ప్రకృతి ప్రాణులకు సర్వస్వం అందిస్తుంది. వారి నుంచి ఏదీ ఆశించదు. అది అందుకున్న దానికి వేల ఇంతలు తిరిగి ఇస్తుంది. అందుకే మనం జీవిస్తున్నాం. ఒక్క గింజ నాటండి. నిరంతరం ఫలాలను ప్రసాదిస్తుంది!.
తనకు కొట్టిన గొడ్డలికే పరిమళం ప్రసాదిస్తుంది చందన తరువు!
మహాత్ములు, మహాపురుషులున్న సమాజంలోనే నీచులు, నికృష్ఠులు, స్వప్రయోజనపరులూ ఉంటారు. గాంధీ పుట్టిన సమాజంలోనే గోడ్సే సహితం పుట్టాడు!
ఈ స్వప్రయోజనపరులు చెట్టుకు చీడలాంటివారు. సమాజం సాంతాన్ని తమకోసం వాడుకుంటారు. వారి వేషాలు అనంతం. గుర్తించడం దుస్తరం! వారు తామే నిస్వార్థులం అని నమ్మిస్తారు. జనం వారినే నమ్ముతారు. గొర్రె కసాయివాణ్ణే! నమ్ముతుంది!
ఈ నీచులు మహర్షులు, మహాత్ములు ఏర్పరచిన సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను దిగమ్రింగుతారు. కనీసం త్రేన్చరు. వాటి స్థానంలో ఆత్మ కోల్పోయిన గాజు బొమ్మల్లాంటి ఆచార సంప్రదాయాలను కల్పిస్తారు. తమవే నిజమైనవని నమ్మిస్తారు. జనం ప్రాణం ఉన్న రూపాలను విడుస్తారు. నడిచే బొమ్మల వెంట పరుగులు పెడ్తారు.
ఈ స్వప్రయోజన పరులు గంగాజలాన్ని విషపూరితం చేయగలరు! విషమే అమృతం అని నమ్మించగలరు. నమ్మటం జనుల స్వభావం!!
ఈ నీచులు అనాదిగా సమాజాన్ని మోసగిస్తున్నారు. మోసమే వారి తిండీ, గుడ్డా! మోసమే వీరి గూడూ నీడ! మనకు తెలిసింది ఇసుమంత చరిత్ర. ఈ కొలదిలో వీరు బౌద్ధం నుంచి గాంధీ వాదం వరకు దిగమింగారు. వివరణ అక్కరలేదు. నిజం చేదు. మొన్నటి మార్క్సిజానికి అదే గతి పట్టింది. ఇది మనకు తెలిసిన కథ. పదిల పరచడానికి అనేక సదుపాయాలున్న యుగం ఇది. కాలం ఇది!
వేదం ఏనాటిది? ఎన్నడు మొదలయింది? వేదం అనాగరిక మానవుని కాలం నుంచి నిర్మలంగా, నిష్కాలమషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది.
స్వప్రయోజన పరులకు వేదం లెక్కలోనిది కాదు. వారు వేదాన్ని వేలం వేయగలరు! తాము చెప్పిందే వేదం అని నమ్మించగలరు. నమ్మించారు. దొంగ వేదాలు సృష్టించారు. అందుకే "విస్సన్న చెప్పింది వేదం" అనే సామెత.
వేదం అలాంటి గందర గోళంలో ఉన్నప్పుడు వ్యాసభగవానుడు అవతరించాడు. వేదానికి కలిగిన ఈ దుస్థితిని చూచాడు, దుఃఖించాడు, అంతటితో చాలించలేదు. వేదాన్ని పరిష్కరించడానికి ఉపక్రమించాడు. అంతటి దుస్థితి నుండి నిజమైన వేదాన్ని వెలికితీయడం సామాన్యం కాదు. రాళ్ళలో వజ్రాన్ని వెదకడం!
వజ్రం రాతి నుండే ఏర్పడింది. కాని రాయి వజ్రం కాలేదు. రాయి రాయే. వజ్రం వజ్రమే! రాతిని చూపి వజ్రం అని నమ్మించవచ్చు కాని ఎన్నటికీ రాయి వజ్రం కాజాలదు. వజ్రం విలువ వజ్రపుదే. వజ్రం తలకెక్కుతుంది! రాయి కాళ్ళకింద పడి ఉంటుంది. రాళ్ళన్నీ ఒకటి కావు. అన్నీ కాళ్ళ కింద పడి ఉండవు.
"జో నతర్షేతో పత్థర్ థే
జోతర్షేతొ ఖుదాబన్ బైఠే"
చెక్కకున్న రాళ్ళు
చెక్కిన దేవుళ్ళు
అలా రాళ్ళూ వజ్రాలు కలిశాయి. స్వప్రయోజనపరులు రాళ్ళను వజ్రాలుగా చెలామణి చేశారు!
అలాంటి విపత్సమయంలో అవతరించారు వేదవ్యాస భగవానుడు.
అభ్రశ్యామం పింగజటా బద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగ త్వక్ పరీధానః|
సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః
పారాశర్యః సర్వసురూపం వివృణోతు||
వ్యాసభగవానుడు ఒక మహత్తర కార్యానికి పూనుకున్నాడు. మానవ కళ్యాణం కోసం మహా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అప్పుడు ఆ మహర్షికి ఎన్ని సమస్యలు ఎదురైనాయో!ఎందరు వైరులైనారో? ఎందరిని ఎదిరించాల్సి వచ్చిందో! ఇదంతా ఎందుకు? వ్యాస భగవానునికి స్వార్థం లేదు. స్వప్రయోజనం లేదు. కేవలం మానవ కళ్యాణానికే వేదాలను పరిష్కరించ పూనుకున్నాడు.
వ్యాసమహర్షికి ఎన్ని వందల వేల విద్వత్ శిష్యులో! ఒక మహావటం కాదు - పంచవటి. ఆ నీడన వ్యాసభగవానుడు ఆసీనుడు. అతడు చంద్రుడు. అతని శిష్యులు నక్షత్రాలు వేనవేలు! ఒక్కొక్కరి ముందు తాళపత్ర రాశి! శిష్యుల వేదాధ్యాయనం. తొలుతగా వారు పరిష్కరిస్తున్నారు. వారు వ్యాసునకు అందిస్తున్నారు. వ్యాస మహర్షి నిశితంగా పరిశీలిస్తున్నారు. వేదం కాని దాన్ని ఒకవైపు విసురుతున్నారు. వేదాన్ని తన వద్ద భద్ర పరుస్తున్నారు. వ్యాసుని పక్కన మునిశిష్యులు, వారు వేదపు ప్రతులు సిద్ధం చేస్తున్నారు! ఎంతటి నిమగ్నత! ఎంతటి ధ్యానం! ఎంతటి మౌనం! ఎంత నిశ్శబ్దం!
ఇది నా ఊహా చిత్రం.
వ్యాసభగవానుడు నిర్వహించిన మహత్కార్యాన్ని తలుచుకుంటే వళ్లు జలదరిస్తుంది. అందరు ఋషులు అందరు మునులు, అందరు కవులు, అందరు యోగులు తమ జీవితాలను దివ్వెలను చేసినారు. తాము తిమిర బాధలు అనుభవించారు. లోకాలకు వెలుగు ప్రసాదించారు! మనిషి జీవితాన్ని ఆదర్శం వైపు నడిపారు. మానవునిలో దైవత్వాన్ని వెలికి తీశారు!
ఎంత శ్రమ! ఎంత కృషి! ఎంత త్యాగం! ఎవడండీ ఇంత చేసే వాడు! వారి నిరంతర యజ్ఞం, యతనం, ప్రయత్నం వల్లనే మనం ఇంకా మనుషులుగా ఉన్నాం. మనం వారికి ఏం చేయగలం? నదీనదాలు, పర్వతాలు, వృక్షాలూ, మనకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. అది సరికాదు. వాటి వల్లనే మనం జీవిస్తున్నాం. మనం వాటికి ఏం చేస్తున్నాం? ఏం చేయగలం? మన శక్తి ఎంత?
` ఈ యంత్రయుగపు నరుడు రాక్షసుడు! తనను పెంచుతున్న ప్రకృతినే చేరుస్తున్నాడు! దోచేస్తున్నాడు! సర్వనాశనం చేస్తున్నాడు! కన్నతల్లిని నరికి పోగులు పెడ్తున్నాడు! తన ప్రాణం తానే తీసుకుంటున్నాడు. తాను చేసుకుంటున్నది ఆత్మహత్య అని ఎరుగకున్నాడు! పుట్టు గ్రుడ్డి! ఏమీ కానకున్నాడు! అజ్ఞాని! విర్ర వీగుతున్నాడు! మూర్ఖుడు! తన సర్వనాశనం ఎరుగకున్నాడు! నిప్పుతో చెలగాటలాడుతున్నాడు! ఎవడు చెపుతాడండీ వానికి? భర్తృహరి మూర్ఖపద్ధతి-
లభేత సికతాను తైలమపియత్నతః పీడయ
న్పిబేచ్చ మృగతృష్టికాసు సలిలంపిపాసార్దితః
కదాచిదపి పర్యటన్ శశినిషాణ మాసాదయే
న్నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్
తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
జేరి మూర్ఖుల మనసు రంజింపగారాదు.
ఫూల్ కి పత్తీసె కట్ సక్తాహై జిగర్
మర్దె నాదాఁపర్ కలామె నర్మొనాజూక్ బే అసర్ - ఇక్బాల్'
పూరేకుతో వజ్రపు గుండెను కోయవచ్చు మూర్ఖుని విషయంలో సుతిమెత్తని మాట నిష్ఫలం.
నాటి వేద వ్యాసుని వేద పరిష్కార మహాత్కార్యంలో ఈ విషయాలు ఎదురైనాయని నా ఉద్దేశం.
1. వేదం మానవునికి నేర్పింది మానవుడు. కొన్నింటి నేర్చాడు. వాటిని అలవాటుగా ఆచారంగా చేసుకున్నాడు. దంతధావనం, స్నానం, ఇల్లు, వాకిలి, నిత్య జీవితం. వీటిని ఇంకా వేదంలో ఉంచడం వల్ల ప్రయోజనం శూన్యం. వ్యాసమహర్షి వాటిని తొలగించాడు. ఇది అంత కష్టమైన పని కాదు. జనం అప్పటికే ఆ వేదాలను మరిచి ఉంటారు.
2. వేదం పేర చలామణిలో ఉండిన నకిలీ వేదాలు- దొంగ వేదాలు. ఇవి స్వ ప్రయోజనపరుల సృష్ఠి వారు వాటితో లాభం పొందుతూంటారు.
దొంగ వేదాలను వెలికి తీయడం కష్టం. ఎందుచేతంతే అవి వేదంలాగే ఉంటాయి. స్వార్థపరులు జనులచే వాటిని ఆమోదింప చేశారు.
సమాజం స్వప్రయోజనపరుల పిడికిటనే ఉంటుంది. ఆ పిడ్కిలి తెరుచుకోదు. పిడికిలిని విరచాలి. ఇది అసాధారణ కార్యం. ఎంతో సాహసం, మనో బలం, నైతిక శక్తి, సత్యసంధత, దైవ బలం కావాలి. దుష్టులను దూరం చేయగల శక్తి మహాత్ములకు ఉంటుంది. ఒకే రాముడు, ఒకే కృష్ణుడు, ఒకే బుద్ధుడు, ఒకే శంకరుడు, ఒకే రామానుజుడు, ఒకే గాంధీ దుష్టులను గెలిచారు. వ్యాసుడు అందరిని ఎదురించాడు. కలుపు వేదాన్ని, చీడ వేదాన్ని, నకిలీ వేదాన్ని దొంగ వేదాన్ని సాహసోపేతంగా తొలగించాడు. అందుకే అతడు వ్యాసభగవానుడు అయినాడు.
వ్యాసభగవానుడు దర్శనం ఇస్తే అతని పాదాలు చుంబించాలనేది నా తీరని కోరిక.
3. అసలు, సిసలు వేద మంత్రాలను నిశ్చయించడం, వాటిని సార్వజననీనమూ, స్వార్థ కాలీనములుగా దర్శించడం, వాటిని దర్శించిన ఋషులను ఇతరములను నిశ్చయించడం, అలా నిశ్చయించిన వాటిని పండిత పామరులచే ఆమోదింప చేయడం.
4. వేదాన్ని నిశ్చయించడం వేరు. అది మాత్రమే వేదం, అన్యం కాదని ప్రచారం చేయడం వేరు. వ్యాస భగవానుడు తన శిష్యులనంపి సమస్త మానవాళిచే 'ఇదే వేదం' అని వప్పించాడు. ఇది స్వల్పకార్యంకాదు. సామాన్య మానవులు సాదించ్ జాలరు. అందుకే వ్యాసునిది అవతారం అతడు భావానుడు తన శిష్యులనంపి సమస్త మానవాళిచే 'ఇదే వేదం' అని వప్పించాడు. ఇది స్వల్పకార్యంకాదు. సామాన్య మానవులు సాధించ జాలరు. అందుకే వ్యాసునిది అవతారం. అతడు భగవానుడు. అతడు నారాయణుడు!
ఆ మహాత్ముని పరిశ్రమ గురించి - వారు సాధించిన ఫలితాలను కనీసం అంచనా వేసే శక్తి లేదు. మనది అల్ప బుద్ధి, స్వల్ప బుద్ధి, మానం అల్పాయుష్కులం!
వ్యాసుడు మానవజాతికి ఎన్ని ఉపకారాలు చేశారండి!
1. భారత వంశాన్ని అంతరించనీయ లేదు - చేశారండి!
2.పంచమ వేదం - మహాభారతాన్ని సృష్టించాడు.
3.అమృతతుల్యమగు భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మచే పలికించాడు.
4. శాంతి ప్రాతిపదికమగు శ్రీమద్భాగవతమును ప్రవచించాడు.
5. పురాణ, ఉపపురాణ కర్త అయినాడు.
6. సంఘసంస్కర్త అయినాడు.
7. భాషేశ్వరుడు అయినాడు.
8. సామాజిక సారథి అయినాడు.
9. రాజకీయ వేత్త అయినాడు.
అతడు కానిది ఏది?
అతడు మనకు అక్షయ సంపద ప్రసాదించా. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి, ఇంకా మిగులుతుంటుంది. కనీసం ఇవ్వలేదని అల్పులం అయినాం మనం!
వ్యాసుడు ఏ చెట్టు కిందనో, పర్ణశాలలోనో ఉన్నాడు. పిడికెడు మెతుకులు తిన్నాడు. ఇన్ని మహత్కార్యాలు సాధించాడు.
ఆ మహర్షికి మనం ఏం ఇవ్వగలం? నమస్కరింతాం.
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పారాశరాత్మజం వన్దే శుకతాతం తపోనినిధిం
వ్యాసుడు వశిష్ఠుని ముని మునుమడు. శక్తికి పౌత్రుడు, నిష్కల్మషుడు, పరాశరుని పుత్రుడు , శ్రీ శుకుని తండ్రి, తపోధనుడు. అతనికి నమస్కరిస్తున్నాను.
సంహిత - వేదం
మనకు ప్రస్తుతం లభిస్తున్నవి వేద సంహితలు. అవి నాలుగు.
1. ఋగ్వేదసంహిత
2.కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత
3.సామవేదసంహిత
4.అథర్వవేదసంహిత
ఏవంచకార భగవాన్ వ్యాసః కృపణ వత్సలః
వ్యవధాత్యజ్ఞ సంతత్యై వేద మేకం చతిర్విధం
వ్యాసభగవానుడు కృపావాత్సల్యములు గలవాడు. తీరికలేని అజ్ఞాన సంతతి రానున్నదని గ్రహించినాడు. ఏక వేదాన్ని నాలుగుగా నిర్మించాడు.
"సంహితం భవతి హ్యక్షరాణి ధనం ప్రతిష్ఠాయై" అని తాండ్యము. తరగని సంపదను కలిగించునది సంహిత.
'సంహిత' వర్గ సంయోగము. వేదము నందలి కొంత భాగము శాస్త్రము. సంధించబడినది అని శబ్దరత్నాకరము.