"కాళికాదేవిని ఏడుసార్లు ధ్యానించాలి. ఆ తరువాత మరో ఐదుగురికి ఇలాగే మీరు ఉత్తరాలు వ్రాయాలి. దేశరాజధాని వరకు నీ భక్తి రసం పొంగి పోరలాలి- ఇట్లు కాళికాదేవి భక్తుడు" ఆలోచిస్తూనే పైకి చదివేసాడు ప్రభు.
ఆ తరువాత కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుందా గదిలో.
"దాదాగంజ్ లాంటి గూండా జేబులో భక్తుడి ఉత్తరం.....? అదీ నలిగిపోయేవరకు పారేయకుండా ఉంచుకున్నాడు...... భక్తుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని పోస్టాఫీసు బాక్స్ లో పోస్ట్ చేసాడు...." ప్రభు అనుమానాస్పదంగా అంటూ మరికొద్దిసేపు మౌనంగా ఆలోచిస్తూండిపోయాడు.
"నాకెందుకొ అనుమానంగా ఉంది సార్ - ఆ ఉత్తరంలో ఏదో కోడ్ దాగి ఉందని నాకనిపిస్తోంది. ఆ ఉత్తరం మీద అడ్రస్ మరీ అనుమానాస్పదంగ ఉంది సార్....." ఆఫీసర్ అన్నాడు....
"నాకలాగే తోస్తోంది- దశరధ..... టీవీ ప్రొడ్యూసర్.....నెంబర్ వన్ టెలీ సీరియల్ ప్రొడ్యూసర్.... సస్పీషియస్ పర్సనాలటీ..... హొమ్ మినిస్టర్ అన్న..... దశరధకి వచ్చిన ఉత్తరం దాదా చేతుల్లోకి ఎలా వెళ్ళింది...? ఏది ఏమైనా మనం నిఘాని అధికం చేయాలి. దశరధ మీద, దాదా మీద, చివరకు హొమ్ మినిష్టర్ మీద కూడా నిఘా పెట్టాలి. ముగ్గురూ ఒకటే- ఒక గ్రూప్ కి చెందిన వాళ్ళే - ముగ్గురూ సంఘ విద్రోహక చర్యలకు ఆజ్యం పోసి పబ్బంగడుపుకొనేవారే...."
"బట్...... సార్..... హొమ్ మినిస్టర్ మీద నిఘా అంటే....?"
"అక్కడే జాగ్రత్తగా ఉండాలి- మంచి నమ్మకస్తుడైన ఎస్. ఐని ఆ పనికి వినియోగించాలి. అతనెంతో నీతి, నిజాయితీ కలవాడు కావాలి. ఇదే మాత్రం బయటకొచ్చినా మనం దొరికిపోతాం. హొమ్ మినిస్టర్ చర్యలకు బుర్రకాయ లూపే మన పై అధికారులు మనల్ని హెరాస్ చేస్తారు.... మనం నిఘా కోసం ఉపయోగించే వ్యక్తి ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది.....? వాళ్ళ మూమెంట్స్ ని మనకి తెలియపర్చాలి. దాంతో మనకు ఏదో ఒక క్లూ దొరకకపోదు. నాకెందుకొ జయధీర్ హైదరాబాద్ లోనే ఉన్నాడనిపిస్తోంది. అది కేవలం నా అనుమానమే - ఆధారం లేదు...... ఎనీహౌ..... మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఈ తీగను కదిలించి చూడాలి. మీరెళ్ళి ఆ పని చూడండి-" అన్నాడు ప్రభు ఆ ఉత్తరాన్నే పరిశీలనగా చూస్తూ.
ఆ ఆఫీసర్ తలూపి వినయంగా సెల్యూట్ చేసి బయటి కెళ్ళిపోయాడు.
అతనలా వెళ్ళిపోగానే లోనగడియవేసుకొని మేగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని ఆ పేపర్ ని పరిశీలించసాగాడు.
కొద్ది క్షణాలకి ప్రభు కళ్ళు మెరిసాయి.
పరిశోధనలో చిన్న కుదుపు....
ఉత్తరం వ్రాసిన పేపర్ ఇండియాలో తయారయింది కాదు.....
మేని ఫోల్డ్ గ్లేజ్డ్ పేపర్..... ఎంతో పల్చగా ఉన్న ఆ పేపర్ అంతర్భాగంలో న్యూజెర్సీ అన్న అక్షరాలు ఎంబోజ్ ఇంప్రెషన్ తో క్లియర్ గా కనిపించాయి. ఆ పేపర్ ఇండియాలో దొరకదనేమిటి....?
ఆ ఆలోచనరాగానే ప్రభు కవర్ ని మేగ్నిఫయింగ్ గ్లాజ్ క్రింద ఉంచి పరీక్షించాడు. అది మామూలు బ్రౌన్ కలర్ కవర్..... ఫినిషింగ్ అద్భుతంగా ఉంది.
దాని మీద అతికించిన స్టాంప్స్ ఇండియావే..... కాని కవర్ అంతర్భాగంలో కూడా ఏవో అక్షరాలు ఇంటర్నల్ గా ఎంబోజ్ అయి కని పించాయి.....
ప్రభులోని ఉత్కంఠ, అనుమానం రెట్టింపయ్యాయి.
మరింత జాగ్రత్తగా చూసాడు..... న్యూజెర్సీ పేపర్ స్టోర్ అన్న అక్షరాలు కనిపించాయి.
ఇండియాలో తయారయ్యే వైట్ పేపర్స్ పై (బాండ్), కవర్స్ పై కూడా ఇంటర్నల్ ఎంబోజింగ్ పద్ధతిలో మేన్యుఫేక్చరర్ పేరు (కంపెనీ) వుంటుంది...... వాడిన కవర్, లోపల పేపర్ రెండు న్యూజెర్సీకి చెందినవే..... అలా జరగటం అసాధారణం..... ఒకవేళ అమెరికా కవర్స్ పై, పేపర్స్ పై వ్రాయాలనుకుంటే ఉంటుంది. అయితే......వినియోగదారుడు అమెరికాలో తయరయ్యాయని రుజువు చేసే వాటినే కొంటాడు- వీటి మీద అలాంటి ముద్రలు మామూలుగా కనిపిస్తూ లేవు. మేగ్నిఫయింగ్ గ్లాజ్ తో చూస్తే తప్ప కనిపించటం లేదు. అంటే.... వినియోగదారుడు ఏ కవర్ వాడుతున్నది, ఏ పేపర్ మీద ఉత్తరం వ్రాస్తున్నది అంతగా పట్టించుకాలేదన్నమాట.....
సో..... ఈ కవర్, కవర్ లోని కాగితం అమెరికాకి చెందినవే...... అమెరికాలోనే ఉత్తరం వ్రాసి ఇండియన్ స్టాంప్స్ అతికించి, ఇండియా వస్తున్నా వ్యక్తికిచ్చి ఇండియాలో పోస్ట్ చేయమని చెప్పి ఉండవచ్చా.... అలా అనుకుంటే కాని లింక్ దొరకటం లేదు.
అది నిజమే అయితే..... ఈ ఉత్తరంలోని మేటర్ ని ఎలా డీకోడ్ చేయాలి.....?
కాళికాదేవిని ఏడుసార్లు ధ్యానించాలి.
ఆ తరువాత మరో ఐదుగురికి ఇలాగే మీరు ఉత్తరాలు వ్రాయాలి.
దేశరాజధాని వరకు నీ భక్తిరసం పొంగిపొరలాలి. పై మూడు వాక్యాలను కనీసం వందసార్లయినా చదువుకొని ఉంటాడు ప్రభు...... ఏమీ బోధపడలేదు...... బుర్రవేడెక్కిపోయింది.
చిరాగ్గా బయటకు వచ్చి కారు దగ్గరకు వెళ్ళాడు.....
కొద్దిసేపలా తిరిగొస్తే తప్ప మైండ్ ఫ్రెష్ గా తయారవ్వదనుకుంటూ కారులో కూర్చుని స్టార్ట్ చేసాడు... కాని ఫలితం కనిపించలేదు- ఐదారు సార్లు ప్రయత్నించి "డామ్ ది ఇండియన్ ఆటోమోబైల్ మేకర్స్...." అంటూ విసురుగా కారులోంచి దిగుతుండగా "ఆటో తీసుకురానా సార్?" అంటూ ఓ కానిస్టేబుల్ వచ్చాక ప్రభు తలూపాడు.
మరో నిమిషానికి ఆటో వచ్చింది.
ఆటో ఎక్కి కుతుబ్ షాహీ టూంబ్స్ అన్నాడు ప్రభు. ఆటో బయలుదేరింది.
* * *
టీ వీ లో ఇంటర్వ్యూ వస్తోంది.
ఒక నూతన రచయిత్రిని ఒక పాఠకుడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. బ్రహ్మానందం అటుకేసే చూస్తున్నాడు.
"ఇంతకు ముందు మీరేమైనా వ్రాసారా?"
"ఓ..... చాలా రాసాను"
"ఎన్ని ప్రచురింపబడ్డాయి.....? అవేమిటి.....?"
"ఒక్కటీ ప్రచురింపబడలేదు. రాసుకొని చదువుకొనేదాన్ని - మా ఫ్రెండ్స్ కి చూపించేదాన్ని. వాళ్లు వాటిని పత్రికలకి పంపమనేవాళ్లు.... నేనే పంపేదాన్ని కాదు - ఎందుకంటే అవి ప్రచురణ స్థాయికి అందవని నా కనిపించేది"
"మా తల్లే... అంత గొప్ప నిజాయితీ....? పత్రికలకి పంపి వాటిని తద్దినం పెట్టకుండా కాపాడావు- నిజంగా పంపే వుంటుంది. అవి తల్లిని వెతుక్కొనే బిడ్డలా తిరిగొచ్చుంటాయి. ఆ విషయం చెప్పటానికి సిగ్గు ఆత్మవంచన ఇక్కడి నుంచే ప్రారంభం" బ్రహ్మానందం దశరధకు వినపడేలా అన్నాడు.
తిరిగి టీవీలో వచ్చే ఇంటర్వ్యూని చూడసాగారు దశరధ, బ్రహ్మానందం.
"ఒక్కో రచనకు ఎన్నిసార్లు రాస్తారు?"
"ఎన్నోసార్లా.....? ఆహా.....హా....ఒక్కసారే - అదే రఫ్ - అదే ఫెయిర్.... కనీసం రాసాక చదవను కూడా చదవను. నా రచనల మీద నాకంత నమ్మకం"
"బాగుపడతావ్ తల్లి..... గొప్ప రచయిత్రివైపోతావు-తిరుగులేదు" బ్రహ్మానందం అన్నాడు వ్యంగ్యంగా.
"తెలుగు నవలా సామ్రాజ్యాన్ని మీరే కైవసం చేసుకుంటారని కొందరు సంచలనంగా చెప్పుకుంటున్నారు..... మరీ మీ"
"మధ్యలో వచ్చినవాళ్ళు మధ్యలోపోవల్సిందే" నవ్వుతూ అంది.
"మరి..... మీరు మధ్యలో వచ్చినవాళ్ళేగా.....?"
ఆ మహా రచయిత్రి కలవరపడింది- వికారంగా మొహం పెట్టింది.
"అదేమిటి ఆ ప్రశ్నవేసాడు....? ఓ ప్రక్క ఇంటర్వ్యూ చేస్తూ మరో ప్రక్క డేమేజ్ చేయవచ్చా....?" దశరధ చిరాగ్గా అన్నాడు.
"పాపమతనికి మండిపోయుంటుంది. లేకపోతే..... అతనేదో ఆమె అంతరంగాన్ని తెలుసుకుందామని ఆ ప్రశ్న వేస్తే, ఈమె అణుకువగా సమాధానం చెప్పవద్డా....? ఒక్క నవలైనా, మార్కెట్ లోకి రిలీజ్ కాలేదు- అప్పుడే కైవసం మాటలెందుకండి అని సమాధానం చెప్పి తన హుందాతనాన్ని కాపాడుకోవాలి గదా? ఒక వారం సీరియల్ రాగానే అప్పుడే నవలా సామ్రాజాన్ని ఏలుతున్నట్లు కలలు.... ఆ ఓవర్ కాన్ఫిడెన్సే నాశనం చేసేది. ఎంత వినయంగా, హుందాగా ఉండాలి! అయినా ఆవిడ కైవసం సంగతి తేల్చవలసింది పాఠకులు పత్రికలూ కాదు, ఇంటర్వ్యూ కాదు."
"ప్రస్తుతం పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం?"
"రాజకీయాలా....? నా కసలు తెలీవు-గిట్టవు"
"మా గొప్పగా సెలవిచ్చారండీ.....కనీసం డైలీ పేపర్స్ చూడని వాళ్లు , రాజకీయాల రొంపిలో దేశం ఎటు వెళ్తుందో తెలీనివాళ్ళు నవలలు రాస్తే మరంతే- పేపర్స్ చదవకుండా దేశం ఎటు వెళ్తుందో, ప్రపంచం ఎటు వెళ్తుందో రాసేస్తారన్నమాట. ఏ దేశ ప్రజల సామాజిక ఆర్ధిక జీవనమైనా ఆ దేశ రాజకీయాలతో ముడిపడి వుంటుంది. ఒక ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్ అన్యాయంగా రేప్ చేయబడింది ఇటీవల. ఆ అమ్మాయి ధైర్యంగా ఎదురుతిరిగింది. ధర్నాలు చేయించింది- ప్రభుత్యాన్ని పోలీసుల్ని దుమ్మెత్తిపోసింది. అయినా ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? ఎందుకు జరగలేదు....? పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులెందుకు పట్టించు కోలేదూ....? రాజకీయనాయకుల చెప్పుచేతల్లో ఉన్నారు గనుక- రాజకీయ నాయకులెందుకు రియాక్టు కాలేదు....? దాని వెనుక రాజకీయాలున్నాయి గనుక. ఇలాంటి సబ్జక్టు మీద నవల వ్రాయాలనుకోండి - రాజకీయాలు తెలియాలా లేదా....? తెలియకుండా వ్రాస్తే అది స్పృహ ఉన్న నవలవుతుందా....? అనకాపల్లిలో కొబ్బరినూనె ధర పెరగటానికి శ్రీలంకలో శాంతి సేనకు సంబంధంమేమిటో....? కేంద్ర బడ్జెట్ కి ఫ్లోస్కో ధరకి సంబంధమేమిటో తెలీకుండా నవలలు వ్రాస్తే అవి మనం చదవాలి....? సాధారణంగా పాఠకుడి కన్నా రచనలు చేసే వాళ్ళకి ఎక్కువ విషయాలు - తెలిసుండాలి గదా....? వాళ్ళకే తెలీనప్పుడు, వాళ్ళు పాఠకులకేం చెబుతారు నా పిండాకూడు....?"
"నువ్వు మరీ చెబుతావురా"
"మరీ చెప్పినా, కొద్దిగా చెప్పినా నిజమేగదండి-కేంద్రంలో ఇంధనం ధరలు పెరిగితే, పెట్రోలియం ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే ఫ్లాస్కోల ధరలు పెరుగుతాయి. శ్రీలంకతో మన దేశానికి సత్ సంబంధాలు లేకపోతే దాని ప్రభావం చేరువుగా ఉన్న కేరళ మీద పడుతుంది. కేరళలో తయారయ్యే కొబ్బరినూనె ధరలు ప్రభావితమవుతాయి. నగరాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల మూలంగా హైదరాబాద్ లాంటి నగరం బాగుపడుతుంది కదా....? కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే రాజకీయాలు మొదలవుతాయి. ఒక్కోసారి నిధులు తగ్గిపోతాయి - ఫలితం....! హైద్రాబాద్ వాసులకు సౌకర్యాల లోటు ఎదురవుతాయి - ఆ లోటుని ఎదుర్కొనేది ప్రజలే కదా....? మరి నవలలు వ్రాయవలసింది ప్రజల గురించే కదా....? తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రజలు సుఖపడతారు. తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రజల సుఖపడతారు. తెలుగు గంగ ఎందుకాగి పోయింది....? రాజకీయాలమూలంగా..... పదివేల బుణాలు మాఫీ అన్నారు- మాఫీ అయితే పేద రైతులు తేరుకుంటారు. మాఫీ చేయాల్సిందెవరు...? ప్రభుత్వాలు- ఆ ప్రభుత్వాల్ని నడిపేదెవరు? రాజకీయ నాయకులు.....వారి వెనుకేముంటాయి......పార్టీలు...... రాజకీయాలు.... యూరోపియన్ కమ్యూనిస్టు దేశాలు కమ్యూనిజాన్ని విసర్జించే ప్రజాస్వామ్యాన్ని స్వీకరించారు. మరప్పుడు ఆ ప్రజల జీవన విధానంలో మార్పురాదా....? ఆ మార్పుల్ని రచనా వ్యాసంగంలో ఉన్నవాళ్లు విస్మరించవచ్చా....? చెన్నారెడ్డి ఎవరు...? ముఖ్య మంత్రి....కాకముందు రాజకీయవేత్త.... ఈ మహారచయిత్రి స్త్రీల సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చేందుకు ఆయన నివాసానికీ ఊరేగింపుని తీసుకువెళ్తుంది. అప్పుడు చెన్నారెడ్డి ఇంటిముందుండే ఘూర్ఖా నవ్వడా....?"