Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 3

    విడిదికి వచ్చాక తెల్లవారితే సోమవారం. మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందునించే రేపు జరిపించాల్సిన పూజల గురించి మాట్లాడుకో సాగారు.
    "ఏమండి! మారేడు దళాలన్నా, మోదుగుపూలన్నా మహాదేవునికి చాలా ప్రీతి అంటారు. అవి సంపాదించి శ్రీశైలస్వామికి అర్పించుకోవాలనుంది" అన్నది వాణి.
    "ఒకే! అలాగే!" అంటూ వరమిచ్చేశాడు స్వప్నకుమార్.
    వాచ్ మాన్ ని పిలిచి మారేడు దళాలు, మోదుగుపూలు కావాలని చెప్పాడు. ఆముదం పుచ్చుకున్న వాడిలా ముఖం పెట్టాడు వాచ్ మెన్. "మారేడు దళాలు దొరుకుతాయి సార్  మోదుగుపూలు సాధించటం అంత తేలిక కాదు" అన్నాడు ఆ సమాధానం విని ఉలిక్కిపడ్డాడు స్వప్న.
    అక్కడ చెంచువారి తండాలున్నాయి. వారు యాత్రికులకు అవసరమయిన సాయం చేస్తూ, వారిచ్చే ప్రతిఫలాన్ని పుచ్చుకుంటారు. స్వప్నకు ఆ విషయం తెలుసు.
    వాణి  కోరిక తీర్చేందుకు అతడు కృతనిశ్చయుడయినాడు.
    "ఎవరినయినా పిలుపు. ఎక్కడయినా సరే, మోదుగుపూలు తెప్పించు నూరు రూపాయలిస్తాను" అన్నాడు అతనితో.
   వాచ్ మన్ ఆ మాటలకు తేలికగా నవ్వేశాడు.
    "నూరు రూపాయలు కాదు, సార్! నూరువేలిచ్చినా ఇప్పుడు మోదుగుపూలు దొరకవు అవి సాధించి తేగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతడు నివసించే గూడెం ఇక్కడికి అయిదారు కిలోమీటర్లు దూరంలో ఉంది. పిలిచినా ఇష్టమయితే వస్తాడు. లేకపోతే లేదు. వానిని పాముల మల్లిగాడు అంటారు. ప్రయత్నించండి" అని సలహా చెప్పి వెళ్ళిపోయాడు.
    ఆ సమాధానం విని నీరసపడిపోయి వెనుదిరిగాడు స్వప్న.
    "అంతా విన్నాను" అన్నది వాణి.
    "అయితే రేపటి పూజకు మారేడు దళాలు మాత్రమే ఉన్నాయి. మోదుగుపూలు లేవు" అన్నాడు స్వప్న.
    "స్వప్నా! కోరికలు అనేవి మనిషి బతుకును కథలుగా మలుస్తాయి. కోరికలే చరిత్రను రచిస్తాయి. కోరికలే చరిత్రను రచిస్తాయి. కోరిక లేనిదే ప్రాణి లేదు. మనసులో కలిగిన కోరికలనుంచి వెనుకంజ వేయటం పిరికివాళ్ళ లక్షణం. రేపటి ఉదయం పూజకు మోదుగుపూలు నేను సాధించుకు వస్తాను." అంటూ నేరుగా వెళ్లి కారులో కూర్చుంది వాణి.
    "ఇంత చీకటిలోనా!" అంటూ నోరు తెరిచేశాడు స్వప్న.
    "రవిచంద్రుల దివారాత్రాల దోబూచులాటలో వెలుగు చీకటులు సర్వసాధారణం. ధైర్యమనేది కంచుకాగడా. నువ్వు కంగారుపడకు, స్వప్నా. మోదుగుపూలు సంపాదించుకునే తిరిగి వస్తాను" అన్నది వాణి ధైర్యంగా.
    స్వప్న బెంబేలు పడిపోయినాడు.
    "పోనీ, నేను వెళ్లి వస్తాను" అన్నాడు. అందుకు వాణి అంగీకరించలేదు.
    "స్వప్నా, డియర్! మన బాబుని నీకు అప్పగించి నేను పోతున్నాను" అన్నది వాణి. స్వప్న ఉలిక్కిపడినాడు.
    "చిన్న కారణానికి ఇంత సాహసం ఎందుకు" అన్నాడు.
    "సాహసమే కదా జేవితం!" అంటూ సర్రున కారుని ముందుకు దూకించింది వాణి.
    చీకటిలో కలిసిపోతున్న వాణి వంక విభ్రాంతుడై చూస్తూ నిలబడిపోయినాడు స్వప్న
   చీకటి ఆకాశంలోకి ఉల్కలా దూసుకుపోయింది వాణి. చీకటిలో కలిసిపోయింది.
                                                                              2      
    ఆది పదిహేను పాకలున్న గూడెం. దానిలో నివసించే వారు అందరూ కొండ దొరలే. వారికి నాయకుడు మల్లిగాడు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదిన్నర. అప్పటికి వారంతా పాకలలోకి దూరిపోయినారు!
    లోపల దీపకాంతులు లేవు. ప్రకృతిలో ప్రజ్వలించే తారకలే విధాత వారికోసం వెలిగించిన దీపాలు. వేరే దీపాలు వెలిగించుకోవటం వారికి తెలియదు.
    గూడెంలోకి కారు వచ్చి ఆగిన శబ్దం కాగానే పాకల వాకిళ్ళకు అడ్డుంచిన అభ్యంతరాలన్నీ  తెరుచుకున్నాయి. ఒక్కొక్కరూ బయటకు వచ్చారు. కారులోంచి దిగుతున్న వాణిని విచిత్రంగా చూడసాగారు. నగరాలనించి శ్రీశైల దర్శించేందుకు వచ్చే వారిలో కొందరు అక్కడకు వస్తారు. అడవిలో తిరిగి చూడాలనుకున్న వారు అడవిదారులు చుపగాలవారి కోసం వస్తారు. అయితే ఆ ప్రాంతాలకు ఇలా పొద్దుబోయిన తరువాత ఎవరూ రారు. పగలే వస్తారు.
    సాధారణంగా ఆ ప్రాంతాలకు అలా వచ్చేవారు మగవారు అయి ఉంటారు. ఆడవారు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు భయపడతారు. అందుకు కారణం కొండజాతుల వారి జీవితం గురించిన పరిజ్ఞానం వారికి లేకపోవడమే అయి ఉంటుంది.
    చూచేందుకు మొరటుగా కనిపించినా, కొండదొరలకు దొంగతనం, వంచన చేయాలన్న కోరికలుండవు. అర్ధించి వారినించి ఏదైనా పొందాలని ప్రయత్నిస్తారు. వారి గురించి గతంలో విచిత్రమైన అనుభవాలను పొంది ఉన్న వాణి ధైర్యంగా అక్కడకు రాగలిగింది. పాకల అభ్యంతరాలను తొలగించుకుని వచ్చిన వారంతా ఆశ్చర్యంతో బొమ్మలవలె అయి చూడసాగారు.
    కాని ఎవరూ మాట్లాడేందుకు సాహసించలేదు. వాణి వారి కదలికల్ని అమితమైన జాగరూకతతో పరిశీలిస్తోంది. అన్ని పాకల వాకిళ్ళు తెరుచుకున్నా ఒక్క వాకిలి మాత్రం మూసుకునే ఉంది.
    కొండదొరలు, ఆటవికుల ఆచారాలు ఆమెకు కొత్తవయినవి కావు. మూసి ఉన్న ఆ తలుపులు వెనుక ఆ గూడెం నాయకుడు ఉండి ఉంటాడని సులభంగానే గ్రహించగలిగిందామె.
    కారు ఆగినా హెడ్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కారు గూడానికి అభిముఖంగా ఆగి ఉండటం నించి దీపకాంతులలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

 Previous Page Next Page