Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 5


    క్రమంగా పోటీ పెరగసాగింది. దాన్ని గమనించిన అయే దశరథ, సుశీల్ కుమార్ లాంటి మీడియా కింగ్స్ కి చేరువయింది.

    దాంతో ఇప్పుడు ఆమె ఓ పెద్ద హీరోయిన్ అయికూర్చుంది.

    "మీరు నందినిని హీరోయిన్ గా పెట్టుకుంటేనే నా దగ్గరకు రండి....." అని చెప్పేదాకా  వెళ్ళాడు సుశీల్ కుమార్.

    హీరోయిన్ ఎవరైతే నేం? ఎలా చేస్తేనేం? మా సీరియల్ ని స్పాన్సర్ చేస్తేచాలని నిర్మాతలు ఆమెకోసం తిరగటం మొదలెట్టేసరికి ఆమె చెట్టెక్కి కూర్చుంది.

    మత్తుగా ఉండే ఆమె కళ్ళు.... గమ్మత్తుగాఉండే ఆమె చూపులు సుశీల్ కుమార్ ని మొదటి కలయికలోనే ఆకట్టుకున్నాయి.

    అదంతా ఓ పథకం ప్రకారం చేసింది దశరథ. అసలామె ద్వారానే అతను సుశీల్ కుమార్ కి దగ్గరయింది.

    నేషనల్ లెవెల్ కంపెనీలు ఏవైనా సుశీల్ కుమార్ కి తెలీకుండా స్పాన్సర్ చేయటం జరగలేదు ఇంతవరకు.

    అతన్ని చూస్తూనే పార్టీలో మునిగి ఉన్న చిన్నచిన్న టీ.వీ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు భయంగా అతని చెంతకు వచ్చి 'యువర్ హైనెస్' అన్న పద్ధతిలో నమస్కరించి వినయంగా ప్రక్కకు తప్పుకున్నారు.

    దశరథ స్వయంగా రెండు పెగ్గులు తెచ్చి సుశీల్ కుమార్ కి, నందినికి అందించాడు.

    ఆమె సుతారంగా పెగ్గును పెదాలకు ఆనించుకుంది.

    అక్కడున్న ప్రతి ఒక్కరూ దశరథ, సుశీల్ కుమార్ ళ కళ్ళుగప్పి ఆమెకేసే చూస్తున్నారు ఆర్తిగా.

    భుజాల క్రింది వరకు నగ్నంగా కనిపిస్తున్న ఆమె వంపులకేసి దొంగ చూపులు చూస్తూ ఎంత తాగుతున్నామన్న స్పృహను కూడా కోల్పోయారు.

    ఆమెకు తెలుసు తనకేసి అక్కడున్న ప్రతి ఒక్కరు కాంక్షగా చూస్తున్నారని- తన అందాన్ని ఒంపుసొంపుల్ని ఆరాధిస్తున్నారని.

    ఆమె కదిలింది......స్టయిల్ గా ఒక్కో అడుగేస్తూ ప్రతి ఒక్కర్ని పేరు పేరునా పలకరిస్తోంది.

    వాళ్ళు మైమరచి ఆమెకేసే చూస్తున్నారు.

    ప్రతి ఒక్కరి దృష్టిలో తన అద్వితీయమైన అందం పడాలన్న ఆమెలోని ఇగోనే ఆమెనలా తిప్పిస్తోంది.

    సమయం రాత్రి పదిగంటలయింది. దాదాపు అందరూ తూలిపోయే దశకు చేరుకున్నారు.

    అందరికేసి పరికించి చూసిన దశరథ  నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.

    బ్రహ్మానందాన్ని దగ్గరకు రమ్మని సైగా చేశాడు.

    అప్పటికే అతను కూడా బాగా పుచ్చుకొని ఉన్నాడు.

    "అందరి మొఖాలు ఎలా వెలిగి పోతున్నాయో చూసావా? అంటే రేపటినుంచి మన పనులు ఇంకా వేగంగా అయిపోతాయన్న మాట" అన్నాడు ఖాళీ అయినా సీసాలకేసి చూస్తూ.

    "ఎంత అన్యాయమండి బాబు..... ఇలా తాగించి పరమచెత్త సీరియల్స్ ని, ప్రోగ్రామ్స్ నీ అనాలా మీదకు రుద్దేస్తున్నారు. వీళ్ళేం ప్రభుత్వాధి కారులండి బాబు ?ఫ్రీ గా  వస్తే ఫినాయిల్ అయినా తాగేలా ఉన్నారు"

    "చిన్నగా మాట్లాడి చావు. వాళ్ళకు వినిపిస్తుంది....."దశరథ కసురుకున్నాడు బ్రహ్మానందాన్ని.

     బ్రహ్మానందం చిద్విలాసంగా నవ్వాడు.

    "వాళ్ళకు వినిపిస్తుందా? భలే వాళ్ళండి బాబు మీరు,,,టీవీ వాళ్ళకు చెవులు,కళ్ళు అంత బాగా పని చేయవండి. వాళ్ళునోర్లు, చేతులే  బాగా పనిచేస్తాయండి. చెవులే పనిచేస్తుంటే ప్రేక్షకుల గోడు ఎప్పుడో వినిపించి ఉండేది కదా?"

    "ఇంతకీ ఏమంటావురా?"

    "అంటానికేముందండి..... ఎప్పుడో ఇరగ్గొట్టేస్తారండి."

    "ఎవరు..... ఎవర్ని?"

    "ఎవర్నేంటండి.......చెత్త ప్రోగ్రామ్స్ తయారుచేసే వార్ని, వాటిని వదిలే వాళ్ళని ఇంకెవరు ఇరగ్గొడతారండీ? వేలకువేలు పోసి టీ.వీ సెట్లు కొనుక్కున్న వాళ్ళండి....."

    "నిన్నసలు తాగినప్పుడు కదిలించకూడదు" చిరాకుపడ్డాడు దశరథ.

    "మరేనండి.......నిజాలు బయటకొచ్చేస్తాయండి. నన్ను కదిలించకండి. తాగనివ్వండి. మధ్యలో టీ వీ గురించి, ప్రోగ్రామ్స్ గురించి అడిగారంటే కిక్కు దెబ్బకు దిగిపోయి, వాంతులవుతాయండి....." అన్నాడు గ్లాస్ ని తిరిగి నింపుకొనేందుకు తూలుతూ వెళ్తూ.


                        *    *    *

    ప్రభు గోవాలో దిగాడు.

    పోలీస్ మెస్ లో కూర్చుని ఒక్కో హొటల్ కి ఫోన్ చేసి హంపి గురించి వాకబు చేయసాగాడు.

    "మిస్టర్ విల్సన్......ఓ చిన్న విన్నపం" గోవా టూరిజమ్ పి.ఆర్.ఓ ఆమెకు వినిపించకుండా చిన్నగా అన్నాడు.

    "చెప్పండి"

    "విదేశస్థులు గోవా సముద్రపోడ్డున నగ్నంగా తిరుగుతారని, నగ్నంగా ఇసుకపై పడుకుంటారని, వాళ్ళకి  సన్ బాతన్నా, సముద్ర  స్నానమన్నా ఇష్టమని దేశమంతటా తెలుసు. అది నిజం కూడా. ఇంతవరకు మీరు ఆ దృశ్యాల్నే చిత్రీకరించకపోతే ఎలా? అదీ యాత్రికులకు ఆ ఆకర్షణే కదా?" అతని బాధ అతనిది.

    "అది మీరడగటమే బావుంటుంది. ఫర్వాలేదు అడగండి....."

    అన్నాడు విల్సన్ ఇసుకపై ట్రాలీని అరేంజ్ చేయిస్తూ.

    అక్కడికి కొద్దిదూరంలో డైరెక్టర్ ఛెయిర్ లో కూర్చున్న హంపీ షాట్ డివిజన్ పేపర్ ని చూసుకుంటోంది.

    ప్రక్కనే భవాని నించుని ఆమె ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నాడు.

    పి.ఆర్.ఓ,విల్సన్ ఇద్దరూ కలిసి ఆమె దగ్గరకు వచ్చారు.

    "మిస్టర్ విల్సన్.....ఫస్ట్ షాట్...... మనం ట్రాలీమీద ఆబ్ జెక్ట్ కి అభిముఖంగా వెళ్తుంటాం....సెకెండ్ షాట్ లయబద్ధంగా  కదిలే వారి పాదాల్ని మాత్రమే తీసుకోవాలి. థర్డ్ గోవా సముద్రపు ఒడ్డును చూసిన ఆనందం వారి కళ్ళలో కనిపిస్తుంటే నేను క్లోజప్ కి వెళ్తాను. ఫ్రమ్ ది షోల్డర్స్ టు ది టాప్ ఆఫ్ ది హెడ్స్. ఆ తరువాత ఈ సాయంత్రమూ వర్షమొచ్చేలా ఉంది. వర్షపు చినుకులు సముద్రంపై పడుతున్న దృశ్యాన్ని తీసుకొని అటునుండి వర్షంలో తడిసిన కొబ్బరిచెట్లను ఎక్స్ పోజ్ చేయాలి. కొబ్బరాకులు వర్షంలో తడిసినట్టు తెలియాలంటే ఎండన్నా వాటిమీద రిఫ్లెక్ట్ కావాలి లేదా మనమే కొన్ని ఆకుల మీదకు లైట్ ఫోకస్ చేయాలి. ఇవి ఈ రోజుషాట్స్. నైట్ ప్లైట్ కి టిక్కెట్స్  కన్ ఫర్మ్ అయ్యాయా?" కుర్చీలోంచి లేస్తూ అందామె.

    "కన్ ఫమ్డ్ మేడమ్..... చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది పి.ఆర్.ఓ......" నెమ్మదిగా అన్నాడు.

    "చెప్పండి......" అందామె పి.ఆర్. ఓ వేపు చూస్తూ.

    "అన్నిటినీ కవర్చేసారు. మాకు చాలా ఆనందంగా ఉంది. గోవా అందాల్ని సరికొత్త కోణంలో చూపించినందుకు మా డిపార్ట్ మెంట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే....." అతనూ సందేహించాడు.

    "ఏదైనా వదిలేసామా? ఫర్వాలేదు చెప్పండి. ఒక్కసారి మన క్యాసెట్ చూస్తే తప్పక జీవితంలో ఒక్కసారైనా గోవా చూడాలన్న కోర్కె కలగాలి యాత్రికుల్లో, అదే మన మోటివ్..... ఎనీ థింగ్ లెప్ట్?" ఆమె ఇసుకలో పచార్లు చేస్తూ అంది.

    ఆమె ఓ వేపు మాట్లాడుతూనే మరోవేపు ట్రాలీ షాట్ కి జరుగుతున్న అరేంజ్ మెంట్స్ ని పరిశీలిస్తోంది.

    "ఏంలేదు మేడమ్...... గోవా అనగానే న్యూడ్ బీచ్ ఉంటుందట..... విదేశస్థులు దుస్తులు లేకుండా నగ్నంగా తిరుగుతుంటారట అనే భావాలు మనదేశ యాత్రికుల్లో బలంగా నాటుకుపోయాయి. అఫ్ కోర్స్ ఇట్ షూట్ నాట్  బీ  ఎక్స్ పోజ్డ్ , బట్ ఎట్ ది సేమ్ టైమ్ వుయ్ షుడ్ నాట్ లెప్ట్ దట్ ఎట్రాక్షన్...... ఒక్కసారి ఆలోచించండి......" అతను వినయంగానే అన్నాడు.

    ఆమె పచార్లు చేస్తున్నదల్లా ఓచోట ఆగిపోయింది.

    అతనికి భయం పట్టుకుంది.

    "నేనేం చేయను మేడమ్?" నేనూ ఓ ఉద్యోగినే. తరువాత  మా చైర్ మన్ కి బోర్డ్ డైరెక్టర్స్ కి నేను సమాధానం చెప్పుకోవాలి.. నాకు తెలుసు...... మీకు అబ్ సినిటీని ఎక్స్ పోజ్ చేయటం ఇష్టముండదని. కాని...."

     ఆమె మౌనంగా తల పంకించింది.

    "మిస్టర్ విల్సన్! పాసింగ్ షాట్స్ కి కూడా అరేంజ్ మెంట్స్  చూడండి. ఒక బస్ ని తెప్పించండి. హై ఏంగిల్ లో లాంగ్ షాట్స్ కొన్ని తీద్దాం" అంది ట్రాలీ వేపుకు వెళ్తూ.

    పి.ఆర్.ఓ మొఖం మతాబులా వెలిగిపోయింది ఆ మాత్రానికైనా ఆమె ఒప్పుకున్నందుకు.

    "ఆర్యూ హ్యాపీ  మిస్టర్ పి.ఆర్.ఓ? కమాన్! ట్రాలీ షాట్ అరేంజ్ మెంట్స్ చూద్దాం పదండి"అన్నాడు విల్సన్ ఆమె వెనుకే బయలుదేరుతూ.

    అప్పటికే ట్రాలీ మీదకు కెమేరా ప్లాట్ ఫాం  మీదున్న స్టూల్ మీద కూర్చుని కెమేరా  ఎక్కించారు. ఆమె కెమేరా ప్లాట్ ఫాం  మీదున్న స్టూల్ మీద కూర్చుని కెమేరా  హేండిల్ ని  కుడిచేత్తో పట్టుకొని వ్యూ ఫైండర్ లోంచి ఫీల్డ్ చూసుకుందోసారి.

    "ఓకే.....మిస్టర్ విల్సన్......వాళ్ళకోసారి జాగ్రత్తలు చెప్పి లయబద్ధంగా గెంతులేస్తూ రమ్మను. ట్రైల్ చూద్దాం." అంది తిరిగి వ్యూ ఫైండర్ లోంచి చూస్తూ. ఆ వెంటనే చేత్తో ట్రాలీ మేన్ కి సంజ్ఞచేసింది. ఒక క్రమపద్ధతిలో ఫ్లాట్ ఫామ్ ముందుకు నెట్టుకెళ్ళి చివరలో ఆపాడు.

    విల్సన్ ఓ పొదచాటునున్న పాతిక మంది చిన్న పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అందరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు.

    ఆ షాట్ కి అవసరమని హంపి చెప్పగా పి.ఆర్.ఓ. ఓ స్కూల్ కి వెళ్ళి ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకొని  వాళ్ళనక్కడకు తీసుకొచ్చాడు.

    "ఇప్పుడు షాట్ తీయబోతున్నారు. మీరు మీకొచ్చిన పాటను హమ్ చేస్తూ క్రమపద్దతిలో కెమేరాకి ఎదురు రావాలి. కాని పొరపాటున కూడా కెమేరా వేపు చూడకూడదు...... ఏమ్మా.....ఓకేనా?" అన్నాడు విల్సన్ వారి వేపు ప్రేమగా చూస్తూ.

    "ఓకే అంకుల్........." అన్నారందరూ ఒక్కసారి.

    "మా మేడమ్ టేక్ అని పెద్దగా అంటారు. ఆ వెంటనే బయలుదేరాలి "మీరు" అంటూ ఫీల్డ్ లోంచి తప్పుకొని పొదచాటుకువెళ్ళిపోయాడు విల్సన్.

    అంతా నిశ్శబ్దంగా ఉంది.

    ట్రాలీ మేన్ కి తిరిగి సంజ్ఞచేసింది హంపి.

    అతను ప్లాట్ ఫామ్ ను తిరిగి వెనక్కు నెట్టుకొచ్చేసాడు.

    ఆమె మరోసారి ఫీల్డ్ ని చూసుకొని.

    "రడీ.....టేక్" అంది పెద్దగా అరుస్తూ.

    పోదచాటునుంచి ఒక్కొక్కరే బయటకు రాసాగారు. ఫ్లాట్ ఫామ్ నేమండిగా వారికి ఆపోజిట్ డైరెక్షన్ లో కదిలింది. పిల్లలు క్రమంగా స్ట్రెయిట్ గా చూస్తూ ముందుకు దూకుతున్నారు.

    ఆమె సంతృప్తిగా చూస్తూ ముందుకెళ్ళి పోయింది.

    "ట్రైల్ షాట్ ఓ.......కే...." అందామె తిరిగి.

 Previous Page Next Page