"స్టాపిట్" కంపార్టుమెంట్ దద్దరిల్లేటట్లు అరిచింది...అసలే ఎర్రగా వున్న ఆమెకళ్ళు మరింత ఎర్రగా అయ్యాయి. లోతుగా వున్న ఆమె కళ్ళలోంచి తీక్షణమయిన చూపులు ప్రసరించి టీ.సీ శరీరానికి శరాఘాతంలా తగిలాయి.
ఆమె అరుపుకి టీసితో పాటు అంతా నిర్ఘాంతపోయి చలనం లేనట్లు వుండిపోయారు.
ఆమె సంచీ వడిలోకి తీసుకుంది. సంచిలోంచి గుడ్డమూట బయటికి తీసింది. మూట విప్పింది. మూటలోంచి పాతది బుల్లి పర్స్ ని తీసింది.
ఆమె పర్స్ లోంచి టిక్కెట్ తీసి ఛర్రున లేచి నిలుచుంది. తూలుతున్న శరీరాన్ని నిలదొక్కుకుంది. చేయి జాచి టీ.సి ముఖం మీదకు టిక్కెట్ చూపుతూ స్వరం ఖంగున మ్రోగిస్తూ అంది.
"మిస్టర్! ఐ గాట్ ప్రోపర్ టికెట్. దిసీజ్ మై టికెట్ యూ కెన్ సీ అండ్ శాటిన్ ఫై యువర్ సెల్ఫ్. నౌ, సే ఎనీ ఫూల్ విల్ ట్రావెల్ ఇన్ దిస్ క్లాస్ పర్చేజింగ్ ఏన్ ఆర్డినరీ క్లాస్ టికెట్. నెవర్!
దేరార్ ఫూల్స్ హు విల్ కన్ ఫ్యూజ్ బై సీయింగ్ వన్స్ క్యాస్ట్యూమ్స్, చివరి మాటలు గొణుగుతూ నిసత్తువగా సీటులో కూలబడిపోయింది. ఆమె కంటిలోంచి రెండు బిందువులు బుగ్గలమీద జాలువారాయి.
స్వచ్చమైన ఇంగ్లీష్ లో ఆవేశంగా గట్టిగా మాట్లాడే ఆమెను చూసి టీసి బిత్తరపోయాడు. ఒక బీద ముష్టి కంపుకొట్టే ఆమె చాలా ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడటంతో కొట్టేసినట్లు నోరు పడిపోయినట్లు అయింది. చాలా పెద్ద అవమానం జరిగినట్లు అవమాన భారంతో తల వంచుకుని యెవరో తరుముతున్నట్లు పక్క కంపార్టుమెంటుకి వెళ్ళి పోయాడు.
ఆమె చేతిలోవున్న సెకండ్ క్లాస్ టిక్కెట్టు, ఆమె ఇంగ్లీషు వాగ్ధాటి చవిచూసిన ప్రయాణీకులు నోరు పడిపోయినట్లు వుండిపోయారు.
బాగా చదువుకున్న పెద్దింటి పిల్లే అయి వుంటుంది.
"బాగా చదువుకున్న పెద్దింటి పిల్లే అయి వుంటుంది. ఏదో బలీయమయిన పరిస్థితులు బీదరికంలోకి తోసి వుంటాయి. ప్చ్....పాపం...."ఈ తఫా ప్రయాణికుల ఆలోచనలు ఈ విధంగా సాగాయి.
పాప కదిలి నెమ్మదిగా ఏడవటంతో ఆమె సీటు మీదకి దేహం చేర్లేసి పాపని డొక్కలోకి లాక్కుంది.
స్టేషన్ వస్తున్న సూచనగా ట్రైన్ వేగం తగ్గింది.
ట్రైన్ ఆగింతర్వాత ఆమె లేచి ఆ స్టేషన్ ఏదో తెలుసుకుంది. "ఇంకా చాలా దూరం వుంది. చాలా...చాలా.... నాకు తప్ప" గొణుక్కుంది. ఈ తఫా దగ్గు వచ్చింది. లేచి బాత్ రూమ్ కెళ్ళాలని చూసింది....లేవలేక అలాగే ఆగిపోయింది. పైట చెంగుతో మూతి తుడ్చుకుంది. మూతి పక్కమీదకి ఎర్రని చార ఏర్పడింది. అది నోట్లోంచి వచ్చిన రక్తం తాలూకు గుర్తు.
ఆమెని పలకరిద్దామని చూసిన ఒకామె అది చూసి "నా కెందుకొచ్చిన గోల" అనుకుని మిన్నుకుండిపోయింది.
ఆమె సంచీ సరీగా సర్దుకొని దానిని భద్రంగా తల కింద పెట్టుకొని పడుకుంది.
ఎన్నో స్టేషన్ లు వస్తూన్నాయి పోతున్నాయి.
ఎక్కేవారు ఎక్కుతున్నారు దిగేవారు దిగుతున్నారు.
పాతవాళ్ళు చాలామంది దిగిపోయి కొత్తవాళ్ళు ఎందరో ఎక్కారు."
ఆమె లేవలేదు.
రామాపురం వచ్చింది.
రామాపురం అటు పెద్ద స్టేషనూకాదు చిన్న స్టేషనూకాదు. అన్ని ఎక్స్ ప్రెస్ లు ఆగుతాయి.