ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమిమీదకి వచ్చిన మహాపురుషులందరి జీవితాలూ ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి వుంటాయి. భారత సమైక్యం కోసం నాటకీయంగా సంభవించిన గాంధీగారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలయి పోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటిచెప్పింది.
ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా వెల్లడించారు.
"అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది; అది జీవిస్తుంది. అది ప్రపంచానికి శాంతిదూత.
అలా వెల్లడించినా, గాంధీగారికో ఆందోళన ఆయన గుండెలోతుల్లో గూడుకొట్టుకొని వుండేది-
కోట్లాది దేశభక్తుల రక్తప్రవాహాలతో, అశ్రుతర్పణంతో సాధించుకున్న స్వాతంత్ర్యం సద్వినియోగమవుతుందా? దుర్వినియోగమవుతుందా? అని.
ఆ అసంతృప్తితోనే ఆయన పోయారు గనుక, ఆయన తిరిగి జన్మించక తప్పదేమో...
కంటికి కనిపించని సూక్ష్మలోకంలో వుండే గాంధీజీ ఆత్మ- నేడు జరుగుతున్న దుర్మార్గాల్ని చూసి ఎంతగా క్షోభిస్తుందో?
తమకున్న అధికారాల్ని ఏకరువు పెట్టి, బెదిరించి ప్రజలనుంచి లంచాలు దండుకొనే దౌర్భాగ్యులయిన ప్రభుత్వ సిబ్బందిని- మేలు చేస్తామని చెప్పి పదవుల్లోకి వెళ్ళి టన్నుల కొద్ది వెండి, బంగారాల్ని, ఇళ్ళని- తోటల్ని వెనకేసుకొనే రాజకీయ నాయకుల పచ్చి స్వార్థాన్ని చూస్తున్న గాంధీజీ ఆత్మ తిరిగి మానవ రూపంలో ప్రాణం పోసుకోక తప్పదేమో.
తిరిగి మరో ఉద్యమం నడవక తప్పదేమో అది అనివార్యమని కూడా అనిపిస్తోంది.
గాంధీగారి మరణం తాలూకు బుక్ చదువుతున్న అన్వేషి ఒక్క క్షణం చదవటం ఆపి ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
అలా క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు- చిన్న చావుని ఆహ్వానిస్తూ.
సూర్యుడు పూర్తిగా అస్తమించాడు.
ఒక సాహస నిర్ణయానికి వచ్చిన ఫణివర్మ ఆలోచనల్లా చీకటి క్రమ క్రమంగా ఆక్రమించుకొంటోంది. మూఢనమ్మకాలకు, అవి ఆచరించే ప్రజలకు నిలయమైన భారతదేశ ప్రజలను, మేధావులను, హేతువాదాలను దిగ్భ్రాంతిలో ముంచబోతున్న ఫీలింగ్ మనసులో లీలగా మెదలగానే ఫణివర్మ సన్నగా విజిల్ వేశాడు వుత్సాహంగా.
రెండు దశాబ్దాలుగా విశ్వాత్మ పునర్జన్మ గురించి, క్రిప్టోగ్రాఫ్ కోడ్ గురించి తల పగిలిపోయేలా ఆలోచించిన జనం, నిర్లక్ష్యం చేసిన చిన్న లొసుగును కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి తనే.
ఆ భావన మనసులో మెదిలేసరికి, ఒక మహా నియంతలా వెనుదిరిగి ఆ కొండలవైపు మధ్యలో కనిపిస్తున్న ప్యాలెస్ వైపు చూసిన ఫణివర్మకు- రేపటి ప్రపంచపు అరుదైన ధనవంతుడు విశ్వాత్మని నేనే అని గొంతు చించుకొని గట్టిగా అరవాలనిపించినా బలవంతంగా అణుచుకొని కారు స్టార్ట్ చేశాడు.
* * * *
సిగరెట్ చివరి పఫ్ ని గుండెల్నిండా గాఢంగా పీల్చుకుని అప్పుడే అయిపోయావా అన్నట్టుగా విచారంగా పారేశాడు హరి ఉరఫ్ బిల్హరి.
రాత్రి పదకొండు దాటాక రహస్యంగా రూమ్ కి వెళ్ళి తెల్లవారుజాము ఐదు గంటలు రాకముందే బయటపడడం, గత వారం రోజులనుంచి అతని దినచర్య అయిపొయింది.
ఆకలిగా అనిపించేసరికి జేబులు తడుముకున్నాడు హరి. మూడు రూపాయల చిల్లర, రూం తాళం చెవి, రూం అద్దె, చిన్న చిన్న అప్పుల లిస్ట్ తీశాడు జేబులోంచి. అప్పులన్నీ లెక్కించాడు. పదహారు వందలు. ఆ అప్పును ఎలా తీర్చాలో అతనికర్థంగాక దిగులుపడిపోయాడు. కృష్ణాపత్రిక ఆఫీస్ దాటుతుండగా టీ బండివాడు పలకరించారు.
"నమస్తే హరి సాబ్! కన్పిస్తలేదేంది?" అన్నాడు.
ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు హరి. వెంటనే తేరుకుని-
"ఏం బావున్నావా... ఎలా వుంది బిజినెస్" అడిగాడు హరి నవ్వు పులుముకుని.
"ఏం బిజినెస్ సార్! మీలాంటోళ్ళు నలుగురొస్తేనే గదా నడిచేది" టీ అందిస్తూ చెప్పాడతను.
"ఊరెళ్ళానోయ్ ఈ మధ్య. అన్నట్టు నీకో ఏభై రూపాయలు యివ్వాలి కదూ? జీతం అందగానే యిచ్చేస్తాను" చెప్పాడు బ్రెడ్ తీసుకుంటూ.
"మీ దగ్గరేడకి పోతాయి సాబ్ పైసలు" అన్నాడతను భరోసాగా నవ్వుతూ.
మొహమాటంగా నవ్వి థాంక్స్ చెప్పాడు హరి, ఒక సమస్య తీరినట్లు రిలీఫ్ గా ఫీలవుతూ.
ఆకస్మికంగా వెనకనుంచి భుజం తట్టినట్టు అనిపించేసరికి తల తిప్పి చూశాడు. పలకరింపుగా నవ్వుతూ ఇంటి ఓనర్ శ్రీముఖం. కనుబొమలెగరేశాడు.
తిరిగి హరి గుండెల్లో రాయి పడింది.
సమస్య మీద సమస్య.
ఒకటి తీరితే మరొకటి.
"నా ఇంట్లోనే వుంటావు. కానీ నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుక్కోవాలి" అన్నాడు శ్రీముఖం.
చెమటలు పట్టాయి బిల్హరికి. అద్దె అడిగి టీ కొట్టువాడి ముందు పరువుదీస్తాడేమోనని.
"డ్యూటీ... డ్యూటీ సార్! క్షణం తీరక లేదంటే నమ్మండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. క్షమించాలి" అన్నాడు తడబడుతూ.
"భలేవాడివే. ఇబ్బంది నాక్కాదయ్యా ఆ పోస్ట్ మాన్ కి" చెప్పాడు శ్రీముఖం.
"పోస్ట్ మేన్ కా... ఎందుకండి?" అని అడిగాడు హరి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ.
"ఎందుకంటావేమిటయ్యా! నీకేదో ఉత్తరంతోపాటు ఎమ్. ఓ. వచ్చిందట. రెండు రోజుల్నుంచి తిరుగుతున్నాడు" అన్నాడు శ్రీముఖం హుషారుగా.
హరిలో ఒక్కసారిగా ఉత్సాహం తొంగిచూసింది.
ముందుకు పరిగెత్తాడు.
రూమ్ మెట్లెక్కుతూనే ఓనర్ కూతురిని అడిగాడు హరి పోస్ట్ మేన్ గురించి.
"రాలేదు. పదకొండు అవుతుంది" చెప్పింది.
ఉత్సాహంగా విజిలేస్తూ, తాళం తీసి స్నానానికి ఉపక్రమించాడు. ఎవరు పంపించి వుంటారా అని ఆలోచించాడు స్నానం చేస్తూ.