ఆమె మనసు ఆనాడే విరిగిపోకుండా ఎలా వుంటుంది ఈ మాటలు విని. హానీమూన్ కి వెడదాం అంటే సెలవు లేదన్న మనిషి వాళ్ళింటికి గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, కామేశరి పెట్టడం అంటూ పదిహేను రోజులుండిపోయారు రోజుకి ఒక పూజచేస్తూ వాళ్ళ వేడుక మనం కాదనం. కాని కొత్త భార్యని సరదాగా నాల్గు రోజలు తిప్పి తీసుకురావచ్చు గదా. ఆ మాత్రం సరదా, సున్నితత్వం తెలిసిన మనిషయితే మొదటిరాత్రే భార్య ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తాడా! 'మా వాళ్ళు మర్యాదలు సరిగా చెయ్యకపోతే ఆ తప్పు నాదా! అసలు వాళ్ళు మాత్రం మర్యాదలకి ఏం లోపం చేశారు? హోటలు రూమ్స్, కార్లు, కాఫీలు, టిఫిన్లు, గ్రాండ్ గా రిసెప్షన్, బట్టలు అవీ అన్నీ చేశారు.
పాతకాలం పద్దతులు - ఆ మొహాలు కడగడాలు అవి మాకు తెలియవు. అంతగా అవన్నీ జరగాలనుకున్నప్పుడు ముందే చెప్పి చేయించుకోవచ్చుగదా! కట్నం వద్దన్నారంటే ఎనభైవేలకారు ఇవ్వాలనా అర్థం..... ఆ ఎనభై వేలిచ్చి కట్నం ఇచ్చాం అని మేం గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందిగా. కారు ఎనభై, పెళ్ళి ఖర్చు యాభై, నా నగలు చీరలు యాభై.... మా నాన్న మరీ లక్షాధికారా? ఏదో ఒక్కర్తే కూతురినని తలకుమించి ఖర్చు పెట్టారు. వాళ్ళకి అవన్నీ కావాలనుకున్నప్పుడు ముందే చెబితే మాకు తాహతువుంటే చేసుకునేవాళ్ళం, లేదంటే ఇంకో సంబంధం చూసుకునేవాళ్ళం. ముందు గొప్పగా ఏమీ వద్దని, తర్వాత ఈ సాధింపులు ఏమిటి? చదువు సంస్కారం వున్న వాళ్ళయితే ఇలాంటి చిన్నవాటికి కొత్తకోడలిని ఇలా ట్రీట్ చేస్తారా? అని నేను ఆవేశంగా దులిపేశాను.
ఆయనగారి మొహం చూడాలి.... 'మొదటిరోజే ఇలా మాట్లాడినదానివి నీవేం కాపురం చేస్తావు? ఆడదానికి అణుకువ నేర్పలేదా మీ వాళ్ళు? నీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర కాదు. మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మా అన్నయ్య పెళ్ళిలో కారిచ్చారు. అడుగడుగునా ఎంత మర్యాదలు చేశారు. మీరిలా అని తెల్సుంటే అసలు చేసుకునే వారంకాదు.' రుసరుసలాడుతూ అన్నారు."
'మీరిలా అని తెల్సుంటే మావాళ్ళు చచ్చినా ఇచ్చేవారు కాదు' అన్నాను వళ్ళుమండి.
"ఆంటీ.... అడుగడుగునా మీ వాళ్ళిలా, మీ అమ్మలా, నాన్నలా అని చెప్పుతూంటే ఎలా భరించటం? అందరినీ వదులుకుని ఆశలు, కలలు అన్నీ భార్తమీద నిలుపుకుని వెళ్ళిన నవవధువు మనసు ఈ మాటలకి ఏమవుతుందో ఆలోచించండి. అందులో చిన్నప్పటి నుంచీ ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగానేమో వాళ్ళందరి తిరస్కారం సహించటం నావల్ల కాలేదు. కొత్త కోడలు అత్తింటికి వచ్చిందన్న సంబరం లేకపోగా అందరూ నన్ను చూసి నేనేదో ఘోరాపరాధం చేసినట్లు మూతులు ముడుచుకునేవారు. మాటకి ముందు 'మా పెద్ద వియ్యాలవారు ఇంత ఘనంగా చేశారు. అంత గొప్పగా చేశారు. ఈ కారు మా పెద్దాడికి వాళ్ళిచ్చారు. చిన్నవాడికీ పెళ్ళయితే కారు వస్తుందని కొనలేదు. మాకేం లేదా పోదా! ఏదో అత్తవారిచ్చారంటే అదో సరదా.
ఇదిగో, ఇప్పుడు కట్టుకున్న ఈ చీర పెద్దబ్బాయి పెళ్ళికి మొహాలు కడిగించినప్పుడు పెట్టారు. అప్పగింతలకి రెండువేల ఖరీదయిన చీర పెట్టారు. అంటూ సందు దొరికినప్పుడల్లా దెప్పి పొడిచేవారు. ఆయన ఆ మాటలన్నీ వింటూ మొహం మాడ్చుకుని కూర్చునేవారు. గదిలోకి రాగానే మళ్ళీ అవన్నీ అంటూ సాధించేవారు. అసలు నేను కొత్త భార్యనన్నదే ఆయనకి గుర్తులేనట్టు, ఎన్నాళ్ళ బట్టో కాపురం చేస్తున్నదాన్ని సాధించినట్టు సాధించేవారు. తొలిదినాల్లో ఉండాల్సిన ఆ మోజన్నా ఉండేదికాదు. ఆయనకి ప్రేమానురాగాలు లేకపోయినా, ఉదయం లేవగానే భార్య కాఫీ తెచ్చివాలి, ఇద్దరూ గదిలో కూచుని సరదాగా తాగాలి! సాయంత్రం అలా షికారు వెళ్ళాలి, ఓ మల్లెపూలు కొనాలి, సాయంకాలం ఏ డాబామీదో ఏకాంతంగా కూచోవాలి లాంటి చిన్న కోరికలు, సరదాలు కూడా లేవామనిషికి.
పొద్దున్నే అమ్మ దగ్గర వంటింట్లో స్టౌ దగ్గర కాఫీ తాగేవారు. నేననే మనిషినే ఇంట్లో ఉన్నట్లు పట్టించుకునేవారుకాదు ఎవరూ. ఆ ఇంట్లో కాస్తో కూస్తో నాతో మాట్లాడిన మనిషి తోటి కోడలు మాత్రమే! ఆవిడ మాటల్లోనూ మాకంటే వాళ్ళు గొప్పవాళ్ళని, మాకంటే వాళ్ళు పెళ్ళి బాగా చేశారు అన్న గరం కనబడేది. మా అన్నయ్య రిసెప్షన్ అయిన వెంటనే వెళ్ళిపోయాడు. వాడున్నంతసేపు వాడితో ఎవరూ మాట్లాడలేదు. ఆ వున్న ఒక్క రోజులోనేవాడు పరిస్థితి గ్రహించాడు. వెళ్ళేటప్పుడు పాపం చాలా ఫీలయ్యాడు.
'విద్యా.... ఏమిటోనే వీళ్ళవరసనాకర్థం కావటం లేదు. బావయినా మాట్లాడడు. ఏమిటో ఎలా గెటాన్ అవుతావో ఇక్కడ' అన్నాడు దిగులుగా.
అసలే విరిగిన నా మనసు వాడలా అనగానే పట్టలేని దుఃఖం వచ్చింది. మావాళ్ళు ఎంచి ఎంచి పప్పులో కాలేశారు. వెతికి వెతికి ఈ కొంపలో పడేశారు నన్ను అని దుఃఖం వచ్చింది. వాడు వెళ్ళాక ఏడుస్తుంటే అనునయించకపోగా 'ఎందుకా ఏడుపు? ఏదో ఈనాటికి నీవొక్కర్తివే కాపురానికి వచ్చినట్లు ఏడుస్తున్నావే. ఆవిడలో ఉన్నట్లు దిగులు పడ్తున్నావెందుకు పాపం' అని హేళన చేశారు.
పెళ్ళయిన పదిహేను రోజులకే నాలో సగం ఉత్సాహం, ఉత్తేజం తగ్గిపోయాయి. పెళ్ళయిన పదిహేను రోజులకే జీవితం ఇంత నిస్సారం అనిపిస్తే ఆ కాపురం ఎంత మధురంగా సాగుతుందో ఎవరూ చెప్పక్కరలేకుండానే అర్థం అయింది. ఆయన మనస్తత్వం చాలావరకు అర్థం అయింది. ఈ కాలం మగవారిలా ఏ విషయంలోనూ ఆయనకి నవీనత అంత యిష్టం లేదు. భార్య అంటే ఇంట్లో అణిగిమణిగి ఉండాలనుకునేతత్వం - చిన్నతప్పులని సైతం క్షమించే ఔదార్యం ఆయనలో లేదు. చెప్పిందే చెప్పి, అనిందే అని ఇవతలివారిని ఎలా హర్ట్ చేద్దామా అనే సాడిస్ట్ మెంటాలిటీ.
తల్లి తండ్రి అంటే గుడ్డి నమ్మకం. వారు చెప్పిందేవేదమని, వారు తప్పు చెప్పరు, చెయ్యరు అనే మూఢనమ్మకం. మనకీ వయసు వచ్చింది. మన ఆలోచనల తీరు వేరుగా ఉండవచ్చు. అన్నింటిలోనూ తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడవనవసరంలేదు. తల్లిదండ్రులను గౌరవించడం అంటే భార్యతో పడుకోవాలో వద్దో కూడా వాళ్ళు చెప్పక్కర్లేదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి. ఆయన సరసం, శృంగారం, సున్నితత్వం, లాలిత్యం అనే పదాలకి తావులేదు.
భార్య అనేది లాలిస్తే కరిగిపోయి పాదాలమీద వాలుతుంది అన్న నిజం తెలియని చదువుకున్న అజ్ఞాని. స్త్రీని గౌరవిస్తే ఆ స్త్రీ ఆ పురుషుడిని దేముడిలా కొలుస్తుందన్న నిజం గుర్తించలేని అవివేకి. ఇవన్నీ ఆ పదిహేను రోజులలో ఏర్పడ్డ అభిప్రాయాలు నాకు.... కాని ఏ మూలో ఇక్కడ నించి వెళ్ళి మా సొంత కాపురం పెట్టాక ఇలా ఉండదేమోనన్న చిన్న ఆశతో, ఆయన వెంట హైదరాబాదు వెళ్ళాను. లేకపోతే అట్నించి అటే ఇంటికి పారిపోయి వచ్చేదాన్నేమో!" విద్య ఆవేశంగా ఎగిరి పడుతున్న గుండెలతో అంది.