Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 44


    కారు విశాలమైన రోడ్లమీద ట్రాఫిక్ మధ్యనుంచి దూసుకుపోతోంది. సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నా అతనెక్కడో ఆలోచిస్తున్నాడు.

 

    నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా... అనే ప్రశ్నను అడగటానికి హోటల్లో చాలాసార్లు ఉద్యుక్తుడయిన అన్వేషి, ఎందుకో అ ప్రశ్నను అడగలేకపోయాడు. ప్రస్తుతం అన్వేషి ఆ విషయమై ఆలోచిస్తున్నాడు. అడగాలా? వద్దా? అని. అసలా ఆలోచనే అతనికి విచిత్రంగా వుంది. తనెందుకు పదే పదే శృతివైపు ఆకర్షింపబడుతున్నాడు?

 

                              *    *    *    *

 

    క్రిప్టోగ్రాప్ మెషీన్ ని చూడగానే బిల్హరి ముఖంలో రంగులు మారడాన్ని గమనించాడు అన్వేషి.

 

    గది డోర్ లాక్ చేశాక కుడివైపు నున్న ఖాళీ స్థలంలో ఛైర్ వేసుకుని తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడతను.

 

    శృతి బిల్హరికి ఎడమవైపున కూర్చుంది. మిత్ర రిమోట్ కంట్రోలర్ పట్టుకుని కూర్చున్నాడు.

 

    కంప్యూటర్ వైపు ఉద్వేగంగా చూస్తూ కూర్చున్న బిల్హరికి కాషన్స్ చెప్పసాగాడు డైరెక్టర్ మిత్ర.

 

    నిశ్శబ్దంగా వున్న ఆ నేలమాళిగలో ఒక మహాద్భుతమైన వ్యక్తి పునర్జన్మ తాలూకు ఛాయల కోసం అన్వేషణ ప్రారంభమైంది.

 

    అది అక్కడున్న వ్యక్తులకే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా పరమాశ్చర్య కరమైన సంఘటన.

 

    విశ్వాత్మ పునర్జన్మ గురించి మీడియా మొత్తం ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. పత్రికలు, శాటిలైట్ ఛానెల్స్ తమ విలేఖరుల్ని, ప్రతినిధుల్ని విశ్వాత్మ ఫౌండేషన్ మీద ఓ కన్నేసి వుంచమని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చున్నాయి. అందుకే ప్యాలెస్ బయట మీడియా వాళ్ళు ఎదురుచూస్తున్నారు.

 

    "మిస్టర్ బిల్హరీ! నేను రిమోట్ కంట్రోలర్ తో కంప్యూటర్ ను ఓపెన్ చేసి సిగ్నల్ యివ్వగానే నువ్వు ఆపరేట్ చేయడం మొదలుపెట్టాలి. కానీ ఒక షరతు నువ్వు కీ బోర్డును ఒకసారి మాత్రమే వుపయోగించాల్సి వుంటుంది. ఒకవేళ పొరపాటుగాగానీ, ఉద్దేశపూర్వకంగాగానీ మళ్ళీ ఆపరేట్ చేస్తే మీరు డిస్ క్వాలిఫై అవుతారు. నేను వెంటనే సిస్టమ్ ను స్టాప్ చేస్తాను. ఐ థింక్... మీకన్నీ అర్థమయ్యాయనుకుంటాను" అడిగాడు మిత్ర గంభీరంగా.  

 

    తలపంకించాడు బిల్హరి. ఆ వెంటనే మిత్ర రిమోట్ కంట్రోలర్ స్విచ్ ఆన్ చేశాడు. కంప్యూటర్ స్క్రీన్ పై మసక మసకగా వెలుతురు మొదలయి అది క్రమంగా పాలపుంతలా తెల్లగా మారింది.

 

    ఆ గదిలో నలుగురి శ్వాస మాత్రమే వినిపించేంత నిశ్శబ్దం అలముకుంది అకస్మాత్తుగా.

 

    బిల్హరి తన వణుకుతున్న చేతులను స్వాధీనం చేసుకుని కీ బోర్డును స్పృశించాడు.

 

    మిగతా ముగ్గురి చూపులు గుచ్చుకుంటున్నట్లుగా వున్నాయి అతడి శరీరానికి. ముఖ్యంగా అన్వేషి వైపు చూడాలంటే భయంగా వుందతనికి.

 

    "ఓ.కె. మొదలెట్టండి" అన్నాడు మిత్ర గ్రీన్ సిగ్నల్ యిస్తూ.

 

    కొద్దిక్షణాల తర్వాత ఆన్, ఆఫ్ స్విచ్ ల వైపు బటన్ నొక్కాడు బిల్హరి. లయబద్ధంగా శబ్దం చేసే స్క్రీన్ పై ఒక చార్ట్ ప్రత్యక్షమయింది వెంటనే.

 

    బీప్....బీప్... మంటూ శబ్దం వినిపిస్తోంది.

 

    ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు దానివైపు కాసేపు చూస్తుండిపోయాడు బిల్హరి. అతనిలో అమితమైన ఉద్వేగం గూడుకట్టుకుని వుంది. ఎమోషనల్ ఎక్స్ ప్లోజన్ కి గురయ్యే వ్యక్తిలా వున్నాడతను.

 

    మొత్తానికి కొద్ది నిమిషాలకి తనని తాను నియంత్రించుకుని, ఆ తరువాత తలపంకించి గబగబా కంపోజ్ చేశాడు. క్షణ క్షణం ఓ అద్భుతం జరుగుతున్నట్లు గడిచిపోతోంది ఆ గదిలో. అయిపోయిందన్నట్లు చూశాడు బిల్హరి మిత్ర వైపు.

 

    స్క్రీన్ వైపు చూసి వాచీవంక చూసుకుంది శృతి. ఎక్సయిటింగ్ గా ఫీలవుతున్నట్లు ఆమె కనురెప్పలు కదలాడుతున్నాయి.

 

    నిర్లిప్తంగా కూర్చున్నాడు అన్వేషి.

 

    అతడి ధోరణిని గమనించి విస్తుపోయిన మొదటి వ్యక్తి ఆ రూంలో మిత్ర ఒక్కడే.

 

    మూడు నిమిషాలు గడవటానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలాయి.

 

    నుదుటికి పట్టిన స్వేదాన్ని ఆదుర్దాగా తుడుచుకున్నాడు బిల్హరి.

 

    మూడు నిమిషాలు గడిచాయి.

 

    మంద్రంగా సిగ్నల్ యిస్తూ-

 

    "XZ/......BLC....300ZY 910....ALL FOOLS" అన్న అక్షరాలు స్క్రీన్ మీద అందంగా ప్రత్యక్షమయ్యాయి.

 

    చివరి అక్షరాలు చదివి తుళ్ళి తుళ్ళి నవ్వింది శృతి.

 

    ఆమెకు తెలీకుండానే అలా నవ్వేసింది.

 

    ఆమెకేసి సీరియస్ గా చూశాడు మిత్ర.

 

    ఆమె చప్పున తలదించుకుంది.

 

    డైరెక్టర్ మిత్ర అన్వేషివైపు అదోలా చూశాడు సిస్టమ్ రిమోట్ కంట్రోలర్ తో ఆఫ్ చేస్తూ.

 

    "కంప్యూటర్ ఇంజనీర్ వి అయినంత మాత్రాన మీ ఎత్తులిక్కడ సాగవు... మిస్టర్ హరీ" అన్వేషి ఒకింత వ్యంగ్యంగా అన్నాడు.

 

    "హరీనా... ఇతని పేరు బిల్హరి కాదా?" అడిగింది శృతి వెంటనే ఆశ్చర్యపోతూ.

 

    తన అసలు పేరు అన్వేషి నోటివెంట వింటూనే షాక్ తిన్నాడు బిల్హరి అనే హరి.

 

    దాంతో అతని ముఖం పాలిపోయింది.

 

    అతడివైపు ఎగాదిగా చూస్తూ "వాటిజ్ దిస్?" అన్నాడు మిత్ర తీవ్ర స్వరంతో.

 

    వాళ్ళవైపు చూడలేనట్లుగా తల వంచుకున్నాడు బిల్హరి- తన మోసం బయటపడిందన్న అవమానంతో.

 

    "ఇతడి గురించి తెలిసే అనుమతించమన్నారా?" సంజాయిషీ అడుగుతున్నట్లు అన్నాడు డైరెక్టర్ మిత్ర- అన్వేషి కేసి చూస్తూ.

 

    శృతికి అంతా అయోమయంగా వుంది. అన్వేషి పొరబడ్డాడేమో నన్నట్లు చూసిందతనివైపు.

 

    "మన డిస్కషన్ పర్సనల్ గా వుంటే బావుంటుంది" చెప్పాడు అన్వేషి గంభీరంగా.

 

    "ఆల్ రైట్... మిస్టర్ హరీ... ఉరఫ్ బిల్హరి... యూకెన్ గో... విశ్వాత్మ ఆత్మతో మిమ్మల్ని మీరే కాకుండా, మమ్మల్ని కూడా ఫూల్స్ అనిపించినందుకు థాంక్స్" అన్నాడు డైరెక్టర్ మిత్ర కోపంగా.

 Previous Page Next Page