ఆనాటి స్త్రీ బతికే ఒక విధంగా నయమేమోననిపిస్తుంది ఒకోసారి. ఆనాటి స్త్రీకి చదువులేదు. అజ్ఞానంలో బతికేది. భర్త ఏం చేసినా పడుండాలని, కొట్టినా తిట్టినా అదే స్వర్గం అనుకుంటూ సహించాలని, తన అదృష్టమో, దురదృష్టమో అంతా భర్తతోనే ముడిపడి వుంటుంది అని, ఇల్లే స్వర్గం అని, పిల్లలని కనడమే ఘనకార్యం అని భర్తకి, పిల్లలకి చాకిరి చేసుకుంటూ బతకడమే జీవిత పరమావధి అనుకుని, భర్త మంచివాడయితే అదృష్టం అనుకుని మురిసిపోవడం, దుర్మార్గుడైతే తన ఖర్మ అనుకుని అనుభవించడం, భర్త లాలించిన రోజు కరిగిపోయి, తిట్టిననాడు ఏడ్చి అదే బతుకు అనుకునేది. భర్త అంటే తిట్టడానికి, కొట్టడానికి హక్కు వుంది. ఆడది అదంతా భరించాలి అని నమ్మేది.
ఆ అజ్ఞానమే ఆమెకి రక్ష అయి ఏ అనుభూతికిలోనుకాకుండా బతకగలిగేది. ఈనాటి స్త్రీ చదువుకుంది. విజ్ఞానం సంపాదించి, స్త్రీ పురుషులిద్దరూ సమానమన్న సత్యం తెలుసుకొని, ఆ సమానత్వం కాగితాలలో తప్ప కార్యాచరణలో కాదన్న నిజం జీర్ణించుకోలేక, పురుషుడికి తల ఒగ్గి బానిసలా బతకలేక, తలఎత్తి ఎదిరించే ధైర్యం లేక, ఎదిరించి పర్యవసానానికి తట్టుకోలేక, అలా అని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, వ్యక్తిత్వాన్ని వదులుకోలేక, ఇటు అటు కాకుండా మధ్యస్థంగా నలిగిపోతుంది.
"మీరు చెప్పింది నాకర్థం అవుతుంది అంటీ! కాని ఈ స్థితి ఎన్నాళ్ళు? కాస్త చదువుకున్న ఆడవాళ్ళయినా ఈ పురుషాహంకారానికి జవాబు చెప్పలేకపోతే ఈ పరిస్థితి ఎప్పటికి మారేను? ఎన్ని యుగాలయినా ఆడది పురుషాధిపత్యానికి తల ఒగ్గి బతకవలసిందేనా?"
"జవాబు చెప్పి నేను సాధించింది ఏముంది విద్యా? నీవు జవాబు చెప్పి సాధించగలననుకుంటే అది ఉత్త అపోహ అసలు ఈ మాత్రం ధైర్యం చేసి ఇల్లు దాటి బయటికి వచ్చే సాహసం నూటికి ఒక్కరి కన్నా లేదు. ఏ ఉద్యమం అయినా ఏ ఒక్కరివల్లో కాదు. తిరుగుబాటు అనేది సంఘటిత చర్య. నూటికి ఒక ఆడది భర్త దౌర్జన్యాన్ని సహించలేక తిరగబడి ఇల్లు వదిలివస్తే అది 'వార్త' అవుతుంది. అదే నూటికి తొంభైమంది చేస్తే "ఉద్యమం" అవుతుంది."
ఏ ఒక ఆడదో కాపురం వదులుకుని వస్తే నష్టపోయేది ఆ ఆడదే కాని ఆ పురుషుడుకి చీమకుట్టినట్లయినా ఉండదు. ఒక ఆడదాని కాపురం కోసం సంఘంలో విప్లవాలు తలెత్తవు. ఆ ఆడదానికోరిక సమంజసమని, ఆమె పోరాటం న్యాయసమ్మతమైనదని జనానికి తట్టేవరకు స్త్రీకి న్యాయం చేకూరదు. స్వాతంత్ర్యం ఇచ్చేది మానేది పురుషుల చేతిలోది కాదు. ఆ సమాన హక్కుకోసం, తన ఉనికి, తన వ్యక్తిత్వం చూపించడానికి స్త్రీలందరూ ముందుకు రావాలి. స్వాతంత్ర్య పోరాటంలో ఒక్క గాంధీగారే అయితే విదేశీయులతో నెగ్గి స్వాతంత్ర్యం సాధించగలిగేవారా?! ఆయన వెనక భారతదేశ ప్రజలందరి సంఘటిత బలం ఉందని, అంతటి బలం ముందు తమ శక్తి చాలదని ఆంగ్లేయులు గ్రహించారు. ఆయన ఒక్కడినే అయితే ఎప్పుడో అణచేసేవాడు. ఎంతటి బలవంతమయిన సర్పమయినా చలిచీమల చేతచిక్కి చస్తూంది అని ఎప్పుడో చెప్పారు. ఈ చీమ ఏం చెయ్యగలదు అని కాలరాస్తాడు పురుషుడు ఒకటో రెండో అయితే. అదే వందలు, వేలు, లక్షలు అయితే చీమలు కలిసి చుట్టుముట్టితే వాటిముందు తలవంచక ఏం చేస్తాడు?" నిర్మల అంది.
"ముందు మన ఆడవాళ్ళకి అసలు ధైర్యసాహసాలు లేవు. మనలో మనకే ఒకరిపట్ల ఒకరికి సద్భావం లేదు. ఐకమత్యం లేదు. ఏం చేసినా ముందు విమర్శించేది ఆడవాళ్ళే. అయితే ఈ పరిస్థితి ఎలా మారుతుందంటారు?"
"ఈ మార్పు రావడానికి కొన్నితరాలు పడ్తుంది విద్యా! ఏ మంచి మార్పూ ఒక్క రోజులో రాదు. ఆడది గడపదాటి బయటికి వచ్చి పురుషునితో సమానంగా చదివి, ఉద్యోగాలు చేసే స్టేజికి రావడానికి ఇన్ని తరాలు పట్టింది. మనముందు ముందు తరాల్లో స్త్రీకి అన్యాయాన్ని ఎదుర్కొనే మనోబలం, ఎదుర్కొని లోకాన్ని లెక్క చెయ్యకుండా బతకగలిగే మనస్థైర్యం అలవడొచ్చు."
"అంతవరకూ మనం నోరుమూసుకుని ఈ పురుషుల అహాన్ని సహిస్తూ పడివుండాలా?"
"చూడు విద్యా..... మన చుట్టూ ఉన్న సమాజంలో, మనుషుల మానసికస్థితిలో మార్పు రానంతవరకు సహించక తప్పదు సహించకుండా ఎదిరించి బయటకొచ్చిన మనలాంటి ఆడవాళ్ళకి లాభం కంటె నష్టమే చేకూరుతుంది. మనసులు కలవని, కలతలు, కలహాలున్న కాపురం వదులుకురావడం చాలా సులువే. వచ్చాక ఆ స్త్రీకి ఏది దారి? పెళ్ళి చేసి ఆడపిల్ల బరువు బాధ్యతలనించి చేతులు దులుపుకున్న తల్లిదండ్రులు తిరిగి ఆ ఆడపిల్లని చేరదీసి, చేయూత నిచ్చేందుకు తయారుగా లేరు. దానికి ఆర్ధిక పరిస్థితి ఒక కారణం. మిగతా పిల్లల పెళ్ళిళ్ళు కొంత కారణం. తమ తరువాత ఆ కూతురి గతి ఏమిటన్న చింత, ఏ కాపురమో ఒక కాపురం, కనీసం ఆడపిల్లకి రక్షణ ఉంటుందన్న ఆలోచనతోనే తల్లిదండ్రులు ఎంతసేపూ, అల్లుడు ఎలాంటివాడైనా కూతురినే సర్దుకుని బతకమని భోదిస్తారు. మనమధ్యతరగతి సంసారాల్లో కాపురం వదులుకుని వచ్చిన ఆడపిల్లని ఆదుకునే తల్లిదండ్రులు ఇంచుమించులేరు. సమాజంలో బతకవలసిన వారా కూతురిని దగ్గరికి తీసి విమర్శలకి గురి అవలేక, ఆ కూతురు భవిష్యత్తుకి ఇంకేదారి వుండదన్న నమ్మకంతో అలా ప్రవర్తిస్తే వాళ్ళని మనం తప్పు పట్టలేం విద్యా!"
"ఆంటీ..... ఈనాటి ఆడపిల్లలు అందరూ చదువుకుంటున్నారు. తమ కాళ్ళమీద తాము బతికే అవకాశాలున్నప్పుడు ఇంతలా భయపడుతూ బతకడంలో అర్థంలేదంటాను-"
"విద్యా.... నా కథ అంతా విన్నాక కూడా నీవింకా అలాగే మాట్లాడుతున్నావా? చూడు విద్యా...... బతకడానికి డబ్బు అవసరమేగాని, డబ్బు ఒకటే జీవితం కాదు విద్యా! చదువు ఉంది, సంపాదించుకొని నా బతుకు నేను బతకగలననే ఆత్మవిశ్వాసం మంచిదే! కాని ఏ అనుభూతులకి నోచుకోని ఆ బతుకు ఎన్నాళ్ళు బతకడం విద్యా......"
"మేడమ్..... మీ కథలో మాదిరి అందరి కథలూ అవుతాయని ఎందుకనుకుంటున్నారు?
"మొదటి పెళ్ళి ఫెయిల్ అయితే రెండో పెళ్ళి చేసుకుంటోంది స్త్రీ కూడా. మీ కేసులో అలా అయిందని అందరికీ అలా అవుతుందా?"