Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 4

 

   శిల్పకి పళ్ళు తోమడానికి భరణి బాత్రూంలోకి తీసుకెళుతూ వుంటే, తనే వెళతానని చేత్తోనే వారించింది.
    "అబ్బో నువ్వే తోముకుంటావేంటి?" అంటూ వెళ్ళి మంచంమీద కూర్చుంది భరణి.
    భరణి అందించిన పాలగ్లాసులోని పాలన్నీ తాగేసి గ్లాసుకింద పెట్టింది శిల్ప. అప్పటికే స్నానం చేసేసి ముస్తాబయివచ్చింది రాగిణి. ఎఱ్ఱటి షిఫాన్ చీరమీద, తెల్లటి పువ్వులూ, ఎఱ్ఱటి బ్లౌజు, దోసగింజ బొట్టు, తీర్చిదిద్దిన కాటుక.
    "ఎక్కడికక్కా?" అడిగింది భరణి.
    "కల్చరల్ సెంటరుకే" జడల్లుకుంటూ అంది.
    "అతనే ఫోన్ చేస్తానన్నాడుగా"
    "మనం వెళితే వచ్చిన నష్టం ఏమిటి?"
    "నేనూ రానా?"
    "నువ్వు శిల్పతోటుండు. నే వెళ్తాలే!" అంటూ గబగబా రెండు బ్రెడ్డు ముక్కలు తిని, టీ తాగి బయలుదేరింది రాగిణి.
    శిల్ప ఆమెకేసి చూస్తూ వుండిపోయింది.
                                        *    *
    "ఉదయమనగా రెండు బ్రెడ్డుముక్కలు తిని వెళ్ళింది, యింకా రాలేదు" అంది సరోజిని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వొక్క పొడి నములుతూ, భరణికేసి చూసి.
    "బయటికెళితే టైమ్ తెలీదు అక్కకి" దెప్పుతున్నట్టుగా అంది భరణి.
    "ప్రోగ్రామ్ ఫిక్సయిందేమో : లేకపోతే వాళ్ళెవరో ఆర్గనైజర్లు కలిసుండరు. వాళ్ళని కలిసి ఆ పని సాధించుకొస్తే తప్ప, దానికి తోచదు. అది ఊరుకోదు. అంత పట్టుదల దానికి." మెచ్చుకుంటూ అంది సరోజిని.
    "శిల్పా కాసేపు నిద్దరపోతావా టైమ్ రెండయింది. నాలుగింటి వరకూ పడుకో."
    తల అడ్డంగా ఊపింది శిల్ప, పడుకోను అన్నట్టుగా.
    "అబ్బబ్బబ్బా! ఊటీ వెళ్ళినా ఈ తలూపడం తప్ప, నోరు విప్పి మాట్లాడడం చాతకాలేదింకా."
    "శిల్పూ మూగది! మాటలు సరిగ్గారావు. అందుకే మొద్దులా తలూపుతుంది" అంది కొంటెగా భరణి శిల్పని చూస్తూ.
    శిల్ప తలొంచుకుని కూర్చుంది, ఫ్రాక్ కి వున్న గుండ్రని గుడ్ల గూబ కళ్ళలాంటి గుండీలని ఇటూ అటూ తిప్పుతూ.
    నిద్రరావడం లేదు. కూర్చుంటే ఏమీ తోచడం లేదు. ఇదే ఊటీలో అయితే, సిస్టర్ ఫెర్నాండిస్ ఏవో కథలు చెప్పేది. తన సమాధానానికి ఎదురు చూడకుండానే, మాట్లాడుతూపోయేది. తను మాట్లాడకపోయినా, చెవులు ఆమె చెప్పేవి వింటూనే వుండేవి..... కళ్ళు ఆమెని చూస్తూనే వుండేవి - అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ గుండీని గట్టిగా తిప్పేసరికి అది ఊడి చేతికొచ్చింది.
    "అయ్యో! చూడమ్మా! కొత్త ఫ్రాకు బటన్ ఊడబీకేసింది అంది భరణి శిల్ప చేతిలోని గుండీని అందుకుంటూ, కంప్లెయింట్ చేస్తున్నట్టుగా.
    "అన్నీ పిచ్చి వేషాలే! దీని దగ్గర ఒక్క వస్తువూ నిలవదు, అదేం పిల్లోకానీ, ఆ బొమ్మలూ అవీ జాగ్రత్త! పగలగొట్టినా గొట్టేస్తుంది ఒక్క రోజులో" అంది సరోజిని మంచంమీద వాలుతూ.
    శిల్ప కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'అమ్మ ఎందుకలా అంటుంది.......? ఎందుకు పగలగొడుతుందీ తను? అయినా ఆమెకీ తనమీద కన్నా ఆ బొమ్మలమీదే ప్రేమున్నట్టుంది.' అనుకుంటూ బాధతో మెల్లగా వెళ్ళి రాగిణి గదిలోని మంచంమీద పడుకుంది ఆలోచిస్తూ. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కళ్ళు తెరిచేసరికి రాగిణి గొంతు వినబడుతోంది. "కల్చరల్ సెంటర్ వాళ్ళ కార్యక్రమాలు ఈసారి ఇక్కడకాకుండా ఢిల్లీలో పెడతారట. దానికి ఎవరో గీతారాణి పేరు సజెస్టు చేశారట. కానీ సెక్రటరీ గురునాథంగారు ఎలాగైనా నన్నే ఢిల్లీ పంపించాలని పట్టుబట్టారట. నేను వెళ్ళగానే ఎంత సంతోషించారనుకున్నావ్? గీతారాణి దగ్గరనుంచి రెండు సార్లు ఫోనొస్తే లేరని చెప్పించేశాడాయన" హ్యాండ్ బ్యాగ్ ని టీపాయ్ మీద పెట్టి, సోఫాలో కూర్చుంటూ చెబుతోంది రాగిణి.
    "డబ్బెంత ఇస్తామన్నారూ?" అడిగింది సరోజిని.
    రానూ పోనూ టిక్కెట్లు - అంటే నాతోపాటు ఇంకొకరు రావొచ్చును. ప్లస్ ఆర్కెస్ట్రా, అక్కడ గెస్ట్ హౌస్ రిజర్వేషనూ భోజనాలూ అన్నీ పోను నాలుగు వేలడిగాను."
    ఐదు వేలడిగినా ఇచ్చుండేవారు. ఢిల్లీలో ప్రోగ్రాం కదా! నీతోపాటు నేనొచ్చుంటే అడిగేదాన్ని గట్టిగా."
    "అవును నాకు చాతకాదు" కిల కిలా నవ్వింది రాగిణి.
    "నిన్ననే వచ్చింది కదా శిల్ప అని నీతో రాలేదు ఇవ్వాళ. దాంతోపాటు ఇంట్లో వుండి కాలక్షేపం చేద్దామనుకున్నాను."
    "నీతో బాగానే మాట్లాడిందా? దానిలో మార్పొచ్చిందా ఏమైనా?" కాళ్ళకున్న శాండల్స్ ని విప్పదీసి పక్కకి పెడుతూ అడిగింది.
    "ఏమీ లేదు. అదే మౌనం, అదే బుద్ధావతారం. ఏమిటో ఉలుకూ పలుకూ లేదు. ఏ ఆటా పాటా లేదు. నవ్వులేదు మొహంలో అదేం పిల్లో ఏమిటో!" దండకంలాగా చెప్పుకుపోతోంది సరోజిని.
    పక్క గదిలోని మంచంమీంచి తొంగిచూస్తూ వాళ్ళ సంభాషణంతా వింది శిల్ప. వాళ్ళలా మాట్లాడుకోవడం, తనకేమాత్రం నచ్చలేదు. అమ్మ తనమీద అక్కతో ఏదో పితూరీలు చెబుతున్నట్టుగా అనిపించింది. ఏడుపొచ్చినంత పనైంది. అమ్మంటే కొంచెం కోపం కూడా వచ్చింది! అందుకే మంచందిగి లేచొద్దామనుకున్నదల్లా మానేసి అలాగే పడుకుంది.
    రాగిణికి కప్పులో కాఫీ పోసి అందించింది భరణి.
    "నువ్వు తాగావా?"
    "ఆఁ....."
    "శిల్పూ ఇంకా లేవలేదా?"
    "ఊహూఁ......"
    "పాపం! ఊటీ స్కూల్లో హోం వర్కు అదీ చాలా ఎక్కువ వుంటుంది కదా! బాగా అలిసిపోయి వుంటుంది. పడుకోనీ, లేపొద్దు అంటూ కాఫీ కప్పు టీపాయ్ మీదే పెట్టేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి బాత్ రూంలో కెళ్ళింది.
    శిల్పకి ఆ క్షణంలో అక్కే ఎంతో మంచిదనిపించింది.
    ఓ పది నిమిషాలకల్లా రాగిణి స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుని చిన్నది ఎర్రటి గుండ్రపుబొట్టు పెట్టుకుని శిల్ప మంచం దగ్గరికొచ్చింది. భరణి! అక్కేమోనని మెల్లగా కళ్ళుతెరచి శిల్పని చూసి నవ్వుతూ "అమ్మదొంగా! దొంగనిద్రపోతున్నావా?" అంటూ చంకలకింద చక్కిలిగింతలు పెట్టింది.
    శిల్ప పకపకా నవ్వింది. ఆ నవ్వుకి ఇంటిల్లిపాదీ ఆ గదిదగ్గర కొచ్చారు. "ఇవాళ ఎండో వానో ఏదో ప్రళయం తప్పదు" అంది సరోజిని.
    "ఏం జరిగిందీ" అన్నారు రామానుజం అప్పుడే లోపలికొస్తూ విషయం అర్థంకాక
    "శిల్ప పకపకా నవ్వుతోంది" అంది సరోజిని.
    రామానుజం గారు మాట్లాడలేదు. ఒకసారి శిల్పకేసి చూసి అవతలకి వెళ్ళిపోయారు.
    శిల్ప రామానుజం కేసి చూసింది. ఆయన వెళ్ళిపోతూవుంటే, అంతలోనే ఏవో ఆలోచనలు ఆ చిన్నారిని గజిబిజి చేయడంతో మళ్ళీ మూగదానిలా అయిపోయి లేచికూచుంది.
    భరణి కూడా స్నానం చేసొచ్చింది. శిల్ప రాగిణినీ, భరణినీ తిప్పి తిప్పి చూసింది. రాగిణిముందు భరణి అసహ్యంగా అనిపించింది.
    "ఏంటలా చూస్తున్నావ్?" అంది భరణి.
    "ఏమీలేదు" అన్నట్టుగా తలవూపి మంచం దిగింది.
    "అక్కా! ఢిల్లీ ప్రోగ్రాం ఎప్పుడు?" అడిగింది భరణి. 
    "మళ్ళీ ఆదివారం. శుక్రవారం ఎ. పి. ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం. రేపట్నించి రిహార్సల్సు పెట్టుకోవాలి. సంగీతం మాస్టరుకీ, ఆర్కెస్ట్రా మెంబర్లందరికీ చెప్పాలి. రేపే రిజర్వేషన్ చేయించుకోవాలి."

 Previous Page Next Page