"నీ క్రాపు సరిచేస్తాను."
"చేయండి!"
"ఇంకో రూపాయి యిస్తాను."
"దాంతో ఇంకో కోటి సంపాయిస్తాను!"
సరిగ్గా యిక్కడ కథ ఆపెసేడు పరమానందం. మైకంలోంచి బయటపడ్డాడు పానకాలు. పరమానందం చాలా విరక్తిగా అన్నాడు.
"దేనికైనా ప్రాప్తముండాలయ్యా పానకాలు! అదృష్టం కలసిరావాలి! అవునూ - కూరలకెంత ఇవ్వాలి?"
"వద్దండి! నాకేమీ ఇవ్వద్దు! ఒక్క రూపాయి ఓకే ఒక్క రూపాయి ఇదిగో ఈ చేతిలో పెట్టండి!" ప్రాధేయపడ్డాడు పానకాలు.
"వద్దయ్యా! నువ్వు కోటీశ్వరుడివైపోతే మేము కూరలకి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కూరలకెంతివ్వాలో చెప్పు."
"సార్! మీరు గనక నాకు రూపాయి యిచ్చి ఆశేర్వదించి పంపకపోతే నేనిక్కడే - మీ కళ్లముందే - గొంతు పిసుక్కుని చస్తాను."
"వద్దయ్యా! అంతపని చెయ్యకు. ఆత్మహత్య మహాపాపం!"
"రూపాయి ఇస్తారా! ఇవ్వరా?"
పరమానందం ఒక్కక్షణం ఆలోచించి అన్నాడు.
"ఊ! సరే! అంత ముచ్చట పడుతున్నావు గనక ఒక పని చేద్దాం!"
"చెప్పండి చేద్దాం!"
"ఇదుగో ఈ రూపాయితో బొమ్మా బొరుసు వేద్దాం! బొమ్మ పడితే రూపాయి నీది! బోరుసైతే రూపాయి నాది! సరేనా?
"పందెమా?" అన్నాడు నీరసంగా పానకాలు.
"ఇష్టం లేకపోతే చెప్పు! మానేద్దాం!"
"సరే కాన్వివండి! నాది బొమ్మ! వేయండి!"
పరమానందం రూపాయి బిళ్లని గాల్లోకి ఎగరేసేడు. అది నేలమీదికి పడుతుండగా చేత్తో పట్టుకున్నాడు. ఏం పడిందో చూసి ఆనందంగా అన్నాడు-
"బొమ్మపడిందోయ్ పానకాలు! అంటే నువ్వే గెలిచేవన్నమాట. దశప్రారంభమైంది. రూపాయికి ఒక కోటి. చాలా?"
పానకాలు నీరసంగా సమాధానమిచ్చేడు.
"చాలా అంటే ఏం చెప్తాం? ఈ రోజుల్లో కోటి రూపాయిలు ఏ మూలకి సార్? ఇంకో పందెం వేసుకుందాం!"
ఆ మాట వినగానే పరమానందం కూచుంటూ పానకాలును కూడా కూచోబెట్టేడు!
5
ఆనందం ఇంటో -
ఇప్పుడు పర్వతాలు కేవలం డ్రాయరు, బనీను మీద వున్నాడు. మనిషి బాగా డీలాపడిపోయి వున్నాడు. కన్నీళ్లతో వున్నాడు. అంచేత కళ్లుతుడుచుకుంటో వున్నాడు. ఆ స్థితిలో వున్న పర్వతాలను ఆనందం పలకరించేడు-
"ఇంకో ముక్క తియ్యి ఏడు కొండలూ!"
ఆ మాటకి పర్వతాలు దాదాపు ఏడుస్తూ ఆన్నాడు -
"నా పేరు ఏడు కొండలు కాదు! అసలు పేరేంటో మరిచిపోయెను అయ్యా - ధనయోగాముందని రెచ్చగొడితే కాబోలనుకున్నాను వెర్రి నా కొడుకుని! ఇపుడు తెలిసిందండి ధన యోగం మీకు మాత్రమే వుంది. నా వంటి మీద డ్రాయరు బనీను మాత్రమే వున్నాయి. మొత్తం దులిపేసేరు నేను వెళ్లిపోతా!"
"అదే తప్పు!దైర్యంగా పోరాడిగెల్చుకోవాలి. ధర్మరాజు ఏం చేసేడు?"
"నాకు తెలీదు. తెలిసినా మరిచి పోయేను."
"నేను గుర్తు చేస్తాను, ఆ యొక్క ధర్మరాజు జూదంలో సొంత పెళ్లాన్ని తాకట్టు పెట్టేడు. గుర్తు తెచ్చుకో!"
"వద్దులేండి! నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లయ్యేక ఆ పనిమీద వస్తా! ఇప్పుడు మాత్రం నన్ను విడచిపెట్టండి డ్రాయరు బనీన్లె వున్నాయి."
"ఫర్లేదు. డ్రాయరు వుంచుకో! మర్యాదగా వుంటుంది. బనీను పందెం కాసి ముక్కలాగు!"
ఇక తప్పేది లేదని పర్వతాలు అర్ధం చేసుకున్నాడు. అంచేత ఆనందం కన్ను కప్పి పారిపోవటం ఒక్కటే మార్గమని-
"తమరు కళ్లు మూసుకోండి! విప్పేస్తా!" అన్నాడు పర్వతాలు.
"బనీను విప్పడానికి కళ్లు మూసుకోవాలా - కోండయ్యా?"
"నా పేరు కొండయ్య కాదు. అయినా సరే! నా అసలు పేరేంటో గుర్తు కొచ్చినా చెప్పను. మీ ఇష్టం కళ్లు తెరుచుకునే వుండండి. డ్రాయరు విప్పుతా! డ్రాయర్తో పందెం కాస్తా!" అన్నాడు పర్వతాలు.
ఆనందం భయపడుతూ అన్నాడు.
"ఛ.....ఛ.... అదేం పద్దతీ?"
"అదంతే! నేనంతే! ఎవరైనా కళ్లుమూసుకుంటే బనీను విప్పుతా! కళ్లు తెరుస్తానని పంతం పడితే డ్రాయరు విప్పుతా!"
"ఆల్ రైట్! అలాగే కానివ్వు! కళ్లు మూసుకుంటా! బనీను విప్పు ఎవరు చెప్పగలరు? బనీను పెట్టి ఈ బిల్డింగునే గెల్చుకోగలవేమో? త్వరగా కానివ్వు?" అని ఆనందం కళ్లు మూసుకున్నాడు. పర్వతాలు కాలెత్తి ఆనందాన్ని కసి కొట్టాలని ప్రయత్నం చేసి - మనసు మార్చుకుని - అటూ ఇటూ చూసి అక్కడ్నించి పరుగెత్తేడు.
6
నందివాడ వారి వీథి -
పానకాలు అనబడే కూరలబ్బాయి మొలకు పేపరు మాత్రమే చుట్టుకుని పరమానందం ఇంటినుంచి బయటపడ్డాడు. రోడ్డుమీదికి వచ్చి - రెండు చేతులూ ఎత్తి ఆ ఇంటికి నమస్కరించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో పేపరు జారిపోతుంటే - దాన్ని పైకి లాక్కుని కోపంగా నడుస్తూ గొణుక్కున్నాడు-
"కూరలమ్ముకునే వాడి మీద ఇంత కుట్రా? రూపాయి తీసుకుని ఎవడో వెధవ నా కొడుకు కోటీశ్వరుడయ్యేట్ట! ఆశపడి కూచుంటే.... అసలు నాకు బుద్దిలేదు..... నేను పెద్ద చవట నా కొడుకుని! నన్ను చెప్పుతో కొట్టాలి!"
అంతలో-
ఆనందం ఇంటోంచి పర్వతాలు నిక్కరు బనీనుతో పరుగెత్తుకుంటోవచ్చేడు. ఆ స్పీడుతో పానకాలుని ఢీకొన్నాడు. ఇద్దరూ కింద పడ్డారు. పానకాలు స్టడీగా నిలబడి అన్నాడు-
"కళ్లు కనిపించడం లేదా? మీద పడితే పేపరు చిరిగిపోద్ది! పట్టపగలు ఇంటిదాకా పోవాలి!"
"హుఁ! నాబతుకే చిరిగి పోయింది. నీ బోడి పేపరు ఒక లెక్కా? గాసు ఆఫీసుకి వెడితే డబ్బులడుగుతారు. ఇంటికి పోతే - వంటి మీద బట్టల గురించి అడుగుతారు. అందరూ అడిగేవారే? హే భగవాన్! - ఎందుకుస్వామీ గాసు వాడితో ఇలా ఆడుకుంటున్నావ్?" చేతులెత్తి అన్నాడు పర్వతాలు.
"నీలాగా నేను చేతులెత్తి అరవలేను. నా తరపున నువ్వే ఆ దేవుడ్ని కొప్పడు. బాగా తిట్టు నా పేరు పానకాలు కూరల వ్యాపారం" అన్నాడు పానకాలు.
"హే భగవాన్! ఎందుకయ్యా కూరల వాడితో ఆడుకుంటున్నావ్!" చేతులెత్తి అన్నాడు పర్వతాలు.
ఈ ప్రార్థనలు జరుగుతుండగా - అక్కడికి ఆ వీథి మనిషాకాయన వచ్చేడు. వాళ్ల పరిస్థితి అర్థం చేసుకుని అన్నాడు.
"ఆడుకున్నది భగవంతుడు కాదు. ఆనందం, పరమానందం. అవునా?"
"అవును" అన్నాడు పర్వతాలు.
"ఎట్లా కనుక్కున్నారు?" అడిగేడు పానకాలు.
"ఈ నందివాడ వారి వీథికి మీరిద్దరూ కొత్త! అవునా?"
"అవును!" అన్నరిద్దరు.
"అందుకే మీ ఇద్దర్నీ ఆ ఇద్దరూ నంజుకు తిన్నారు!"
"అవునవును!" అన్నరిద్దరూ.
"అంచేత ఈ వీథికి రావద్దు. బతికుంటే బంతిపూలు అమ్ముకు బతకొచ్చు! పరుగెత్తండి. పారిపోండి." అని సలహా ఇచ్చేడు ఆ వీథి మనిషి.
పర్వతాలు, పానకాలు పరుగెత్తుతున్నారు.
7
శ్రీవేణుగోపాలస్వామి ఆలయం!
గర్భగుడి ముందు కుడి పక్క సింహాచలం, ఎడం పక్క భద్రాచలం నిలబడి వున్నారు. వాళ్ల చేతుల్లో నోటు పుస్తకాలున్నాయి. పెన్నులున్నాయి.
కొబ్బరికాయలు పగుల్తుంటే లెక్కలు రాసుకుంటున్నారు. పూజారి వీళ్ల తంతుని గమనించకుండా మంత్రాలు చదువుతున్నాడు.
దేవాలయంలో వున్న గోడ గడియారం పదిగంటలు కొట్టింది!
అంతే -
సింహాచలం భద్రాచలం లిద్దరూ గర్భ గుడి ముందు నిలబడ్డారు. ఇంక ఎవరూ కొబ్బరి కాయలు కొట్టడానికి వీల్లేదని దబాయింపు ధోరణితో ఆర్డరు వేసేరు. ఆ ఆర్డరు విని భక్తుల్లో ఒకరు కళ్ళెర్ర చేసి చూసే సరికి ఆర్దర్ని సవరించేరు. పది నిమిషాల్లో తమ పని పూర్తవుతుంది గనక ఆ తర్వాత తమ ఇష్టమని ప్రార్థించేరు!
భక్తులు ఏ కళ నున్నారోగాని అందుకు అంగీకరించేరు!వాళ్లు నోటు పుస్తకాల్లో రాసుకున్న సంఖ్యకీ - పగిలిన కొబ్బరికాయల లేక్కకీ సరిపోయింది.