Previous Page Next Page 
హత్య పేజి 4


    "మరి మా అమ్మా?"

 

    మీ అమ్మకాదు అనికైలాసగణపతి అనబోయే లోపలే ఆ కుర్రాడు నోరంతా తెరిచి "అమ్మాయ్! నీకోసం ఎవరో వచ్చారేవ్!" అన్నాడు.

 

    ఆమె లోపలనుంచి ఆదరాబాదరాగా వచ్చి "నాకోసం ఎవరొస్తారా?" అని అంతలోనే కైలాసగణపతిని చూసి మీరు..... మీరు నాకోసం రావటం ఏమిటి? మీరెవరు?" అంది నొసలు చిట్లిస్తూ.

 

    "అమ్మా! నాపేరు కైలాసగణపతి. నేను ఉరుముకొండ రావడం యిదే ప్రధమ పర్యాయం. సూరీడు ఇంటికి వచ్చాను. ఎవరిని అడిగినా సరీగా అడ్రస్ చెప్పటంలేదు."

 

    "సూరీడు యింటికా ఇలా తూర్పు దిక్కుగా వెళ్లండి.....

 

    "తూర్పుకెళితే సూర్యుడు పడమట కెళితే చంద్రుడు వస్తాడు. నాకు కావాల్సింది ఆ సూరీడు కాదు."

 

    "నేను చెప్పేది అదేనండి. సూర్యుడుకాదు సూరీడు యింటికి తూర్పు దిక్కు వీధిలో అయిదో యిల్లు సూరీడుదే. వాకిట్లో పక్కపక్కనే రెండు వేపచెట్లు వుంటాయి. అదే వాళ్ళిల్లు" ఆమె వివరించింది.

 

    "థాంక్స్." అని చెప్పి కైలాసగణపతి బైలుదేరాడు.

 

    "థాంక్స్" అంటే ఏమిటి! మంచిదమ్మా, చాలా సంతోషం అడగంగానే చెప్పారు అనాలా, థాంక్స్ భోంక్స్ అంటూ పోవాలా ఏం మనిషీ చాలా తమాషా గానే వున్నాడు అనుకుంది ఆమె.

 

    కైలాసగణపతి కాస్తంత దూరం నడిచి రెండు వేపచెట్లు వున్న ఇంట్లోకి సరాసరి వెళ్ళి "సూరీడు, సూరీడు" అన్నాడు.

 

    "ఏమిటి?" అంటూ పంచ ఎగగట్టిన వకాయన పక్కగదిలోంచి బైటకి వచ్చాడు. కండలు పెంచి చిన్నసైజు పహిల్వాన్ లాగా వున్నాడు.

 

    వీడెవడు సూరీడింట్లో పనిచేసే బండోడా! అని కైలాసగణపతి అనుకుంటుంటే ఇంతలో అతనే "ఎవరితో ఎప్పుడు ఎక్కడ?" అన్నాడు రవంత ఉత్సాహంతో.

 

    "ఏమిటి?" అన్నాడు కైలాసగణపతి.

 

    "కుస్తీ."

 

    "కుస్తీయా!"

 

    "కుస్తీయే, ఎవరితో, ఎప్పుడు ఎక్కడ?" కండలు చూసుకుంటే అడిగాడు.

 

    వీడి పిచ్చి బాగానే అర్థమయింది కైలాసగణపతికి. సూరీడుని కేకేస్తే వీడిగోల తప్పుతుందనుకుని "సూరీడూ!" అని పిలిచాడు.

 

    "ఏంటీ! సూరీడు నాతో కుస్తీ! నీయవ్వ సూరీడు అయేడి వాడి తాతయ్యేది దట్టిబిగించి దిగానంటే హాంఫట్" అన్నాడు.

 

    "సూరీడు ఇంట్లో లేడా?" కైలాసగణపతి నుదురు చిట్లిస్తూ అడిగాడు.

 

    సూరీడు ఇంటో వుండడు ఆకాశంలో ఉంటాడు. ఆడి దగ్గరకు నీవు పోవాల్సిందే కోడిరెక్కలు కట్టుకుని టపటపలాడిస్తూ పైకెగిరి....

 

    అప్పుడొచ్చింది అనుమానం కైలాసగణపతికి

 

    "సూరీడు పేరుగలవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరా?" అని అడిగాడు.

 

    "లేరు."

 

    "అయితే సరే వెళతాను."

 

    "వెళ్ళేవాడివి ఎందుకు వచ్చావ్? కుస్తీల సూరిబాబు ఇంటికి వచ్చేముందు -

 

    "ఆగాగు మళ్ళీ నీపేరు చెప్పు!"

 

    "కుస్తీల సూరిబాబు. అసలు మా యింటిపేరు కోళ్ళవారు."

 

    "అదీ విషయం."

 

    "ఏది?"

 

    "నేను సూరీడు యింటికి రాబోయి, కుస్తీల సూరి బాబు యింటికి వచ్చాను అదీ విషయం.

 

    "ఎందుకు వచ్చావ్?"

 

    "నా ఖర్మకాలి" అని కైలాసగణపతి లోపల అనుకుని తనకి ఎవరో తప్పు అడ్రస్ యిచ్చారని అందుమూలాన ఇందులోకి రావాల్సివచ్చిందని..... వివరించాడు.

 

    "అదన్నమాట విషయం?"

 

    "సరీగ అదే. వెయ్యి కుస్తీలుపట్టి లక్షలాది అభిమానులమధ్య అభిమన్యుడిలాగా, చిరంజీవిలాగా వర్ధిల్లు నాయనా!" అన్నాడు.

 

    అభిమన్యుడు ఎవడు?" కుస్తీల సూరిబాబు అడిగాడు.

 

    "ఇప్పుడు లేడులే. గతంలో నీలాగా కుస్తీలుపట్టి దేశదేశాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు గడించినవాడు."

 

    కైలాసగణపతి నోటికివచ్చిన అబద్ధం అవలీలగా ఆడాడు.

 

    కుస్తీల సూరిబాబుకి దారాసింగుకింగ్ కాంగ్ గురించి ఆ నోట ఆనోట  వినివుండటం వల్ల తెలుసు? మధ్యలో ఈ అభిమన్యుడు ఎవరో తెలియదు. తెలియకపోయినా అభిమన్యుడు అనేవాడు కేవలం కుస్తీలు మాత్రమే పట్టిదేశదేశాలలో పేరు ప్రఖ్యాతలు పొందాడు కాబట్టి చాలా గొప్పవాడే అయివుంటాడు. అంతడివాడితో తననికొంచెమయినా పోల్చినందుకు చాలా సంతోషించి కైలాసగణపతితో మర్యాదగా మాట్లాడాడు. ఎప్పుడైనా అవసరం అయితే కుస్తీకి పిలవండి అనికూడా చెప్పాడు.

 

    కుస్తీల సూరిబాబు దగ్గర సెలవుతీసుకుని మళ్ళీ రోడ్డు ఎక్కాడు కైలాసగణపతి.

 Previous Page Next Page