ఆప్టరాల్ దెబ్బలేగా - రేపో, ఎల్లుండో నయమైపోతాయి. ఇవాళ షాపుకి సెలవు పెట్టెను. ఆకలిగా వుంది. ఏదైనా హొటల్ కి వెడదాం! ఓకే!"
"కనీసం అక్కడైనా జరిగింది చెబుతావా?"
"ప్రయత్నిస్తా! ప్రామిస్ చేయలేను. ఆకలి!"
శారద మరేమీ ప్రశ్నించకుండా అతన్తోపాటు హొటలు వేపు నడుస్తోంది.
* * *
నందివాడ వారి వీథికి చాలా దూరంగా ఉన్న బేంకులో -
లక్షా పాతికవేల రూపాయల్తో జాయింటు ఎక్కవుంటు ప్రారంభించేరు సింహాచలం భద్రాచలంలు.
ఆ పని పూర్తయ్యేక ఇద్దరూ ఒకర్నొకరు ఆత్నీయంగా కౌగలించుకున్నారు, చెయ్యీ చెయ్యీ కలుపుకుని జాయింటుగానే బేంకు నుంచి బయట పడ్డారు.
"టైమీజ్ షార్ట్!" అన్నాడు సింహాచలం.
"ఇంగ్లీషా?" అన్నాడు భద్రాచలం.
"వై నాట్? నువ్వు సిక్కుల కుర్రాడి అవతారం ఎత్తలేదూ? అట్లాగే నేను ఇంగ్లీషు కుర్రాణ్ని కావచ్చు గదా? ఆ అవసరం కూడా రావచ్చు గదా! ఇంతకీ నే చెప్పేదేమిటంటే....."
"టైమీజ్ షార్టన్నావ్!"
"అంతేగా మరి! వితిన్ ప్యూ మంత్స్ -మనం ఎంత ఏక్టివ్ గా వర్క్ చేస్తే అంత డబ్బు! లేక్సండ్ లేక్స్! ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోవాలి."
"అంతా ఆ దేవుడి దయ!"
"మనకి ఏ దేవుడూ వద్దు. ఉన్నారుగా ఆనందం పరమానందం మహానుభావులు!వాళ్లే మనకి జంట దేవుళ్లు! వర్తమాన దేవుళ్లు!వాళ్లని నమ్ముకుంటే చాలు. కనకవర్షం!" అన్నాడు సింహాచలం.
37
ఆనందమింటో -
ఆనందం కాలుకాలిన పిల్లిలాగా ఆ గదిలో తిరుగుతున్నాడు. అంతలో
"నమస్కారం!" అంటో సింహాచలం ప్రవేశించేడు.
"ఇంతసేపూ ఎక్కడ వున్నావు?" అడిగేడు ఆనందం.
"మనసు బావుండక గుడికి వెళ్లేనండి!"
"జరిగిందానికి చింతిస్తున్నావా?"
"అంతే కందడీ మరి? పందెం గెలిచే వాతావరణానికి మబ్బులు పడితే చింత వుండదా? ఈ మధ్య నాకు పేడ కలలు కూడా వస్తున్నాయండి!"
"పేడ కలలా?"
"చిత్తం!"
"పేడ కలలేమిటయ్యా నీ బొంద! వాటిని పీడకలలంటారు!"
"చిత్తం! నాకు మాత్రం పేడకలలు వస్తున్నాయండీ! ఆఘమందో, గేదెల మందో నా ముందు. వాటికి వెనక తట్టా బుట్టా పట్టకుని నేను పశువులు విసర్జించిన పేడను బుట్టల్లోకి, తట్టల్లోకి ఎత్తుకోవడం, ఆ పేడను పిడకలుగా గోడకేసి కొట్టడం - ఈ రోటీస్ కలలెందుకోస్తున్నాయో తెలీడం లేదు."
"ఆ కలల్లో నేను కనిపిస్తున్నానా?" ఆందోళనగా అడిగేడు ఆనందం.
"అదే నా విచారం! ఎంత వెతికినా తమ జాడ మాత్రం కనుక్కోలేకపోతున్నాను."
"అంటే పేడ పోగుచేసుకునే కార్యక్రమంలో నేను తప్పనిసరిగా వుంటానని నీ ఉద్దేశమా?" అడిగేడు ఆనందం.
"చిత్తం! తమరట్లా అన్వయించుకుంటే నేనేం చేయలేను. కల గదా! కలల్లో చిన్నా పెద్దా తేడాకుండవండి! మన మంత్రిగారు మాలీషు చేస్తున్నట్లు నాకు కలలో కనిపించవచ్చు. అట్లాంటి బేవార్సు కల నీకెందుకొచ్చిందని మంత్రిగారు కోప్పడితే ఎట్లా."
"నువ్వు చెప్పిందాంటో కూడా పాయింటుంది."
"చిత్తం పాయింటు లేనిదే నేను ఏదీ చెప్పనండి! తోటపాండుగారు మనల్ని దెబ్బ తీసినప్పట్నుంచీ నా కిల్లాంటి కలలే వస్తున్నాయండి."
"పీడకలలన్నావు కదూ?"
"చిత్తం! పేడ కలలన్నానండి!"
"కలలో పేడ కనిపిస్తే మంచిదటయ్యా! అంటే నీకు మంచి రోజు లోస్తున్నాయని అర్థం౧"
"కలలో పేడ కనిపిస్తే మంచిదటయ్యా! అంటే నీకు మంచి రోజు లోస్తున్నాయని అర్ధం!"
"నిజమే అనుకోండి. నీకు అని నొక్కి చెప్పకుండా మనకు అంటే బావుంటుందేమో ఆలోచించండి."
"నేనొక నిర్ణయానికి వచ్చేనయ్యా!"
"చిత్తం."
"ఎవడ్నో అయిదు లక్షలు ముష్టి అడిగి సత్యమూర్తి పెళ్లి చేసే దానికంటే ఆ మొత్తం పైకం నేనే సత్యమూర్తికి సర్దేస్తే ఎల్లా వుంటుంది?"
చిత్తం! అగ్రిమెంటు మాట మరిచిపోయేరు కాబోలు! తమ సొంత సొమ్ములో పైసా కూడా సత్యమూర్తికి ఇవ్వకూడదు."
"వంకాయ్! అది నా సొంత డబ్బని ఆ పరమానందానికి ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పాలి, లేకపోతే నువ్వు చెప్పాలి."
"చిత్తం! నా మీద అట్లాంటి నిందలు వేయకండి. అసలే పేడ కలల్తో సతమతమవుతున్నాను. దానికి తగ్గట్టు నిందలు కూడానా?"
"మాటవరసకి అన్నాను. అంతమాత్రానికే గింజుకుంటావే? పందెం గెలవాలంటే నిజాయితీ ఒక్కటే కాదు సింహాచలం, కుట్రలు కూడా చేయాలి. అది జూద నీతి! రేపు ఉదయం సత్యమూర్తిని నన్ను కోనేరు సెంటర్లో కలవమను."
"చిత్తం!" అని సింహాచలం నిష్ర్కమించేడు.
ఆనందం బేంకుకి ఫోన్ చేస్తున్నాడు.
* * *
పరమానందం ఇంటో -
భద్రాచలం చెప్పింది పూర్తిగా విని కోపంగా లేచేడు పరమానందం.
"అంటే, మా ఒప్పందానికి వ్యతిరేకంగా స్వయంగా ఆనందమే అయిదు లక్షలు ఇస్తున్నాడా?"
"ఇవ్వనీండి! ఆ డబ్బు గోవిందం ఇంటికి భద్రంగా చేరితేనే గదా వాళ్లమ్మాయితో సత్యమూర్తికి పెళ్లాయ్యేది - మనం బస్సు స్టాపులో టీ అమ్ముకునేది! దునియా దయ వల్ల అల్లాంటి ప్రమాదాలు జరగవని నేను తమకు హామీ ఇస్తున్నానండీ!"
"కానీ షరతు షరతేగా?"
"అయ్యా! తమరు షరతుల్నే పట్టుక్కూచొకూడదండి! మీరు చేసిందేమిటి చెప్పండి?"
"ఏం చేసేను?"
"షరతుకి విరుద్దంగా - దునియాకి లక్షా పాతికవేలిచ్చి పని జరిపించలేదూ? ఇప్పుడు కూడా అదే చేద్దాం! అంచేత షరతుల్ని మరిచిపోండి. దునియాని జ్ఞాపకం పెట్టుకొండి."
"ఫీజు అడుగుతాడు కదయ్యా!"
"చిత్తం! పని చేస్తున్నాప్పుడు చిల్లర ఖర్చులు తమరు పట్టించుకో కూడదు."
"మళ్లా లక్షా పాతికవేలేనా?"
"ఇప్పుడు మరో పాతికవేలు పెంచేడండి!" అని భద్రచలం మవునంవహించేడు.
పరమానందం గాల్లో లెక్కలవీ వేసి తృప్తిపడి అన్నాడు -
"అల్లాగే! పనిచూడమను."
"చిత్తం! అని భద్రాచలం అక్కడ్నించి వెళ్లిపోయేడు.
* * *
కోనేరు సెంటర్లో -
ఆనందం సత్యమూర్తికి బ్రీపుకేసు ఇచ్చేడు.
"లెక్క చూసుకో! అయిదు లక్షలు!" అన్నాడు ఆనందం.
సత్యమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
"ఎందుకు ఏడుస్తావ్?" అడిగేడు ఆనందం.
"ఏం చేయాలో తోచనప్పుడు నాకు ఆటోమాటిగ్గా ఏడుపే వస్తుందండి! మీకు పాదాభివందనం చేద్దామంటే నా చేతుల్లో బ్రీఫ్కేసుంది!" అన్నాడు సత్యమూర్తి.
"లెక్క సరిపోయిందో లేదో చూడవయ్యా!" అన్నాడు ఆనందం.
అతని తృప్తికోసం సత్యమూర్తి బ్రీఫ్కేసు తెరిచేడు.
అన్నీ వందనోట్లే! అంత డబ్బు చూడగానే అతని కళ్లు తిరిగేయి. నసుగుతూ అన్నాడు.
"కాగితమ్మీద లెక్కలు కోట్లలో చూడగలను గానీ, నిజం డబ్బు వెయ్యికి మీంచి లెక్క పెట్టడం నాతరం కాదండీ! ఇప్పుడే వెళ్లమంటారా?"
"ఆలిస్యమెందుకు? డబ్బు గోవిందం మొహమ్మీద కొట్టి శారద చెయ్యి పట్టుకురా! గుళ్లో మీ పెళ్లి జరిపిస్తాను."
"ఇంక చెప్పకండి సార్! నాకు ఆవేశం ముంచుకోస్తోంది. అంత ఆవేశంలో ఆ గోవిందంగాణ్ని ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ దెబ్బతో నా పెళ్లయ్యేలాఅ దీవించి పంపించండి!" అని తలవంచేడు.
"అంతా శుభమే జరుగుతుంది. వెళ్లిరా!" అన్నాడు ఆనందం గంభీరంగా.
ఆ తర్వాత సత్యమూర్తి పెద్ద పెద్ద అంగలేసుకుంటో తన భ్రీఫ్ కేసులో అయిదు లక్షలున్నాయని గుర్తు రాగానే స్టెయిల్ గా నడుస్తూ గోవిందం ఇంటివేపు వెడుతున్నాడు.
అతని వెళ్లిపోయేక ఆనందం దేవుడ్ని ప్రార్దించేడు -