బెస్ట్ డైరెక్టర్ కి ప్రధమలక్షణం ఏమిటో తెలుసా...?
సబ్జెక్ట్ సెలక్షన్....
వ్యాసుడి గ్రాండ్ కాన్వాస్ మూలంగానే మహాభారతం, వాల్మీకి కవి హృదయం మూలంగానే రామాయణం బుల్లితెర మీద అంతటి విజయం సాధించాయి.
ఆ రెండు సబ్జక్ట్స్ ని ఎవరు చేపట్టినా, వారికి ఆర్ధికస్తోమత తోడయితే మినిమమ్ సక్సెస్ సొంతమవుతుంది.
రామానంద్ సాగర్ బాపూకన్నా గొప్పవాడు కాదు-
చోప్రా కమలాకరకామేశ్వారావు కన్నా గొప్పవాడు కాదు.
సముద్రాలు కన్నా రహిమాసుమ్ రాజా గొప్పవాడు కాదు. అంతెందుకు కృష్ణుడి పాత్రధారి నితిష్ భరద్వాజ్, ఎన్టీఆర్ ముందు నిలవగలడా?
పౌరాణికాల్ని తెలుగు సినిమా పరిశ్రమ కన్నా ఎవరు గొప్పగా తీయగలరు....? తీసారు.....
కాకపోతే మొదటిసారి నార్తిండియన్స్ కి మహాభారతం, రామాయణం సమగ్రంగా హిందీలో నేషనల్ నెట్ వర్క్ ద్వారా ప్రసారం అయ్యాయి కనుక అంతటి ప్రశంసలు పొందాయి.
ఆ సీరియల్స్ సక్సెస్ కి మరో కారణం కూడా ఉంది.
దేశంలో హిందువులకు భద్రతకరువయింది. ప్రతి ఒక్కరికి హిందూమతం లోకువయిపోయిందన్న భావన హిందువులలో బలపడింది.
ఏది ఏమైనా, పెద్ద కాన్వాస్ ఉన్న సబ్జక్టు డైరెక్టర్ కి సవాల్ లాంటిది- అయినా సక్సెస్ గ్యారంటీ ఉంటుంది.
భార్యని అనుమానించే దౌర్భాగ్యపు కధలు భర్తల అక్రమసంబంధాల గురించి- ఆ రెంటిని కాక్ టైల్ చేసే క్రైమ్ ట్రాక్ కధలను ఎంత సృజనాత్మకత ఉన్న ఏ డైరెక్టర్ అయినా ఏం చేయగలడు?
ఈ అందరూ ఎక్కడో ఒకచోట రాజీపడి వ్యవహరించిన వాళ్ళే- నీకు అందుబాటులో ఉండే సాంకేతిక నిపుణులనే తీసుకొని, నీకు కావల్సింది చెప్పి చేయించుకోవాలి.
నీలో ఆ తపన ఉండాలేకాని - అసంతృప్తి కాదు.....
భార్యల్ని అనుమానించే నికృష్టపు కధలకు ఎంత ఖర్చుపెట్టినా, మరెంత పబ్లిసిటి ఇచ్చినా అవి నిలబడగలవా....? అవి రాసిన వాళ్లు , రాయించిన వాళ్లు, తీసిన వాళ్ళూ అందరూ అల్పులు కాకుండా పోతారా...?
అక్కడే అర్హత అన్నది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఏ కధని భుజాని కెత్తుకోవాలో, ఏ కధని చెత్తక్రింద తొక్కేయాలో నిర్దేశకుడికి తెలియాలి. అది తెలీని నిర్దేశకుడు కంపెల్లర్ అవుతాడే తప్ప క్రియేటర్ కాలేడు. కంపెల్లర్స్ పధగాములు కాలేరు.
కధకుడి మూలంగా తనకు ఒకగూడే లాభాల్ని బేరీజు వేసుకొని కన్నా తల్లి లాంటి వృత్తిని, నిర్మాతను, సంస్థను తాకట్టు పెట్టే అసమర్ధులు కొందరు అయ్యారు కాబట్టే అనారోగ్యకరమైన వాతావరణం నేడు అలుముకొని ఉంది.
వీటన్నిటికి అతీతంగా మంచి సబ్జక్టుని ఎన్నుకున్నావ్ - మంచి స్పేస్ ఉన్న సబ్జక్టు - పెద్దకాన్వాస్- సమాజం ఉలిక్కిపడే విధంగా నీ సీరియల్ ఉండాలి. మరో కాలక్షేపపు కధల్ని ఎప్పటికీ ఎన్నుకోకు-అప్పుడే నీ గురువు గారికి నిజమైన గురుదక్షిణ చెల్లించిన దానివవుతావు...' అంటూ చెప్పటం ముగించాడు సీతారామారావు.
కొందరి విషయంలో గురువు- తండ్రి వేర్వేరు అవుతారు. కాని తన విషయంలో తన తొలిగురవు- మలిగురువు- తండ్రీ ఒక్కరే. తండ్రివేపు కృతజ్ఞతగా చూస్తూ లేచింది హంపి.
"ఈ రోజెక్కడమ్మా షూటింగ్....?"
"ఆంధ్రజ్యోతికి ఎదురుగా ఉన బంజారా హిల్స్ స్మశాన వాటికలో నాన్నగారు...."
"తల్లికి కర్మకాండ నిర్వహిస్తూ చేతుల్ని కాల్చుకునే సీనేనా.....?" సీతారామారావు తన అరచేతుల్ని తేరిపార చూసుకుంటూ అన్నాడు.
"అవును నాన్నగారు..... ఈ రోజు రెండు కెమేరాలను ఉపయోగిస్తున్నాను.... వస్తాను మరి...." అంటూ హంపీ బయటకు నడుస్తుండగా-
"నీ ఊహల మేరకు నీకొత్త హీరో నటిస్తున్నాడామ్మా....?" అంటూ అడిగాడు సీతారామారావు.
సమాధానంగా ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది.
ఒక ఇంటిలిజన్స్ పోలీసుఆఫీసర్ తీసుకువచ్చిన వార్తవిని ప్రభుషాక్ తిన్నాడు.
కొద్దిక్షణాల వరకు ఆ వార్తను నమ్మలేకపోయాడు. అలా అని పూర్తిగా ఆ వార్తను నమ్మకుండా కూడా ఉండలేకపోయాడు. ఆ వార్తా తెచ్చిన పోలీసాఫీసర్ తన వృత్తిపట్ల గౌరవం- సిన్సియారిటీ ఉన్న వ్యక్తి కావటంతో అతనికేసి చూస్తూ వివరాల్లోకి వెళ్ళిపోయాడు.
"మీకా వార్తా ఎలా వచ్చింది....?" నేరపరిశోధనలో ఉండే వ్యక్తులు గాలివార్తల్ని ఆధారం చేసుకొని తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవటాన్ని ఇష్టపడరు. ప్రభు ఆ కోవకు చెందినవాడే.
"ఎవరో ఫోన్ చేసి చెప్పారు"
"రెగ్యులర్ ఇన్ ఫార్మరా...?"
"కాదు సార్"
"మరి...? ఆ వార్తనెలా నమ్మటం.....?"
"నేనూ అలాగే భావించి దాదాగంజ్ మీద నిఘా వేసాను - చాలా బిజీగా ఉంటున్నాడు. సాధారణంగా అతను ఇన్ వాల్వు అయ్యే లోకల్ గూండాగిరిపై ఎక్కువ శ్రద్ధ కనబర్చటం లేదు. పైగా బయలుదేరిన దగ్గర్నుంచి ఎన్నో వెహికల్స్ మారుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఎక్కడకు వెళ్తున్నదీ తెలుసుకోలేకపోయాను. ఒకసారి మాత్రం....."
"ఆ ఆఫీసర్ మాటలు పూర్తి కాకుండానే ప్రభు అడ్డుతగులుతూ..... "వూ..... ఒకసారి మాత్రం....! ఎక్కడికి వెళ్ళాడు" అన్నాడు తనలో రేగిన ఉద్వేగాన్ని అణుచుకోలేక.
ప్రభు ఆ కేసుపట్ల చూపుతున్న శ్రద్ధను, ఆతృతను అర్థంచేసుకుంటూ "హొమ్ మినిస్టర్ బంగ్లాలోకి వెళ్ళటాన్ని చూసాను సార్....." అన్నాడు వినయంగా.
"హొమ్ మినిస్టర్......బంగ్లా.... దాదాగంజ్...... లోకల్ గూండాగిరి పట్ల ఉందనిపిస్తోంది....." స్వగతంలో అనుకుంటూ కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు ప్రభు.
"మరో చిన్న విషయం సార్"
"చెప్పు"
"దాదాగంజ్ గతరాత్రి హొమ్ మినిస్టర్ ఇంటిముందు సెక్యూరిటీ నిమిత్తం ఉండే మన డిపార్ట్ మెంట్ గన్ మెన్ కి మామూలు ఇచ్చాడు"
"అది సహజమే-లంచాన్ని మనమేం ఆపగలం.....?"
"అక్కడే నాకు చిన్న క్లూ దొరికింది సార్......"
"ఏమిటది....?" ప్రభు షార్ప్ గా రియాక్టు అవుతూ అడిగాడు.
"దాదా అప్పుడు బాగా తాగి ఉన్నాడు. గేటు దగ్గరకు వస్తూ జేబులో చెయ్యిపెట్టి చేతికొచ్చినంత తీసి గన్ మెన్ కిచ్చాడట. దాదా ఇచ్చిన కరెన్సీ నోట్లతో పాటు ఒక నలిగిపోయిన కవర్ కూడా ఉంది. ఆ గన్ మెన్ దాన్ని నా కందించాడు..... దాన్ని చూసాక నా అనుమానం మరింత బలపడింది" ని అంటుండగానే "వేరేజ్ దాట్ కవర్....!" అంటూ సడన్ గా కుర్చీలోంచి లేచాడు ప్రభు.
ఆ ఆఫీసర్ తనషర్ట్ జేబులోంచి బాగా నలిగిపోయి ఉన్న ఒక కవర్ తీసి ప్రభుకి అందించాడు.
ప్రభు ఆతృతగా దాన్ని ఓపెన్ చేసి, ఒక్కక్షణం ఆగి ఎన్ వలప్ మీదున్న పోస్టల్ ముద్రల్ని పరీక్షించాడు ముందుగా.
* * *
"ఓకే.... మేడమ్...." అన్నాడు విల్సన్ భూమ్ షాట్ కి సిద్ధమవుతూ.
"రడీనా మిస్టర్ అనిల్......? టేక్ చేద్దామా......?" అంది హంపి మెఘా ఫోన్ లో మసకబారిన కళ్ళతో అనిల్ తాలుపాడు.
కట్టెల మీద ఓ నడివయస్కురాలు పడుకొని ఉంది.
ఆమెని, అనిల్ ని, అతని వెనుక ఉన్న ఎక్స్ ట్రా ఆర్టిస్టుల్ని ఫ్రేమ్ లోకి తీసుకొని ఫీల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసాడు విల్సన్ అప్పటికే.
"సైలన్స్ ప్లీజ్" అంటూ భవానీ పెద్దగా అరిచాడు. మిగతా వాళ్ళందరికీ అదొక షూటింగ్ లా ఉన్నా, అనిల్ కి మాత్రం జరిగిన కధే తిరిగి పునరావృతమావుతున్నట్లు...... చరిత్ర పేజీల్లో సమాధి అయిన తన గతమే తిరిగి ఊపిరి పోసుకొని కట్టెదుట నిలిచినట్లుగా భ్రాంతి చెందుతున్నాడు.
తనకు జన్మనిచ్చిన తల్లి, తన రక్తమాంసాలు ధారవోసి కంటికి రెప్పలా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించిన తల్లి, మంచి ఉద్యోగం వెతుక్కొని వచ్చి తను తీసుకువెళ్ళి సుఖపెడతాడని భావించిన తల్లి, ఈ ఆర్ధిక వ్యవస్థ మీద, సమాజం మీద, ఎంతో ఆశపెట్టుకున్న తల్లి..... తన కన్నతల్లి.....పిచ్చితల్లి...... దుర్గంధ భూయిష్టమైన నేటి రాజకీయ, ఆర్ధిక వ్యవస్థల గురించి, వాటిని నియంత్రిస్తున్న స్వార్థపరాశక్తుల గురించేమాత్రం తెలీని అమాయకపు తల్లి..... తనకోసం కళ్లు కాయలు కాచేలా, కడుపు కట్టుకొని ఎదురుచూసింది...... నిరీక్షణ..... సుదీర్ఘమైన నిరీక్షణ సహనానికి మారుపేరయిన ఆమెనే అసహనానికి గురిచేయగా కొడుకును వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.
అప్పటికే శుష్కించి పోయిన శరీరం..... ఆ శరీరం సంతరించుకున్న అనారోగ్యం ఆమె నిరీక్షణను పరీక్షకుపెట్టగా ఘోరంగా ఓడిపోయింది.
తన జీవితకాలంలో తన కొడుకు ప్రయోజకుడు కాడేమోనని భావించిన పిచ్చితల్లి శాశ్విత విశ్రాంతిని వెతుక్కుంటూ దూరతీరాలకు వెళ్ళిపోయింది.
అనిల్ కళ్ళ చివరన నిలిచిన వేదనాశృవు అతన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వెక్కిరిస్తూ నిశ్శబ్దంగా జారి కట్టెల మీద పడింది.
"రడీటేక్" అంటూ హంపీ అరిచిన కేక ఆ ప్రాంతంలో ప్రతి ధ్వనించింది కెమేరా ఆన్ అయింది. ఎక్స్ ట్రా ఆర్టిస్టు- కాలుతున్న కట్టెలు తెచ్చి అనిల్ చేతికి అందించాడు. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ కాలుతున్న కట్టెని అందుకున్నాడు.
ఏమేం చేయాలో, ఎలా అభినయించాలో రిహార్సల్స్ లోనే హంపి చెప్పి ఉండటంతో అనిల్ కాలుతున్న కట్టెని గాల్లోకి లేపి ఓసారి దానికేసి చూసి, కుడి అరచేతిని చాపి మండుతున్న కట్టెని క్రమంగా కుడి అరచేతికి దగ్గరగా తీసుకురావాలి. అదీ వేగంగా - అదీ షాట్ - తరువాత షాట్- క్లోజప్ లో అనిల్ మొఖం - అరచేతిని కాల్చుకున్న బాధ, ఆవేదన ఎస్టాబ్లిష్ చేయాలి- కెమేరాని అరచేతికేసి ప్లాన్ చేసినప్పుడే అరచేతిని కాల్చుకొని కట్టెని పైకి తీస్తున్నట్లుగా కనిపించే షాట్ ని తీయాలి.
అంతా నిశ్శబ్దంగా ఉంది.
యూనిట్ సభ్యులంతా మౌనంగా షాట్ ని తిలకిస్తున్నారు.
బ్రెయిన్ బాగా వంగిపోయింది.
కెమేరా అనిల్ కి చేరువుగా ఉంది.
కొద్దిక్షణాలు మండుతున్న కట్టెతో స్టే అయిన అనిల్ కట్టెని గాల్లోకి లేపి కొద్దిక్షణాలు దానికేసి చూసాడు.