Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 38

    మనదేశంలో అసలు ఆడదానికి వేరే ఛాయిస్ లేదు అనుకో. పెళ్ళి అన్న పదానికి చాలా ప్రాముఖ్యత వుంది మనదేశంలో. ఆడది పుట్టడం, పెరగటం అంటే పెళ్ళికొరకు, పిల్లల కొరకు అన్న దృక్పథం చిన్నప్పటి నుంచి పెంచి పోషించబడ్తోంది. ఆడపిల్ల అంటే 'ఆడ'పిల్ల అనే భావంతో చూస్తారు. ఆడదాని జీవిత ధ్యేయం పెళ్ళి అని చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దలు ఆమె మనసులో నాటుతారు. ఆమె జీవితంలో అదృష్టమో, దురదృష్టమో పెళ్ళితో ముడిపడి వుంటుంది. ఆ వచ్చే భర్త కాస్త సామాన్యుడయితే ఆ ఆడదాని జీవితం ఏదో చిన్నచిన్న ఒడుదుడుకులున్నా సాఫీగా సాగిపోతుంది. అదే ధూర్తుడు, అహంభావి అయితే ఆ స్త్రీ జీవితం నరకంగా మారుతుంది."   
    మరి అలా నరకంగా మారినా సర్దుకుని బతకాలనే అందరూ చెప్పేది. మీరూ అలాగే అంటున్నారుగా!" విద్య మధ్యలో అడిగింది.
    "విద్యా! నేను ముందే చెప్పాను..... ఏ పురుషుడుగాని, ఏ స్త్రీగాని పెర్ ఫెక్ట్ గా వుండదు. ఏవో లోపాలు, బలహీనతలు ప్రతివారిలో వుంటాయి. ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. ముందే చెప్పినట్లు ఆడదానికి ఈ సమాజంలో ఛాయిస్ లేదు. ఆడదానిలో బలహీనతలు, లోపాలు ఉంటే అవి ఆ భర్త సహించడు. భర్తకి అనుగుణంగా సర్ధుకుని, తన అహం, వ్యక్తిత్వం అన్నీ చంపుకుని తన అండనపడుండాలని భర్త ఆశిస్తాడు. అదే భర్తలో బలహీనతలనీ, అహాన్ని ఆడది చచ్చినట్లు భరించాల్సి వస్తుంది మనదేశంలో. మిల్స్ అండ్ బూన్ నవలల్లో, సినిమాల్లో మాదిరి ఏ పురుషుడూ నిజజీవితంలో ఉండడు. ఆడదాన్ని సున్నితమైన పువ్వులా, సుకుమారంగా లాలించడం, అనురాగంతో ముంచెత్తడం, ప్రేమతో పరవశింపచేయడం, ఒకరి కౌగిట్లో ఒకరు కరిగిపోవడం, ఒకరి కళ్ళలోకి ఒకరు మైమరచి చూసుకోవడం - ఇవన్నీ కథలల్లో, సినిమాలలో తప్ప నిజజీవితంలో జరగవు. ఆడదాని అదృష్టం కొద్దీ కాస్త సున్నితం, లాలిత్యం తెల్సిన భర్తయితే కనీసం ముందు రోజుల్లోనయినా భార్యని అలరించడానికి ప్రయత్నిస్తాడు. కాస్త శృంగార భావాలున్న మగవాడయితే ఆ కొద్దిక్షణాలయినా భార్యని లాలిస్తాడు. కాని అలాంటి మగవాడు నూటికి పదిమందన్నా వుంటారా?"  
    "మిగతా మగవారు చాలామంది ఆడది, భార్య అంటే విలువా, గౌరవం ఇవ్వనక్కరలేదని, తన అవసరాల కోసం సృష్టించబడిందని అనుకుంటారు. భార్యని శారీరకంగా తప్ప మానసికంగా గెల్చుకోవాలన్న ఆరాటం ఉండడు వాళ్లకి. ఆడది లాలిస్తే, కాస్త అనురాగం చూపిస్తే కరిగి పాదాలమీద వాలి, బానిస అవుతుందనేది గుర్తించలేని మూర్ఖులు మగవాళ్ళు. సున్నితం. లాలిత్యం ఏ కోశానలేని పురుషుడితో జీవితం స్త్రీకి నరకమే. కాని వివాహబంధానికి కట్టుబడి ఒళ్ళప్పగించి పిల్లలను కంటూ, వంటింట్లో చాకిరి చేసుకుంటూ భర్తగారు కాస్త ఆదరంగా మాట్లాడిన క్షణంలో పొంగిపోయి, తిట్టినప్పుడు ఏడుస్తూ ఇంతే జీవితం అనుకొని తృప్తిపడ్తుంది ఈ దేశంలో సగటు స్త్రీ."
    "మీరు చెప్పింది ఇదివరకటికాలం స్త్రీ సంగతి ఆంటీ..... ఈనాడు పురుషుడితో సమంగా చదివి, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ ఇంకా పురుషుడి దయాధర్మాలకి తలవగ్గి బతకాల్సిందేనా అన్న ప్రశ్న ఈనాటి స్త్రీ అడుగుతుంది. మీ అమ్మమ్మ, అమ్మవేరే దారి లేక భర్తల ఆగడాలు భరించిపడున్నారు ఇంట్లో. అలా ఈనాటి స్త్రీ ఎలా వుండగలదు ఆంటీ? చదువు, ఆర్థికస్థోమత లేని ఆనాటి స్త్రీ వేరే గతిలేక పడుండేది. ఇప్పుడు చదువు ఇచ్చిన నిబ్బరంతో, చదువు ఇచ్చిన వ్యక్తిత్వంతో స్త్రీ ఇదివరకులాగా ఎలా పడి వుండగలదు ఆంటీ?" తీవ్రంగా ప్రశ్నించింది విద్య.
    "విద్యా..... నిజమే! రోజులు మారాయి. ఆడవాళ్ళు గడపదాటి బయటికివచ్చి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వచ్చారు. ఎంత చదివినా, ఎంతపెద్ద ఉద్యోగాలు చేసినా వారింకా పురుషుడి అధీనతకి తల ఒగ్గే బతుకుతున్నారు విద్యా ఆడది ఆర్జనపరురాలైనా తన సంపాదన తన ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేని వాళ్ళున్నారు."
    ఆడది చదువుకొని ఉద్యోగం చెయ్యడం వల్ల ఆడదానికి ఒరిగిన లాభం ఏం లేదు.  ఆడది ఆర్జన పరురాలై భర్తగారికి సాయపడుతూ ఇంకో ఇంత బాధ్యత నెత్తినవేసుకోడం మినహా ఈనాటి స్త్రీకి ఒరిగింది ఏమీలేదు. స్థూలంగా ఆలోచిస్తే ఆడదాని పురోభివృద్ధి అంటే వేషభాషల్లోనే వచ్చింది. వచ్చిన మార్పుల్లా ఆడది గడపదాటి బయటికి రావడం వరకే. స్త్రీకి పురుషుని మాదిరిగా వ్యక్తి స్వాతంత్ర్యం రాలేదు. అంటే తనకి నచ్చింది ధైర్యంగా చెయ్యగల సాహసం చేసి విమర్శలకి తట్టుకుని ఎదిరించి నిలబడగలగడం, తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని వెల్లడించే అవకాశం ఈనాటి స్త్రీకి ఇంకా రాలేదు.
    పెళ్ళికాకముందు తండ్రి, పెళ్ళయ్యాక భర్త ముసలి వయసులో కొడుకు - ఇలా జీవితంలో ప్రతి స్టేజిలోనూ ఆమె పురుషుడి ఆధీనంలోనే ఉంటుంది. ఎంత చదువుకున్నా, సంపాదిస్తున్నా ఇంట్లో చెప్పకుండా, పర్మిషన్ తీసుకోకుండా కనీసం సినిమాకైనా వెళ్ళగలిగిన స్త్రీలు మన మధ్యతరగతి సంసారాల్లో ఎందరున్నారంటావు? ఆడదాన్ని మగవాళ్ళందరూ చిత్రహింసలు పెడ్తున్నారని, బానిసలా చూస్తున్నారని, గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని నేననను. కాని ఈనాటికి భావ స్వాతంత్ర్యం లేదు స్త్రీకి. తనకి నచ్చినది చెప్పగలిగే, చెప్పినది చేయగలిగే స్వాతంత్ర్యం ఎంతమంది స్త్రీలకి వుందంటావు విద్యా?
    ఇలాంటి పరిస్థితులలో మన అమ్మ, అమ్మమ్మల తరం కంటే మనం సాధించిన ప్రగతి ఏ మాత్రమో నీవే ఆలోచించు. నేనూ చదువుకున్నాను, ఆర్థికంగా స్వతంత్రురాలిని. నా భర్తతో విడిపోయి ధైర్యం చేయగలిగానుకాని, నా భార్తలా పెళ్ళికాకపోతేపోయింది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినవాడితో తిరుగుతాను అనే ధైర్యం, సాహసం నాకున్నాయా? నా భార్తలా నా సుఖం కోసం నాకు నచ్చిన తోవ ఎన్నుకోలేక ఎందుకిలా కుమిలిపోతున్నాను? ఎందుకంటే, స్త్రీ స్వతంత్రించి పురుషుడిలా ప్రవర్తించితే ఈ సమాజం ఊరుకోదు కనక. నేను ఒక్కర్తినే సినిమాకయినా వెళ్ళగలుగుతున్నానా? వెళ్ళనిస్తున్నారా! నాన్న, అన్నా, అమ్మా ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందేగదా? ఈనాటికైనా ఆడదానికి! మనం ఇదివరకటి తరంకంటే సాధించిన ప్రగతివల్ల స్త్రీకి ఏం లాభం చేకూరుతుంది?       
    స్త్రీ చదువుకోవడంవల్ల విజ్ఞాన ఆర్జన తప్ప ఆమెకి ఒరిగింది ఏముంది? ఇంట్లో పిల్లలకి చదువు చెప్పుకోవడానికి, ఇంటిబయట సంబాళించుకునే బాధ్యత ఆమె మీద పడేసి కాస్త ఫ్రీ అయ్యాడు ఈనాటి పురుషుడు. స్త్రీ ఉద్యోగం చేసినందువల్లా ఆ ఆర్ధిక స్వాతంత్ర్యం ఆమె కన్నా ఇంట్లో వారికే లాభిస్తుంది. భార్య సంపాదనతో ఇంట్లో కంఫర్ట్సు పెంచుకుంటున్నాడు పురుషుడు. వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడయి అతని బరువు కాస్త తగ్గించుకున్నాడు. సంపాదిస్తున్నంత మాత్రాన సర్వ స్వాతంత్ర్యంగా ఎంతమంది ఆడవాళ్ళున్నారంటావు. మనం చదువుకుని, మనకూ ఓ వ్యక్తిత్వం ఉండాలనుకుని పురుషుడిని ఎదిరించి మనం సాధించింది ఏమిటి? అటు పురుషుడితో సమానంగా బతకలేక, అటు పాతతరం స్త్రీలా భర్తమాట జవదాటని పతివ్రత అని అయినా అన్పించుకోలేక రెండింటికి చెడిన రేవడిలా ఉన్నామనిపిస్తోంది.

 Previous Page Next Page