వాణి కారు దిగి వారి మధ్యకు నిర్భయంగా చాలా చనువు ఉన్న దానిలా వెళ్ళింది. ఒక కొండ దొరసాని దగ్గర నిలిచిపాయింది. "చెల్లీ! పాముల మల్లిగాడు ఎక్కడుంటాడో చెప్పవా?" అని అడిగింది మైత్రీపూర్వక స్వరాన.
అడగటమైతే తనకన్నా వయసులో చిన్నది అయిన కొండ దొరసానిని ఉద్దేశించి అడిగింది కాని, ఆ ప్రశ్న అందరూ విన్నారు. అది వింటూనే ఒకరిముఖం మరొకరు చూచుకోవటం ప్రారంభించారు.
తాను ప్రశ్నించిన దొరసాని పెదవి కదపలేదు. ఒక వృద్దుడు తాను కల్పించుకుని ముందుకు వచ్చాడు. అతడి శరీరం తారు పులిమినట్లు నల్లగా కనిపిస్తోంది కనుబొమ్మలు కూడా తెల్లగా అయినాయి. నుదుటిమీద విభూతి రేకల్ని తలపిస్తూ మూడు గీతాలున్నాయి.
బాగా మాసిపోయిన ఒక చిరు వస్త్రాన్ని కౌపీనంగా ధరించినాడతడు. మెడలో బలిక పూసలమధ్య రాతి వెండి బిళ్లలున్నాయి. వాటిమీద ఏవో బొమ్మలు చెక్కి ఉన్నాయి. పాదాలు అనాచ్చాదితంగా ఉన్నాయి.
"అమ్మా! నిన్ను చుస్తే పట్నవాసం దొరసానిలా ఉన్నావు. దారితప్పి వచ్చావా? ఈ వేళప్పుడు మల్లిగాడి గురించి అడుగుతున్నావంటే ఇక్కడి పరిస్థితులు నీకు బొత్తిగా తెలియవని అర్ధమౌతోంది. వెంటనే తిరిగి వెళ్ళిపో తల్లీ!" అన్నాడతడు.
వాణి తల ఎత్తి అతని వంక తేరిపార చూసింది అనుభవాలు పండిన జ్ఞానమూర్తిలా కనిపించాడతడు. అతడి చదువు సంధ్యలు లేకపోవచ్చు. నాగరిక లోకంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, అద్భుతాలు, వైజ్ఞానిక విప్లవాలు అతనికి అర్ధం కాకపోవచ్చు.
కాని ఆకలి పోరాటానికి, బ్రతుకు సుఖాలకోసం ఆరాటానికి నిర్వచనమయిన మానవ జీవితం అతనికి తెలిసిన వాడిలా కనిపించాడు.
"తాతా! ఒక పనికోసం ఉద్యమించిన తరువాత తిరిగి పోవటమంటే ఏమిటో నాకు తెలియదు. వీరందరికీ నిద్రాభంగమయినట్లుంది నానించి ఇందరికి అసౌకర్యం ఎందుకు కలగాలి? వెళ్ళిపొమ్మని చెప్పు. నేను మల్లిగాడితో మాట్లాడందే తిరిగి వెళ్ళను. అతని గురించి చెప్పవలసిన విశేషాలు ఏవైనా ఉంటే నీవు నాకు చెప్పు" అన్నదామె దృఢస్వరాన.
వృద్ధమూర్తి అయిన కొండదొర పెదవుల చాటున నవ్వుకున్నాడు. గుబురుమీసాలు రవ్వంత కదలినాయి. అతడు ముఖం తిప్పి మిగిలిన వారివంక చూచాడు.
ఆ చూపుల అర్ధాలను గ్రహించిన వారిలో వారంతా తిరిగి ఎవరి పాకలలోకి వారు వెళ్ళిపోయినారు. వెదురు చీలికల అభ్యంతరాలను బిగించుకున్నారు. వృద్ధుడు వాణి కోమల హస్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
విభ్రాంతి అయింది వాణి.
"పట్నవాసం దొరసానీ?పాపం, నీకు మల్లిగాడి గురించి బొత్తిగా తెలియదనుకుంటాను. తక్షణం నీవిక్కడనించి వెళ్ళిపో! అతడు చుస్తే ఎంతైనా ప్రమాదం" అన్నాడు బతిమాలుతున్న ధోరణిలో! వాణి రవంత అయినా బెదరలేదు. తన అభిప్రాయం నించి కొంచెమయినా దిగజారిపోలేదు.
"తాతా! ఎందుకంత కంగారు పడతావు? అతడు ఎటువంటివాడయినా నన్ను కాపాడుకోగలను. కాని మల్లిగాడిని నేను చూచి తీరాలి" అన్నదామె ఏదైనా చాలెంజ్ ఎదురు అయినప్పుడు ఎదిర్చి నిలవడంలో తనకు సాటి మరెవరూ లేరు అన్నట్లుగా!
వ్రుద్దుడయిన కొండదొర ఉస్సురని నిట్టూర్చాడు. ఆమె పట్టుదల విషయంలో చూపులకు కనిపించేంత సుకుమారమైన వ్యక్తి కాదని గ్రహించాడు. అయినా చూస్తూ చూస్తూ అటువంటి రాక్షసుడి దగ్గరకు ఆమె వెళ్లటం అతని మనసుకు సమాధానాన్ని కూర్చలేకపోయింది.
ఎనిమిది పనులు పైబడి ఎన్నో అనుభవాలతో నిండిన జీవితం అతనిది. చావు బతుకుల మధ్య సరిహద్దు రేఖ ఎంత సూక్ష్మమయినదో అతడికి తెలుసు. అతి స్వల్పమయిన కారణాలకు క్షణాలలో బతుకు అగమ్యమైపోయినవాళ్లు ఎందరో అతడికి తెలుసు. ఉన్నత పదానికి వెళ్లి ఒక్కమారుగా పాతాళానికి జారిపోయిన వాళ్ళు తెలుసు. అనుక్షణం జీవితంలోని స్పందనలకు, చైతన్యానికి వెనుక జడత్వం, మృత్యువు దాగి ఉంటాయి. అలాగే పురోగతి వెనక పతనం కూడా పొంచి ఉంటుంది.
ఈమె సాహసం వెనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాని వాటిని గురించి ఆలోచించేందుకు ఆమె రవంత అయినా సంసిద్దురాలు కావడం లేదు.
"పట్నవాసం దొరసానీ! నీవు చాలా సాహసానికి పూనుకుంటున్నావు. నీవు మల్లిగాడి దగ్గరకు వెళ్ళాలంటే మార్గం చూపేందుకు అరక్షణమయినా పట్టదు. కాని అలా చేసేందుకు నా మనసు అంగీకరించలేదు. మల్లిగాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అంతేకాక ఇటివల అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అవేమిటో, ఎందుకు వచ్చాయో అర్ధం కానిదే నీవంటి వారిని అతడి దగ్గరికి పంపటం నాకు చేతకాని పని. ఇంతకూ నీవు అతనివల్ల సాధించదలుచుకున్న దేమిటో నేను తెలుసుకోవచ్చా?" అని అడిగాడు వృద్ధుడు.
వాణి రవంతసేపు ఆలోచనామగ్నురాలు అయింది.
"తాతా! నాకు మోదుగుపూలు కావాలి. అడివికి వెళ్లి రావాలి" అన్నదామె. కొండదొర నవ్వాడు.
"ఈ మాత్రం పనికి మల్లిగాడెందుకులే! నేను తెచ్చి ఇస్తాను" అన్నాడతడు. వాణి విభ్రాంతి ఐపోయింది. ఆమెలో సంశయాలు అధికాదిమైనాయి. మరొకప్పుడు ఐతే ఆమె ఆ విషయం తేల్చుకుని కాని అక్కడినుంచి కదలి వెళ్ళేది కాదో.
కాని ఇప్పటి పరిస్తితి వేరు. కన్నబిడ్డా, కట్టుకున్న భర్తా తనకోసం ఎదురు చూస్తుంటారు. అందునించి ఆమె తల్లిగా, ఇల్లాలిగా కర్తవ్యతాబద్దురాలు ఐపోయింది.
"తాతా! తెల్లవారేసరికల్లా నీవు మోదుగుపూలు తీసుకురావాలి!" అంటూ తాము విడిది దిగిన వివరాలు చెప్పి బయలుదేరిందామె.
వినూత్న ఆగంతుకురాలైన తన యోగక్షేమాలను గురించి అంతగా ఆలోచించి ఆరాటపడినందుకు అతడికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంది.