ఓ అచ్చటా ముచ్చటా సరదా పాడు లేదు. మా అమ్మ, మా నాన్న అంటూ వాళ్ళు గీచిన గీటు దాటడు. తను సరే.... ఇద వాళ్ళ అడుగులు మడుగులు వత్తుతూ అత్తమామల సేవచేసుకుంటూ అక్కడే ఉండమంటాడట. చదివిన చదువు చాల్లే ఇంక చదివి ఉద్యోగాలు ఏం చెయ్యక్కరలేదు. నీవు చదువు మానేయి అంటాడుట. మీవాళ్ళకి మంచి మర్యాదలు లేవు. మా వాళ్ళని పెళ్ళిలో అవమానించారు. అంటూ అస్తమానం దెప్పుతాడట. ఓ సినిమా అంటే రానంటాడుట. ఫ్రెండ్స్ పార్టీలు అలాంటి సరదాలే లేవు. ఇంటికి కావల్సినవి నాలుగు ముచ్చటపడి కొనుక్కుందాం అంటే అక్కరలేదు - అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి.
మళ్ళీ వేరే కొనటం ఎందుకు దండగ అంటాడట.
అదేం పిల్లాడమ్మా.... వాళ్ళింట్లో ఉంటే చచ్చాక ఇస్తారుగాని ఇప్పుడే ఇస్తారా? వాళ్ళిచ్చేవరకు ఇంట్లో ఏం లేకుండా ఉండాలా? కొత్త కాపురం. నాలుగూ అమర్చుకోవాలని వుండదూ దీనికి? అయ్యేరాత.... కొత్తపెళ్ళాం, ఆ మోజు ఉంటే ఈ కాపురం ఇలా ఎందుకేడ్చేది? మా రాత.... దాని ఖర్మ. ఒక్కగానొక్క పిల్లని, భూప్రపంచాలు గాలించినట్టు వెతికి వెతికి వీళ్ళమొహాన కొట్టాం బంగారం లాంటి పిల్లను. పిల్ల సుఖపడుతుందని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళి చేశాం. కాళ్ల పారాణి ఆరకుండా పిల్ల తిరిగివచ్చింది. పోతేపోని! మా పిల్లమాకు బరువా? చూస్తూ చూస్తూ దాన్ని అక్కడ వదిలి చేతులారా చంపలేం.
"దాని ప్రాణానికి సుఖం లేకపోయాక ఎందుకా పెళ్ళి.... ఎందుకా మొగుడు! ఎవరేం అనుకుంటారోనని మాకేం భయం లేదు. వెధవలోకం కోసం పిల్లని బలిపెట్టం. పోనీ ఇంతటితో బయటపడ్డాం. ఇంకా నాలుగు రోజులుంటే ఏ కడుపో వచ్చి దాని గొంతుక్కి ఉరి బిగిసేది. ఏదో చదువుకుంటుంది. ఉద్యోగం చేసుకుని దాని బ్రతుకు అది బ్రతుకుతుంది. అంతేగాని అలాంటి కాపురం దానికక్కరలేదు.
ఆవిడ ఏకధాటిగా గుండెల్లోకసి, దుఃఖం అంతా వెళ్ళగక్కింది. విద్య అలా కళ్ళు వాల్చుకు కూర్చుంది. తల్లిమాటలు ఆపాక, 'అమ్మా.... ఆంటీకి కాఫీ ఇవ్వమ్మా' అంది - తల్లి ధోరణి ఆపాలని కాబోలు.
ఆవిడ లోపలికి వెళ్ళాక నిర్మల విద్య భుజం మీద చెయ్యివేసి "విద్యా.... నీవు తొందరపడలేదుగదా, బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా?" అంది.
విద్య విసుగ్గా చెవులు మూసుకుని "ఆంటీ.... ప్లీజ్! ఐ హేట్ టు టాక్ దిస్ సబ్జెక్ట్ ఎనీమోర్, ఇట్స్ ఏ బాడ్ డ్రీమ్. అది తల్చుకోవాలనిలేదు" అంది బాధగా.
"ఓకే - ఓకే.... నీకు చెప్పాలని లేకపోతే వద్దు" హర్ట్ అయింది నిర్మల.
"ఛా.... అదికాదు ఆంటీ. చెప్పుకోడానికి మీకంటే ఆప్తులు నాకెవరున్నారు? ఈ నెల రోజులుగా ఈ విషయం ఆలోచించి, మాట్లాడి వాదించి విసిగిపోయాను. ఈ టాపిక్ వస్తే నాకు ఆవేశం వస్తుంది. నన్ను నేను కంట్రోలు చేసుకోలేను. నిజంగా నా జీవితంలో ఈ పెళ్ళి ఓ పీడకల ఆంటీ" అంది బేలగా విద్య.
ఏమని ఓదార్చాలో అర్థంకాక నిర్మల మెల్లిగా ఆమె చెయ్యి నొక్కింది. "ఓకే - ఫర్ గెట్ యిట్.... తరువాత మాట్లాడుకుందాంలే" అంది. విద్య మొహంలో భావావేశం తీవ్రతతగ్గి మామూలు అయింది.
"అదేంలేదు ఆంటీ! నేనే వచ్చి మీకు అంతా చెప్పాలనుకున్నాను. ఇంట్లో ఏడ్పులు రాగాల మధ్య ఎవరికీ మనశ్శాంతి లేదు. పరిస్థితి చల్లబడ్డాక రావచ్చని వూరుకున్నాను."
"అసలు గొడవలు ఎందుకొచ్చాయి విద్యా..... ఏ విషయంలో?" సానునయంగా అడిగింది నిర్మల.
"ఏ విషయంలో రాలేదు అని అడగండి ఆంటీ..... ఆయన ఓ చదువుకున్న మూర్ఖుడు. పద్దెనిమిదో శతాబ్దంలో పుట్టాల్సిన ఛాందసుడు! ఇంత చదివి, అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సంస్కారం లేని క్రూక్! నెత్తిమీదకి ముప్ఫై ఏళ్ళు వస్తున్నా సొంత ఆలోచన లేకుండా అమ్మ కొంగు పట్టుకు వేలాడే అర్భకుడు. తను సుఖపడి, ఇంకొకరిని సుఖపెట్టలేని, సుఖపడితే చూడలేని మీన్ ఫెలో - క్రుకెడ్ ఫెలో! ఏ కోశానా సున్నితత్వం, లాలిత్యంకాని, ఆ పదాలకి అర్థం తెలియని మూఢుడు. ప్రేమ, అనురాగం అనేవి ఇస్తే దొరుకుతాయని గ్రహించలేని స్టుపిడ్.... అంతకంటే అతన్ని వర్ణించాలంటే ఐ హావ్ నో వర్డ్స్" అంది ఆవేశంగా.
"నీవు ప్రతిదాన్నీ భూతద్దంలో చూడలేదుగదా. చిన్న విషయాన్ని గోరంతలు చేసి ఆలోచించటంలేదు గదా?" నెమ్మదిగా అంది నిర్మల.
"చిన్నవిషయాలే ఆంటీ..... కాని ఆ చిన్నవిషయాలని పట్టుకుని సాగదీసి, తెగేవరకూలాగి ఇవతలి వాళ్ళని హర్ట్ చేసే సాడిస్ట్ టెంపర్ మెంటుని చిన్న విషయం అని ఎలా వదిలేయటం ఆంటీ? ఇలాంటివి వినేవాళ్ళకి చిన్నవిషయాలుగానే కనబడతాయి, కాని అనుభవించినవారికే అర్థమవుతాయి." ఆమె గొంతు పట్టుకుంది.
నిజమే.... అనుభవించినవారికే అర్థమవుతాయి! ఆ విషయం తనకంటే ఎవరికి తెలుసు! తెలుసుగనకనే ఏదో చెయ్యాలని తాపత్రయ పడింది నిర్మల.
"ఆంటీ..... కొత్తగా పెళ్ళయిన జంట మొదటిరాత్రి మాట్లాడుకోవాల్సిన విషయాలు - 'మీ వాళ్ళు పెళ్ళిలో మా వాళ్ళకి మర్యాదలు సరిగా చెయ్యలేదు. మా అమ్మకి, వదినకి, చెల్లెలుకి అలాంటి చీరలు పెడతారా? భోజనాలకీ వాటికీ పిలవకుండా వచ్చి తింటారులే అన్నట్లు బుర్ర తిరుగుడుగా ప్రవర్తిస్తారా? టేబిల్ మీల్స్, పిండివంటలు చేయిస్తే మర్యాద అవుతుందా? మేం వున్న రెండురోజులు పెళ్ళివారికి మర్యాదలు సరిగా చెయ్యాలని తెలీదా? మేం అంటే ఏమిటో తెలుసా! మా ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా! మీ నాన్నలాంటి వారిని పదిమందిని కొనగలం మేం. మా ఇంట్లో వున్న నగలు చూస్తే కళ్ళు తిరిగిపడతారు మీరు. కట్నం వద్దన్నాం అంటే డబ్బు వద్దన్నాం. అల్లుడి హోదాకు తగ్గట్టు ఓ కారు అయినా ఇవ్వాలని తెలీదా.....' మొదటి రాత్రి నవవధువుతో మాట్లాడవలసిన మాటలా ఇవి ఆంటీ!