Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 4

    "ఆ..." ఆమె నుదురు చిట్లిస్తూ అంది.

    "నాకు చెముడులేదు కదూ!"

    "లేదు అయితే ఏమిటట!"

    "మరి మీరీ కాగితాన్ని...!"

    "ముందే చెప్పాకదమ్మాయ్! చిల్లి కాకపోతే తూటు అని."

    "ఇది ఆ రెండూ కాదు మేడమ్!"

    "రెండూ కాకపోతే మూడోది కంత. ఫలానా సబ్బు వాడండి అనో, ఫలానా తిలకం మీ ముఖానికి అందం అనో...

    "అలాంటి దేమీ కాదని మీకు భరోసా యిస్తున్నాను. మీరు ఒక్కసారి చదవండి. దీనివల్ల మీరు నష్టపోయేది ఏమీలేదు! నేను సహాయం కోరి రాలేదు. ఏదో అడిగి తృణము ఫణము అలాంటిది కాదు. ఇది కొత్తరకంది. మీరు కని విని వూహించనిది. చాలా విచిత్రమైనది. పరమాద్భుతమైనది. కేవలం మీ రక్షణకోసం.

    దీక్ష తమాషాగా గబగబ చెపుతుంటే ఇంక ఆమె ఆగలేక "రక్షణకోసమా?" అంది.

    "అవును. ఇది చదవండి చాలు." అని పాంప్లెట్ ఆమె చేతిలో పెట్టి దీక్ష 'వస్తా మేడమ్!" అని రోడ్డు ఎక్కేసింది.

    ఆమెకి ఏదో అర్ధం అయినట్లు అయి చిరునవ్వు నవ్వుకుంది.

    ఇది ఆడవాళ్ళకు సంబంధించిన సినిమాకి ఆహ్వానం అయి వుంటుంది. కనుకనే పిల్ల చలాకీగా ఆకర్షణీయంగా వుంది. ఆ మధ్య నూన్ షో "చిటికెడు పసుపు" అనే సినిమా వస్తే. నలుగురు ఆడవాళ్ళు ఇంటింటికీ బొట్టుపెట్టి పేరంటానికి పిలిచినట్లు పిలిచి "చిటికెడు పసుపు" మీరొచ్చి స్వయంగా తీసుకెళ్ళండి అని పిలవటం తడవుగ పొలోమంటూ ఆడవాళ్ళంతా వెళ్ళి సినిమా చూసి ఆ సినిమా వంద రోజులు ఆడేలా వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించారు.

    అలాగే యిది కూడా.. అనుకుంటూ ఆమె పాంప్లెట్ మీదనున్నది చదవటం ప్రారంభించింది.

    మీ యింట్లో ఆడపిల్లలు వున్నారా!

    మీరు వంటరిగా ఎక్కడి నుంచయినా వస్తున్నారా!

    మీకు గాని మీ పిల్లలకిగాని ఆ విషమ పరిస్థితి ఎదురైతే! అప్పుడు మీరేం చేస్తారు?

    పాంప్లెట్ లో నాలుగులైన్లు ఈ మాటలున్నాయి. అది చదివి ఆమె యిలా అనుకుంది. "ఇదేమి పిచ్చిగోల?"

    ఆమె దీక్ష కోసం చూసింది. దీక్ష దూరంగా వెళుతూ కనిపించింది. ఆమె మరోసారి పాంప్లెట్ లో వున్నది చదివింది. "విషమ పరిస్థితి!" ఆ మాట చదివి ఉలిక్కిపడింది. విషమ పరిస్థితా! అంటే ఎవరికని? అటు ఆమెకా, ఇటు నాకా! మీరు అనే రాసుంది కదా! అంటే నాకే నన్నమాట...!

    ఆ ఆలోచన రాగానే ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి.

    'భగవంతుడా! ఆయనకి మొన్ననే ఉద్యోగం వూడినంత పని అయి ఎలాగో నిలదొక్కుకున్నాడు. ఉన్న ఒక్క ఆడపిల్లా...

    ఆమె భయంతో అలా ఆలోచిస్తుండగానే కూతురు రోజా రమణి వచ్చింది. "ఏమిటమ్మా నీ చేతిలో కాగితం!" అంటూ.

    "ఇదేమిటోనే తల్లీ! నాకు భయంగా వుంది. ఎర్రతేలులా వున్న ఓ పిల్ల ఈ కాగితం నా చేతిలో బలవంతాన వుంచి వెళ్ళింది." అంది ఆమె.

    రోజారమణికి సినిమాల పిచ్చి చాలానేవుంది. ఒకటి నాలుగు సార్లు పాంప్లెట్ మీద వున్నది చదివి కాస్త అలోచించి "తెలిసిందిలే, నాకు తెలిసిందిలే." అని రాగం తీసింది.

    "తర్వాత పాడుదువుగాని ముందు నీకు తెలిసింది ఏమిటే చెప్పవే రమణమ్మా!" అంది ఆమె.

    "ఆ మధ్య ఓ దినపత్రికలో మీరు కనీ వినీ ఎరుగని దారుణం రేపు ఇదే పేజీలో ఇక్కడే చూసి చదవండి అని పడితే మర్నాడు పేపరు వస్తూనే అందరూ అక్కడే చదివారు. అప్పుడు అక్కడ ఏమని వుంది! ఒక సాధారణ స్త్రీ నట్టనడి బజారులో పోలీసు ఇన్ స్పెక్టర్ ని కత్తితో పొడిచిన వైనం రేపు మళ్ళీ ఈ పేపరులో ఇదే చోట చదవండి అని వుంటే మనమంతా ఎంత అదుర్దాపడింది నీకు గుర్తు వుంది కదమ్మా!" రోజారమణి అడిగింది.

    "వుంది. ఇంతా అదుర్దాపడి ఏడిస్తే అది సినిమా తాలూకా వాళ్ళు తమాషాగా ప్రచురించిది."

    "ఆడది కాదు ఆదిశక్తి అన్న సినిమాకి వాళ్ళు కొత్త రకంగా పబ్లిసిటీ యిచ్చారు. ఇదీ ఆ బాపతే. ఈ మధ్య ఓ పుస్తకంలో వెర్రి తలలు వేస్తున్న వేలంవెర్రి పబ్లిసిటీ స్టంట్ స్టంట్ అంటూ నా పొడుగు వ్యాసం పడింది. సినిమాలు చూసే వాళ్ళకి పుస్తకాలు చదివే వాళ్ళకి ఇలాంటివి బాగా తెలుస్తాయి" సినిమాల పిచ్చికి తోడు పుస్తకాల పురుగు కూడా అయిన రోజారమణి నొక్కి వక్కాణించి మరీ శలవిచ్చింది.

 Previous Page Next Page