ఓం వతామినన్తిమాయినో వధీరా వ్రతాదేవానాం ప్రథమాద్రవాణి
వరోదపీ అద్రుహా వేద్యాభిర్న పర్వతావి వమే తస్థివాంసః
రెండవ అధ్యాయము
మూడవ అనువాకము ముప్పది మూడవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్రుడు సంవరణుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. నేను సంవరణ ఋషిని. అత్యంత దుర్భలుడను. ఇంద్రుడు మహాబలసంపన్నుడు. నేను ఇంద్రుని గూర్చి అనేక స్తవములు వచింతును. అందువలన నా వంటి మనుష్యుడు బలవంతుడగును. సంగ్రామమునందు అన్నలాభము కొఱకు స్తుతించగా ఇంద్రుడు స్తోతలతో కూడ నన్ను అనుగ్రహించును.
2. ఇంద్రా ! నీవు కోరికలు తీర్చువాడవు. నీకు ప్రియములయిన స్తోత్రములు రచించిన వారిని నీ దృష్టిలో ఉంచుకుందువు. ఆ స్తోత్రములతో రథమునకు కట్టిన గుఱ్ఱముల కళ్లెము పట్టుకొందువు. ఆవిధముగా నీవు మా శత్రువులను ఓడించుము.
3. తేజో విశిష్టుడవగు ఇంద్రా ! నీ భక్తులకు భిన్నమైనవాడు, నీ వెంట ఉండనివాడు, బ్రహ్మ కర్మహీనుడు నీవాడుకాడు. కావున నీవు మా యజ్ఞమునకు వచ్చునపుడు నీవు స్వయముగా నడిపించు రథమున విచ్చేయుము.
4. ఇంద్రా ! నిన్ను కీర్తించు స్తుతులు అనేకములు ఉన్నవి. నీవు భూమి మీద జలవృష్టిని నిరోధించువారిని సంహరింతువు. నీవు అభీష్ట పూరకుడవు. సూర్యుని స్వస్థానమున వర్ష ప్రతిబంధకారకులగు దాసులతో యుద్ధము చేసినావు. వారి పేరు సహితము మిగలకుండ నష్టపరచినావు.
5. ఇంద్రా ! మేము ఋత్విక్కులము. యజమానులము. మేమందరము నీవారలము. మేము యజ్ఞము చేయుదుము. నీ బలమును పెంచుదుము. హోమము చేయుటకు నీ దగ్గరికి చేరుదుము. నీ బలము సర్వవ్యాపకము. నీ అనుగ్రహమున యుద్ధక్షేత్రమున భాగము -ప్రశంసనీయ, విశ్వసనీయ భృత్యులు మున్నగువారు మాకు లభించవలెను.
6. ఇంద్రా ! నీవు పూజనీయుడవు. సర్వవ్యాపివి. అమరుడవు. నీవు నీ తేజమున జగములను నింపుము. శ్వేతవర్ణ మగు విశేష ధనమును మాకు ప్రసాదించుము. మేము విశేష ధనవంతుడగు దాత దానగుణమును ప్రశంసింతుము.
7. ఇంద్రా ! నీవు శూరుడవు. మేము నిన్ను స్తుతింతుము. భజింతుము. మాకు రక్షణ కల్పించుము. పాలించుము. సంగ్రామమున నీవు నీ ఆచ్చాదక రూపమును ప్రదానము చేయుము. మా అభిషుత సోమరసము సేవించి సంతుష్టుడవగుము.
8. గిరిక్షిత గోత్రోత్పన్నుడు, పురుకుత్స పుత్రుడు త్రసదస్యుడు హిరణ్యవంతుడు. దాత. అతడు మాకు పది అశ్వములను దానము చేసినాడు. అవి శుభ్ర వర్ణములు. అవి మమ్ము వహించవలెను. రథనియోజక కార్యములద్వారా మేము శీఘ్రగమనులము కాగలము.
9. మరుతాశ్వుని పుత్రుడు విదథుడు మాకు రక్తవర్ణములు, శ్రేష్ఠములగు అశ్వములను దానము చేసినాడు. అవి మమ్ము వహించవలెను. అతడు మమ్ము పూజించి సహస్ర పరిమిత ధనము ఇచ్చినాడు. అతని వంటి మీది అలంకారములను ఇచ్చినాడు.
10. లక్ష్మణపుత్రుడు ధ్వన్యుడు మాకు దీప్తిమంతములు, కర్మక్షమగల అశ్వములను ఇచ్చినాడు. అవి మమ్ము వహించవలెను. గోవులు కొట్టములకు చేరినట్లు ధ్వన్యుడు ఇచ్చిన మహాధనము సంవరణ ఋషి ఇంటికి చేరవలెను.
ముప్పది నాలుగవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్రుడు సంవరణుడు. దేవత-ఇంద్రుడు. ఛందస్సు - జగతి. చివరిది త్రిష్టుప్.
1. అజాత శత్రువగువాడు, శత్రువులను నాశనము చేయువాడు, అక్షీణ, స్వర్గప్రద, అపరిమిత హవ్యమును అందుకొనును. ఋత్విక్కులారా ! అట్టి ఇంద్రుని కొఱకే మీరు పురోడాశాదుల పాకము చేయుడు. తగిన విధమున పూజింపుడు.
ఇంద్రుడు స్తోత్రవాహకుడు. బహుస్తుతుడు.
2. ఇంద్రుడు మృగనామక అసురుని వధించదలచినపుడు సోమరసముతో అతని జఠరమును నింపినాడు. ప్రముదితుడు అయినాడు. అప్పుడు ఇంద్రుడు అపరిమిత తేజోవంతమగు తన మహా వజ్రమును ఎత్తినాడు.
3. ఇంద్రుని కొఱకు అహర్నిశలు సోమమును అభిషవించు యజమానులు ద్యుతిమంతులు అగుదురు. యజ్ఞము చేయనివారయి ధర్మసంతతి కోరువారిని సుందర అలంకారాదులు ధరించువారిని ధనవంతులయ్యు కుత్సితులకు సాయము చేయువారిని ఇంద్రుడు విడిచి పెట్టును.
4. తనను పూజించువాడు మాతాపితరులను భ్రాతను వధించిన వానిని సహితము ఇంద్రుడు దూరము చేయడు. అతడు సమర్పించిన హవ్యమును కాంక్షించును. శాసకుడు, ధనాధిపతియగు ఇంద్రుడు పాపములకు సహితము విచలితుడు కాడు.
5. ఇంద్రుడు శత్రువులను సంహరించుటకు అయిదుగురి, పదిగురి సహాయమును ఆశించడం. సోమాభిషవము చేయనివానితోను, బంధువులను పోషించనివానితోను ఇంద్రుడు సాంగత్యము చేయడు. వారిని బాధించును. వధించును.
ఇంద్రుడు యజ్ఞము చేయు యజమానుల గోష్ఠములను గోవులతో నింపును.
6. ఇంద్రుడు యుద్ధమున శత్రువును క్షీణింప చేయును. రథపు వేగమును పెంచును. అతడు సోమాభిషవము చేయని యజమానిని దూరము చేయును. సోమాభిషవము చేయువానిని వర్థిల్ల చేయును. విశ్వరక్షకుడు, భయజనక స్వామి ఇంద్రుడు యధేచ్చగా దాస కర్మము చేయువారిని తన వశమున ఉంచుకొనును.
7. ఇంద్రుడు వర్తకులవలె ధనమును తస్కరించును. మానవుల శోభను పెంచు నట్టి ధనమును బహువిధ అన్య ధనములను తెచ్చి యజ్ఞము చేయు యజమానులకు ఇచ్చును. బలశాలియగు ఇంద్రునకు కోపము కలిగించినవాడు మహావిపత్తుల పాలగును.
8. ధనబలము, అంగబలముగల ప్రత్యర్థులు సంపన్నములగు గోవుల కొఱకు పరస్పరము ఘర్షణ పడుదురు. అప్పుడు ఇంద్రుడు వారిలో యజ్ఞము చేయువారికి సాయపడును. మేఘములను కంపింప చేయగల ఇంద్రుడు అట్టి యజ్ఞకారి యజమానికి గోసమూహములు ప్రదానము చేయును.
9. గుణ విశిష్టుడవగు ఇంద్రా ! అపరిమిత ధనదాత అగ్నివేశపుత్రుడు ప్రసిద్ధ శత్రినామక రాజర్షిని స్తుతింతుము. అతడు ఉపమానభూతుడు ప్రఖ్యాతుడు. జలరాశి అతనిని సంపూర్ణముగ సంతుష్టుని చేయవలెను. అతని ధనము బలవంతము, దీప్తివంతము కావలెను.
ముప్పది అయిదవ సూక్తము
ఋషి-అంగిరస గోత్రజుడు ప్రభూవసుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు - అనుష్టుప్, చివరది పంక్తి.
1. ఇంద్రా ! నీ అతిశయ ప్రజ్ఞ మమ్ము రక్షించవలెను. నీ కార్యములు సమస్త జనులకు కళ్యాణ కారకములగును. పరిశుద్ధములగును. సంగ్రామమున ఇతరులు ఎదిరించరానివి అగును.
2. ఇంద్రా ! నీవు చేయునట్టి చతుర్వర్ణముల రక్షాకార్యమును త్రిలోకముల రక్షాకార్యమును, పంచజనుల రక్షాకార్యమును అట్టి సమస్త రక్షాకార్యములు నీవు మా కొఱకు భద్రపరచుము.
3. ఇంద్రా ! నీవు అభిమత ఫలసాధకుడవు. వృష్టికర్తవు. శీఘ్ర శత్రు సంహారకుడవు. నీ రక్షణ కార్యము వరణీయము. మేము దానిని ఆహ్వానింతుము. నీవు సర్వవ్యాపి మరుత్తులతో కలిసి మాకు ఫలప్రదానము చేయుము.
4. ఇంద్రా ! నీవు అభీష్ట వరదుడవు. యజమానులకు ధనము ఇచ్చుటకే నీవు జన్మించినావు. నీ బలము ఫలప్రదము అగును. నీ మనసు ధృడమయినది - విరోధులను అణచివేయునదగును. నీ పౌరుషము సంఘవినాశకము. "సత్రాహమింద్ర పౌంస్యమ్"
(సత్రాహం సంఘహంతృ అని శాయణుడు ఇంద్రుని కోపము సంఘ వినాశకారి అని అర్థము కావచ్చును)
5. ఇంద్రా ! నీవు వజ్రధారివి. నీ రథము సర్వత్ర అప్రతిహతముగ సంచరించును. నీవు నూరు యజ్ఞములు చేసినవాడవు. శతక్రతువవు. నీవు బలములకు అధిపతివి. నీ విషయమున శత్రుత్వము చూపినవాడిపై నీవు దండెత్తిదవు.
6. ఇంద్రా ! నీవు శత్రుహంతవు. ఉద్యతాయుధుడవు. బృహత్ ప్రజలలో పురాతనుడవు. యజ్ఞము చేయువారు యుద్ధములందు నిన్ను ఆహ్వానింతురు.
7. మా రథము సంగ్రామమున సకల విధ ధనములను కాంక్షించును. అనుచరుల వెంటసాగును. దుర్నివార్యము, రణ సంకులము అగును. ఇంద్రా ! అట్టి మా రథమును నీవు రక్షింపుము.
8. ఇంద్రా ! నీవు మా వద్దకు ఆత్మీయుడవయి రమ్ము. నీ ఉత్కృష్ట బుద్ధితో మా రథమును కాపాడుము. నీవు నిరతిశయ బలశాలివి. దీప్తిమంతుడవు. నీ అనుగ్రహమున మేము వరణీయ ధనమును, యశస్సును పొందవలెను.
ఇంద్రా ! మేము నిన్ను స్తుతించుచున్నాము.
ముప్పది ఆరవ సూక్తము
ఋషి-అంగిరస గోత్రజుడు ప్రభూవసుడు, దేవత-ఇంద్రుడు ఛందస్సు-త్రిష్టుప్. మూడవది జగతి.
1. ఇంద్రుడు మా యజ్ఞమునకు విచ్చేయవలెను. ధనమునకు ప్రతీక అయిన దేవత ఎటువంటివాడు? ఇంద్రుడు స్వభావతః దాత. ధనుస్సు వెంటసాగు ధనుర్దారివలె సాహసపూర్ణ గమనముగల, అత్యంత సంతుష్టుడయిన ఇంద్రుడు అభిషుత సోమపానము చేయవలెను.
2. ఇంద్రుడు అశ్వద్వయ సంపన్నుడు. శూరుడు. మేము సమర్పించు సోమరసము పర్వత శిఖరమువంటి అతని హనుప్రదేశమును ఆరోహించవలెను. గడ్డి వలన అశ్వములు తృప్తి చెందును. అట్లే మేము స్తుతుల ద్వారా నిన్ను ప్రీతిని చేతుము.
ఇంద్రా ! నీవు బహుస్తుతుడవు.
3. ఇంద్రా ! నీవు బహుస్తుతుడవు. వజ్రవంతుడవు. భూమిమీద తిరుగు చక్రమువలె మా హృదయము దారిద్ర్య భయమున గడగడలాడుచున్నది. సర్వదా వర్ధమానుడవగు ఇంద్రా ! పురూవసు ఋషి బహుళ స్తుతులతో నిన్ను స్తుతించుచున్నాడు. నీవు రథారూఢుడవగుము.
4. ఇంద్రా ! విశేష ఫలమును అనుభవించు స్తోతలు అభిషశిలవలె నిన్ను స్తుతింతురు. ధనవంతుడవు, హర్యశ్వవంతు ఇంద్రా ! నీవు కుడి, ఎడమ రెండు చేతులతో ధనదానము చేతువు. నీవు మమ్ము విఫల మనోరథులను చేయకుము.
5. ఇంద్రా ! నీవు అభీష్ట వరదుడవు. అభీష్ట వర్షులగు ద్యావాపృథ్వులు నిన్ను సంవర్థితుని చేయుదురు. నీవు వర్షకారివి. అశ్వములు నిన్ను యజ్ఞస్థలమునకు చేర్చును. శోభన హనువులుగల వజ్రధారివైన ఇంద్రా ! నీ రథము కళ్యాణవహము అగును. యుద్ధమున నీవు మమ్ము రక్షింపుము.
6. ఇంద్ర సాహాయక మరుత్తులారా ! అన్నవంతుడగు శృతరథ మహారాజు మాకు లోహిత వర్ణములగు రెండు అశ్వములను మూడువందల గోరూప ధనమును దానము చేసినాడు. నిత్య యవ్వనుడగు ఆ శృతరథ రాజును సకల ప్రజ ప్రసన్నమై ప్రణమిల్లును.
ముప్పది ఏడవ సూక్తము
ఋషి - అత్రి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. యథావిధి ఆహుత అగ్నిలో హవ్య ప్రదానము చేయుట వలన అగ్ని ప్రదీప్తము అగును. సూర్యరశ్మి సహితముగా ఆహూయ మానుడు అగును. "ఇంద్రుని కొఱకు హోమము చేయుము" అన్న యజమాని కొఱకు ఉష అహింసితము అగును.
2. అగ్నిని ప్రదీప్తము చేయునట్టి కుశలను విస్తృతపరచునట్టి యజమాని అగ్నిని భజించును. సోమరసమును అభిషవించు వారు స్తుతింతురు. ఏ అధ్వర్యుని పాషాణమున సుమధుర శబ్దమగునో ఆ అధ్వర్యుడు హవ్యము తీసికొని నదిలోనికి చేరవలెను.
3. పత్ని పతిని వాంఛించి యజ్ఞమున అతనిని అనుసరించును. ఇంద్రుడు అదేరీతి తనను అనుసరించు మహిషిని అనుగమించును. ఇంద్రుని రథము విశేష ధనము వహించి మా వద్దకు రావలెను. అది అధిక శబ్దము చేయును. అది నలువైపుల వేల ధనము విసరవలెను.
4. ఎవని యజ్ఞమున దుగ్ధమిశ్రిత మదజనక సోమరసమును ఇంద్రుడు పానము చేయునో ఆ యజ్ఞము చేయు రాజు ఎన్నటికి వ్యాధితుడు కాడు. అతడు అనుచరుల వెంట సర్వత్ర సంచరించును. శత్రుసంహారము చేయును. ప్రజలను రక్షించును. సుఖసంతోషములు కలిగి ఇంద్రుని సేవించును.
5. ఇంద్రునకు అభిషుత సోమము సమర్పించువాడు బంధువులను, బాంధవులను పోషించును. ప్రాప్తధనమును రక్షించును. అప్రాప్త ధనమును సాధించును. వర్తమాన అహోరాత్రులను గెలుచును. అతడు సూర్యుడు, అగ్ని ఇద్దరికి ప్రీతిపాత్రుడు అగును.