అక్టోబరులో విద్య పెళ్ళి జరిగిపోయింది. కట్నం పుచ్చుకోలేదని పెళ్ళి ఏర్పాట్లు ఘనంగానే చేశారు ఆడపెళ్ళివారు. మంచి కేటరింగ్ కంపెనీకి భోజనాలకీ కాంట్రాక్టు ఇచ్చారు. మగపెళ్ళివారికి మంచి హోటలు రూములు బుక్ చేశారు. వేడినీళ్ళు, చన్నీళ్ళు, టేబిల్ మీల్స్, పూటపూట రకరకాల పిండివంటలతో భోజనాలు - అంతా ఆర్భాటంగానే ఖర్చుపెట్టారు. మగపెళ్ళివారికి ఖరీదయిన చీరెలు, బట్టలు పెట్టారు. ఆనవాయితీగా అబ్బాయికి పెట్టాల్సిన వెండి కంచం, చెంబు, వాచీ, ఉంగరం లాంటివన్నీ ఇచ్చారు. విద్య చీరలు, నగలకి కాక అరవై ఐదువేలు ఖర్చు పెట్టారు.
కాని.... పెళ్ళిలో మగ పెళ్ళివారి మొహాలు విడలేదు. మూతులు ముడుచుకున్నారు. చేసిన ఏర్పాట్లు వాళ్ళకి చాలలేదని ఆడపెళ్ళివారు అనుకున్నారు. 'మా తహతంతే, ఇంకేం చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం -' విద్య అమ్మగారు గొణుక్కుంది.
కాఫీకి రండి, టిఫినుకి రండి, భోజనానికి రండి అంటూ ప్రతి మాటు బొట్టు పెట్టి పిలవలేదని, మాకు పెట్టు పోతలకంటే మర్యాదలు ముఖ్యం అని మగ పెళ్ళివారు గొణగడంతో అది ఆడపెళ్ళివారికి చేరింది. 'ఈ కాలంలోనూ ప్రతిదానికీ బొట్లు పెట్టిపిలవడాలూ అదీ - ఏమిటీ చాదస్తాలు' అని ఆడపెళ్ళివారు విసుక్కున్నారు.'కట్నం వద్దన్నాంగదా, అత్త ఆడబడుచులాంఛనాలు కనీసం వెయ్యి నూట పదహార్లన్నా ఇస్తారనుకున్నాం. ముష్టి నూట పదహార్లు ఇస్తారా?..... ఈ పట్టుచీరలు మేం పండుగలకే కొనుక్కుంటాం, పెళ్ళికి కాస్త ఖరీదువుపెట్టారా? కట్నం వద్దన్నాంగా! అసలు వీళ్ళకి అచ్చటాముచ్చటా తెలీదా? వియ్యపురాలికి మొహం కడిగించి వెండుబొట్టు పెట్టన్నా ఇవ్వద్దూ!' అని మధ్యవర్తులదగ్గిర అన్నారు.
'ముందు మాకేం వద్దనడం ఎందుకు, తరువాత మేం యిచ్చినవి సరిపోవు అని గొణగడం ఏమిటి? ఏం కావాలో ముందే అడగాల్సింది. మీ మొహాలు కడగడం ఈ పాత చింతకాయ అలవాట్లు ఏమిటింకా' అని ఆడపెళ్ళివారు ఈసడించుకున్నారు. 'వేడుకలు పెళ్ళిలో కాకపోతే రోజూ మాత్రం వస్తాయా? అచ్చటా ముచ్చటా ఈ రెండురోజులేగా!' అని మగపెళ్ళివారు ఎగిరిపడ్డారు. వీళ్ల మధ్య మాటల విసుర్లు, దెప్పుకోడాలు, మూతిముడుచుకోడాలు జరిగాయని తల్లి చెప్తుంటే నిరాసక్తంగా వింది తను.
పెళ్ళి పీటల మీద మాత్రం విద్య పక్కన అతన్ని చూస్తే ఎందుకో సంతృప్తిగా మాత్రం లేదు తనకి.
పెళ్ళయింది. విద్య తండ్రి 'హానీమూన్ కి వెళ్ళండి' అన్నాడు. తనకి సెలవు లేదని విద్యను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళి గృహప్రవేశం, పార్టీ అది కాగానే హైదరాబాదు వెళ్ళిపోతాం అని చెప్పాడు అల్లుడు. గృహప్రవేశానికి ఆడపెళ్ళి వాళ్ళని రమ్మన వాళ్ళు పిలవలేదు. పిలవకుండా మేం ఎలా వెడతాం అని వీళ్ళు గింజుకున్నారు. ఎవరూ రాకపోతే నేను వెళ్ళను అని విద్య మొండి కేస్తే ఆఖరికి అన్న వెంట వెళ్ళాడు.
పెళ్ళి అయ్యాక దీపావళి పండగకి వచ్చింది విద్య భర్తతో. అతని ఫారెన్ ప్రయాణానికి వీసా ఇంకా రాలేదుట. మొదటి పండుగ రమ్మని చాలాసార్లు ఫోన్ చేస్తేగాని అతను రాలేదుట. ఆఖరుకి ఎలాగో వచ్చారని అంతా సంతోషించారు.
"పెద్ద చదువో అని గోల పెట్టావు, పెళ్ళికాంగానే ఆ మాటే మర్చిపోయావే డిస్ కంటిన్యూ చేస్తున్నావేమిటి?" తను నవ్వుతూ అంది విద్యతో.
"లేదు ఆంటీ..... ఈయనింకా వెళ్ళలేదు. నాకు క్లాసులు పోతున్నాయంటే, మరేం ఫర్వాలేదు. ప్రయివేట్ గా చదవచ్చు అంటున్నారు" అంది కాస్త బాధగా. కొత్త మోజులో భార్యని వదలలేక వద్దంటున్నాడేమోననుకుంది. కాని కొత్త పెళ్ళికూతురు మొహంలో వుండాల్సిన వెలుగు, కళ, సంతోషం లాంటివి ఏమీ కనపడలేదు విద్య మొహంలో. అదోలా డల్ గా ఉందనిపించింది. విద్య ఏమన్నా చెప్తుందేమోనని చూసింది. కాని ఆమె ఉన్నదే రెండురోజులు. మళ్ళీ కల్సుకుని తీరిగ్గా మాట్లాడుకునే టైమ్ లేకపోయిందసలు.
పెళ్ళయిన మూడునెలలకే విద్య పుట్టింటికి వచ్చేసింది. అన్నమాట వినగానే ఏదో ముందే తెల్సిన నిజంలా అన్పించింది నిర్మలకి. ఎందుకో ముందునించి అపశృతే పలికింది తన మనసు అనుకొంది. విద్య అడిగినప్పుడు ఫ్రాంక్ గా తన అభిప్రాయం చెప్పి వుంటే తనమీద నమ్మకంతో, గౌరవంతో ఈ పెళ్ళి చేసుకునేది కాదేమో! కాని ఇప్పుడు.... పెళ్ళయ్యాక పట్టుమని మూడు నెలలు కాపురం చెయ్యకుండా ఇలా జరిగిందంటే, ఇంక విద్య జీవితం ఏమవుతుంది? విద్య తల్లిదండ్రులు ఆవేశంలో ఈ విషయం లోతుగా ఆలోచించటం లేదు. అనుకుంది నిర్మల. హు... ఆఫ్ ఆల్ ది పీపుల్.... తను ఇలా ఆలోచించటం తమాషాగా అన్పించింది ఆమెకే! కాలం ఎన్ని మార్పులు తెస్తుంది? మనుషుల్లోనే కాదు.... ఆలోచనల్లో.... ఆచరణల్లో కూడా!.....
"విద్యా..... ఏం చేస్తున్నావు?" విద్య వచ్చి నాల్గురోజులయినా ఇంటికిరాలేదని, ఆమె వచ్చే మూడ్ లో లేదని గ్రహించిన నిర్మలే వాళ్ళింటికి వెళ్ళింది." నాల్గురోజులయింది వచ్చి, మా ఇంటివైపు రానేలేదే నీవు?" ఏం తెలియనట్లే అడిగింది.
"రండి ఆంటీ..... రండి." విద్య చప్పున మంచం మీదలేచి కూర్చుంది. ఆమె గుండెల మీద ఇంగ్లీషు నవల ఉంది. ఆమె పుస్తకం చదవటం లేదని, ఏదో ఆలోచిస్తోందని నిర్మల గ్రహించింది.
"రావాలనే అనుకున్నాను ఆంటీ! ఏమిటో మూడ్ బాగోలేదు" శుష్కహాసం చేసి అంది విద్య.
"ఎలా బాగుంటుందమ్మా నిర్మల! మాయదారి పెళ్ళి చేసి దాని గొంతు కోశాం. మీ అమ్మగారు అంతా చెప్పే వుంటారు నీకు. కళకళలాడుతూ వెళ్ళిన పిల్ల మూడునెలలకే పీనుగులా తయారయి వచ్చింది.... చూస్తున్నావుగా" అంది విద్య తల్లి కళ్ళు వత్తుకుంటూ.
విద్య కళ్ళు వాల్చుకుంది.
నిజమే. విద్య చాలా చిక్కింది. బుగ్గల్లో నునుపు మాయమయింది. కళ్ళకింద నల్లచారలు. ఆమె మొహంలో దరహాసమేలేదు.
"అమ్మ ఏదో చెప్పింది లెండి! అసలేం జరిగింది?" అంది నిర్మల.
"ఏం జరగలేదని అడుగు తల్లీ! పిల్లవాడు చదువుకున్నవాడు, మంచి వుద్యోగం, ఆస్థిపాస్తులున్నాయని మురిసిపోయాం. వీళ్ళలాంటి పదిహేనో శతాబ్దపు బుద్ధులున్న వాళ్ళని గ్రహించలేకపోయాం. పోనీ అత్తమామలంటే పాతకాలం వాళ్ళుఅని సరిపెట్టుకోవచ్చు. కాని ఇతగాడికేం! చూస్తే పెద్ద ఇంగ్లీషు కంపెనీలో పని, బుద్ధులు చూస్తే పిలక పెట్టుకుని పారాయణ చేసుకునేరం.