అతని సమయస్ఫూర్తికి, అందులో దాగివున్న వేగానికి శృతి విస్మయ పడింది.
అదే సమయంలో-
"ఎక్స్ క్యూజ్ మీ సర్! మీకోసం ఎవరో వచ్చారు" చెప్పాడు అన్వేషి ఫ్యూన్.
పంపించమన్నట్టు సైగ చేశాడు అన్వేషి.
అంతక్రితం ఎప్పుడూ చూడని ఓ వ్యక్తి లోపలికి వచ్చి తనను తాను పరిచయం చేసుకొని ఎ.సి.పి. చక్రధర్ పంపించారని చెప్పి రెండు బ్లూ కవర్లిచ్చి వెళ్ళాడతను.
ఆ కవర్లలో ఎ.సి.పి. చక్రధర్ రాసిన లెటర్, మరొకటి ఫింగర్ ప్రింట్స్ డిపార్టుమెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్ వున్నాయి.
రెంటినీ పూర్తిగా చదివాక అన్వేషి లోలోనే నవ్వుకున్నాడు. ఆ నవ్వు లక్ష్యాన్ని గురిచూసి ఛేదించిన తర్వాత నవ్వే విలుకాని నవ్వులా వుంది.
* * * *
అరగంట తర్వాత డైరెక్టర్ మిత్రకు మెసేజ్ పంపాడు అన్వేషి. బిల్హరిని క్రిప్టోగ్రాఫ్ టెస్ట్ కు అనుమతించమని.
సరిగ్గా ఆరుగంటలకి శృతి కాబిన్ లోకి ప్రవేశించాడు అన్వేషి.
పలకరింపుగా నవ్వింది శృతి.
"లెటజ్ స్టార్ట్" అన్నాడు.
శృతి జవాబివ్వబోయేంతలో ఫోన్ మోగింది. అవతలి కంఠం హలో అనగానే ఆ కంఠం ఎవరిదో గుర్తుపట్టింది శృతి.
డైరెక్టర్ మిత్ర!
కొద్ది క్షణాలసేపు మాట్లాడిన తర్వాత "ఓ.కె. సార్..." అంటూ ఫోన్ పెట్టేసింది శృతి. ఆమె ముఖంలో ఆశ్చర్యంతో కూడిన విస్మయం కొట్టిచ్చినట్టు కనిపించింది అన్వేషికి.
"డైరెక్టర్ మిత్రగారి ఫోన్" అందామె.
"తెలుసు మీ ముఖమే చెబుతోంది ఆ విషయం" అన్నాడు అన్వేషి ఆమెకేసి చూస్తూ.
"బిల్హరిని రేపు క్రిప్టోగ్రాఫ్ టెస్ట్ కు పిలిపించమని చెప్పారు" అంది శృతి అసహనంగా.
"ఆ నిర్ణయం తీసుకోమని మెసేజ్ ఇచ్చింది నేనే..." తాపీగా చెప్పాడు అన్వేషి.
శృతి ఆశ్చర్యం రెట్టింపయింది. కానీ ఉదయమే బిల్హరి బ్యాక్ గ్రౌండ్ ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశించాడు. మిత్ర అన్వేషి చెప్పినదాన్ని ఆచరిస్తున్నాడంటే అతన్ని పూర్తిగా నమ్ముతున్నాడా? ఆలోచనలో పడింది శృతి.
"ఏమిటీ... అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? పదండి..." అని కదిలాడతను. అన్వేషి వెనుకగా నడుస్తూ ఆలోచిస్తోంది శృతి. విశ్వాత్మ ఎంతో తేలికగా చెప్పగలిగే హిందూమత విశిష్టత గురించి ఒక్క మాట కూడా చెప్పలేని బిల్హరికి పునర్జన్మ పరీక్షా?! ఆమెకి మిత్ర అంతరంగం బొత్తిగా అర్థంకాలేదు.
వాళ్ళిద్దరూ కలిసి కారులో బైటకు వెళ్లడం, సెక్యూరిటీ గార్డ్స్ వింతగా చూశారు.
* * * *
కారు పంజాగుట్ట క్రాస్ రోడ్స్ దగ్గర మలుపు తిరుగుతున్న సమయంలో "డిన్నర్ ఎక్కడ తీసుకుందాం?" అనడిగాడు అన్వేషి.
"హోటల్ బంజారా దర్బార్" అంది శృతి.
"అంత చిన్న హోటల్ లోనా?" అన్నాడతను.
"అక్కడ బిర్యానీ అంటే నాకిష్టం" చెప్పింది శృతి.
కారు లకడికాపూల్ వైపు పరుగెడుతుండగా సెల్యులర్ ఫోన్ లో బిల్హరిని ఇంటర్వ్యూకి రమ్మంటూ మెసేజ్ యివ్వమని చెప్పింది శృతి తన పి.ఎ.తో.
అన్వేషి ఆఫీసులోనే వుండి, బిల్హరి గురించి అతి తక్కువ టైమ్ లోనే ఇన్వెస్టిగేట్ చేసి, రిపోర్టు ఎలా పంపగలిగాడా అని ఆలోచిస్తోందామె. ఆ ఇరానీ హోటల్ ముందు కారు పార్కింగ్ కి స్థలం లేకపోవడం వల్ల వెనుక వీధిలో వున్న సాయిబాబా టెంపుల్ దగ్గర కారు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళారు.
గుడి ముందునుంచి వచ్చేటప్పుడు శృతి దేవుడికి దండం పెట్టింది బైటనుంచే.
హోటల్ బాగా రద్దీగా వుంది. ఖాళీగా వున్న ఓ మూల కూర్చునేసరికి కొందరు తామిద్దరివైపూ అదోలా చూడటం గమనించింది శృతి.
బిర్యానీ ఆర్డర్ చేశాడు అన్వేషి.
"ఇప్పుడు చెప్పండి. బిల్హరి ఎవరు? అతన్ని క్రిప్టోగ్రాఫ్ టెస్ట్ కు పంపించడమేమిటి? నాకెంత అయోమయంగా వుందో తెలుసా...?" అంది శృతి.
"ఆఫీసు విషయాలు ఇంకేవీ అడగనంటే ఈ విషయం చెప్తాను" అన్నాడు అన్వేషి.
"సరే..."
"విశ్వాత్మ పునర్జన్మను మనం నమ్ముతాం కదా!"
"నమ్ముతాం. నమ్మాలి.... నమ్మితీరాలి" స్థిరంగా అంది శృతి.
"బిల్హరి పునర్జన్మ పొందిన విశ్వాత్మే" చాలా క్యాజువల్ గా చెప్పాడు అన్వేషి.
ఫక్కున నవ్వింది శృతి.
ఎందుకలా నవ్వావన్నట్లు చూశాడు అన్వేషి.
"అతన్ని మీరు ఇంటర్వ్యూ చేశారా? ఈజ్ హి క్వాలిఫైడ్... మిత్ర కూడా నమ్మారా?" నవ్వుతూ అడిగింది శృతి.
ఇంతలో బిర్యానీ వచ్చింది.
వేడి వేడి బిర్యానీని తిన్నారిద్దరూ. హోటల్లోంచి తిరిగొస్తున్నప్పుడు మళ్ళీ అడిగిందామె.
"మనల్ని నమ్మించినవాళ్ళను మనం నమ్మాలా?"
"నమ్మి పరీక్షించటంలో తప్పులేదుగా?"
"అందర్నీ మనం విశ్వాత్మలని నమ్మేస్తే... అనవసరమైన గొడవలు... టైమ్ వేస్ట్ తప్ప... ఫలితం వుంటుందంటారా?" కాదు దగ్గరి కొచ్చాక అతని ముఖంవైపు సూటిగా చూస్తూ అందామె.
అన్వేషి ఏదో జవాబు చెప్పబోయాడు. ఏదో లారీ హారన్ కి అతను డిస్టర్బ్ అయ్యాడు. కానీ అతని ముఖంలోకే శృతి చూస్తూ వుండిపోయింది.
"మీ ముఖం మీద ఏంటీ ఆ మచ్చ?" అంది శృతి.
"నా ముఖంమీద మచ్చా?" అంటూ ముఖాన్ని తడుముకున్నాడు అన్వేషి.
అప్పుడతనికి గుర్తొచ్చింది.
ముక్కుకి ఎడమ పక్కన బుగ్గకు కిందిభాగంలో చుబుకం ప్రాంతములో గీరుకుపోయిన చర్మం- గాయం మానినా మచ్చ మిగిలిందని.
ఎక్కడో, ఎప్పుడో చిన్న దెబ్బ తగిలినట్లు గుర్తు. కానీ ఎక్కడ తగిలిందో అతనికి గుర్తుకు రాలేదు. అద్దం ముందు నుంచున్నప్పుడు అప్పుడప్పుడూ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించేవాడు కానీ ఇంతవరకూ గుర్తుకు రాలేదు. అందుకే ఆమెకేమీ సమాధానం చెప్పలేకపోయాడు అన్వేషి.