Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 45


    సెక్యూరిటి గార్డ్స్ వచ్చి బిల్హరిని బరబరా లాక్కుపోయారు- మిత్ర ఇన్ స్ట్రక్షన్స్ మేరకు.

 

    అతడు వెళ్ళిపోయాక ఆ గదిలో గంభీరమయిన వాతావరణం అలముకుంది.

 

    "బిల్హరిని మీరు ఇంటర్వ్యూ చేసి పంపిన కొన్ని గంటలకే అతడి గత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాను. అతడు అంతగా భయపడాల్సినంత గొప్ప నేరస్తుడిగా అనిపించలేదు నాకు.. అతడి గురించి రిపోర్ట్ చదివాక"

 

    "అంటే మీ ఉద్దేశం..." అడిగాడు డైరెక్టర్ మిత్ర అడ్డుపడుతూ.

 

    "ఇదంతా నా క్యూరియాసిటీవల్లే చేశాను" ఆ మాటకు శృతితోపాటు డైరెక్టర్ మిత్ర కూడా నిర్ఘాంతపోయారు.

 

    "కారణం చెప్పండి" తేరుకుని అడిగాడు మిత్ర.

 

    "ఇది పనిచేసే విధానం నాకోసారి ప్రాక్టికల్ గా తెలిస్తే మరింత జాగ్రత్తపడటానికి వీలవుతుందనే బిల్హరిని క్వాలిఫై చేశాను" సీరియస్ గా చెప్పాడు అన్వేషి.

 

    "డైవర్ట్ చేయకుండా సూటిగా సమాధానం చెప్పండి" అసహనంగా అడిగాడు మిత్ర.

 

    డైరెక్టర్ మిత్ర అంత సీరియస్ గా మారడం అన్నది తను ఉద్యోగంలో చేరాక మొట్టమొదటిసారిగా తటస్థించింది శృతికి.

 

    "క్రిప్టోగ్రాఫ్ మిషన్ ని ఎవరైనా ఆపరేట్ చేస్తే గమనించాలనిపించింది. సరిగ్గా నా కుతూహలం పెరుగుతున్న సమయంలో బిల్హరి వచ్చాడు. అతడి గూర్చి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్ గా చేయాలనిపించింది. బిల్హరి అందుకు తగిన వ్యక్తిగా నిర్ధారించుకునే సిఫార్సు చేశాను" సిన్సియర్ గా చెప్పాడు అన్వేషి.

 

    "ఇతడినే ఎందువల్ల ఎన్నుకున్నట్లు?" మిత్రలో అసహనం పెరగడం సూచించింది అతడి గొంతు.

 

    "బిల్హరి నా పాత స్నేహితుడు" చెప్పాడు అన్వేషి.

 

    సాలోచనగా మిత్ర శృతివైపు చూశాడు.

 

    "మనం మళ్ళీ ఏకాంతంగా మాట్లాడుకుందాం. బహుశా నాకీ షాక్ నుండి తేరుకోవడానికి రెండ్రోజులు పట్టొచ్చు... ప్రాక్టికల్ జోక్స్ నాకిష్టం వుండదు" అంటూ సీరియస్ గా లేచి వెళ్ళిపోయాడు మిత్ర క్రిప్టోగ్రాఫ్ మిషన్ కవర్ వేసి.

 

    "మిత్రగారి కోపం నేనింత వరకూ చూడలేదు. ఆయనకు ఆవేశం తెప్పించిన మొదటి వ్యక్తి బహుశా నువ్వే కావచ్చు" అంది శృతి.

 

    "కవర్ బటన్ క్లిప్ చేయలేదు" అన్నాడు అన్వేషి శృతి దగ్గరకు వస్తూ.

 

    క్లిప్ చేసిందామె.

 

    "క్లిప్ చేయాల్సినవి ఇంకా నాలుగు మిగిలిపోయాయి" కొంటెగా అన్నాడతను- ఆమె కళ్ళలోకే సూటిగా చూస్తూ.

 

    "యూ సిల్లీ!" అందామె సిగ్గుల మొగ్గవుతూ.

 

    అప్పుడా నేలమాళిగలో ఆ ఇద్దరే మిగిలిపోయారు. మితిమీరిన మిత్ర కోపాన్ని కూడా తట్టుకొని, ఆ వెంటనే జాలీ మూడ్ లోకి ఎలా రాగలిగాడు అన్వేషి? విచిత్రమయిన వ్యక్తిలా వున్నాడే? అతని గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయింది శృతి.

 

    అటుఇటు చూసి వేగంగా ముందుకొచ్చి శృతి నడుము మీద చెయ్యి వేశాడు అన్వేషి.

 

    "సెక్యూరిటీ గార్డ్స్..." అంటూ దూరంగా వరండావిపు చూస్తూ కనురెప్పలు రెపరెపలాడించింది శృతి.

 

    "నా దగ్గిరిప్పుడు రివాల్వర్ వుంటే బావుండేది" అంటూ సెక్యూరిటీ గార్డ్ వైపు చిరాగ్గా చూస్తూ ముందుకు కదిలాడు అన్వేషి.

 

    సరిగ్గా అదే సమయంలో - హైద్రాబాద్ మహానగరంలోని ఓ మూలన, విశ్వాత్మ విసిరినా సవాలును ఛేదించే పథకానికి అంకురార్పణ జరిగింది.  

 

                                                 *    *    *    *

 

    జూబ్లి హిల్స్...

 

    సాయంత్రం ఆరుగంటలైంది.

 

    వాతావరణం పొడిపొడిగా వుంది.

 

    ఫణివర్మ బైనాక్యులర్స్ ను సర్దుకున్నాడు. అతడి మొహంలో సంతృప్తికరమైన నవ్వు కదలాడింది. వెళ్ళబోయేముందు చివరిసారిగా ఎత్తయిన కొండరాయి పైనుంచి విశ్వాత్మ ప్యాలెస్ ని చూశాడు తీక్షణంగా అయిదు రోజులుగా అతడు చేస్తున్న అన్వేషణ ఆ సాయంత్రంతో పూర్తయింది.

 

                               *    *    *    *

 

    జాతిపిత అన్న పేరు ఆయనకు సార్ధకమయింది. ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటానుకోట్ల ప్రజలు విలపించి పోతున్నారు. ఈ గడ్డమీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో వెయ్యేళ్ళు కనిపిస్తుంది. ప్రపంచం దాన్ని దర్శిస్తుంది. 1948 జనవరి 30న న్యూఢిల్లీలో గాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి భారత ప్రధాని అన్న మాటలివి.

 

    అంతకు కొన్ని నెలల ముందు భారతదేశం శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 78 ఏళ్ళ వయస్సుగల గాంధీగారి పని పూర్తి అయిపోయింది. తన రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. భగవంతుడు ఇచ్చిన గడువు సమీపించబోతోందని ఆయనకు తెలిసిపోయింది.

 

    కర్తవ్య నిర్వహణ పూర్తయిపోయింది. జీవిత రంగస్థలం మీద తన పాత్ర చివరకొచ్చిందని కూడా ఆయనకు తెలిసిపోయింది.

 

    ఆ విషాద సంఘటన జరిగిననాడు పొద్దున్న, "ఆభా, ముఖ్యమైన కాయితాలన్నీ ఇలా తీసుకురా" అని తన మనుమరాలితో చెప్పారు.

 

    నేనివాళ జవాబులు రాసెయ్యాలి. రేపనేది ఇక లేకపోవచ్చు. తమ చరమ భవితవ్య సూచనల్ని గాంధీగారు తమ రచనల్లో అనేకచోట్ల వెల్లడించారు. మహిమాన్వితులకే మృత్యుఘటికలు వినిపిస్తుంటాయి.

 

    నిరంతర ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలోకి చొచ్చుకు పోయిన మూడు పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు, మెల్లగా నేలకు వాలుతూ, మౌనంగా క్షమాదానం చేస్తూ హిందూ సంప్రదాయరీతిలో నమస్కరిస్తూ చేతులు పైకి ఎత్తారు.

 

    జీవితంలో నటనే ఎరగని మహాత్మాగాంధీగారు ఆ మరణ సమయంలో మహా నటులయ్యారు. ఆయన నిస్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి ప్రేమపూర్వకమయిన ఆ చివరి భంగిమను చూపించగలిగాయి.

 

    ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ-

 

    "ఇటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమిమీద నడిచారన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు" అన్నారు.

 

    రోమ్ లో వున్న వాటికన్ సిటీ నుంచి వచ్చిన సందేశంలో ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తీభవించిన దేవదూతలాంటి గాంధీగారి కోసం ప్రజలు విలపిస్తారు- అని వుంది. 

 Previous Page Next Page