ఇంకోవిషయం___వారంలో పాతికమంది అమ్మాయిల్ని మనంఎంచుకుంటే అందులో చివరికి మిగిలేది ఒకమ్మాయి. ముందుజాగ్రత్తగా మరో అయిదుగురు అమ్మాయిల్నికూడా సెలక్టు చేసుకుంటాను. ఇందులో ఎవరి వ్యక్తిగత యిష్టాలకూ తావులేదు.....నా నిర్ణయమే నిర్ణయం....ఏవంటారు?" సీరియస్ గా అడిగాడు మనోహర్.
"అలాగే" యిద్దరూ తలూపారు.
"ఈ పథకంలో ఎక్కడ ఏ పొరబాటు జరిగినా నష్టపోయే నేనే.....అదిమాత్రం గుర్తుంచుకోండి.
నేను నా ;శపధాన్ని' నిలబెట్టుకోలేని పరిస్థితులే ఏర్పడితే___నన్ను మీరు మనిషిగా చూడలేరు" ఆ మాటను సీరియస్ గా అంటున్న మనోహర్ ముఖంలో 'పందెం' గెలవాలన్న పట్టుదల, దీక్ష స్పష్టంగా కనిపించాయి ఆ ముగ్గురికి. మనోహర్ అనుకున్నది సాధించగలడు. కాని......యిలాంటి 'పందెం' కాయటం మాత్రం......మనోహర్ ని అభిమానించే అక్కడున్న ముగ్గురికి భయాన్ని కలిగించింది. వారి భయం నిజమవుతుందనే నమ్మకం కూడా వారికి కలిగింది యెందుకో.
అలా అని మనోహర్ ని ఆపుచేయగల ధైర్యం, చనువు వారిలో ఎవ్వరికీ లేవు. తెలిసీ, కావాలేనే మనోహర్ కోసం ప్రమాదభరితమయిన పందెంలోకి దిగేందుకు సిద్దమయ్యారు వారు. రోట్లో తలపెట్టి, రోకటి పోటుకు వెరచే పిరికితనం లేనివారు యీ ముగ్గురూ. ఒక్కొక్కరూ ఒక్కో శాఖలో నిష్ణాతులు.......ముగ్గురివేపు ఓసారి చూసి లేచాడు మనోహర్ ఆ క్షణంనుంచి అతనికళ్ళు కెమెరా లెన్స్ లుగా మారిపోయాయని ఆ ముగ్గురికి తెలియదు.
* * *
బొంబాయి వర్ధమాన చిత్రకారిణి మునీరహవా సెల్ఫ్ పోట్రయిట్ ఆ గోడకుంది. ఆ గోడ గోధుమరంగులో వుంది. గోధుమరంగు గోడమీద కాఫీపొడుం రంగులో పెయింటింగు. ఆ పెయింటింగ్ లో ఆ అమ్మాయి కురులసంపద వరదపొంగులా వుంది. ఆ అమ్మాయి ఓరకళ్ళే పెయింటింగుకి సజీవత్వాన్ని తెస్తున్నాయి. విలక్షణత, విశృంఖలత్వం తనకిష్టమయిన అందాలని ఆ మునీరా చిత్రం స్పష్టం చేస్తుంది. ఆ విశాలమయిన గదికి ఆ మునీరా చిత్రమే అలంకారం. ఆ గది మధ్యలో తూగుటుయ్యా లొకటుంది. ఆ ఉయ్యాలమీద యూ ఫోమ్ పరుపు, దానిమీదో మెత్తని దిండూ వున్నాయి. ఆ పరుపుమీద దిండుకానుకుని రోమాకౌర్ అందంగా కూర్చుంది.....
అప్పుడావిడ నీలపురంగు చుడీదార్........కుర్తాలో చాలా అందంగా వుంది. ఆ ఉయ్యాలముందు పేముకర్రతో చేసిన టీపాయ్ వుంది. దానిమీద రెండు చల్లని పానీయాల సీసాలున్నాయి.
ఆ టీపాయ్ కిటువైపు ఆ ఉయ్యాలకు ఎదురుగా వున్న___
అతి మెత్తని పేము కుర్చీమీద___
మనోహర్ కూర్చున్నాడు.
అతనక్కడకొచ్చి పదిహేను నిమిషాలయింది.
"నేను వస్తానని బర్త్ డే అని అబద్దం చెప్పావా.......?" అడిగాడు మనోహర్.
"కాదు."
"మరి....."
"మీ ఎదుట కొంతకాలం ఏకాంతంగా గడపోచ్చని" అందంగా నవ్వుతూ అంది రోమా.
"నేన్నమ్మను.......ఉదయం మనిద్దరమే ఏకాంతంగా వున్నాం......అప్పుడు నాతో ఏకాంతంగా గడిపినట్టేకదా?" అన్నాడు మనోహర్.
"అవును. కానీ......నా ఏకాంతం వేరు."
"అంటే?"
"తెలుస్తుందిలెండి కంగారెందుకు?" రోమా మళ్ళీ నవ్వింది.
"నన్ను పది నిమిషాల్లో పంపిస్తానన్నావు.......అది దాటిపోయింది" గుర్తు చేశాడు మనోహర్.
కొంతసేపు ఎవరూ మాట్లాడుకోలేదు.
"మీరు బాగా ఎదిగిపోయారు మిష్టర్ మనోహర్......" అంది రోమా.
"అవును. మనం మొదట కలిసింది 1981 లో అనుకుంటా" మనోహర్ నవ్వాడు.
"నేనా ఎదుగుదల గురించికాదు అంటోంది" అని లేచి ఒక బీరు సీసాలోని ద్రవాన్ని రెండు గ్లాసుల్లో పోసింది రోమా.
"తీసుకోండి" అంది తను గ్లాస్ అందుకుంటూ.
"నో....థాంక్స్."
తిరస్కరించాడు మనోహర్.
"బీరు ఆడపిల్లలు తాగుతున్నారు.....మీరు"
"నీకు తెలుసు నేను తాగనని."
"మీరు నిజంగానే ఎదిగిపోయారు. వృత్తిపరంగా ఎంతో సిన్సియర్ గా. తెలివిగా మోడల్స్ ని మీ యాడ్ ఫిల్మ్స్ లో వాడుకుంటారు. నిజజీవితంలోకి వస్తే వాళ్ళకు దూరంగా మనవృత్తిలో వుండే అలవాట్లకు దూరంగా వుంటారు. మోస్ట్ కాంప్లెక్స్ మెంటాలిటీ......"
రోమా ఆగింది ఓ నిమిషం. కోటేరులాంటి మనోహర్ ముక్కు చూస్తూ- కొంతసేపు పోయాక తనే అంది.
"మీరింతవరకూ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు మిస్టర్ మనోహర్?"
మనోహర్ ఏదో చెప్దామనుకున్నాడు. మళ్ళీ చెప్పకూడదనుకుని మానేశాడు. అతనికిక్కడ చాలా బోర్ గా వుంది. అర్జంట్ అపాయింట్ మెంట్ కాన్సిల్ చేసుకుని ఇక్కడికొచ్చాడు. కానీ ఇక్కడ రోమా తీరుబడిగా మాట్లాడుతోంది. బర్త్ డే పార్టీకి రాకపోతే ఏమనుకుంటుందేమోనని వచ్చాడు. కాని ఇక్కడికొచ్చాక తెల్సింది రోమా అబద్దాలు కూడా ఆడుతుందని, తనని......అబద్దం ఆడి రప్పించుకోవాల్సిన అవసరం ఏముంది రోమాకి?......అర్థమయినట్లే అర్థం కాకుండా వుంటారు ఆడవాళ్ళుమనోహర్ కి. వృత్తి గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తాడో అనునిత్యం తనకు తారసపడే అమ్మాయిల గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు......
అనే ఆలోచిస్తున్నాడు మనోహర్.
"ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు.....అంటే నా గురించేనన్న మాట......ఎందుకంటే తమ గురించి తప్ప ఇతరుళ గురించి ఎక్కువమంది సీరియస్ గా ఆలోచిస్తారని నేననుకుంటున్నాను. యామై కరెక్టు?"
"మే బి......బట్.....బట్....." నసిగాడు.
గదిలో ఎ.సి. గాలిలో కల్సివస్తున్న ఇంటిమేట్ సెంట్ మత్తుగా చల్లగా వుంది. అప్పుడప్పుడు ఉయ్యాల మెల్లగా కదులుతున్న చప్పుడు, అందమైన అమ్మాయి కాలిమువ్వల చప్పుడుగా ఆహ్లాదంగా వుంది.
"వృత్తిపరంగా మనిద్దరం స్నేహితులం అవునా.....అదే కాకుండా మోడలింగ్ లో నన్ను ఎంకరేజ్ చేసింది కూడా మీరే.....ఈ హైదరాబాద్ సిటీలో చూస్తే 'హైవీ పెయిడ్' మోడల్ ఆర్టిస్ట్ ని కూడా నేనే........"
"అవును" అన్నాడు మనోహర్ సాలోచనగా........రోమా ఇంకేదో అడుగుతుంది అనుకున్నాడు. కాని ఆ అమ్మాయి చటుక్కున విషయం మార్చేసింది.
"నేనప్పుడప్పుడు ఒంటరితనాన్ని ఫీలవుతుంటాను, మనోహర్.....ఆ ఒంటరితనం భరించటం నాకు చాలా కష్టంగా వుంటుంది. అసహ్యంగా, బాధగా వుంటుంది. అప్పుడు నాకు....తోడు......మగతోడు......కావాలని వుంటుంది. ఆ మగతోడు మంచి స్నేహితుడెవ్వరు? మీరు తప్ప......? అందుకే అబద్దమాడి మిమ్మల్ని రప్పించాను."
ఈ మాటల్ని నెమ్మది అంది రోమా.
కాసేపు మౌనం, మనోహర్ కి ఏం మాట్లాడాలో తెలీలేదు.
మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది రోమా.
"మిస్టర్ మనోహర్, నా మటుకు నాకు 'విక్కీలా మొట్టా ఇష్టం- విక్కీలా మొట్టా పేరు విన్నారా మీరు?" అడిగింది రోమా.
"విన్నాను" అని అన్నాడు మనోహర్.
రోమా మాట్లాడుతున్న మాటలు ఒకదానికొకటి పొందికలో లేవు. అది రోమా విలక్షణత్వానికి చిహ్నమా? ఏమిటో రోమాను కొన్నేళ్ళుగా ఎరిగినా, ఆవిడ అనుకున్న 'ఏకాంతం' సమయంలో మనోహర్ కలుసుకోవడం ఇదే ప్రథమం.
ఆమె ఏం చెప్తోందో అర్థంకాక వింటున్నాడు మనోహర్.
"విక్కీలామొట్టా" అందం చూస్తే ఇరవై యేళ్ళ అమ్మాయిలు కూడా పిచ్చెక్కిపోతారు. విక్కీలామొట్టా అమెరికాకు చెందిన ఫేమస్ మోడల్ గర్ల్. ప్రస్తుతం ఆమెకి 55 ఏళ్ళు దాటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ జీవితంలో విషాదం, నా జీవితంలో విషాదం ఒక్కటే..........విక్కీ 23 ఏళ్ళ వయస్సులో మొదటి భర్తని వదిలేసి ముగ్గురు, పిల్లల్ని తీసుకొని ప్లోరిడా వచ్చి, అక్కడ నాట్య ప్రదర్శనలిచ్చి బ్రతికేది. ఆమె తన మొదటి భర్తనుంచి విడిపోయి ఎందుకొచ్చేసిందో తెలుసా......? అతగాడు ప్రేమ పేరుతో పెట్టే శారీరకహింసలు భరించలేక......శాడిస్ట్ కానిక్ శాడిస్టు......అలాగే నా జీవితంలో కూడా అదే విషాదం......నాకు పిల్లల్లేక పోవడం.......ఆనందకరమైన విషయం....విక్కీ రెండో పెళ్ళి చేసుకున్నాక సుఖపడిందనుకోండి......అప్పుడే ఆమె పోటోలు వేసుకోడానికి పత్రికలు కొన్నివేల డాలర్లిచ్చేవి. నేను మగవాళ్ళ గురించి ఆలోచించినప్పుడల్లా.......నా భర్త గుర్తుకొస్తాడు.......అక్కడ నేను పడ్డ బాధలు గుర్తుకొస్తాయి....... బాల్యం నుంచి పెళ్ళివరకు పేదరికంలో ఎన్నో కష్టాలనుభావించాను. అంత బాధలోనూ అద్భుతమైన నా అందమే నన్ను వూరడించేది. నా అందం చూసి ఏ రాకు మారుడో రాకపోతాడో........పైసా కట్నం అడక్కుండా పెళ్ళి చేసుకుని ఎగరేసుకు పోకపోతాడా......! అని తియ్యటి కలలు కనేదాన్ని.
నేననుకున్నట్టే డబ్బున్నవాడు వచ్చాడు. చాలా అందంగా, నాగరికంగా అగుపించాడు. నన్ను మెచ్చానన్నాడు. నన్ను ప్రేమించాడనుకున్నాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. మంచివాడనుకున్నాను. పెళ్ళయింది. అలాగే కొన్ని నెలలు నన్ను అపురూపంగా చూసుకున్నాడు. అందుకు మురిసిపోయాను. ఆ మురిపెం మూన్నాళ్ళే అయింది.
ఒకరోజు బాగా డబ్బున్న తన ఫ్రెండ్ ని తెచ్చాడు ఇంటికి___
అతనికి ఆనందాన్నిస్తే మన భవిష్యత్తు బాగుంటుంద'న్నాడు. నాకు స్పృహ తప్పలేదు. అతని ధోరణికి. కాని ఇటువంటి భర్తలుంటారా, వారికి సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు వుండవా అనిపించింది.
అతనిమీద అసహ్యం వేసింది......అతన్ని నాలుగు దులిపి వచ్చేశాను. ఆ రావటం రావటం మీ దృష్టిలో పడ్డాను. నా అదృష్టం బావుంది. ఒకప్పుడు తిండికి డబ్బులేదు. కొన్నాళ్ళకి డబ్బుండేది కాని, మొగుడి ప్రేమలో మోసపోతూ ఆ ప్రేమతోనే కడుపు నింపుకునేదాన్ని, ఇప్పుడు........
డబ్బుంది......పేరుంది.....గ్లామర్ వుంది.....వాస్తవ జీవితం అంటే తెలుసుకున్నాను......కనుక భ్రమల్లో లేను. కాని ఒంటరితనం.....
దారుణమైన ఒంటరితనం......
గుండెల్ని పిండే ఒంటరితనం....."
"పెళ్ళి చేసుకోవచ్చుగా రోమా?"
"వచ్చు....."
"మరి అభ్యంతరం??"
"ఒకసారి గృహిణిగా దెబ్బతిన్నాను. మరోసారికూడా మోసగించ బడతానేమోనన్న భయం. ఇప్పటికే నేను మీ ద్వారా మోడల్ గా సంపాదించానన్న డబ్బు తీపిగా కనిపించవచ్చు. కాని నాకున్న పేరుని......సహించలేకపోవచ్చు....అప్పుడు అతనిలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. మగవాడి శాడిజానికి ఇదికూడా ఒక కారణమే___ఇవన్నీ కాదు అనుకున్నా అర్ధనగ్నంగా నేను చేసే యాడ్ ఫిల్మ్స్ ని సహృదయంతో చూడగలడా? లేదు - వృత్తి మానేయమంటాడు.
జీవితం అంటే ఏమిటో తెలియనప్పుడు భర్తకులొంగి గృహిణిగా గడిపేదాన్నే మోకాని, ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చంపుకొని మాత్రం గృహిణిగా మారలేను."
వాతావరణం గంభీరంగా వుంది. ఎంత లోతుగా ఆలోచించగలుగుతోంది రోమా! మనోహర్ ఆలోచిస్తున్నాడు. కాని, రోమా చటుక్కున చెప్పడం ఆపేసింది.
"నేనిప్పుడు.....ఒకదానికి......మరొకటి.....సంబంధంలేని అనేక విషయాలు చెప్పాను కదూ! అదే రోమా లక్షణం! బాధల్లోపుట్టి, బాధల్లోపెరిగి సుఖాల తెరల చాటులో బాధలు అనుభవించేవాళ్ళు నాలాగే మాట్లాడుతారు...."