Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 3

    అది చదివి ముందు తెల్లబోయింది బలవర్ధనమ్మ. తేరుకుంటూనే అన్ని కాగితాలు తిరగేసింది. అన్ని కాగితాలు రక్షించమనే అంటున్నాయి. తిరిగి చూసేసరికి దీక్ష కనబడలేదు ఆమెకి. క్షణకాలం లబ్ డబ్ లబ్ డబ్ అంటూ కొట్టుకుంది గుండె.

    'ఓరి దేముడో! ఇది అల్లాటప్పా విషయం కాదు. మిన్ను విరిగి వెన్నుమీద పడుతున్నా ఎవరికీ అర్ధమయినట్లు లేదు. నిశ్చింతగా తలుపులు బిగించుకుని పనులు చేసుకునేవారు నిద్రపోయేవారు! అబ్బే ఇలా అయితే లోకం ఏమి బాగుపడుతుంది! ఇదేదో పదిమందికి నేనే చెప్పాలి.' అనుకుంది బలవర్ధనమ్మ.

    చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెపితేగాని ఆమెకి తోచదు. ఒక్కోసారి వార్తలే కరువయినట్లు నోటికి కావాల్సినంత మేత దొరకదు. మేతంటూ ఒక్క గడ్డిపోచ అందినా చాలు. దానిని మహావృక్షాన్ని చేస్తుంది. రక్షించండి అనే వార్తని పట్టుకుని ఏదో మహోత్కార్యం నిర్వహిస్తున్నదానిలా ఆదరా బాదరాగ నాలుగిళ్ళకి బైలుదేరింది బలవర్ధనమ్మ.

    దీక్షకి యిహ ప్రచారం అనవసరం.

    దీక్ష తనకి తెలియకుండానే ఓ మంచి పనిచేసింది. పాంప్లెట్ ని బలవర్ధనమ్మ చేతిలో పెట్టటం.

    ఆ పేటంతా తిరిగి పాంప్లెట్ ని తానే స్వయంగా పంచిపెట్టిన దీక్ష 'అమ్మయ్య! సోమవారం వకటి పూర్తి అయింది. ఇంకా ఆరురోజులు వుంది.' అని భారంగా అనుకుంది.

    ఆ రోజుకి కార్యక్రమం పూర్తి అయిన దీక్ష తిరుగుముఖం పట్టింది.

   
                          -2-

    "వద్దు నేను తీసుకోను." అంది ఆమె.

    "ఎందుకు తీసుకోరు మేడమ్!" దీక్ష మర్యాదగా అడిగింది పాంప్లెట్ చేతిలో వుంచుకుని.

    "ఈ భాగోతం ఎవరికి తెలియదు కనుక!"

    "భాగోతమా!" తెల్లబోయింది దీక్ష.

    "మరికాక!" అంది ఆమె.

    "మీరు చెప్పేది ఏమిటో నాకర్ధం కావటంలేదు మేడమ్!"

    "ఏమి ఎరగనట్లు!"

    "నిజంగా నాకేమి తెలియదు మేడమ్! మీరు అదేమిటో నాకు కాస్త చెపితే...!" ఎంతో  సహనంగా మర్యాద వుట్టిపడే స్వరంతో ఆమె తిరస్కారాన్ని లెక్క చెయ్యకుండా అడిగింది దీక్ష.

    చేపట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే చాకచక్యం అంతకు మించిన ఓర్పు వుండాలని దీక్షకి తెలుసు.

    ఏముంది ఏదో పెద్ద పని వుందన్నట్లు తలుపులు కొడతారు. మేము నిద్ర పోతున్నా సరే పనిలో వున్నా సరే బైట ఏమి కొంపలు మునుగుతున్నాయో అని చేతిలో పని వదిలిపెట్టి వస్తే నీలాంటి వాళ్ళు ఓ కాగితం ముక్క చేతిలోపెట్టి పోతారు. ఆ కాగితంలో...

    మా తల్లితండ్రులకు మేము ఎనిమిది మంది సంతానము. పుట్టుకతో అందరము మూగవారము. దైవము మాకీ శిక్ష చాలదన్నట్లు మా ఎనిమిది మందికి చెముడుకూడా ప్రసాదించాడు. పైగా మేము ఎనిమిది మందిమి ఆడవాళ్లమే.

    మా యీ దురదృష్టమునకు చింతించి ఉప్పుటూరి ప్రెసిడెంటు గారి ధర్మపత్ని, ధనము సాయము చేయటమేగాక ఈ కాగితములు అచ్చు వేయుటకు సాయముకూడా చేసినారు. అలాంటి పుణ్యాత్ముల వల్లనే మేము ఇంకా ఈ పృధ్విపై జీవించి యున్నాము.

    తల్లులారా! తండ్రులారా! ఈ బిడ్డలపై దయవుంచి మీకు తోచిన సాయము తృణమో ఫణమో యివ్వగలరు. అంగవైకల్యము గల ఎనిమిది మంది సోదరీ మణులే గాక వీరి తల్లి తండ్రియు కడువృద్ధులు దీనాతి దీనావస్తలో జీవించి వున్నారు.

                        ఇట్లు,

                శ్రీమతి సతివాడ వేంకట వీరలక్ష్మీ సుబ్బరత్నం

    ఇదిగో యిలాంటి కాగితాలు. ఇదికాక పోతే ఇట్లాంటిదే మరొకటి. చిల్లి కాకపోతే తూటు. వెనుకటికి నాబోటి మహాతల్లి బిందెని మాట్లేసేవాడికిస్తూ 'బిందెకి చిల్లుపడింది మాటేయినాయినా!' అందిట 'దీనిని చిల్లి అనరు తూటు అంటారు.' అన్నాడుట మాట్లేసేవాడు. "చిల్లికాకపోతే తూటు. బిందె కారకుండా వుండటం ముఖ్యం. మాటెయ్యి" అందిట ఆ మహా యిల్లాలు. అలాగే అనుకో నీ కాగితంలో కథ కూడా." గలగల లాడుతూ అంది ఆమె.

    ఆమె చెప్పిన తీరుకి దీక్షకి నవ్వొచ్చింది. నవ్వితే పనిగాకపోగా అపార్ధానికి తావిచ్చినట్లవుతుంది. అందుకే అతి ప్రయత్నం మీద నవ్వాపుకుని మృదువుగా అడిగింది. "నేను మాట్లాడుతూనే వున్నాను కదా మేడమ్!"

 Previous Page Next Page