"అక్కా నేనూ రానా నీతో?"
"అమ్మనడుగుదాం. ఎవరో ఒకరే రావడానికి వీలవుతుంది మరి."
"పోనీ మరో టిక్కెట్టుకి మనమే డబ్బు పెట్టుకుంటే సరి"
శిల్పకోసం పాలు పట్టుకొచ్చిన సరోజిని వీళ్ళ మాటలు విని "ఎందుకు అందరం వేస్టు! నువ్వూ వస్తే నాన్నగారూ, శిల్పా కూడా రావల్సొస్తుంది"
"పోనీ తీసికెళదాం. శిల్పకి అరటిక్కెట్టేగా. నేనూ నాన్నగారూ మావి రెండు టిక్కెట్లు."
"ఆఁ చాల్లే! ఉత్తి టిక్కెట్టుంటే సరిపోతుందేమిటి? అక్కడికెళ్ళాక ఖర్చులు? పైగా ఇల్లు తాళం పెట్టి వెళ్ళడం సేఫ్టీ కాదు కూడా" జడ్జిమెంటులా నాలుగు మాటలు చెప్పి కూర్చుందావిడ.
"ఎక్కడికేంటి ప్రయాణం?" రామానుజం గారు అడిగారు.
"కల్చరల్ సెంటర్ వాళ్ళు ఢిల్లీలో రాగిణి ప్రోగ్రాం పెట్టారు మళ్ళీ ఆదివారం - యూత్ ఫెస్టివల్ సందర్భంగా" అంది సరోజిని.
"వెళుతున్నారా?"
"వెళ్ళకపోవడమేంటి? ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా?" అంది భరణి.
"అసలు గీతారాణి ఎంత ట్రై చేసిందో ఈ ప్రోగ్రాంకోసం అయినా గురునాథం గారు పట్టించుకోలేదు. నా పేరే రికమెండ్ చేశారు" కనుగుడ్లు గుండ్రంగా తిప్పుతూ అంది ఏదో సాధించానన్న తృప్తి మొహంలో తొణికిసలాడుతుంటే రాగిణి. రామానుజంగారు ఏదో పుస్తకాన్ని చేతిలో పుచ్చుకుని వాకిట్లో వున్న మల్లెచెట్టుకింద కుర్చీ వేసుక్కూర్చున్నారు.
".....శిల్పా......శిల్పా"...... అన్న రామానుజంగారి పిలుపుకి శిల్ప వచ్చి దగ్గరనుంచుంది.
"ఏమ్మా..... ఊటీ అక్కడి స్కూలూ బాగున్నాయా?" అడిగారు.
బాగున్నాయన్నట్టు తలూపింది.
"ఇంకా..... మీ టీచర్లు బావున్నారా? మంచివాళ్ళేనా?"
మంచివాళ్ళేనన్నట్టు మళ్ళీ తలూపింది శిల్ప.
పిచ్చిపిల్ల అంటూ బుగ్గలు ముద్దెట్టుకున్నారు. రామానుజంగారలా బుగ్గలు ముద్దెట్టుకుంటే శిల్పకి సిస్టర్ ఫెర్నాండిస్ గుర్తుకొచ్చింది.
"వెళ్ళు! ఆడుకో!" అన్నాడు ఆప్యాయంగా చూస్తూ.
శిల్ప అక్కడినుంచి వెళ్ళిపోయింది లోపలికి తనకోసం కొన్న కొత్త బొమ్మల దగ్గరకి.
ఆరోజూ రాత్రి భోజనాలవగానే వెళ్ళి రాగిణి మంచంమీద పడుకుంది. ఊటీకి వెళ్ళకముందు ఎప్పుడూ శిల్ప సరోజిని దగ్గరే పడుకునేది. అటువంటిది ఇప్పుడు వచ్చినప్పటినుంచీ రాగిణి దగ్గరే పడుకుంటోంది.
అందరూ ఆశ్చర్యపోయారు.
మర్నాడు ఉదయం లేచింది మొదలు రాగిణి రిహార్సల్స్ తోటీ, రిజర్వేషన్లూ బట్టలు ప్యాక్ చేసుకోవడం మొదలైన విషయాలతోటీ ఊపిరి ఆడనంత బిజిగా ఉంది. సరోజిని కూడా రాగిణి పన్లతోటే మునిగి ఉంది. ఇంటిపనీ వంటపనీ అంతా భరణి చూసుకుంటోంది. దాంతో శిల్ప మరీ ఒంటరిదైపోయింది. ఇంటి నాలుగు గోడల మధ్యా ఒక్కర్తీ పిచ్చిదానిలా తిరిగేది. భరణి కూడా ఇంటి పనుల్లో మునిగిపోవడం వల్ల శిల్పని పలకరించేవాళ్ళు కూడా కరువైపోయారు. ఒక్కర్తే బొమ్మలతో మూగిగా ఆడుకోవడం...... అలా నిద్రపోవడం ఇలా మరో నాలుగురోజులు గడిచిపోయాయి. సరోజినీ, రాగిణీలకి ఢిల్లీ ప్రయాణం, ప్రోగ్రాం ఈ రెండూ తప్ప వేరే ప్రపంచం లేనట్టు వాటిలో లీనమైపోయారు. ఎప్పుడో రోజులో ఒకసారి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చినట్లుగా శిల్పని పలకరించడం లేకపోతే లేదు పనులన్నీ అయ్యాక భరణి శిల్ప దగ్గరకొచ్చి పడుకునేది.
రాగిణీ వాళ్ళూ వెళ్ళిపోయాక ఇంట్లో హడావుడీ, గోలా తగ్గింది కానీ మరీ బోరుకొట్టడం ఎక్కువైపోయింది. శిల్పకి ఏమీ తోచేదికాదు. భరణికోసం స్నేహితులెవరయినా వస్తే గంటలు గంటలు మాట్లాడుతూ ఉండిపోయేది. శిల్పకి పిచ్చెత్తినట్టుండేది.
రాగిణికీ, సరోజినికీ ఇరవైనాలుగు గంటలూ డాన్సు గురించీ, డబ్బుగురించీ ఆలోచించడానికే సరిపోవడంలేదు. ఢిల్లీ ప్రోగ్రాములో సంపాదించిన డబ్బుతో అక్కడే ఒక జత గాజులు కొనుక్కొచ్చారు. తన చేతికున్న మట్టిగాజుల్ని తీసేసి బంగారపు గాజులు తొడుక్కుని మురిసిపోయింది సరోజిని.
"ఏమండీ! ఎన్నాళ్ళ తరువాత మళ్ళీ నా చేతులకి బంగారుగాజులు వేసుకున్నాను!" అంటూ చేతులు చూపించింది సరోజిని.
రామానుజం గారు 'బాగున్నాయి' అని ముక్తసరిగా అని ఊరుకున్నారు.
* *
రామానుజంగారు సిటీలో ఒక హైస్కూల్లో ఏడో తరగతి తెలుగు టీచరుగా పనిచేశారు. పూర్తి రిటైరయ్యేదాకా ఉద్యోగం చెయ్యడానికి ఆరోగ్యం ఒప్పుకోలేదు. తల్లిదండ్రులనుంచి వారసత్వంగా పుచ్చుకున్న బ్లెడ్ ప్రెషర్ ఆయన్ని ఉద్యోగం చెయ్యనివ్వలేదు. వాలంటరీ రిటైర్ మెంటు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరాడపిల్లలకీ పెళ్ళి చేసేసి తమ తాహతుకి తగ్గట్టుగా ఉండాలంటే సరోజిని ఆలోచనలు అందుకు భిన్నంగా ఉండి అలా జరగలేదు.
మేనత్తల అందాన్ని పుణికిపుచ్చుకుని పుట్టిన రాగిణి అందానికి మురిసిపోయి సరదాగా డాన్సు నేర్పించిన సరోజిని ఈ రోజు ఆ అవకాశాన్ని డబ్బుగా మార్చుకుని ఆడబ్బుతో సుఖాలని కొనుక్కుని ఆనందిస్తోంది. రాగిణీ పూర్తిగా తల్లిచేతిలో కీలుబొమ్మగా తయారయింది. రామానుజంగారు ఇందుకు ఒప్పుకోకపోయినా వేరే గత్యంతరంలేక మాట్లాడక ఊరుకున్నారు. నిజానికి తన వ్యక్తిత్వాన్ని చంపుకుని మౌనిలాగా భార్యాబిడ్డల ఆజ్ఞలను పాటిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ రోజున అతని స్థితి ఆ ఇంట్లో భార్యా బిడ్డలకు కావలసిన వేమయినా ఉంటే అమర్చిపెట్టే గుమాస్తా పని. స్టేషన్ కి వెళ్ళి టిక్కెట్లు రిజర్వు చేయించడం. ప్రోగ్రాముల గురించి వాళ్ళతోటీ వీళ్ళతోటీ మాట్లాడడం, అవసరమయితే ప్రోగ్రాములప్పుడు కూడా వెంటవెళ్ళడం ఇవీ అతని డ్యూటీలు. శిల్పను చూస్తే అతనికి అపరిమితమైన జాలి.
అందుకే అయిదు నిమిషాలకన్నా ఎక్కువ ఆ పిల్లతో మాట్లాడలేదు. అదో విచిత్ర స్థితి.
ఢిల్లీ కార్యక్రమంలో రాగిణికి చాలా పబ్లిసిటీ వొచ్చింది. పేపర్లలో ఫోటోలూ బాగానే వచ్చాయి. దాంతో రాగిణికి అభిమానుల సంఖ్య పెరిగింది. కొందరు ఇంటికొచ్చి "మీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం" అంటూ గంటలు గంటలు కూర్చుని వెళ్ళేవారు. కొందరి కోసం రాగిణీ, సరోజినీ పనిగట్టుకు వెళ్ళేవారు. ఏది ఏమైనా, రాగిణి మహా బిజీగా వుంటోంది. ఏ అర్థరాత్రో అపరాత్రో వచ్చి "రామానుజంగారు భోం చేశారా, శిల్ప భోంచేసిందా" అని అడగడం తప్ప, వేరే ఖాళీ వుండడంలేదు.
మొదటి రెండు రోజులూ తప్ప, శిల్పకి ఆ తరువాత నుంచీ ఏం కావాలన్నా భరణే చూసుకునేది. రాత్రుళ్ళు భరణి పక్కనే పడుకునేది.
మధ్యలో రెండ్రోజులు జ్వరం వొచ్చి తగ్గిన సంగతి రాగిణికి, సరోజినికి దాదాపు ఒకవారం గడిస్తేగానీ తెలీలేదు. రామానుజంగారూ, భరణీయే డాక్టరు దగ్గరికి తీసుకెళ్లడం, మందులివ్వడం జరిగింది.
భరణికూడా అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ ని కలుసుకోవడానికి బయటికి వెళ్లిపోతూ వుంటుంది లేదా స్నేహితులే ఇంటికొచ్చి గంటల తరబడి బాతాఖానీ వేసుక్కూర్చుంటారు. శిల్ప బాగా చిక్కిపోయింది. మాట్లాడడం పూర్తిగా మర్చిపోయిందేమో అన్నట్టు మూగిలా ఇరవైనాలుగ్గంటలూ. ఆ బొమ్మల్ని పెట్టుకుని ఒంటరిగా ఆడుకోవడం ఆ అమ్మాయిని పిచ్చిదానిలా చేస్తోంది.
వరసగా రాగిణికి ఆ వారంలో రెండు మూడు ప్రోగ్రాములు వచ్చాయి. రోజూ రిహార్సిల్స్, అక్కడికి వెళ్లిరావడం, ఎవళ్ళో ఒకళ్ళు రావడం. దీంతోనే సరిపోతోంది. కాస్త సమయం దొరికితే, బట్టల దుకాణానికో, బంగారు దుకాణానికో వెళ్లడంతో కాలం గడిచిపోతోంది. ఇలా రెండు మాసాలు ఇట్టే గడిచిపోయాయి. సిస్టర్ ఫెర్నాండిస్ దగ్గర నుంచి ఆరోజు వచ్చిన ఉత్తరం చదివితే తప్ప, శిల్ప స్కూల్ తెరుస్తున్నారనీ, శిల్పని పంపించాలనీ గుర్తు రాలేదు రాగిణికీ, సరోజినికీ కూడా.