అందరూ అనిల్ పెర్ ఫార్మెన్స్ పట్ల బాగా ఇంప్రెస్ అయిపోయి కళ్లు ఆర్పటం కూడా మర్చిపోయి చూస్తుండగా, అనిల్ ఎడంచేతిలో కాలుతున్న కట్టె వేగంగా వచ్చి నిజంగానే అతని కుడిచేతిపై ఆనింది.
జరుగుతున్నదేమిటో అర్ధంకాక అందరూ నిశ్చేష్టులయిపోయారు.
విల్సన్ షాక్ తిన్నాడు. అతనికి తెలీకుండానే కెమేరా తిరుగుతునే అ దృశ్యాన్ని రికార్డ్ చేసుకుపోతోంది.
అందరికంటే ముందుగా తేరుకున్న హంపి శరవేగంతో అనిల్ కేసి దూసుకువచ్చి కట్టెని లాగవతల పడేసింది.
అనిల్ అరచేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ప్రొడక్షన్ బాయ్ కేసి చూసింది.
అప్పటికే జరిగింది అర్ధం చేసుకున్న బాయ్ బర్నాల్ తో పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"ఆర్యూమేడ్....? ఎందుకిలా చేసారు.....?" అంటూ అరచేతిని తెరిచి చూసింది. చెయ్యంతా బాగా కాలిపోయింది. ఆమె కళ్ళు తడిదేరాయి.
బాయ్ ఇచ్చిన బర్నాల్ తీసి మృదువుగా కాలిన అరచేతిపై రాస్తూ అంది- "మరీ ఇంత సహజంగా నటించమని చెప్పానా....?" ఆమె గొంతు తనుచేసిన పనికి తట్టుకోలేక జీరబోయినట్లు గుర్తించాడు అనిల్.
"ఒక అద్భుత కధకు ఆ ముఖంగా మీరు చెప్పిన సంఘటనలు....... అదే.... నిజ జీవితపు సంఘటనలు నన్ను కదిలించివేసాయి. నాలోని మాలిన్యాన్ని కరగించివేసాయి. నన్ను నిద్రలేపాయి. సెల్ఫ్ రియలైజేషన్ కేవలం మౌనంలోంచి రాదని నా విశ్వాసం. అది శాస్త్రీయం కూడా కాదని నా నమ్మకం. న్నను నేను అదుపులోకి తెచ్చుకొనేందుకు మానసికంగానే గాక, శారీరకంగా కూడా సిద్ధమవుతున్నాను. మీరు మొదటిసారి ఈ టీవీ సిరీయల్ కధ చెప్పినప్పుడు ఉలిక్కిపడ్డాను- మంత్రముగ్దుడ్ని అయ్యాను. అది మీ నాన్నగారి జీవితమే అని తెలిసినప్పుడు నేను పొందిన అనుభూతికి అక్షరరూపం ఇవ్వలేకపోయాను. ఈ కాల్చుకోవటం నాకు తెలిసీ, తెలీక రెండు రకాలుగా జరిగింది. సినిమా హీరోలు, టీవీ హీరోలు ఫేక్ ఐడెంటిలు మాత్రమే. వాళ్లు నిజజీవితపు హీరోలు కారు..... నేను చేసిన తప్పులకు, నిరర్ధకంగా ఇంతకాలం వృధాచేసిన నా జీవితకాలానికి ఎక్కడో, ఎప్పుడో శిక్షపడాలి. అదీ జరిగిందిప్పుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరనుకొనే నాలోని ఒంటరితనం, నూన్యతాభావం టాగూర్, నారాయణ్, శిరీష్, మీ మూలంగానే దూరమయ్యాయి. ధాంక్యూ..... ఊహల నుంచి దిగి వచ్చి వాస్తవాల రహదారిలో ప్రయాణిస్తున్న మీకు నా పూర్తి సహకారం ఉంటుంది....." అన్నాడు అనిల్ ఉద్వేగంగా.
అప్పుడే బర్నాల్ రాయటం పూర్తిచేసిన హంపి ఒక్క క్షణం అతని కళ్ళలోకి చూసింది.
తను ఆమెకేసి కృతజ్ఞతగా చూసాడు.
కొద్దిక్షణాలు ఆమె హృదయస్పందన పెరిగి, తిరిగి యధాస్థితికి వచ్చింది.
"పేకప్ చెప్పనా....?" హంపి చిన్నగా అంది.
"నో..... నో..... నాకేం ఫర్వాలేదు....." అన్నాడు అనిల్...... అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ.
"కొంతగేప్ ఇచ్చి అప్పుడు షూటింగ్ చేద్దాం" అంది యూనిట్ కేసి వెళ్తూ, షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
మరికొద్ది నిమిషాలకు అందరూ స్మశానంలోనే చెట్టుక్రింద సెటిలయ్యారు.
హంపి తనాశించిన ఫలితాలు రావటంతో వృత్తిపరమైన ఆనందాన్ని, తృప్తిని పొందగలిగింది.
ఆమెకు తెలీకుండానే అనిల్ పట్ల ఆకర్షితురాలవసాగింది.
"నా లైఫ్ లో ఇన్ని అద్భుతాల్ని, యాదృచ్చికాల్ని నేనూహించ లేదు మిస్ హంపి..... మీకు నేను చాలా రుణపడిపోతున్నాను......" అన్నాడు అనిల్ టీ కప్పు అందుకుని హంపీకి అందిస్తూ.
ఆమె అతని సంస్కారాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ టీ కప్పు అందుకుంది.
"ఇలా చెబితే అలా అందుకు పోగలిగే ఆర్టిస్టులు దొరకటం నా అదృష్టం మిస్టర్ అనిల్..... వృత్తిపరమైన అసంతృప్తితో మీరు దొరికే వరకు ఎంతో అశాంతికి గురయ్యాను. ఇక అద్భుతాలంటారా....? రక్త సంబంధం లేకుండానే ఇద్దరు వ్యక్తులు ఐడెంటికల్ ఉండటంలాగే ఇద్దరు వ్యక్తుల జీవితంలో ఒకే ఒకమయిన సంఘటనలు, సంఘర్షణ కూడా అప్పుడప్పుడు, ఎక్కడో ఒకచోట సహజమేనేమో అనిపిస్తోంది నాకూ. మా నాన్నగారి జీవితం ఏ మలుపులు తిరిగిందో - మీ జీవితం అవే మలుపులు తిరగటం నాకూ అద్భుతంగానే అనిపిస్తోంది. మా నాన్నగారు సోమరిపోతట -మా నాయనమ్మ చావు - మా అమ్మ పరిచయం మా నాన్నగారి జీవితాన్ని పూర్తిగా మర్చివేసాయి. మరి...... నా పరిచయం...." అంటూ అర్దోక్తిలో ఆగిపోయింది హంపి.
వీళ్ళద్దరికి ఒకింత దూరంలో ఉండటం మూలంగా, షూటింగ్ హడావిడి ఒక్కప్రక్క జరుగుతుండటంతో హంపీ మాటలు ఎవరికీ వినిపించలేదు. హంపీ అన్న చివరి మాటలకు అనిల్ ఒ క్షణం ఆలోచించాడు. ఆమె అర్ధోక్తిలాగే అతని ఆలోచనలు మధ్యలోనే తెగిపోయాయి విల్సన్ అక్కడకు రావటంతో.
"రియల్లీ.....ఐ వజ్ షాక్డ్ మిస్టర్ అనిల్" అన్నాడు విల్సన్ షాక్ నుంచి తేరుకుంటూ.
"ఆ దృశ్యం కూడా షూట్ చేసారుగా?" అనిల్ తన అరచేతిని నెమ్మదిగా కుర్చీ హేండ్ రెస్ట్ మీద ఆనిస్తూ అడిగాడు.
"నిజానికి కట్ చేసేవాడ్ని కాని నేను అచేతనస్థితికి చేరుకోవటంతో కెమేరా తిరుగుతూనే ఉండిపోయింది......" అన్నాడు విల్సన్ కుర్చీలో కూర్చుంటూ.
"ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని షూటింగ్ తిరిగి మొదలెడదాం" అంటూ హంపీ టీ కప్పు ప్రక్కన పెడుతూ లేచింది.
"అబ్బే.... దీని కెందుకండి పెద్ద వర్రీ కావటం.....? బర్నాల్ రాసారు గదా...." అదే తగ్గిపోతుంది" అన్నాడు అనిల్ తేలిగ్గా.
"నో....నో.... సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉండవచ్చు- రండి- వెంటనే వచ్చేద్దాం" అంటూ హంపి పట్టుబట్టడంతో అనిల్ లేచి ఆమె వెనుక నడిచాడు.
మరికొద్ది క్షణాలకి హంపీ, అనిల్ ఎక్కిన మారుతీకారు అపోలో హాస్పిటల్ కేసి దూసుకుపోయింది.
* * *
"షూటింగ్ మధ్యలో వచ్చానంటున్నారు- మరి బ్యేండేజ్ కడితే ఫర్వాలేదా?" డాక్టర్ హంపీకేసి చూస్తూ ప్రశ్నించాడు.
"అవసరమైతే కట్టకపోతే ఎలా డాక్టర్....?" తన కధ మూలంగానే ఇన్ స్పేర్ అయి అనిల్ ఆ దుస్సాహసానికి పూనుకున్నాడని ఆమెకి ఒకింత బాధగా ఉంది.
"నో.... డాక్టర్.... కట్టుకడితే నాలుగైదు రోజులు షూటింగ్ కేన్సిల్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ రాత్రికే షూటింగ్ పార్ట్ పూర్తి కావల్సి ఉంది. నేనెలాగో మేనేజ్ చేస్తాను. కావాలంటే రేపు కట్టుకట్టించుకుంటాను" అన్నాడు అనిల్ స్థిరంగా.
అనిల్ తన సీరియల్ పట్ల ఫీలవుతున్న నైతిక బాధ్యతకు ఆమె మనస్సు లోనే కృతజ్ఞతలు తెలుపుకుంది.
డాక్టర్ ట్రీట్ మెంట్ కొనసాగిస్తూనే మాట్లాడాడు-
"ఏం.... మేడమ్..... టీ వీ సెట్ కొన్నందుకు మంచిపని చేసానేమో నన్న తృప్తిని కలిగించే సీరియల్స్ ఎప్పటికి ప్రసారమవుతాయి....? ఎన్నాళ్ళండి... ఇంకెన్నాళ్లు దూరదర్శన్ ట్రైనింగ్ సెంటర్ గా మిగిలిపోతుంది.....? కొన్నాక టీ వీ సెట్ ని అమ్మలేం- దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మరో ఏడెనిమిదివేలు పెట్టి వి సి. పి కొనుక్కోవాలి..... కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా దూరదర్శన్ వాళ్లు పట్టించుకోరా.....? మా వృత్తి మీద ప్రేమతో కాక మామూలు వ్యక్తిగా చెబుతున్నాను- ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని తెలీనివాళ్ళుండరుగదా....? మన దేశంలో ఎంతమంది గొప్ప గొప్ప డాక్టర్సున్నారు....? వార్ని ఎప్పుడయినా ఇంటర్యూ చేయటం కాని ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం కాని చేయరెందుకని...? ప్చ్...." అంటూ తన పని ముగించుకొని వాష్ బేసిన్ లో చేతులు కడుక్కొని వచ్చాడు.
హంపీ నవ్వింది-
"మీడియా వేల్యూ తెలీనంతవరకు అంతే డాక్టర్..... దూరదర్శన్ లో కరప్షన్ అంతం కానంతవరకు అంతే...." హంపీ ఫిలసాఫికల్ గా అంది.
"ఈ మద్య వార్తలు చదివేందుకు కొత్తవారొచ్చారు. వార్తలకి తద్దినం మంత్రాలకు తేడా తెలీకుండా చదివేస్తున్నారు. బాగా చదివే వాళ్ళు నలుగురు చాలరా....? వారానికొకళ్ళ చొప్పున వచ్చేస్తున్నారు. మాటల్లో స్పష్టతుండదు వత్తులుండవు - వాక్యనిర్మాణం సరిగ్గా ఉండదు- సగం మ్రింగేస్తూ.... తడబడుతూ తడుముకుంటూ.... ఎందుకిలాంటి ప్రయోగాలు చేస్తుంటారు.....?" డాక్టర్ తన సీట్లో కూర్చుంటూ అన్నాడు.
సమాధానమివ్వకుండా నవ్వింది హంపీ.
ఆ తరువాత డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చి కారెక్కారిద్దరు. కారు లోకేషన్ కేసి దూసుకుపోయింది.
* * *
షూటింగ్ గంట తరువాత తిరిగి మొదలయింది.
"ఆ చేత్తోనే కట్టెని పట్టుకోగలరా? నెప్పిగా ఉండదు.....?" హంపి ఒకింత ఆందోళన అంది.
"ఫర్వాలేదు..... కొద్ది క్షణాలే కదా....? ఇలా ఇవ్వండి"! అంటూ కాలిన తన కుడిచేతిని చాపాడు.
హంపీ ఫ్రేమ్ లోంచి తప్పుకుంటూ "కెమేరా" అంది పెద్దగా.
"ఎక్స్ ట్రా ఆర్టిస్ట్ కాలుతున్న కట్టెని అందించాడు.
అనిల్ బాధను ఓర్చుకుంటూ కట్టెని పట్టుకొని చితికి నిప్పంటించాడు.
ఒక్కసారి మంటలు మింటికెగసాయి.
డమ్మీ శవం మంటల మధ్య కాలిపోసాగింది.
కెమేరాని ఆపరేట్ చేస్తున్న విల్సన్ జూమ్ తో మంటల మీద నుంచి అనిల్ మొఖం మీదకి రాసాగాడు.
హంపీ ఏకాగ్రతతో అనిల్ మొఖంలో పలికే భావాల్నే చూస్తోంది.
ఆ సీరియల్ ప్రేక్షక ప్రపంచంలో సంచలనం సృష్టించి తీరుతుందని యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.
మరికొద్ది క్షణాలకి "కట్" అంది హంపి పెద్దగా.
కెమేరా ఆగిపోయింది.
"మిస్టర్ విల్సన్" అంది హంపీ ఏదో సూచన ఇచ్చే ఉద్దేశంతో. కెమేరాని భవానికి అప్పగించి విల్సన్ హంపీ దగ్గరకు వచ్చాడు.
"అనిల్ గారి మీద వారం క్రితం రియల్ ఇన్సిడెంట్ ని తీసాం గదా.... అది..... ఇది దగ్గర పెట్టుకొని ఎడిట్ చేయాలి గుర్తుపెట్టుకోండి" అంది హంపీ కెమేరాకేసి కదులుతూ.
* * *
"ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, న్యూఢిల్లీ...." తనలో తాను అనుకుంటున్నట్లుగానే పైకే అనేసాడు ప్రభు.
ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు.
"ఇది అక్కడ పోస్ట్ చేయబడిన కవర్..... పోస్టల్ ముద్ర క్లియర్ గా కనిపిస్తోంది....." అంటూ ప్రభు కవర్ లోని పేపర్ విప్పి చదివాడు.