Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 3


    'మరి వెళ్ళిరానా?' అన్నాడతను ప్రేమనంతా గొంతులో నింపుకుని. ఇక తప్పదన్నట్లు తల పైకెత్తి అలానే అన్నట్టు తల ఊపింది.

 

    అతను అంతటితో ఆగలేక, తన అరచేతితో ముద్దు పెట్టుకున్నట్టు పెదవులను ఆన్చి, దానిని ఆమెకి పంపుతున్నట్టు నోటితో ఊదాడు.

 

    గాలిలో ఆ ఫ్లయింగ్ కిస్ తన దగ్గరికి వచ్చినట్లు ఆమె చటుక్కున గాలిలోనే పట్టుకుని కుడిచేయి గుప్పిట మూసింది. మెల్లగా కళ్ళెత్తి అతని వంక చూస్తూ ఆ ముద్దుని తన ఎదలో దాచుకున్నట్టు పైట లోపలికి గుప్పెటను తోసింది.

 

    ఇదంతా గమనించి అతను, 'అక్కడా! ఆ భారీ అందాల నడుమ నా ముద్దుకు ఊపిరాడదు' అన్నాడు.

 

    అప్పుడామె మరింత చమత్కారంగా, 'పైటను వింజామర చేసి విసురుతాను లెండి' అంది. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ ముద్దు తన ఎద మధ్యనే వున్నట్టు ఆమె ఫీలయ్యింది.

 

    ఇలా ఆలోచిస్తుంటే నిద్రరాదని తెలిసి, మనసుని డైవర్ట్ చేసుకోవడానికి సాయంకాలం కొన్న మాగజైన్ ను తీసుకుంది. ఇదిలా వుండగా మరో గదిలో పడుకున్న శాంతిమతి కూడా అప్పటికీ నిద్రపోలేకపోతోంది. ఉదయం ఫంక్షన్ కి కావాల్సినవి వున్నాయో లేవోనని చివరిసారి చెక్ చేసుకుంది.

 

    ఇదంతా పూర్తయ్యేటప్పటికి పన్నెండయింది.

 

    ఇక అప్పుడు పడుకుందిగానీ గాఢంగా నిద్రలేకపోతోంది. ఏదో టెన్షన్ ఆమెను ప్రతి గంటకోమారు లేపుతోంది. లేచినప్పుడల్లా టైము వంక చూసుకుంటోంది. అయిదుంపావయినప్పుడు మెలకువ వచ్చింది. పావుగంట ఆలస్యానికే బాధపడిపోయి కూతుర్ని లేపడానికి బయల్దేరింది.

 

    గదుల్లో, హాలులో బంధువులు గాఢంగా నిద్రపోతున్నారు. తమ స్నానాలయ్యాక ఒక్కొక్కర్నే లేపవచ్చని అనుకుంటూ కూతురు గదిలోకి వెళ్ళింది శాంతిమతి.

 

    జీరో క్యాండిల్ బల్బు మసగ్గా వెలుగుతోంది. బెడ్ దగ్గరికెళ్ళి, దీపా...దీపా" అంటూ పిలిచింది.

 

    ఓ క్షణంపాటు అటూ ఇటూ కదిలి, తల్లి తనను పిలుస్తున్నట్టు గ్రహించి లేచి కూర్చుంది దీపశిఖ.

 

    కళ్ళు నులుముకుందిగానీ తల్లి స్పష్టంగా కనపడలేదు. "అమ్మా ట్యూబ్ లైట్ వెయ్" అంది.

 

    "వేస్తాలే" అని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కింది శాంతిమతి. బల్బులోంచి ఒక్కసారిగా వెలుగు దుమికినట్టు పట్టపగల్లా తయారయింది.

 

    "మొదట స్నానం చెయ్" అంటూ కూతురివేపు తిరిగిన ఆమె భయంతో బిగుసుకుపోయింది.

 

    ఇంకులో ముంచి లేపినట్టు నీలంగా మారిపోయింది దీపశిఖ. ముఖంలోని చర్మమంతా లావాలా పొంగి, ఘనీభవించినట్టు వంకర్లు వంకర్లుగా తిరిగివుంది.

 

    లోపలి నుంచి ఎవరో బలవంతంగా బయటికి తోసినట్టు చొచ్చుకొచ్చిన కనుగుడ్లు రెండూ భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆమెకి తెలియకుండానే నోట్లోంచి వేలాడుతున్న నాలుక రక్తంలో ముంచిలేపిన కలబందపట్టలా వుంది. దాన్నుంచి లాలాజలం గూడులోంచి కిందకి దొర్లిపోతున్న పిచ్చుకగుడ్లలా చుక్కలు చుక్కలుగా పడుతోంది. భయానికే చెమటలు పట్టేటట్టుంది దీపశిఖ రూపం.

 

    "ఏమైందే అమ్మా?" అంటూ తన దగ్గిరికి వస్తున్న కూతుర్ని చూస్తున్న శాంతిమతికి మరుక్షణంలో స్పృహ తప్పింది.

 

    నందినికి ఎవరో లేపినట్టు అయిదు గంటలకే మెలకువ వచ్చింది. పక్కకి తిరిగి చూస్తే రాత్రి పగలులోకి మారే విచిత్రమంతా కిటికీలోంచి కన్పిస్తోంది. ఆ కిటికీ ఏదో మాయా దుర్భిణిలా అనిపించింది. అప్పటికే పక్షులు తమ చిన్న కడుపుల్ని నింపుకోవడానికి పెద్ద ప్రయాణాన్నే మొదలుపెట్టినట్టు ఆకాశంలో సాగిపోతున్నాయి.

 

    భూమిలోంచి చీల్చుకొస్తున్న మొలకల్లా సూర్యకిరణాలు తూర్పు ఆకాశాన్ని బద్దలుకొడుతున్నాయి. గాలి చల్లగా తగుల్తోంది.

 

    ఈ మధ్యకాలంలో ఆమె తొందరగా లేవడం అదే ప్రధమం. లేచి చెయ్యాల్సిన పనులు కూడా ఏం లేవు. ఉన్న ఇద్దరు పని మనుషులకే తగినంత పనిలేదు.

 

    ఆ రోజు అంత త్వరగా మెలకువ వచ్చినందుకు ఆమెకి ఏమీ ఆశ్చర్యంగా లేదు. అవును మరి ఆ రోజు ఆమె పెళ్ళిరోజు. ఆ విషయం గుర్తుకొచ్చేటప్పటికి ఆమెకి భర్త కళ్ళముందు మెదిలాడు.

 

    రాత్రంతా కూడా అతని గురించి కలలు. ఏవేవో- ఒకదానికొకటి సంబంధం లేదు. వాటినన్నిటినీ తిరిగి కళ్ళలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది గానీ వీలుకాలేదు. ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకుని లేచి ఇంటి బయటికి వచ్చింది.

 

    అప్పటికే వాచ్ మేన్ మారినట్టున్నాడు. రామ్ సింగ్ వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు.

 

    ఖాకీబట్టల్లో అతను శుభ్రంగా వున్నాడు.

 

    అతనిది నేపాల్. అతనిదే ఏమిటి ఆ కాలనీలో వున్న చాలామంది వాచ్ మేన్ లు నేపాల్ దేశస్థులే.

 

    రామ్ సింగ్ ఆమెను చూసి సెల్యూట్ చేసి తిరిగి గేటుకు అతుక్కుపోయిన సీతాకోకచిలుకై పోయాడు.

 

    నందిని అక్కడే ఓచోట కూర్చుని పనిమనిషి చేత పేపర్ తెప్పించుకుంది.

 

    అంత తెల్లవారే వచ్చే వీలులేదని తెలిసినా ఆమె మాట మాటకీ గేటువంక చూస్తోంది భర్తకోసం.

 

    ఆమె భర్త నితిన్ విశాఖపట్నంలో రొయ్యల ఎక్స్ పోర్టింగ్ బిజినెస్ చేస్తున్నాడు. అతని తండ్రి ఐ.పి.యస్. చదివి గవర్నమెంటులో ఏవేవో పెద్ద పోస్టులు చేసి రెండేళ్ళ క్రితం రిటైరయ్యాడు.

 

    రిటైర్ అవుతూనే ఆయన కొడుకుచేత రొయ్యల బిజినెస్ పెట్టించాడు. ఆ మరుసటి సంవత్సరమే నందినితో పెళ్ళి జరిపించాడు.

 

    బ్యూరోకాట్ గా వున్నా లవ్లీహిల్స్ లో ఇతర బిజినెస్ మేన్ ల లాగానే ఆయన పెద్ద ఇంట్లో ప్రస్తుతం ఆయన, ఆయన భార్యా, కోడలు నందిని వుంటున్నారు.

 

    కొడుకు నితిన్ విశాఖపట్నంలోనే వుంటూ అప్పుడప్పుడూ వచ్చి పోతుంటాడు.

 

    అలా వచ్చిపోవడంవల్లే పెళ్ళయి సంవత్సరం అవుతున్నా తమకు ఇంకా తమకం తీరలేదని నందిని అనుకుంటూ వుంటుంది.

 

    రోజూ రాత్రుళ్లు సరిగ్గా నిద్రరాదు. ఒళ్ళంతా పేలబోతున్న అగ్నిపర్వతంలా మారిపోతుంది. కోరిక బుసబుసమని పొంగుతుంటుంది. నితిన్ కౌగిలిలో తప్ప అగ్నిపర్వతం చల్లారదని తెలుసు. కానీ అతను చాలా దూరంలో వుండిపోయాడు.

 

    పెళ్ళయిన కొత్తలో చేయిచాస్తే అందేంత దూరంలోనే భర్త వుండాలి. లేకపోతే కౌగిలింతలకు బదులు ఆవులింతలే మిగలుతాయి. రాత్రి కూడా నిద్రపోని స్థితిలో వుండాల్సిన తను పగలులో కూడా ఎక్కువ భాగం నిద్రతోనే సరిపెట్టేస్తోంది. అలవాటుపడిన సుఖంకోసం శరీరం మారాం చేస్తుంటుంది. నితిన్ వున్న ఒకరోజో, రెండు రోజులో ఎంతో ఆనందంగా వుంటుంది తను. మొత్తం ప్రపంచంలోనే తామిద్దరే వున్నట్టనిపించే ఆ ఫీలింగ్ చాలా గొప్పది.

 

    ఆమెకి ఠక్కున తాను పెళ్ళికాకుండా వున్నప్పుడు చూసిన ఓ సంఘటన గుర్తుకు వచ్చింది.

 

    ఆమె పుట్టిల్లు నెల్లూరు... ఓసారి బంధువుల ఇంటికి ఆమె, ఆమె తల్లీ బయల్దేరారు.

 

    సమయానికి కారు లేకపోవడంవల్ల బస్సులో వెళదామని నిర్ణయించుకున్నారు. తీరా బస్టాండుకు వచ్చేటప్పటికి పరిస్థితి దారుణంగా వుంది.

 

    అది పెళ్ళిళ్ళ సీజన్. బస్టాండ్ అంతా ఇసుకవేస్తే రాలనంత జనం వున్నారు.

 Previous Page Next Page