Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 40

    "విద్యా...... నీకింకా చిన్నతనం. ఆవేశంలో దూరాలోచన చేయలేకపోతున్నావు. ఈ దేశంలో సగటు ఆడపిల్లకి పెళ్ళి అవ్వడం ఎంత కష్టంగా వుందో నీకు తెలుసు. అన్నీ వున్నా, చదువు, కొద్దో గొప్పో అందం వున్నా కొంతమందికి పెళ్ళిళ్ళు కావడం లేదు. మధ్యతరగతి సంసారాల్లో మొదటిపెళ్ళికే మొగుళ్ళు దొరక్క బాధపడుతుంటే..... ఓ పెళ్ళయిన ఆడదానికి, కొన్నాళ్ళు కాపురం చేసిన దానికి పెళ్ళి అవ్వడం అంత సుళువు అనుకుంటున్నావా రెండో పెళ్ళి? ఆడదాన్ని..... కాపురం చేసిన ఆడదాన్ని పెళ్ళాడటానికి ఎంతమంది మగవాళ్ళు ముందుకు వస్తారంటావు? వచ్చినా నీవిచ్చే డబ్బు చూసో, నీ ఉద్యోగానికి ఆశపడో రావాలి."
    కొత్తమోజులో నాల్గు రోజులు వూరుకున్నా, మగ అహంతో నీవు రెండో పెళ్ళిదానివని అనుక్షణం గుర్తుచేసి, వ్యంగ్యంగా విసుర్లు విసిరి, నీ బతుకు నరకమయం చేయడానికి సిద్ధపడతాడు ఆ మగమహారాజు. ఎక్కడో నూటికో కోటికో ఏ పుణ్య పురుషుడో అలాంటి స్త్రీని సానుభూతితో అర్థం చేసుకుని మనఃపూర్వకంగా చేయూతనివ్వడానికి రావచ్చు. కాని నూటికి తొమ్మిది మంది మగవాళ్ళు తన భార్యని తనకంటే ముందు ఒకడు అనుభవించాడన్న నిజాన్ని మర్చిపోరు..... మనల్ని మరిచిపోనీయరు. అలాంటప్పుడు ఆ ఆడది ఈ రెండో పెళ్ళి చేసుకుని ఎంత పొరపాటు చేశాను అని ఏడవాలి.
    "ఆ స్త్రీకి పిల్లలుంటే రెండో పెళ్ళి ద్వారాలు పూర్తిగా మూసుకుపోతాయి. పెళ్ళయి పిల్లలున్నదాన్ని చేసుకుని ఆ పిల్లల్ని తన పిల్లలుగా భావించగలిగే పుణ్యపురుషులు వుంటారా, వున్నారా అని సందేహం. ఈ మధ్య కొందరు స్త్రీలు వైధవ్యం పొందిన వారు, విడిపోయినవారు ధైర్యం చేసి కొందరు రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ పెళ్ళిళ్ళలో సక్సెస్ అయినవి చాలా తక్కువ. మొదటి మేరేజ్ సక్సెస్ అవడం అరుదయినపుడు, రెండో పెళ్ళి గురించి ఏ ఆశలు పెట్టుకోగలం?"
    "మీరు మరీ ఎగ్జాగరేట్ చేస్తున్నారనిపిస్తూంది ఆంటీ! పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయని నేననుకోను." విద్య నిర్మల మాటలు నమ్మలేక అంది.
    "హు..... అనుభవంలోకి రానంతవరకు హోప్ వుంటుంది. సరే..... నిన్ను రెండో పెళ్ళికి నిరుత్సాహపరచడం నా వుద్దేశం కాదు. అయితే, నీవు ఆ పెళ్ళితో సంతోషంగా వుండగలిగితే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. కాని గాడ్ ఫర్ బిడ్. రేపు నా కేసులాగే నీదీ అయితే! మీ ఆయనా పంతం కొద్దీ డైవర్స్ ఇవ్వనంటే...... ముందు బతుకంతా వంటరిగా బతకగలిగే ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను?" జవాబు చెప్పమన్నట్టు చూసింది నిర్మల."      
    విద్య తల దించుకుంది.
    "నాకు తెల్సు విద్యా..... నీకింకా ఇరవై రెండేళ్ళు లేవు. మరో పెళ్ళికి వీలు లేకపోతే ఎన్నాళ్ళు ఏ అనుభూతులు, ఏ స్పందనలు లేకుండా, ఏ ఎమోషన్స్ లేకుండా, ఓ ధ్యేయం అంటూ లేకుండా బతకగలవు? అనుభవించినదాన్ని కనుక నీకింతగా చెప్తున్నాను. పెళ్ళి అంటే సెక్స్ కోరికల కోసమే కాదు. ఆడదాని జీవితంలో సెక్స్ ఇంపార్టెన్స్ మగవాడి జీవితంలో ఉన్నంత వుండదు. కోరికలున్నా, అవి తీరకపోయినా మగవాడిలా పెద్ద బాధపడదు. స్త్రీకి పెళ్ళిలో కావల్సింది ప్రేమ, అనురాగం, నేనున్నాను నీకు అన్న భరోసా, రక్షణ. తనకోసం తపించే ఓ వ్యక్తిని కోరుకుంటుంది స్త్రీ."     
    "మీరు చెప్పినట్లే స్త్రీ కోరుకునే ఆ కనీస కోర్కెలు తీరకపోతే ఇంక పెళ్ళికి అర్థమేమిటి ఆంటీ! ఆ భర్త ఎలాగూ ఏ అనుభూతులూ పంచి ఇవ్వడు. అలాంటి భర్తతో కలిసి బాధలుపడుతూ అక్కడ బతికేకంటే వంటరి బతుకే నయం కాదంటారా?"
    నిర్మల విద్యకి ఎలా బోధపరచడం అన్న ఆలోచనతో కొట్టుమిట్టాడింది ఒక్కక్షణం. తన జీవితంలో ఏర్పడిన వెలితి, తన జీవితంలో ఏర్పడిన  మొనాటనీ..... మాటల్లో ఏ విధంగా మలిచి విద్యకి బోధపరచాలి అన్న ఆలోచనతో సతమతమయింది. మాటల కోసం తడుముకుంది.       
    "విద్యా..... నీకో చిన్న ఉదాహరణ చెపుతాను. మనజీవితం కదిలే రైలు బండి అనుకో. రైలు ప్రయాణంలో ఓ గమ్యం ఉంటుంది. జీవితంలో ప్రతి దశలోనూ గమ్యం చేరుకోవాలన్న తాపత్రయం ప్రతిమనిషిలోనూ ఉంటుంది. రైలుబండి కదులుతున్నంతసేపు ఎంత రద్దీ, దుమ్ము, ధూళి, చీదర, చెమట కంపు ఉన్నా అన్నీ భరిస్తూ గమ్యం చేరడం కోసం ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంటాం. అదే రైలుబండి ఆగిపోయింది అనుకో - ఆ దుమ్ము, చీదర, ఆ ఉక్క, ఆ వాసన నిమిషం భరించాలన్నా నిమిషమో యుగంలా అన్పిస్తుంది. కదలని రైలుబండిలో ఎయిర్ కండిషన్ కంపార్ట్ మెంటులో వున్నా మనిషి సుఖంగా కూర్చోలేడు. ఆ ఎయిర్ కండిషన్ చల్లదనం, ఆ కుషన్ల మెత్తదనం, ఆ కర్టెన్ల అందం అన్నీ వున్నా రైలు కదలకపోతే ఆ ఎయిర్ కండిషన్ చల్లదనమూ, ఆ కుషన్ల మెత్తదనమూ ఎంతసేపు చూస్తూ కూర్చోగలడు మనిషి? గమ్యం వైపు చేరుకుంటే అన్ని కష్టాలన్నీ భరిస్తూ ఓపిగ్గా ప్రయాణం చేయగలం. మనిషి జీవితం అలాంటిదే. జీవితం ప్రవహించే నదిలాంటిది.    
    మనిషి ప్రతి దశలోనూ మార్పు, కొత్తదనం వుంటూ రొటీన్ లైఫ్ నుంచి, నిర్లిప్తత నించి మనిషిని నడిపిస్తూంది. చిన్నతనంలో ఆటపాటలు, కాస్త పెద్దయ్యాక చదువు సంధ్యలతో బిజీ. ఆ తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి. ఆ పెళ్ళి తర్వాత పిల్లలు, పిల్లలు పుట్టాక వాళ్ళ గురించి ఆశలు, ఆలోచనలు, చదువులు, ఒడిదుడుకులు, పెళ్ళిళ్ళు, ఖర్చులు, మనవలు, వారి ముద్దు మురిపాలు, వార్థక్యం, మరణం..... ఇలా ప్రతిదశలోనూ మనిషి జీవితం రోజురోజుకీ నవ్యతతో కూడి వుంటుంది.
    ఒకదశ గడిచి మరో దశలోకి మారిపోతూ మనిషిని ఆలోచించుకోనీయనంత వేగంగా రోజులు దొర్లిపోతూంటాయి. మన చిన్నతనం తీసుకో..... ఆటపాటలతో, చదువు సంధ్యలతో రోజులు ఎంత తొందరగా దొర్లిపోతాయి! తరువాత పెళ్ళి, సంసారం, పిల్లలు, వారి ఆలనాపాలనా..... చదువులు, పెళ్ళిళ్ళు అంటూ వుంటే నా జీవితం ఇంత మోరోజ్ గా వుండేది కాదు. కాపురం, సంసారం అంటూ వుంటే కష్టాలు, కన్నీళ్ళు  కలతలు వున్నా రోజులు గడిచిపోయేవి ఎలాగో అలాగ. కాపురం అంటూ వుంటే ఆ భర్త మంచివాడని సంతోషించడమో, చెడ్డవాడని దుఃఖించడమో, ఆ భర్త గురించి ఆడిపోసుకోవడమో పిల్లలు పుడితే ఆ పిల్లలని చూసుకుని దుఃఖం మరిచిపోవడం, మీ కోసం బతుకుతున్నానర్రా అంటూ ఆత్మవంచన చేసుకుంటూ ఆ పిల్లల బాధ్యతల బరువుతో రోజులు దొర్లిస్తూ..... పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుని, మనవలని చూసి సంతోషిస్తూ ఏదోలా రోజులు దొర్లించేసేదాన్నేమో!       
    నేను ముందే చెప్పినట్టు నాకు డబ్బుంది కనక దర్జాగా ఎయిర్ కండిషన్ పెట్టెలో ఎక్కగలిగాను కాని కదలని రైలు ఎంతకని ఆ ఎయిర్ కండిషన్ ఇచ్చే సుఖాన్ని అనుభవిస్తూ కూర్చోగలను? 

 Previous Page Next Page