Previous Page Next Page 
మోడల్ పేజి 5


    అప్పటికి బీరుసీసా ఖాళీ అయింది.

    "మిమ్మల్ని సీరియస్ గా ఒక విషయం అడగనా?" అంది రోమా.

    "అడగండి......" మనోహర్ అన్నాడు.

    "ఇవాళ షూటింగ్ అయిపోయిన క్లియర్ టోన్ సోప్' తో నేను  చేయాల్సిన బ్యాలన్స్ వర్క్  పూర్తయిపోయింది, అవునా?"

    "అవును."

    "మరి......మీ తర్వాత ప్రాజెక్టులో నేను లేనా? ఐ మీన్.....నాకు ఆఫర్ చేయరా? ఇది ఎందుకడుగుతున్నానంటే__మనిద్దరి మధ్యనున్న స్నేహం ఆధారంగానే."

    "ఎవర్ని తీసుకోవాలో నేనింకా అనుకోలేదు. ఇంకా ఈ ప్రాజెక్టు ఫైనల్  కాలేదుకూడా....." మనోహర్ అన్నాడు.

    "మిస్టర్ మనోహర్! మీరు నిజాల్ని దాచలేరు. నాకు చాలా అడ్వర్టయిజ్ మెంట్ ఏజెన్సీలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. అలా చాలామంది యాడ్ ఫోటోగ్రాఫర్లు రోజూ నన్ను కలుస్తుంటారు......తెల్సా? ఈ పిల్మ్ కి సంబంధించి ఏం జరిగినా నాకు తెలుస్తుంది అవునా?"

    "అవును."

    "అందమైన అమ్మాయి కావాలి" అని మీరు ఏ ఉద్దేశ్యంతో ప్రకటన వేశారో, దాని వెనకవున్న కథేమిటో నాకు తెలియదనుకున్నారా?"

    "నే ఎలా అనుకుంటాను__ తెలుస్తుంది."

    "ఒక యాడ్ ఫిల్మ్ ద్వారా కొన్ని లక్షల్ని సంపాదించడానికి మీ  ప్రాజెక్టు వారంరోజుల క్రితమే ప్రారంభమైంది. అవునా? అందులో భాగంగానే పేపర్ లో ఆ ప్రకటన అవునా?"

    "అవును. కానీ......ఈ విషయాలు నీకెలా తెల్సాయి?"

    "తెలుస్తాయి మనోహర్! కానీ ఇంకో ప్రశ్న- ఈ ప్రశ్న ద్వారా మీ జవాబు  రాబట్టడానికే మిమ్మల్నీవేళ పిలిచాను. ఆ ప్రశ్న ఏమిటంటే- మీ యాడ్ ఫిల్మ్ లో నేను పనికిరానా?" సూటిగా అడిగింది రోమాకౌర్.

    మనోహర్ జవాబు చెప్పలేదు.

    "జవాబు లేదా?" మళ్ళీ అడిగింది.

    "నేను ఇంతవరకూ నీకెందుకా విషయం చెప్పలేదో త్వరలో తెలుస్తుంది."

    "త్వరలో! ......కబుర్లు!!.......నాకఖ్కర్లేదు......"విసుగ్గా, రోషంగా అంది రోమా.

    మనోహర్ కి ఏం చెప్పాలో తోచలేదు.

    ఆ యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫేమ్ వస్తుంది. ఏ మోడల్ కైనా. ఈ విషయం ఎలా తెల్సింది రోమాకు?

    వారం రోజులక్రితం నాలుగు గోడలమధ్య జరిగిన ఒక సమావేశం విషయాలు ఎలా బహిర్గతమయ్యాయి? అదీ తన వర్గానికి చెందిన రోమాతోతని శత్రువర్గంలోవారు కూడా స్నేహితులన్నమాట.......మనోహర్ కి కోపం ముంచుకు వస్తోంది. రోమాపై అనుమానం వచ్చింది.

    "నేనొస్తాను...."గబుక్కున  లేచాడు మనోహర్.

    "కూర్చోండి" రోమా అభ్యర్ధించింది.

    "నాకు పనుంది. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ తీరుబడిగా జవాబులు చెప్తాను మరేప్పుడన్నా......" లేచి రాబోతూ గబుక్కున ఆగిపోయాడు మనోహర్ రోమా అంటున్న మాటలు విని తలతిప్పి చూశాడు.

    "అవును......నేనన్నది నిజం.....మనోహర్......ప్రదీప్ సక్సేనా.....అతను తీసే యాడ్ ఫిల్మ్ లో నన్ను నటించమని అడిగాడు. లక్ష ఇస్తానన్నాడు."

    "అతను.....నా శత్రువు-మనకి శత్రువు......"మనోహర్ అన్నాడు రోషంగా.

    "సక్సేనా....ఇవాల్టి ఉదయం వరకూ మనిద్దరికీ శత్రువు. అందుకే అతను అడగ్గానే ఒప్పుకోలేదు. కానీ ఈ రోజుతో మీకు నాకు మధ్య మరే వ్యాపారాత్మకమైన సంబంధాలు వుండబోవు. అవునా....అందుకే అతనికి నా అంగీకారం తెలియజేయబోతున్నాను."

    "నా గ్రూప్ లో ఉన్న వ్యక్తిని నువ్వు. నిన్ను ఎందుకడిగాడో ఆలోచించావా?" మనోహర్ శాంతంగానే ప్రశ్నించాడు.

    "లేదు-కాని, నాకు మంచి అవకాశాలు కావాలి. మీరు కాదన్నారు."

    "ఇవ్వాళ నీతో చెపుతున్నాను. మిస్ రోమా, సక్సేనాతో నేను చేసిన ఛాలెంజ్ లో అంతిమ విజయం నాదే...! ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పోటీ కాదు. ఇద్దరు వ్యక్తుల ప్రతిభ, తెలివితేటల మధ్య పోటీ....."

    "ఆ పోటీలో మీలాంటివాళ్ళు నలిగిపోతారు. సక్సేనావేపు నువ్వు వెళ్ళడం నాకు సమ్మతం కాదు. నీకతను ఆ ఛాన్సివ్వడు."

    "జోస్యం చెపుతున్నారా?" రోమా వెటకారంగా అడిగింది.

    "ఇవాళ నీ ఇంటికి మొదటిసారి రావడం మంచిదైంది.....ఎందుకంటే ఇదే ఆఖరుసారి రావడం కదా....! గుడ్ నైట్....." మనోహర్ లేచాడు.

    రోమా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది.

    మనోహర్ గబగబా వరండాలోకి అడుగులేసుకుంటూ వెళ్ళాడు. ఉయ్యాల దగ్గర్నుంచి గది ద్వారబంధం వరకూ వచ్చి డోర్ కర్టెన్ ని పట్టుకొని నిలబడ్డ రోమాకు కారు స్టార్ట్ చేసిన శబ్దం వినబడింది, కారులో కూర్చున్న మనోహర్ కుతకుతలాడిపోతున్నాడు.

    ఈ సంభాషణ అంతా మరో మనిషి వింటున్నాడని రోమాకి తెలుసు.

    అతని ఆలోచనల్లో ప్రదీప్ సక్సేనా మెదుల్తున్నాడు.......ప్రదీప్  సక్సేనా___తనతో అతను చేసిన "ఛాలెంజ్" గుర్తుకొచ్చింది.

    అప్పుడే అతను "గేమ్" మొదలుపెట్టాడన్న మాట.తన వర్గానికి చెందిన రోమాని తనవేపు తిప్పేసుకున్నాడు.

    పూర్ రోమా! రోమా మీద జాలివేలింది మనోహర్ కి.

    అయినా ఆమెమీద జాలి చూపించడం అనవసరమన్పించింది అతనికి. ఆ సమయం  దాటిపోయింది. బర్త్ డే  పేరుతో తనను పిలిచింది ఇందుకే అయుంటుంది. అతని ట్రాప్ లో పడిపోయింది రోమా మూడు సంవత్సరాలుగా తన దగ్గర మాత్రమే మోడల్ గా చేస్తున్న రోమాని ఎంత తెలివిగా తనవైపుకి త్రిప్పుకున్నాడు.

    ఇంతవరకు రోమాకు తనపైనున్న అభిమానాన్ని కృతజ్ఞతని శతృత్వంగా గొప్పగా మార్చగాలిగాడతడు!

    ఒకప్పుడు దారి తెన్నూ లేక___తినేందుకు ఓ పూటకి తిండిలేక అల్లాడిపోతూ తనకు దారి చూపించమన్న రోమాయేనా ఈమె?

    అవకాశం.....అదృష్టం.....అందలం ఎక్కిస్తే.......

    ఆ అవకాశాన్ని, ఆ దృష్టాన్ని కలిగించిన మనిషిని గుర్తుపెట్టుకోవటం మానవ స్వభావానికి విరుద్దమేమో.....

    అందం.....అవకాశం.....అదృష్టం.....డబ్బు....పేరు....గ్లామర్......

    ఈ ఆరే మోడల్స్ కి ప్రాణం.

    అందం ఆమెకుంది. అవకాశం తనిచ్చాడు. అదృష్టం ఆమె తెచ్చుకుంది. డబ్బు, పేరు, గ్లామర్ వాటంతటవే వచ్చిపడ్డాయి. ఇవన్నీ మర్చి పోయిన రోమా.....తన శత్రువుకు మిత్రురాలైంది.

    రోమా స్వార్ధం క్షమించతగ్గది. కానీ......ప్రదీప్ పగ భరించరానిది.

    అంత కోపంలోనూ మరుసటిరోజు పూర్తి చేయాల్సిన డబ్బింగ్ వర్క్ గుర్తుకొచ్చింది మనోహర్ కు.


                                                                      *    *    *

    గతంలో తీసిన యాడ్ ఫిల్మ్ లో కొన్ని షాట్స్ మార్చవలసి రావటంతో జూబ్లీహిల్స్ లోని ప్రతాప్ డబ్బింగ్ ధియేటర్ కి ఉదయమే వెళ్ళాడు మనోహర్. ఆ పని పూర్తిచేసుకొని బయటపడేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.

    మనోహర్ కి బాగా ఆకలనిపించింది. కారులో కూర్చొని బంజారా హొటల్ కి పోనిచ్చాడు.

    సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లో కూర్చొని లంచ్ కి ఆర్డరిచ్చి ఆలోచనల్లో పడిపోయాడు. ప్రొద్దుటినుంచి తానేదో మార్చిపోయినట్లుగా  తోస్తోంది. మర్చిపోయినట్లుగా తెలుస్తుంటుందిగానీ ఏంమర్చిపోయిందీ గుర్తుండదు!

    భోజనం వచ్చింది. భోజనం చేస్తుండగా వెయిటర్ వచ్చి_" సర్ ఆర్ యు మిస్టర్ మనోహర్?" అడిగాడు వినయంగా.

    మనోహర్ తలెత్తి, యస్......!" అనగానే. మీకు ఫోన్ ____" అంటూ రెస్టారెంట్ లో ఓ మూలగావున్న ఫోన్ చూపించాడు. 

    తను ఈ టైమ్ లో ఇక్కడున్నట్లు ఎవరికి తెలుసు....?ఎలా తెలుసు? అంటే ప్రదీప్ సక్సేనా తనమీద పూర్తి నిఘా పెట్టాడన్నమాట. పళ్ళు పటపట కొరుక్కుంటూ కోపంగా భోజనం ముందునుంచి లేచి ఫోన్ దగ్గరకు నడిచాడు. ఫోన్ ఎత్తి "యస్?" అన్నాడు చికాగ్గా.

    "నేను....అనూని అన్నయ్యా!"

    చెల్లెలి గొంతు ఫోన్ లో  వినపడగానే అంతకుముందు అతనిలో వున్న చికాకు చటుక్కున మాయమయ్యింది. చేల్లిల్ని చూడక నెలరోజులు అయింది.

    మనోహర్ కి వున్న ఒకే ఒక రక్తసంబంధం అనుపమ. తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్ లో పోతే ఉన్న పొలం అమ్మి తను చదువుకుంటూ చెల్లెల్ని అపురూపంగా పెంచుకుంటూ వచ్చాడు.

    డిగ్రీ పూర్తయ్యేసరికి తన దృష్టంతా ఫోటోగ్రఫీ మీదకు మళ్ళింది. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే మనోహర్ కి తగని పిచ్చి. చెల్లెల్ని విడిచిపోవటం ఇష్టంలేక పోయినా ఫోటోగ్రఫీ మీద తనకున్న మక్కువని చంపుకోలేక చెల్లెల్ని విశాఖపట్నం కాలేజీలో చేర్పించి, హాస్టల్ లో వుండే ఏర్పాట్లు చేసి తను బొంబాయి వెళ్ళిపోయాడు.

    ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ ఫోటోగ్రాఫర్ సింఘానియా వద్ద అసిస్టెంట్ గా చేరాడు. నాలుగేండ్లకి బొంబాయినుంచి తిరిగొచ్చి హైద్రాబాద్ లో యాడ్ ఫోటోగ్రాఫర్ గా వృత్తి ప్రారంభించాడు. అప్పటికి చెల్లెలి డిగ్రీ పూర్తయింది. తను ఆంధ్రా యూనివర్శిటీలో ఎం.ఏ చదువుతాననటంతో అనుపమని అక్కడే వుంచేశాడు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాడు. చెల్లెలంటే మనోహర్ కి ప్రాణం. అనుపమ చాలా అల్లరిచేస్తుంది. అయినా  ఆనందంగా భరిస్తాడు మనోహర్.

    "అనూ......ఎలా వున్నావురా?" ప్రేమగా పలకరించాడు చెల్లెల్ని.

    "నీ మతిమరుపుతో ఛస్తున్నాను బాబూ.....!"

    "ఏం.....?"

    "నీకు రాత్రి ఫోక్ చేశాను.....మరలా ఉదయం చేశాను. అదయినా గుర్తుందా?"

    "ఆ.....ఆ"

    "మంగళ ఆ రోజు ఉదయం గోదావరిలో హైదరాబాద్ వస్తుందని చెప్పానా?" కోపంగా అంది ఫోన్ లో అనుపమ.

    చప్పునస్ఫురణకొచ్చింది ఆ విషయం మనోహర్ కి.

    తను ఉదయం నుంచి ఏమిటో మర్చిపోయాననుకొని ఆలోచిస్తున్నది అదేననికూడా తెలుసుకోగలిగాడు.

    "సారీ.....అనూ......మంగళ వచ్చేసిందా?" బాధపడుతూ అడిగాడు.

    "వచ్చుంటుంది.....నాకు నీమీద  గొప్ప నమ్మకం......స్టేషన్ కెళ్ళటం మర్చిపోతావని."

    "ఇప్పుడెలా.......? ఎక్కడ దిగుంటుంది.......?"

    "ఎక్కడా దిగదు. నీకోసం ఎదురుచూస్తూ స్టేషన్ లోనే వుంటుంది వెళ్ళు అర్జంటుగా, ఆ........బైదిబై......ఇది నాలుగోకాల్........నీ మతిమరుపు కోసం వందరూపాయలు ఖర్చు పెట్టాను నా పాకెట్ మనీలోంచి....వెంటనే పంపు.......ఉంటాను......"కోపంగా లైన్ కట్ చేసినట్లనిపించింది మనోహర్ కి. చెల్లెలి కోపానికి నవ్వుకొని టైమ్ చూసుకున్నాడు. మూడు కావస్తోంది.  కంగారుగా బయలుదేరాడు. దారిలో యెదురొచ్చిన బేరర్ కి వంద నోటోకటిచ్చి అతనలా ఆశ్చర్యంగా చూస్తూండగానే  బయటకు పరుగెత్తి కారులో కూర్చున్నాడు. కారు ఆఘమేఘాలమీద నాంపల్లి స్టేషన్ కి బయలుదేరింది.

    మనోహర్ డ్రయివింగ్ అంటే ప్రతి ఒక్కరికి క్రేజ్. ప్రమాదాలు లేకుండా పుల్ ట్రాఫిక్ కూడా అరవైకి తగ్గకుండా పోగలడు. కారుని పార్కింగ్ లో పెట్టి దాదాపు పరిగెడుతున్నట్టుగా స్టేషన్ లోకి నడిచాడు ప్లాట్ రం టికెట్ తీసుకోకుండానే.

    ప్లాట్ ఫారం రెండువైపులా దృష్టి సారించాడు. మనోహర్ కళ్ళు ఆనందంగా  మెరిశాయి. దూరంగా ఓ బెంచీమీద కూర్చుని ఏదో పత్రిక తిరిగేస్తున్నా మంగళను చూసి___

    ఓ ప్రక్క మంగళను చూడబోతున్నందుకు ఆనందం.....మరో ప్రక్క రిసీవ్ చేసుకోటానికి రానందుకు కోప్పడుతుందేమోనన్న జంకు......మంగళకు దగ్గరగా వచ్చాడు.

 Previous Page Next Page