కృష్ణాజిల్లాలోని ఒక టౌన్ అది. నాలుగు సిన్మాహాళ్ళు, లైబ్రరీ, బస్ స్టేండ్ ఉన్నాయి. ఆ టౌన్ లో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు.
ఆ ఇద్దరిలో ఒకరు ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థి ఈశ్వర చంద్ర.
ప్రతిపక్షం అభ్యర్థి నరసింహయ్య...
ఆ ఊళ్ళో ఉన్న నాలుగు సిన్మాహాళ్లలో ఒక సిన్మాహాలు ఈశ్వరచంద్రది, రెండోది నరసింహయ్యది. ఆ వూరికి రైలు సౌకర్యం లేదు. రైలెక్కాలంటే విజయవాడ వెళ్ళి ఎక్కాల్సిందే. ఈ వూళ్ళోకి రైలు సౌకర్యం కలగచేస్తామని ఇద్దరు రాజకీయ నాయకులు గత ముప్పయి ఏళ్ళుగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు.
రాదని వాళ్ళకూ తెలుసు, ప్రజలకూ తెల్సు.
* * * *
మూడుగదులు పాతకాలపు పెంకుటిల్లు.
మధ్యలో వరండా- వెనుక పెరడు- నుయ్యి, చిన్న అరుగు, దాని ముందున్న స్థలంలో కూరగాయల మొక్కలు, వేపచెట్లు, బీటలు తీరి పడిపోతున్న గోడ- చిన్న కర్రగేటు.
కర్రగేటు తీసుకుని రోడ్డుమీదకు వచ్చాడు శక్తి.
ఐదడుగుల పదంగుళాల పొడవు, కండలు తీరిన శరీరం, పొడవాటి కాళ్ళు చేతులూ, సూదిగా మొనతేలిన ముక్కు బలిష్టమైన పిడికిళ్ళు...
అతని అందమైన కళ్ళలో ఎప్పుడూ ఎన్నెన్నో ఆశలు మెరుస్తూ ఉంటాయి. తనెప్పుడో గొప్పవాడిని అవుతానని అతనికి ప్రగాఢమైన నమ్మకం.
అతనికొక సొంత గ్యాంగ్ వుంది.
నడుచుకుంటూ వెంకటేశ్వర హోటల్ దగ్గరకు వచ్చాడతను.
అప్పటికీ అక్కడ శక్తి కోసం ఎదురుచూస్తున్న మిత్రబృందం వుంది. శక్తిని చూడగానే మాయాబజార్ లో ఎస్వీరంగారావు, అనుచర రాక్షస గణం అరిచినట్లుగా అరిచాడు.
"ఏమిటింత లేట్... ఒన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం..." రమణ్రావు అన్నాడు.
"బ్యూటీఫుల్ డ్రీమ్ రా... గియోవాని అగ్నెల్లి లెవల్ కల..." హోటల్ ముందున్న చిన్న పిట్టగోడెక్కి కూర్చుంటూ అన్నాడు శక్తి.
"ఓరేయ్... అయ్యర్ ని నాలుగూబై ఆరు కాపీలు పంపమని చెప్రా..." ప్రక్కనున్న సుబ్రహ్మణ్యంతో చెప్పాడు. ఆ ఆజ్ఞను సుగ్రీవాజ్ఞలా స్వీకరించి సుబ్రహ్మణ్యం లోపలకు వెళ్ళాడు... బయటకొచ్చాడు.
"అయ్యారు... పాతబాకీ అడుగుతున్నాడు."
"పాతబాకీ అడిగాడా... అడగడే..." అంటూ శక్తి గోడదిగి హోటల్లో కౌంటర్ ముందు కూర్చున్న ముకుందం అయ్యరు ఎదురుగా నిలబడ్డాడు.
ముకుందం అయ్యరు ఎదురుగా నిలబడ్డ శక్తివైపు తలెత్తి చూసాడు భయంగా.
"ఓరేయ్... శక్తి గ్రూప్ కి ఆరు కాఫీ... ఫోర్ బై సిక్స్ ఎందుకూ- తాగేదేదో తృప్తిగా తాగనీ...." నసిగాడు ముకుందం అయ్యరు.
శక్తి మనస్సులోనే నవ్వుకుని బయటకు వచ్చాడు.
"అవునూ... ఇంతకు ముందు నువ్వేదో పేరన్నావ్... ఏదో కిరస్తానీ పేరు... అగ్నెల్లీ... ఎవరతను..." రమణ్రావ్ అడిగాడు అర్థంకాక.
"బిల్ క్లింటన్ పేరు చెబితే ఎవరు బాసూ... ఏ సినిమాలో చేసాడు. అనేంత దరిద్రపు జనరల్ నాలెడ్జ్ లెవెల్ మీది.
గొప్ప వాళ్ళ పేర్లన్నీ మీకు కిరస్తానీ పేర్లలాగే అన్పిస్తాయి... వాళ్ళంతా నాలాగే చేతిలో చిల్లిగవ్వ లేకుండా కోట్లు సంపాదించిన వాళ్ళు." అన్నాడు శక్తి డ్రీమిగా.
"నీలాగా... నీలాగే వాళ్ళకు ఆరంభంలో చిల్లిగవ్వ లేకపోవచ్చు. అంతవరకే పోల్చుకో.... ఆపైన వాళ్ళ లెవెలే మారిపోయింది. నీ లెవెల్ ఇంకా అయ్యర్ హోటల్ లెవెల్లోనే ఉంది. అది మర్చిపోకు... అయినా ఎపుడూ ఏవో పేర్లు చేబుతావే... నీకు వాళ్ళ పేర్లెలా తెలుసు... మాకు మన జిల్లావాళ్ళ పేర్లే నోర్లు తిరిగి చావవు..." సుబ్రహ్మణ్యం ఒకింత అసహనంతో అన్నాడు.
శక్తి మాట్లాడలేదు. ఇంకా ఏవో కలల్లోనే విహరిస్తున్నాడు.
కాఫీల కార్యక్రమం అయిపొయింది.
పక్కనే ఉన్న కిళ్ళీ కొట్టుమీద కన్ను పడింది.
క్షణంలో తలా ఒక సిగరెట్ వచ్చింది.
ఆ మరుక్షణం సిగరెట్లు వెలిగాయి- అందరి చేతుల్లో కాగడాల్లా-
"పిల్లల్ని కనటం - దేశం మీదకు ఇలా బలాదూర్ వదలటం ఛీ- ఛీ- బొత్తిగా బాధ్యతలేని తల్లిదండ్రులు..." ముకుందం అయ్యరు చిరాగ్గా తనలో తానే అనుకున్నాడు.
"పనీ పాటా లేకుండా ఇలా బలాదూర్ తిరిగే సోమరిపోతు వెధవల్ని చెట్టుకి కట్టేసి చీమల్ని పాకించాలి..." కిల్లీకొట్టు ఓనర్ లోలోనే గొణుక్కున్నాడు.
"ఏంట్రా విశేషాలు...?" శక్తి అడిగాడు తాపీ ధర్మారావులా.
"ఏవుంటాయి మనదేశంలో... పాతవే రిపీట్ అవుతుంటాయి. ఓ మంత్రి కిళ్ళీ కొట్టుకు ఇచ్చినంత తేలిగ్గా బీర్లు తయారు చేసుకోటానికి లైసెన్స్ లు ఇచ్చి పడేసాడు- ఒక పనయినట్టుంటుందని. ఆ దెబ్బతో ఆ పెద్దమనిషి ఇంటికి పంపించేసారుగా- తోట పనులు చేసుకోమని- ఆ పెద్దమనిషి నా భార్యకు టిక్కెటంటూ ఢిల్లీ కెళ్ళాట్ట సిగ్గు లేకుండా..." జగపతి చెప్పాడు.
"ఒరేయ్ రామ్ తేరీ గంగా మయిలీ ఏం చేసిందో చూసావా? ఇండియాలో మగాడేలేనట్టు దుబాయ్ వెళ్ళి దావూద్ ఇబ్రహిమ్ తో కడుపు చేయించుకొచ్చి, ఇక్కడ పిల్లాడిని కన్నదట. ఇండియాకి మరో దావూద్ ని ఇద్దామనే ప్రేమతోనేమో..." సుబ్రహ్మణ్యం అన్నాడు.
"మందాకిని నా అభిమాని- ఏమనకు నా మనస్సు విలవిల్లాడి పోతుంది. రాజ్ కపూర్ ఆత్మ శాంతించదు..." రమణ్రావ్ అన్నాడు బాధపడిపోతూ.
ఢిల్లీ- శ్రీనగర్ విమానం హైజాక్- ఆ పైన సుఖాంతం. పని చెయ్యని ప్రభుత్వోద్యోగులకు మరో విడత కరువు భత్యం... ఇదేగా... ఏం ఉంటాయి విశేషాలు... కాస్త మందాకినిదే మషాలా ఇన్సిడెంట్" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"లైబ్రరీకి పేపర్స్ మాత్రం సరీగ్గానే వస్తున్నాయన్న మాట... మొత్తం చదివేసుంటారు. టిస్కో చైర్ మెన్, రూసీమోడీ, అమెరికాలో ఉన్న టాటా ఇన్ కార్పొరేటెడ్ చైర్ మెన్ పదవికి రాజీనామా చేసారట.
హీ ఈజ్ ది స్టీల్ మేన్ ఆఫ్ ఇండియా. అది చూడలేదా?
రూసీమోడీని టిస్కో చైర్ మెన్ పదవి నుంచి టాటాల తన నెవ్యూ కంపెనీ టాటాసన్స్ తొలగించేసిందట. జె.ఆర్.డి. టాటా తన నెవ్యూ అయిన రతన్ టాటాని టిస్కోకి చైర్ మెన్ గా నామినేట్ చేసారట. ఎంత న్యాయంరా... అవేమీ మీ దృష్టికి రావా?"