"అడిగినది లేదనక ఇచ్చుదాతలలో నీవు మేటివి. అందుకే నిన్ను యాచిస్తున్నాను. నిన్ను ఎక్కువ అడుగను. నా అడుగులతో మూడడుగుల నేల ఇవ్వు. చాలు"
"నీ కోరిక మూడడుగుల నేలయే అయితే తీసికో" అని దానం ఇవ్వడానికి జలపాత్రను అందుకున్నాడు.
శుక్రుడు ఎత్తిన బలి చేయి పట్టుకున్నాడు. "ఇతడు సాధారణుడు కాడు. నిన్ను ధ్వంసం చేయడానికి వచ్చాడు. అతడు ఒక అడుగుతో భూమండలాన్నీ, మరొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టాలి? అని అడుగుతాడు. ఏమిస్తావు. ఇస్తానన్నావు. నిజమే. ఇది ప్రాణరక్షణ. ఇచట సత్యం పనికి రాదు. అబద్ధం ఆడు. ఇవ్వనను" అన్నాడు.
"గురుదేవా! నేను ప్రహ్లాదుని మనుమణ్ణి. ఇస్తానన్నాను. ఇవ్వననడం మోసం కాదా! అసత్యం కంటే అధర్మం లేదు. భూమి అన్నింటినీ భరిస్తుంది. అసత్యం భరించలేదు. నరకం, దారిద్ర్యం, దుఃఖం, రాజ్య నాశనానికి భీతిల్లను. ఇత్తునని ఇవ్వకమోసం చేయ జాలను. అసత్యాన్ని మించిన అపరాధం, పాపం మరొకటి లేదు" అని బలి వామనునికి మూడడుగుల నేల దానం చేశాడు. బలి భార్య వింధ్యావతి బంగారు చెంబుతో నీరు పోసింది. బలి స్వయంగా వామనుని కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడు.
ఆకసం నుంచి ఇదంతా చూస్తున్న దేవతలు చకితులైనారు. ఆశ్చర్యపడ్డారు. వాలి వారికి శత్రువే. అయినా అతని కీర్తిగానం చేశారు:-
కమలనాభు నెరిగి కాలంబు దేశంబు
నెరిగి శుక్రు మాట లెరిగి నాశ
మెరిగి పాత్ర మనుచు నిచ్చెదానము బలి
మహి వదాన్యు దొరుడు మరియు గలడె!
వామనుడు ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్నీ కొలిచాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టవలెను? అని అడిగాడు.
బలి అంటున్నాడు:-
"ప్రభూ! నా మాట అసత్యం చేయాలను కున్నావు. కాని నా మాట సత్యమని ప్రతిపాదిస్తాను. రెండడుగులు ఇచ్చినాను. మూడవ అడుగు నాతల మీద పెట్టుము" అన్నాడు.
వామనుడు బలి తల మీద పవిత్ర పాదము పెట్టినాడు. "బలిరాజా! నీవు సుతల లోకానికి సబాంధవంగా వెళ్లుము. ఆ లోకమున నేను నీకు ద్వారపాలకుడనై ఉంటాను" అన్నాడు.
బలి దానగుణం శ్రీమన్నారాయణ మూర్తినే అతనికి ద్వార పాలకుణ్ణి చేసింది.
ఒకనాటి మాట. అతడు ఆరుబయట కూర్చున్నాడు. ఒకడేగ పావురాన్ని తరుముతున్నది. పావురం భయపడుతున్నది. వణకుతున్నది. దానికి శిబి కనిపించాడు. పావురం శిబి చాటున దాగింది.
డేగ పావురం వెనుక వచ్చింది. శిబిని చూచింది. అతని ముందు వాలింది. అన్నది:-
"మహారాజా! పావురం నా ఆహారం. దాన్ని నేను తరిమి తెచ్చాను. నా ఆహారానికి నీవు విఘ్నం కలిగిస్తున్నావు. సకల భూతాలు ఆహారం వల్లనే జీవిస్తున్నాయి. నాకు పావురం ఇవ్వు. నాకు ఆకలిగా ఉంది. నా ప్రాణాలు పోతాయి. అందుకు నీవే కారణం అవుతావు. నీవు ధర్మజ్ఞుడవు. పావురం ఇవ్వు. నా ప్రాణాలు కాపాడు"
శిబి అంటున్నాడు:-
డేగా! పావురం నన్ను ఆశ్రయించింది. దాని మీద కోపం విడువు. నీకు అనేక జంతువుల మాంసం పెట్టిస్తాను.
మహారాజా! పావురాన్ని రక్షించు. పావురపు తూకమంత నీ మాంసం కోసిపెట్టు. అప్పుడు నీ దాతృత్వం వెల్లడి అవుతుంది.
శిబి అందుకు అంగీకరించాడు. త్రాసు తెప్పించాడు. తనమాంసం కోస్తున్నాడు. త్రాసులో పెడ్తున్నాడు. ఎంతకూ పావురానికి సరిపోవడం లేదు. శిబి స్వయంగా త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు మరో పళ్లెంలోని పావురం ఎగిరింది.
డేగా, పావురం ఇంద్రాగ్నులుగా మారాయి. "నీ ధైర్యశౌర్యాది గుణంబు లనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్దబ్రహ్మగలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడుమ" ని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి.
ఇంతకు మించిన త్యాగం అరుదు. దధీచి తనదేహాన్నే దానం చేశాడు. ఇది మానవతకు పరాకాష్ఠ. దైవత్వానికి అతి దగ్గరిది. మానవుని దైవత్వపు అంచులకు చేర్చుటకు శిబి కథ అవతరించింది.
రంతి దేవుడు
రంతి దేవుడు రాజు, మహాదాత. దానము చేయడంలో అతనికి అతడే సాటి. తన సంపదను తాను అనుభవించలేదు. ఆపన్నులకు, పేదలకు దానం చేశాడు. పేదవాడై నాడు. కుటుంబ సహితంగా 48 రోజులు ఆహారం లేకుండా గడిపాడు. 49వ రోజు ఉదయం కొంత పాయసం, నేయి, నీరు లభించింది. సపరివారంగా భుజించడానికి కూర్చున్నాడు.
అప్పుడు ఆకలి గొన్న బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. 'ఆకలి - అన్నం' అని ఆర్తనాదం చేశాడు. సకల ప్రాణులందు భగవంతుని దర్శించువాడు రంతిదేవుడు. వచ్చిన వానిని భగవంతుడుగా భావించాడు. ఉన్న దానిలో బ్రాహ్మణునికి భోజనం పెట్టాడు. అతడు తృప్తిగా వెళ్లిపోయాడు.
మిగిలిన దానిని భుజించడానికి కూర్చున్నారు.
అప్పుడు ఆకలిగొన్న ఒక శూద్రుడు వచ్చాడు. 'ఆకలి - అన్నం' అని ఆర్తనాదం చేశాడు. రంతిదేవుడు సకల ప్రాణులందు భగవంతుని దర్శించువాడు. వచ్చిన వానిని భగవంతునిగా భావించాడు. మిగిలిన దానిని శూద్రునికి భోజనం పెట్టాడు. అతడు తృప్తిగా వెళ్లిపోయాడు.
మిగిలిన దానిని భుజించుటకు కూర్చున్నారు.
అప్పుడు కుక్కలను పట్టుకొని మరొకడు వచ్చాడు. 'ఆకలి - అన్నం' అని ఆర్తనాదం చేశాడు. రంతిదేవుడు సకల ప్రాణులందు భగవంతుని దర్శించువాడు. వచ్చిన వానిని భగవంతునిగా భావించాడు. మిగిలినది అతనికి అందించాడు. అతడు తృప్తిగా వెళ్లిపోయాడు.
మిగిలింది నీరు మాత్రం. అదీ ఒకనికి సరిపోయేంత లేదు. నీరు త్రాగడానికే సపరివారంగా కూర్చున్నారు.
అప్పుడు ఆకలిగొన్న ఒక చండాలుడు వచ్చాడు. 'ఆకలి - దాహం' అని ఆర్తనాదం చేశాడు. రంతిదేవుడు సకల ప్రాణులందు భగవంతుని దర్శించువాడు. వచ్చిన వాణ్ణి భగవంతునిగా భావించాడు. 'అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న' అని ఇచ్చాడు. అతడు తృప్తిగా వెళ్లిపోయాడు.
అప్పుడు రంతిదేవుడు ప్రార్థిస్తున్నాడు:-
"భగవాన్! నాకు సకల ఐశ్వర్యాలు అక్కరలేదు. నేను నిన్ను మోక్షం కూడ అర్థించను. నేను కోరునది ఒక్కటే కోరిక. సకల ప్రాణుల దుఃఖము నాయందే చేరవలెను. సమస్త ప్రాణులు సుఖించవలెను."
ఆ వచ్చిన అతిథులు దేవతలు. రంతిదేవుని ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైనారు.
వారల నేమియు నడుగక
నారాయణ భక్తి తన మనంబున వెలుగన్
ధీరుండాతడు మాయా
పారజ్ఞుండగుచు బరమ పదముంబొందెన్.
రంతిదేవుడు మహాత్ముడు. కర్మయోగి. కోరికలను జయించిన వాడు. నిష్కామి.
రంతిదేవునకు వందల, వేల వందనములు. అతడు తనను జయించాడు. ఆశలను జయించాడు. మానవత్వాన్ని అధిగమించాడు - అతీతుడైనాడు. నిష్కామి అయినాడు. దైవత్వానికి దరిచేరాడు. కాదు. దాటిపోయాడు. ఇంద్రాది దేవతలకు కోరికలు, ఈర్ష్యాద్వేషాలున్నాయి. రంతిదేవుడు వాటినీ దాటాడు. అతడు 'పరమపదముంబొందెన్' అన్నాడు పోతనామాత్యుడు.
నాకు రంతిదేవుడంటే అత్యంత అభిమానం. భక్తి. నేను "ఆకాశవాణి" కి 'రంతిదేవుడు' అనే నాటిక వ్రాశాను. అది చాల కాలం క్రితం ప్రసారమైంది.
యుగాంతం అవుతుంది. వేదాలు మాయం అవుతాయి. అప్పుడు బ్రహ్మ మహర్షులకు అనుమతిస్తాడు. మహర్షులు ఇతిహాస సహితములైన వేదాలను మరల అందుకున్నారు.
మానవ జీవితం లోని ప్రతి అంశం గురించి భారత మేధావులు, ఋషులు, మునులు, విద్వాంసులు చేసినంత అధ్యయనం, పరిశోధన, పరిశ్రమ, కృషి మరెవ్వరూ చేయలేదు. ఇది సత్యం - ఇది నిశ్చయం.
ఋషి అంటే గడ్డం పెంచుకొని, ముక్కుమూసుకొని, కొండ కోనల్లో తపస్సు చేసుకునే వారనే భ్రాంతి భారత స్వప్రయోజన పరులు మనకు కలిగించారు. అది ప్రమాదకరం అయిన భ్రమ. అయితే దాన్ని తొలగించడం అంత సులభం కాదు.
ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలాడు. అన్యం ఎరుగడు. పరిశోధనయే లక్ష్యం. ప్రాపంచిక విషయాలు ఎరుగడు. అంతటి దీక్ష అతనిది. అదే తపస్సు. అతనిని ఎవరూ నియమించలేదు. జీతభత్యాలు ఇవ్వలేదు. స్వచ్చందంగా పరిశోధనకు పూనుకున్నాడు. అతను కోరిందేమీ లేదు. కేవలం మానవాభ్యుదయం మానవ కళ్యాణం! మానవ జీవితం సుఖమయం - శాంతియుతం కావాలి. ఇదీ లక్ష్యం ఇవ్వాళ్టి మన ఈ మాత్రపు జీవితానికి మహర్షుల కృషి తపస్సే కారణం!
పాశ్చాత్య భాషలో సైంటిస్టు జీతగాడు, లేదా బేహరి. అయినా పాశ్చాత్యుల చరిత్ర ఎంతటిది? యురొపుది వేయేళ్లు. అమెరికాది నాలుగు వందల ఏళ్లు! ఈలోగా వారు చేసిన, చేస్తున్న, చేయనున్న రీసెర్చి, వ్యాపారం. మానవజాతి వినాశానికి మాత్రం ఉపయోగపడుతున్నది. ఇది భస్మాసుర హస్తం. వారినే నాశనం చేస్తుంది! కాలాన్ని కట్టిపెట్టిన రావణాదుల గతి ఏమైందో భారత ఇతిహాసం చాటి చెపుతున్నది. వాల్మీకి రామాయణ సుందర కాండలో లంకను ఎంతో సుందరంగా వర్ణించాడు. అది నేటి పాశ్చాత్య వ్యామోహ జీవితానికి సరిగ్గా సరిపోతుంది!
కాలాన్ని గురించి భారతదేశంలో జరిగినంత పరిశ్రమ మరెక్కడా జరగలేదు. దీన్ని "మూఢనమ్మకం" అని ఆంగ్లేయులు భారత మేధావులను వప్పించారు. అదే చదువు చెప్పారు. వారు మనను గ్రుడ్డి వారినీ, చెవిటివారినీ చేశారు! ఇప్పుడు మనం సత్యం విననొల్లం - చూడనొల్లం. మనకు ఆత్మగౌరవం - ఆత్మ విశ్వాసం నశించింది. ఇవ్వాళ మనం అన్ని బానిసత్వాలు, డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం. ఈ వ్యవస్థ విషాన్ని అమృతం అని అమ్మి లాభాలు ఆర్జించగలదు! చావునే బ్రతుకని నిరూపించగలదు!