Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 4


    ఇక అక్కణ్ణుంచి వెనక్కి వెళ్ళి టాక్సీలో వెళ్ళే ఓపిక లేక రావూరు బస్సు ఎక్కారు. ఉండాల్సిన దానికంటే గాలి ఎక్కువగా వుండిన బెలూన్ లా జనంతో కిటకిటలాడుతోంది బస్సు.

 

    ఇంకా బస్సు బయల్దేరలేదు. అంత జనంలో దూరడం ఇష్టంలేనట్టు గాలి బిగదీసుకుపోయింది. ఉక్కపోత శరీరాన్ని చెమటతో తడిపేస్తుంది.

 

    ఇంకా రాని డ్రైవర్ మీద కొందరు గట్టిగా, మరికొందరు మనసులో తిట్టుకుంటున్నారు.

 

    ఇంత జరుగుతున్నా ముఖాలమీద నవ్వు మాసిపోనిది ఆ బస్సులో ఇద్దరికే. వాళ్ళు నవదంపతులు.

 

    అప్పుడే పెళ్ళయినట్టుంది. ఇంకా పసుపు బట్టలు కూడా మార్చుకోలేదు. నెల్లూరుకి పక్కనున్న ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుని ఇంటికి వెళుతున్నట్టున్నారు. బంధువులంతా చుట్టూ వున్నా వాళ్ళిద్దరు మాత్రం ఈ ప్రపంచంలో లేనట్టున్నారు.


    
    ఆమె వెనకాల అతను. అతను వెనకనున్నా తన ముందుండి ఏవేవో చెబుతున్నట్టు పెళ్ళికూతురి పెదవుల మీద చిన్న చిన్న గులాబీపూలను అతికించినట్టు చిర్నవ్వు మెరుస్తోంది.

 

    అతను చెప్పాల్సినదంతా తన అవయవాలతోనే చేబుతున్నట్టుంది. తన రియాక్షన్స్ నంతా ఆమె కూడా తన శరీరం ద్వారానే తెలియజేస్తున్నట్టుంది. పట్టుచీరలో సైతం ఆమె ఎద స్పష్టంగా తెలుస్తూ వుందంటే ఆ భాగం ఎంతగా పొంగిందో అర్థమవుతుంది.

 

    కళ్ళంతా ఏదో మత్తులో తేలుతున్నట్టు చెమ్మ చెమ్మగా వున్నాయి. పెదవుల్ని కోరిక కాబోలు మధురంగా వణికిస్తోంది. పట్టు రవిక వెనక దాక్కున్న బ్రా పట్టుకోసం పెనుగులాడుతోంది.

 

    అతను తమకం పట్టలేక కాబోలు మరింతగా ఆమెను వత్తాడు. ఆమె ఆ సుఖానికి ఓపలేనట్టు చిన్న జర్క్ ఇచ్చింది. అతను నవ్వుతున్నాడు.

 

    పెళ్ళయిన కొత్త జంటలు మబ్బుల్లో తేలిపోతున్నట్టు సర్వం మరిచిపోయి వుంటారు.

 

    ఈర్ష్య, కుళ్ళు, డబ్బు యావ, ఒంటరితనం, అహం- ఇలాంటి నాన్సెన్స్ లన్నీ వుండవు. తామిద్దరూ స్వర్గంలో వున్నాం- 'ఎవరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి' అన్న బోర్డును వేలాడదీసుకున్నట్టు కొత్తదంపతులు ఏదో మత్తులో వుంటారు.

 

    నందిని బస్సు దిగేవరకు వాళ్ళిద్దర్నీ గమనిస్తూ గడిపింది. వాళ్ళిద్దర్నీ అంతగా అలరించిన ఆ రహస్యం ఏమిటో అప్పట్లో అర్థం కాలేదుగానీ పెళ్ళయిన మరుక్షణం ఆ రహస్యం ఏమిటో తెలిసిపోయింది. అది ఆపోజిట్ సెక్స్ తాలూకా స్పర్శ.

 

    మహత్తంగా, మహిమ అంతా అందులోనే వుంది.

 

    ఆమెకు తమ మొదటిరాత్రి గుర్తొచ్చింది.

 

    అదంతా గుర్తుకు రావడంతో ఒళ్ళంతా వేడెక్కింది. రక్తానికి బదులు కోరిక రక్తనాళాల్లో శరీరమంతా ప్రవహిస్తున్నట్టుంది. ఏదో కావాలన్న ఆరాటం మొదలైంది.

 

    నితిన్ కోసం మరింత ఈగల్ గా వెయిట్ చేస్తోంది ఆమె.

 

    తమ మొదటి పెళ్ళిరోజు ముందుగానే ఒళ్ళో వాలిపోతానన్నానని ఫోన్ లో భార్యకు చెప్పాడు అతను. కానీ పనుల వత్తిడివల్ల వీలుకాలేదు.

 

    అందుకే మార్నింగ్ ఫ్లైట్ ఉదయం పదిగంటలకు వస్తుంది ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఇరవై నిముషాలు పడుతుంది. అంటే పదీ ఇరవైకి ఇంట్లో వుంటాడన్న మాట.

 

    నందిని టైమ్ చూసుకుంది. ఆరూ ఇరవై అంటే మరో నాలుగు గంటల వెయిటింగ్.

 

    ఆమె అప్పట్నుంచి ఏమిటేమిటో చేసిందిగానీ నాలుగు గంటల టైమ్ ని ఏ మాత్రం కుదించలేకపోయింది. పైపెచ్చు కాలానికి ఎవరో కాళ్ళు నరికేసినట్టు అది కదలలేదు. పదవుతూ వుండగా నందిని తిరిగి కారిడార్ లోకి వచ్చి కూర్చుంది.

 

    రామ్ సింగ్ తన చెక్కల గూట్లోకి వెళ్ళిపోయి లార్వా పురుగైపోయాడు. ఇక సాయంకాలమే అతను అందులోంచి బయటపడేది. గేటు శబ్దమైతే ఆటోమేటిక్ గా గుండె అదిరింది ఆమెకి. తల పైకెత్తి చూస్తే డ్రైవర్ గోవిందు కనిపించాడు.

 

    అతను ఆమె దగ్గరికి వచ్చి- "ఎయిర్ పోర్ట్ కు కారు తీసుకెళతానమ్మా" అని చెప్పాడు.

 

    "త్వరగా వెళ్ళు. ఇప్పటికే ఆలస్యమై పోయింది."

 

    తన ఆలస్యానికి నొచ్చుకున్నట్టు గోవిందు ముఖంపెట్టి కారున్న చోటికి వెళ్ళాడు.

 

    కారు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోవడంతో ఆమెలో సంచలనం ఎక్కువయింది.

 

    పదీ ఇరవై దాటడంతో తన కళ్ళనే గేటుకు వేలాడదీసింది ఆమె. ఏ చిన్న శబ్దమైనా సరే ఉలిక్కిపడి అటువేపు చూస్తోంది.

 

    పదిన్నర ప్రాంతాన కారు ఆ ఇంట్లోకి ప్రవేశించింది.

 

    కారిడార్ లో కూర్చుని వున్న భార్యను చూడగానే కారు విండో కిందకి దించాడు నితిన్.

 

    ఏమీ లేకుండానే వుత్తిగానే నవ్వడం, ఆ నవ్వులో వేయి అర్థాలను బిగించడం భార్యాభర్తలకే పరిమితం. అందుకే వాళ్ళిద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు.

 

    అతను కారు దిగి వచ్చేటప్పటికి ఆమె ఎదురెళ్ళింది.

 

    ఒక్కక్షణం ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. ఇన్ని రోజుల విరహం తరువాత కలుసుకున్న ఆ కళ్ళు ఇంద్రచాపాలయ్యాయి.

 

    "రా" అంటూ ఆమె ముందుకి సాగింది.

 

    కొడుకొచ్చాడని తెలియగానే తల్లిదండ్రులు ఎదురొచ్చి కుశల ప్రశ్నలు వేశారు. అక్కణ్నుంచి ఇద్దరూ పైనున్న తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళారు.

 

    ఇక అక్కడ ఎవరూ లేరని అనిపించగానే అతను ఠక్కున ఆమెను వెనక నుంచి కౌగిలించుకుని చేతులను ముందుకు పోనిచ్చాడు.

 

    "ఏయ్- అల్లరిమాని స్నానానికి వెళ్ళిరండి" అంది ఆమె అంతే స్పీడ్ తో అతనిని విడిపించుకుని.

 

    నిజానికి ఆ పట్టులోనే కొంతసేపు వుండాలని వుంది ఆమెకి. కానీ తనూ అతనిలాగా తొందర ప్రదర్శించలేకపోతోంది.

 

    "నావల్ల కాదు" అతను మారాం చేశాడు.

 

    "నా మాట విను" అని ఆమె అంటూ వుందిగానీ అతను వినలేదు. గట్టిగా కౌగిలించుకుని తనకు ఇష్టమైన ఆమె శరీరంలోని కొన్ని భాగాలను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నాడు.

 

    వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరాలు ఇంకాస్త గాఢమైన అనుభవానికి ఆయత్తమౌతున్నాయి.

 

    ఆమె ఓ క్షణంపాటు, అతని ఇష్టాన్ని కాదనకుండా మౌనంగా వుండిపోయి-

 

    "ఇప్పుడొద్దు- స్నానం చేసి వచ్చాక" అతను ఆమె నుంచి విడిపడి, ఆతృతగా అడిగాడు.

 

    "ఊహూఁ" ఆమె అడ్డంగా తల వూపింది.

 

    "మరెప్పుడైతే?"

 

    "రాత్రికి"

 

    "రాత్రికా!" అతని ఆవేశం మీద నీళ్ళు చల్లినట్టు ముఖం వేలాడేసుకుని అడిగాడు.

 

    "ఆఁ- శృంగారం ఎప్పుడూ అయిపోకూడదు- అవుతూ వుండాలి. కోరిక శరీరాన్ని మండిస్తూనే వుంచాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి ఉనికే శరీరానికి గిలిగింతలు పెడుతున్నట్టు వుంటుంది."

 

    ఇక అతను వాదించదలుచుకోలేదు. 

 Previous Page Next Page