Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 4


    సౌందర్యోజ్జ్వల తావకీనముఖవీక్షాదీక్షమై వట్టికుం
    డందే కవ్వము త్రిప్పురాధ; యిక నీవయ్యింతి యొయ్యారపుం
    గందోయిం గనుగొంచు మైమరపునన్ గాల్దీయ నాభామ కా
    లందెన్ పట్టితివంట చిత్రము, మహాత్మా! బాలకృష్ణప్రభూ!

    జడదారుల్ విడరాని భక్తిలతికా జాలంబులన్ గట్టి బి
    ట్టిడుమల్ బెట్టి సతంబు తట్టుకొనలే కెట్టెట్టులో నావలన్
    బడి యెవ్వారును జేరకుండుటకునై బన్నుంటి వౌరౌర! ఆ
    నడి సంద్రంబున నాగుబాముపయి నన్నా! బాలకృష్ణప్రభూ!

    అందన్ రాని మహాసముద్రమున దేహంబెల్ల నాయాసముం
    జెందన్ జాలెడు మఱ్ఱియాకు పయి కుక్షిస్థాఖిలాజాండ! నీ
    వెందాకుండెదవిట్లు? కష్టమగుగాదే? నాదు డెందంపు పూ
    వుందోటన్ విహరింపుమయ్య! సుఖమబ్బున్ శ్రీబాలకృష్ణప్రభూ!

    దివసాధీశకుమారు నెమ్మదికి ప్రేతిం గూర్ప శిక్షించి తా
    దివిజాధీశకుమారు మున్ను; నిపుడర్థిం దద్విరోధంబుగా
    దివిజాధీశకుమారు నెమ్మదికి ప్రీతిం గూర్ప శిక్షించి తా
    దివసాధీశకుమారు వక్త్రము కృపాబ్ధీ! బాలకృష్ణప్రభూ!

    అమ్మో! ఆదివరాహజన్మమున నియ్యంభోధు లెన్నేని నీ
    నెమ్మేనం గల రోమకూపమొకటేనిం నింపలేదంట; చి
    త్రమ్మౌ దోసెడి నీటితోడనె యశోదాదేవి నిండార స్నా
    నమ్మేమాడ్కి నొనర్చె నీకు సరసజ్ఞా! బాలకృష్ణప్రభూ! 

    అత్యంతోగ్రతరాస్యముం దెరచి నిత్యం బెప్పు డెప్డంచు దా
    మృత్యువ్యాఘ్రము గాచియున్నది గదా! యేనాడొ యెచ్చోటనో
    ప్రత్యక్షంబగు; నాటి కిప్పుడె నినున్ బ్రార్థింతు రక్షింపవే
    నిత్యానంద నిరంతనిర్భయత తండ్రీ! బాలకృష్ణప్రభూ!

    హత్యాబుద్ధి ననుక్షణంబు నెపుడెప్డాయంచు వెన్వెంటనే
    మృత్యువ్యాళము గాచియుండ గనలే కీదేహముల్ గేహముల్
    సత్యంబంచు తలంచి మూర్ఖజను లజ్ఞానంబు కన్గప్ప సం
    సృత్యబ్ధిం బడి కొట్టుకొందు రకటా! శ్రీ బాలకృష్ణప్రభూ!
    
    ప్రత్యర్థి ప్రకర ప్రతాపతిమిర ప్రచ్ఛేదన ప్రక్రియా
    ప్రత్యూష ప్రథిత ప్రభాకర౧ భవత్ ప్రత్యక్ష సందర్శన
    ప్రత్యాగ ప్రచుర ప్రణామము లనిన్ బ్రార్థింపగా బూనితిన్
    ప్రత్యగ్రప్రవిఫుల్ల పంకరుహనేత్రా! బాలకృష్ణప్రభూ!

    ధనియై బంటయి బాలుడై ముదుకడై తా నాట్యమాడున్
    క్షణమొక్కొక్క విధాన మర్త్యనటుడీ సంసార రంగమ్ముపై
    వెనుకన్ యామ్యపు రాజ్యమైన తెరలో వేజొత్తు రీనాటక
    మ్మున నీవేకద సూత్రధారుడవు బాబూ! బాలకృష్ణప్రభూ!

    నీకున్ నాపయి కోపమున్న యెడలన్ నీబంతితో గొట్టరా
    దా? కారుణ్యకటాక్షరజ్జువుల చేతం గట్టిగా కట్టరా
    దా? కాకున్న దయారసామృత సముద్రమ్మందు నన్ నెట్టరా
    దా? కెంగేలున తట్టరాద? కసిపోదా! బాలకృష్ణప్రభూ!

    ఆ కేల్దోయి పసందు, ఆ కనుల సొం, పా మోము సింగార, మా
    శ్రీకారంబుల నేలు కర్ణములు, ఆ చెక్కిళ్ళ చక్కందనం,
    బా కెమ్మోవి బెడంగు, నా నడల తీ రాయింపులా లింపులున్
    నీకే కాక మరేరికిన్ గలవు తండ్రీ! బాలకృష్ణప్రభూ!

    నీ సర్వస్వము కట్టిపెట్టు మనుచున్ నిర్బంధమున్ బెట్టినా
    నో! సామ్రాజ్యము నిమ్మటంచడిగినానో! సొమ్ము లిమ్మంటినో!
    రోసం బేటికి గల్గె నాపయిని మారుంబల్కకున్నావు;నే
    కాసుంగోర త్వదంఘ్రిచింతనము దక్కన్ బాలకృష్ణప్రభూ!

    ఆసింపన్ వనమాల; చేతి మురళిన్ యాచింప; పింఛమ్ముపై
    నాసంజెందను; కౌస్తుభం బడుగ; నభ్యర్థింప పై వస్త్రమున్
    చేసాచన్ పులిగోరు నిమ్మనుచు, నీ శ్రీమజగన్మోహన
    మ్మాసౌందర్యము చూడ గోర్కిగల దన్నా! బాలకృష్ణప్రభూ!


                                            * * * *

 Previous Page Next Page