంలోని తొలి శ్లోకార్థం. వాల్మీకి ప్రోక్తం.

    వాల్మీకి నిరంతరం స్వాధ్యాయం చేసేవాడు. అందుకే "రామకథాం పుణ్యాం శ్లోక బద్ధాం మనోరమామ్" సృష్టించకలిగాడు.

                                    వందే వాల్మీకి కోకిలం

    ఋషి - దివ్య దృష్టి

    ఋషి అతీంద్రియ దర్శి. జ్ఞానేంద్రియములకు అతీతముగా చూడగలవాడు. "నానృషిః కురుతే కావ్యం" అతీంద్రియ దృష్టి లేనివాడు కవి, రచయిత కాలేడు. రవి గాంచనిచో కవిగాంచును. సూర్య భగవానుడు సర్వసాక్షి. అయినా అతడు చూడని దానిని ఋషి - కవి చూడగలడు.

    దివ్యదృష్టి దివికి సంబంధించినది. దివ్యదృష్టి దేవతా సంబంధం - జ్ఞాన సంబంధం. జ్ఞానానికి అందనిది లేదు. జ్ఞానం సర్వమును దర్శించగలది. జ్ఞానం భూతభవిష్యత్తులను దర్శించగలదు.

    మానవ సమాజాన్ని గురించి భారత ఋషులు అధ్యయనం చేసినంతగా ప్రపంచంలోని ఏ సామాజిక శాస్త్రవేత్త అధ్యయనం చేయలేదు. మానవుని సుఖదుఃఖాలను గురించి భారత ఋషులు, తత్త్వవేత్తలు, ఆచార్యులు ఎంతగానో పరితపించారు. దుఃఖనివారణకు ఎంతో కృషి చేశారు.

    భవిష్యత్తును గురించి ఋషులు చెప్పిన దానికి ఇంటర్నెట్ యుగంలో మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం! వేదవ్యాస మహర్షి మానవాళి కోసం తన జీవితాన్ని కర్పూరంగా వెలిగించాడు. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగాన్ని గురించి అతని భవిష్యద్దర్శనం అద్భుతం - నిరుపమానం. శ్రీమహాభాగవతం ద్వాదశ స్కంధంలో కలియుగాన్ని గురించి చెప్పబడింది. దాని సంగ్రహ స్వరూపం :

    "కలికాలమున దినదినమునకు ధర్మము, సత్యము, శౌచము, క్షమ, దయ, ఆయువు, స్మృతి లోపించు చుండును. ధనమున్న వాడే కులీనుడు, ఆచారవంతుడు. గుణవంతుడు, బలవంతుడు, ధర్మపరుడు, న్యాయపరుడు, సర్వ నియంతయగును. (నేడు ధనమున్న అమెరికా సర్వ నియంత అయింది.) పెండ్లిండ్లలో కులము, శీలము, యోగ్యత చూడరు. వరునకు కన్య - కన్యకు వరుదు నచ్చిన వివాహములగును. నిజాయితీ లోపించును. మోసము చేయగలవాడు, అబద్ధము లాడగలవాడు. వ్యవహార దక్షుడగును. బ్రహ్మణుని బ్రహ్మణత్వము బ్రహ్మ జ్ఞానము వలన కాక జందెము వలన వ్యక్తమగును. బ్రహ్మచారులు గాని, సన్యాసులు కాని ఆశ్రమ ధర్మములు పాటించరు. వేసిన వేషముతో తృప్తి చెందెదరు. వాగినవాడు పండితుడు, అసాధుత్వమే సాధుత్వము, అసౌజన్యమే సౌజన్యము. స్వీకారమే వివాహము అగును. దూరమున ఉన్న బురదగుంట తీర్థము, వెంట్రుకలు పెంచుట లావణ్యము, కడుపు నింపుకొనుట పురుషార్థము, కుటుంబ పోషణే ఘన కార్యము, యశస్సు కోరుటే ధర్మ సేవనములగును"

    ఒక పరి పరికించండి. ఋషులు ఆనాడు చెప్పింది ఎంతటి యథార్ధమైందో!

    వారి దివ్యదృష్టికి ఆశ్చర్యపోవడం కన్నా ఏం చేయగలం?

    "కలౌ వేంకట నాయకః" కలియుగంలో వేంకటేశ్వర స్వామియే భగవానుడు అని ఏనాడు చెప్పారో? ఈనాడు అది మన కంటికి కనిపిస్తున్నది! ఎంతటి సత్యవాక్కు ఆ ఋషులది!! ఎంతటి తపోధనులు వారు!!!

    "సంఘేశక్తిః కలౌయుగే" కలియుగంలో సంఘటిత శక్తిదే కాలం అన్నాడు. ఇవ్వాళ మనం సంఘ శక్తిని గమనిస్తున్నాం. దేశాలే సంఘటితం అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ అందుకు నిదర్శనం. సైనిక శక్తులు సంఘటితం అవుతున్నాయి. NATO వంటివి అందుకు నిదర్శనాలు. కార్మిక సంఘాలు, కులసంఘాలు, మత సంఘాలే రాజ్యాలు పాలిస్తున్నాయి!

    ఆనాటి ఋషిది ఎంత దివ్య దర్శిత్వం? కొనియాడడానికి పదాలు దొరకడం లేదు! ఆలోచనకు అందడం లేదు!!!

    వేదమేకం చతుర్విధం

    వ్యాస భగవానుడు మానవ సమాజ శ్రేయోభిలాషి. అతడు రానున్న కలియుగాన్ని దర్శించాడు. నాటి అవిశ్రాంత మానవుని దర్శించాడు. అతని అజ్ఞతను దర్శించాడు. స్వప్రయోజనత్వాన్నీ స్వార్థాన్ని, కాలుష్యాన్ని దర్శించాడు.

    వ్యాస భగవానుడు "అనంతావై వేదాః" అనంత వేదాలను దర్శించాడు. వేదాల విశాలతను కలియుగపు సంకుచిత నరుణ్ణి చూశాడు. అతనికి జాలి కలిగింది. కలియుగ మానవులకు ఉపకారం చేయాలనుకున్నాడు. ఉపకారమే అతని జీవితం!

    ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః
    వ్యవధాత్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం

    వ్యాసభగవానుడు కృపావాత్సల్యములు గలవాడు. రానున్న కాలంలో జనానికి తీరిక ఉండదనీ, వాళ్లు అజ్ఞానులనీ గ్రహించాడు. అట్లా గ్రహించి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు.

    1. ఋగ్వేదసంహిత : ఈ సంహిత దేవతల గుణ గణములను స్తుతిస్తుంది. ఇందులో 10,589 కవితలున్నాయి.

    2. శుక్లయజుర్వేద సంహిత : ఈ సంహిత యజ్ఞ యాగాది క్రతువులను నిర్దేశిస్తుంది. ఇందులో 1975 పద్య, గద్యాలున్నాయి.

    కృష్ణయజుర్వేద సంహిత : ఈ సంహిత సహితం యజ్ఞయాగాది క్రతువులను నిర్దేశిస్తూ బ్రాహ్మణ సహితమై ఉంది. ఇందులో 19200 పదాలున్నాయి.

    3. సామవేదసంహిత : ఈ సంహిత దేవతలను ప్రసన్నులను చేసే గాన విధిని వివరిస్తుంది. ఇందులో 1,875 గేయాలున్నాయి.

    4. అథర్వవేద సంహిత : ఈ సంహితలో బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాల వివరణ లభిస్తుంది. ఇందులో 5977 గద్య పద్యాలున్నాయి.

    రెండు యజుర్వేదాలు

    యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులను నిర్దేశిస్తుంది. అందువల్ల యజుర్వేదమే ఎక్కువ ఉపయోగంలో ఉంది. మిగతా మూడు వేదాల కన్నా ఎక్కువమందికి తెలిసింది. యజుర్వేదం రెండుగా ఉండడానికి కారణం మహీధర భాష్యం వివరించింది.

    వేదవ్యాసుడు వేదాలను ఋగ్యస్సామాథర్వ వేదాలుగా విభజించాడు. వాటిని క్రమ ప్రకారం తన శిష్యులు పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు ఉపదేశించారు.

    వైశంపాయనుడు యజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యాదులకు ఉపదేశించాడు. ఒకప్పుడు వైశంపాయనునికి కోపం వచ్చింది. యాజ్ఞవల్క్యుని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాడు. యాజ్ఞవల్క్యుడు యోగబలంతో తాను నేర్చిన యజుర్వేదాన్ని వాంతి చేశాడు. వైశంపాయనుని ఆదేశం ప్రకారం అతని ఇతర శిష్యులు తిత్తిరి పక్షులై వాంతిలో ఉన్న విద్యను స్వీకరించారు. "తాని యజూంషి బుద్ధిమాలిన్యాత్కృష్ణాని జాతాని" ఆ యజుస్సులు బుద్ధిమలినములు. అందువలన కృష్ణ యజుస్సులు అయినవి.

    యాజ్ఞవల్క్యుడు గ్రంథాలు విడిచి వెళ్లి ఉంటాడు. అతడు యోగవిద్య తెలిసినవాడు. నేర్చిన విద్య మరచిపోయి వదలి ఉంటాడు. వైశంపాయనుడు యజుర్వేదం ఒక్క యాజ్ఞవల్క్యునికి మాత్రమే ఉపదేశించలేదు. ఇతర శిష్యులు ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు విశేషంగా నేర్చి ఉండవచ్చు. యాజ్ఞవల్క్యుడు విశేషంగా నేర్చినదాన్ని గురువు అన్య శిష్యులకు ఉపదేశించి ఉండవచ్చు. వారిలో తిత్తిరి మహర్షి గ్రహించింది కృష్ణ యజుర్వేదం అయింది.

 Previous Page Next Page